close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వారసత్వం

వారసత్వం
- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

‘‘హలో రఘూ...’’ ఫోన్‌లో ఏమీ చెప్పకుండా ఏడుస్తోంది కావేరి.
‘‘అక్కా, చెప్పు... ఏమైంది?’’ అన్నాడు రాఘవ ఆందోళనగా.
కావేరి ఏడుస్తూనే విషయం చెప్పింది.

‘‘సరే అక్కా, మేం వెంటనే బయలుదేరి వస్తాం. తమ్ముడికి నేను చెప్తాలే. రేపటికల్లా అక్కడుంటాం. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు’’ అంటూ ఫోన్‌ పెట్టేసి, వెంటనే ఢిల్లీలో ఉన్న తమ్ముడికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు.
అప్పటికే రాత్రి కావటంతో ఇద్దరూ వెంటనే ఆ మర్నాడు పొద్దున్న ఫ్లైట్‌కి టికెట్‌లు బుక్‌ చేసుకున్నారు.

ఇద్దరూ ఓ గంట తేడాలో ల్యాండ్‌ అయ్యారు. అక్కడనుంచి ఓ పెద్ద కారు మాట్లాడుకుని వాళ్ళ సొంత ఊరు బయలుదేరారు. దార్లో చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఉంటే ఇద్దరూ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయారు.
కుటుంబరావు సొంత ఊరిలో పోస్ట్‌ మాస్టరుగా రిటైర్‌ అయ్యాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి కావేరి, రెండోవాడు రాఘవ, ఆఖరివాడు స్వరూప్‌. కావేరి తెలివైనదే అయినా, అప్పటి పరిస్థితులనిబట్టి డిగ్రీ వరకు చదివించి పెళ్ళి చేశాడు. మగపిల్లలిద్దరినీ ఇంజినీరింగ్‌ చదివించాడు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావటంతో ఒకరు ముంబైలో, ఇంకొకరు ఢిల్లీలో సెటిల్‌ అయ్యారు. పండగలకీ ఫంక్షన్‌లకీ సొంత ఊరు వచ్చిపోతూ ఉంటారు. కావేరికి పిల్లలు లేరు. రెండేళ్ళక్రితం కుటుంబరావు భార్య చనిపోయింది. కొడుకులూ కూతురూ ఎంత రమ్మన్నా సొంతూరినీ సొంతిల్లునీ వదలటం ఇష్టంలేక కుటుంబరావు ఒక్కడూ ఉంటున్నాడు. భర్తకి జాండిస్‌ వచ్చి సర్వీస్‌లో ఉండగానే పోవటంతో కంపేషనేట్‌ గ్రౌండ్స్‌లో ఉద్యోగంవచ్చే అవకాశం ఉన్నా, ఒక్కతీ దూరంగా ఉండటం ఇష్టంలేక, కావేరి తండ్రి దగ్గరకి వచ్చేసింది.

కారు దిగి రాఘవ, స్వరూప్‌ లగేజీలు పట్టుకుని టాక్సీ బిల్‌ పే చేసి ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళగా పిల్లల్ని తీసుకుని వాళ్ళ భార్యలు కూడా వాళ్ళని అనుసరించారు. తమ్ముళ్ళని చూడగానే వాళ్ళని పట్టుకుని కావేరి ఒక్కసారిగా భోరుమని ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికే ఇరుగుపొరుగు వాళ్ళందరూ వచ్చి చేరారు.

కుటుంబరావు ఇంకా నిద్రపోతున్నట్టే ఉన్నాడు.
‘‘ఏమైంది అక్కా... ఎలా జరిగింది..?’’ రాఘవ కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు.

‘‘మధ్యాహ్నం భోజనం దగ్గర కడుపు బరువుగా ఉందని, ఏమీ తినకుండా మజ్జిగ తాగి, మాత్ర వేసుకుని పడుకున్నార్రా.

అంతే సాయంత్రం ఎంత లేపినా లేవలేదు. భయంవేసి పక్క వీధిలో ఉన్న డాక్టర్‌గారిని పిలుచుకుని వచ్చాను. నాన్నని చూస్తూనే చెప్పేశార్రా... ‘ఆయన మనకిక లేర’ని’’ అంటూ ఏడవసాగింది కావేరి.

‘‘ఊరుకోండర్రా, ఆయనకేం ఎనభై అయిదేళ్ళు మహరాజులా బతికాడు. మిమ్మల్నందర్నీ ఓ స్థాయికి తెచ్చాడు. నిన్నపొద్దున్న వరకూ ఆయన పనులు ఆయనే చేసుకున్నాడు. ఈ వయసులో మంచం మీద పడి ఎవరిచేతా సేవలు చేయించుకోకుండా అలా వెళ్ళిపోయాడంటే ఆయన ఎంతో అదృష్టవంతుడు. ఆయన జీవితం ఓ వేడుకలా గడిచింది. మీరు బాధపడకుండా, చేయవలసిన కార్యక్రమాలు జరిపించండి’’ అంటూ పక్కింటి పెద్దావిడ కుటుంబరావు పిల్లలు ముగ్గురినీ ఓదార్చింది.

అంతిమ సంస్కారాలు ముగిశాయి. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోగా ఆ ఇంట్లో కావేరీ, రాఘవా, అతని భార్యా, కొడుకూ, స్వరూప్‌, అతని భార్యా, కూతురూ మిగిలారు. అన్ని రోజులూ వంట పనంతా కావేరే చేసింది. ఇద్దరూ పదకొండోరోజు ఎప్పుడు పడిందో చూసుకుని, ఆ తర్వాత వచ్చిన మంచిరోజుకి రిటర్న్‌ టికెట్‌లు బుక్‌ చేసుకున్నారు.

మూడోరోజు రాత్రి కావేరి అందరికీ వంట చేస్తూ ఉండగా, ఇద్దరూ నాన్న బీరువా తెరిచి కాగితాలన్నీ సర్దటం మొదలుపెట్టారు. ఇంటి తాలూకు దస్తావేజులూ, అయిదువేలు నగదూ, బ్యాంకు పాస్‌బుక్‌లో పదివేలు బ్యాలన్స్‌తో పాటు- ఖర్చులు, పాలు, కిరాణా పద్దులు రాసుకునే ఓ డైరీ దొరికాయి. రాఘవ కాజువల్‌గా డైరీ తిరగేస్తుండగా ఓ పేజీలో తండ్రి స్వదస్తూరితో ‘మధుమూర్తికి ఇవ్వవలసిన అసలు- రెండు లక్షలు’ అని రాసి ఉంది. బ్రాకెట్‌లో ‘పై పోర్షన్‌ కట్టే సమయంలో తీసుకున్న అప్పు’ అని రాసి ఉంది. ఇంకోసారి ఆ డైరీని మొత్తం తిరగేసి అలాంటివి ఇంకేవీ లేవని నిర్ధారించుకుని, ‘కాజువల్‌’గా ఆ పేజీని చించేశాడు రాఘవ. ఇదంతా చూస్తున్న స్వరూప్‌ అన్న రాఘవని కళ్ళతోనే అభినందించాడు.

‘‘అన్నయ్యా, ఇది చించేస్తే చాలా... ఒకవేళ ఆయన వచ్చి అడిగితే?’’ అడిగాడు నెమ్మదిగా స్వరూప్‌.

‘‘ఎవిడెన్స్‌ ఆక్ట్‌ ప్రకారం మా నాన్న అప్పు తీసుకున్నట్టు ఏదైనా ఆధారం పట్టుకు రమ్మంటాం’’ అన్నాడు రాఘవ తెలివిగా.

అన్న తెలివికి మురిసిపోయాడు స్వరూప్‌. ఓ నాలుగు రోజులు గడిచిన తర్వాత, అన్నదమ్ములిద్దరూ ముందురోజు రాత్రి మాట్లాడుకున్నట్టుగానే కావేరిని కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టారు.

‘‘అక్కా, నీకు తెలుసు కదా, ఆ పట్నాల్లో పిల్లల స్కూల్‌ ఫీజులూ, ట్రాన్స్‌పోర్టూ, ఈఎమ్‌ఐలూ, మెయింటెనెన్సూ... ఇలా నిత్య ఖర్చులతో మేం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో. పైగా, ఒకసారి ఇంటిపేరు మారిన తర్వాత ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అది పుట్టింటికి అరిష్టమట. నువ్వు మరోలా అనుకోకపోతే ఈ ఇంట్లో ఇప్పటికే అమ్మ పోయింది, ఇప్పుడు నాన్న. అందుకని, ఈ ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాం’’ అంటూ నసిగాడు రాఘవ.

‘అమ్మ... నేను ఇక్కడికి రాకముందే పోయింది. ఓ వయసొచ్చిన పెద్దవాళ్ళు పోతే దాన్ని అరిష్టం అనరు. కాలధర్మం చెందడం అంటారు’ ...ఈ మాటలేవీ పైకి అనలేదు కావేరి. పిల్లలు ఎన్ని రాళ్ళు విసిరినా నది కోపగించుకోదు. వాళ్ళ సంతోషమే తన సంతోషంగా భరిస్తుంది. తన చేతిలో పెరిగిన తమ్ముళ్ళంటే కావేరికి అంత ప్రేమ.

‘‘దాందేముందిరా, మీరు అంత మొహమాటంగా చెప్పాలా, మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి’’ అంది రాఘవ చేతిమీద చెయ్యి వేస్తూ.

‘‘అదే అక్కా, నాన్న వీలునామా అంటూ ఏదీ రాయలేదు. అందుకని లీగల్‌ హెయిర్‌ డాక్యుమెంట్‌ రాయించాలి. నీకు తెలియంది కాదు. ఆడపిల్లకి ఆస్తిలో వాటా అంటూ ఇచ్చే ఆనవాయితీ మనలో లేదు. నీకు తెలుసుగా
నీ మరదళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి నుంచి ఏమీ ఆస్తులు తేలేదు. అందుకని నువ్వు ఓ రెలింక్విష్‌మెంట్‌ డీడ్‌ రాసిస్తే, మేము ఈ ఇల్లు అమ్మే విషయమై ఫర్‌దర్‌గా ప్రొసీడ్‌ అవుతాం’’ అన్నాడు స్వరూప్‌ హుషారుగా. చిన్నవాడవటంచేత సమయానుసారంగా మనసులోని భావాలు మొహంలో కనబడనీయకుండా దాచే టెక్నిక్‌ ఇంకా రాలేదతనికి.

‘‘తప్పకుండా. మీరు వెళ్ళేలోపే కాగితాలు తయారుచేయించి, నేను ఎక్కడ సంతకం పెట్టాలో చెబితే పెట్టేస్తా. మీరు బయటకి వెళ్తారేమో, ఉండండి కాఫీ పెట్టాను... తాగేసి వెళ్ళండి’’ అంటూ కావేరి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రమే డాక్యుమెంట్‌ రెడీ చేసి పట్టుకొచ్చి సంతకం పెట్టమన్నాడు రాఘవ. పూర్వార్జితమైన తన తండ్రిగారి ఇంటిలో వారసత్వ హక్కుని తాను మనస్ఫూర్తిగా వదులుకుంటున్నట్టూ, అందుకు బదులుగా, ఇంట్లో ఉన్న ఉమ్మడి ధనం రెండు లక్షలు తనకు ఇచ్చినట్టుగానూ అందులో రాసుంది. ‘ఈ రెండు లక్షల సంగతేమి’టని అక్క అడిగితే ఏం చెప్పాలో ముందుగానే ప్రిపేర్‌ అయి ఉన్నాడు రాఘవ.

అవేమీ చదవనట్టుగానే సంతకం పెట్టి ఇచ్చేస్తూ ‘‘ఒరే రఘూ, ఆ కొనేవాళ్ళని ఓ మూణ్ణెల్లు టైమ్‌ అడగరా. మన పక్క వీధిలో మధుమూర్తిగారి ఇంట్లో ఓ పోర్షన్‌లో ఉంటున్న మాస్టారు ఈ వేసవి సెలవుల్లో ఖాళీ చేస్తారట. అక్కడైతే నాకు బాగుంటుంది. వాళ్ళ కోడలితో నాకు మంచి స్నేహం ఉంది. కొంచెం కాలక్షేపంగా ఉంటుంది’’ అంది బతిమాలుతున్నట్టుగా.

‘‘తప్పకుండా అక్కా, ఈ వ్యవహారం అంతా అవ్వాలంటే ఎలాగైనా మూడు నాలుగు నెలలు పడుతుంది. మేము కనీసం ఇంకో రెండుసార్లయినా రావలసి ఉంటుంది’’ అన్నాడు రాఘవ తేలికపడిన మనసుతో ఆ డాక్యుమెంట్‌ని జాగ్రత్తగా ఫోల్డర్‌లో పెడుతూ.

ఆ మర్నాడే రిజిస్ట్రేషన్‌కి దస్తావేజులు రెడీ చేయమనీ వచ్చే నెలలో వస్తామనీ బ్రోకర్‌కి చెప్పి ఇద్దరూ టికెట్‌ కొన్న తేదీకే బయలుదేరి వెళ్ళిపోయారు.

* * *

‘‘నమస్తే బాబాయ్‌’’ అంటూ కావేరి పలకరించగానే, చదువుతున్న పేపర్‌లోంచి తలెత్తి చూసి ‘‘నువ్వా కావేరీ, బావున్నావా... రా కూర్చో’’ అంటూ ఎదురుగా కుర్చీ చూపించాడు మధుమూర్తి. మధుమూర్తి, కుటుంబరావు కలిసి పనిచేసేవారు. ఇద్దరిదీ మంచి స్నేహం.

‘‘ఏం లేదు బాబాయ్‌, మీతో రెండు విషయాలు మాట్లాడాలని వచ్చాను’’ అంది కావేరి, ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ.

‘‘చెప్పమ్మా, నువ్వేమీ మొహమాటపడకుండా ఏ సాయం కావాలన్నా అడుగు. నువ్వు నా కూతురులాంటిదానివి’’ అన్నాడు మధుమూర్తి అభిమానంగా.

‘‘అదే బాబాయ్‌, నాన్నగారు లేని ఆ ఇంట్లో నేనొక్కదాన్నీ ఉండలేకపోతున్నాను. తమ్ముళ్ళు కూడా అక్కడ పిల్లలతో డబ్బుకి ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఇల్లు అమ్మేయమని నేనే వాళ్ళకి చెప్పాను.
మీ ఇంట్లో అద్దెకుంటున్న మాస్టారు ఈ వేసవిలో ఖాళీ చేస్తారని తెలిసింది.

ఆ పోర్షన్‌ నాకిస్తే అందులో నేను ఉంటాను. నాకు మీరంతా తోడుగా ఉన్నట్టు ఉంటుంది’’ అంది కావేరి.

‘‘ఆ అవునమ్మా, మీ ఇల్లు అమ్మేస్తున్న విషయం నాకు ఈమధ్యే చూచాయగా తెలిసింది. దాందేముంది, తప్పకుండా ఉండు. నువ్వు ఎప్పుడు దిగుతావో చెబితే, రిపేర్లు ఏమైనా ఉంటే చేయించి పోర్షన్‌ రెడీ చేసి ఉంచుతాను. నీకంటే మంచి పొరుగు మాకెవరు దొరుకుతారు?’’ అన్నాడు మధుమూర్తి సంతోషంగా.

‘‘అలాగే రెండో విషయం... నాన్నగారు పోయినేడాది డాబా మీద రెండు గదులు వేసినప్పుడు మీ దగ్గర అప్పుగా తీసుకున్న మొత్తం మీకు తిరిగి ఇచ్చేయమని తమ్ముళ్ళు డబ్బు పంపారు. ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసి తెచ్చాను’’ అంటూ బ్యాగులోంచి రెండు లక్షలు తీసి టేబుల్‌ మీద పెట్టింది కావేరి.

‘‘అయ్యో, ఈ టైములో ఎందుకమ్మా ఇవన్నీ. మనలో మనకి తొందరేముంది, నిదానంగా మీరు కుదుటపడ్డాక ఇవ్వొచ్చుగా’’ అన్నాడు మధుమూర్తి నొచ్చుకుంటూ.

‘‘లేదు బాబాయ్‌, మీరు నోటిమాట మీద వడ్డీ లేకుండా అప్పు ఇవ్వటమే గొప్ప విషయం. ఇప్పటికే లేటయింది, నాన్నగారెప్పుడూ
ఈ విషయమే చెబుతూ ఉండేవారు’’ అంది కళ్ళు తుడుచుకుంటూ కావేరి.

మధుమూర్తి కోడలు ఇచ్చిన కాఫీ తాగి, మంచిరోజు చూసి షిఫ్ట్‌ అవుతానని చెప్పి ఇంటికి బయలుదేరింది కావేరి.

* * *

‘‘రండి బాబాయ్‌, రండి కూర్చోండి’’ అంటూ కుర్చీ దులిపి ముందుకు వేసింది కావేరి. మధుమూర్తి కూర్చోగానే, గ్లాసుతో నీళ్ళు అందించి ‘‘ఎలా ఉన్నారు బాబాయ్‌. రాణీ ఎలా ఉంది... కొంచెం మజ్జిగ కలిపి తెస్తాను’’ అంటూ లోపలికి వెళ్ళబోతున్న కావేరిని వారించి- ‘‘అవేం వద్దమ్మా, నువ్వు కూర్చో ముందు’’ అన్నాడు మధుమూర్తి మంచినీళ్ళు తాగి గ్లాసు కిందపెడుతూ.

కావేరి కూర్చున్నాక చెప్పటం మొదలుపెట్టాడు.

‘‘అమ్మా, మొన్న నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బిచ్చి వెళ్ళాక... నిజం చెప్పాలంటే నాకు చాలా ఆనందమేసింది. డబ్బు గురించి కాదు. తండ్రి పోయాక- రాతా, పద్దూ లేని అప్పుని కూడా ఎక్కడో పట్నంలో ఉంటూ తిరిగి తీర్చిన మీ తమ్ముళ్ళని అభినందించాలనిపించి రాఘవకి ఫోన్‌ చేశాను. ‘మీ నాన్న చేసిన అప్పు...’ అని నా మాట ఇంకా పూర్తవకుండానే, ‘ప్రామిసరీ నోటులాంటి ఆధారాలేమైనా ఉన్నాయా?’ అంటూ అడగటం మొదలుపెట్టాడు. నాకేమీ అర్థంకాక ఫోన్‌ పెట్టేశాను. నువ్విచ్చిన డబ్బు బ్యాంకులో వేద్దామని నిన్న బ్యాంకుకి వెళ్ళాక తెలిసింది- ఆ అప్పు నీ పెన్షన్‌ మీద లోన్‌ పెట్టి మరీ నువ్వే తీర్చావని. తండ్రి అప్పు పెళ్ళయిన కూతురుగా నువ్వు తీర్చటం ఒకెత్తయితే, ఆయన కొడుకులుగా నీ తమ్ముళ్ళకి ఏమాత్రం చెడ్డపేరు రాకుండా వాళ్ళే తీర్చారని చెప్పటం ఇంకో ఎత్తు. అందరిలాగే నేను కూడా నా కూతురికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు. మొత్తమంతా నా కొడుకు పేరిటే రాశాను. అదేంటో మాలాంటి తండ్రులకి... ఆకలేస్తే కూతురు గుర్తొస్తుంది, ఆస్తి విషయంలో కొడుకులు గుర్తొస్తారు. ఆస్తిలో వాటా మీ హక్కయినా మీరు పుట్టింటి నుంచి ఓ పలకరింపూ ఇంత పసుపూ కుంకుమ తప్ప ఇంకేమీ ఆశించరు. మీకేమీ ఇవ్వకపోయినా, అకాలవర్షంలా మేమెప్పుడు మీ ఇంటికి ఊడిపడినా, ఆరేసిన బట్ట తీసినంతసేపట్లో వండివార్చి, మా కడుపు నింపుతారు. అప్పు తీర్చాలంటే ఆధారాలడిగే మేం ఆస్తి పంపకాల్లో మాత్రం ఆడపిల్లకి కూడా హక్కుందన్న విషయాన్ని సౌకర్యంగా మర్చిపోతాం. మిమ్మల్ని ‘టేక్‌ ఇట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటాం. వారసత్వం అంటే కేవలం ఆస్తీ, ధనమూ కాదు... అదో జ్ఞాపకం, గౌరవం. ఓ రక్తం పంచుకుని పుట్టినవాళ్ళందరికీ అది సమానంగా దక్కాలి. ఇదంతా చూశాక నేను నా కొడుకుతో మాట్లాడి నా ఆస్తిలో నా కూతురికి కూడా వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలాగే నీ విషయంలో ఉండబట్టలేక, రాఘవకి మళ్ళీ ఫోన్‌ చేసి విషయమంతా చెప్పేశాను. అతని మాటల్నిబట్టి జరిగినదానికి అతనూ బాధపడుతున్నట్టే ఉంది. బహుశా ఇంటి విషయంలో కూడా మనసు మార్చుకుని స్వరూప్‌తో మాట్లాడి ఈరోజో రేపో నీకు ఫోన్‌ చెయ్యొచ్చు’’ అని మధుమూర్తి అంటూ ఉండగా కావేరి ఫోన్‌ రింగయింది.

‘‘సత్యం, అదిగో ఫోన్‌ మోగింది...

బహుశా రాఘవే అయుంటాడు. మాట్లాడమ్మా, నే వస్తా. నీకు అంతా మంచే జరుగుతుంది’’ అంటూ లేచి వీధి గేటు వైపు బయలుదేరాడు మధుమూర్తి.

హాల్లో గోడకున్న కుటుంబరావు ఫొటోకి వేసిన పూలదండలోంచి ఓ పువ్వు జారి కిందపడింది - ఆయన సంతోషానికి సంకేతంలా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.