close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బర్మాలో భోజనం... భారత్‌లో నిద్ర..!

బర్మాలో భోజనం... భారత్‌లో నిద్ర..!

‘అదో అపురూపమైన వేడుక. ఓ పక్షి పేరుతో చేసుకునే అరుదైన వేడుక. అదే నాగాలాండ్‌ హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌. విభిన్న తెగల సంస్కృతీ సంప్రదాయాలూ ఆచార వ్యవహారాలూ వేషధారణలూ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలూ పోటీలూ... ఇలా అన్నింటినీ ఏకకాలంలో చూడగలిగే అద్భుత వేదిక’ అంటూ ఆ విశేషాలతోబాటు అక్కడి సందర్శనీయ స్థలాల గురించీ చెప్పుకొస్తున్నారు అనకాపల్లికి చెందిన కొయిలాడ రామ్మోహన్‌రావు.

కొత్త ప్రదేశాలను చూడాలంటే ఒక్కొక్కటిగా పర్యటించాలి. కానీ ప్రజల సంస్కృతీ, నాగరికతల గురించి తెలుసుకోవాలంటే అక్కడ జరిగే వేడుకలకి వెళ్లాలి. అందుకే ఈసారి మా పర్యటనలో నాగాలాండ్‌ హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌కి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాం. గౌహతి, మేఘాలయ, మణిపూర్‌లలో పర్యటించాక ఇంఫాల్‌ నుంచి నాగాలాండ్‌ రాజధాని కోహిమాకు బయలుదేరాం. నాగాలాండ్‌లోకి ప్రవేశించాలంటే భారతీయులూ పర్మిట్‌ తీసుకోవాలి. దాన్ని ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ అంటారు. కోహిమా చాలా రద్దీగా ఉంటుంది. అయినా పచ్చదనం కనువిందు చేస్తుంటుంది. ముందుగా అక్కడి ఎత్తైన జఫు శిఖరమ్మీదకు వెళ్లాం. అక్కడినుంచి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. తరవాత కోహిమా వార్‌ సెమెటరీ, నాగా బజార్‌, జూ, స్టేట్‌ మ్యూజియాలను సందర్శించాం.  ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ఎక్కువ. దాంతో అక్కడ కొత్త సంవత్సర వేడుకలు రెండు నెలల ముందే ఆరంభమవుతాయి. అదేసమయంలో నాగాలు తరాల సంస్కృతినీ కళలనీ విద్యలనీ పరిరక్షించుకోవడంలోనూ ముందుంటారు. ప్రకృతిపట్ల ప్రేమ ఎక్కువ. పర్వతాలనీ లోయల్నీ అడవుల్నీ నదుల్నీ ఎంతో ప్రేమిస్తారు. వాటికేమాత్రం విఘాతం కలిగించరు. అందుకే వాళ్ల పట్టణాలూ పల్లెల్నే తలపిస్తాయి వాళ్లు మంచి వేటగాళ్లు. యోధులు. మంచి వ్యవసాయదారులు కూడా.

కొండమీది రాష్ట్రం!
కొండలపైనే విస్తరించి ఉండటం ఈ రాష్ట్ర ప్రత్యేకత. 3826 మీటర్ల ఎత్తున్న శరమాతి రాష్ట్రంలోనే ఎత్తైన శిఖరం. విమానం లేదా హెలీకాప్టర్ల నుంచి చూస్తే కొండల్ని చీల్చుకుంటూ ప్రవహించే ధన్సిరి, దోయాంగ్‌, డిక్కు, మిలాక్‌, టిజు, జుంకి నదులు ఎంతో అందంగా కనిపించాయి. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా 34 డిగ్రీలు దాటదు. కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు తగ్గదు. కాబట్టి అన్ని సీజన్లలోనూ పర్యటించవచ్చు.

ముందుగా చారిత్రక ప్రాధాన్యం ఉన్న డిమాపూర్‌ చూడ్డానికి వెళ్లాం. రాష్ట్రంలో విమానసౌకర్యం ఉన్న నగరం ఇదొక్కటే. 13వ శతాబ్దంలో అహోంలు చొరబడి సృష్టించిన విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యంగా అక్కడ విరిగిపడిన కోటగోడల శకలాలు అలాగే ఉన్నాయి. హస్తకళాకృతులకోసం ఏర్పాటు చేసిన డిజెఫె గ్రామంలో దుకాణాల్లోని వస్తువులు కళ్లను కట్టిపడేస్తాయి. అక్కడి రంగపహార్‌ ఫారెస్ట్‌ రిజర్వ్‌నీ శివమందిరాన్నీ చూశాక రాష్ట్రంలో పేరొందిన మొకక్‌చుంగ్‌ పట్టణానికి వెళ్లాం. ఇక్కడి నివసించే ఎవో తెగ ఆతిథ్యానికి పెట్టింది పేరు. వాళ్ల సంప్రదాయాల కారణంగా ఈ ప్రాంతం, నాగాలాండ్‌లోనే ప్రధాన పర్యటక స్థలంగా పేరొందింది. ఇక్కడి లాంగ్‌ఖిమ్‌ కొండలమీద రోడోడెండ్రాన్‌లు కనువిందు చేశాయి. నాగాలకు వేడుకలు ఎక్కువ. అందుకే వేడుకలకోసం కొన్ని గ్రామాలనే ఏర్పాటుచేసుకున్నారు. చుచుయిమ్‌లాంగ్‌ అలాంటిదే.

అరవైమంది భార్యలు!
తరవాత ముఖంమీద టాటూలను వేసుకునే కొన్యక్‌ నాగాలకు స్వస్థలమైన మోన్‌ ప్రాంతానికి వెళ్లాం. వీళ్లలో క్రూరత్వం ఎక్కువట. వీళ్ల దంతాలు నల్లగా ఉన్నాయి. రాజరికపాలన ఈ తెగలో ఇప్పటికీ ఉంది. ఇక్కడికి సమీపంలోనే రాజు (అంగ్‌) నివసించే లోంగ్వా అనే సరిహద్దు గ్రామం ఉంది ఆయన ఇంట్లోనుంచి సరిహద్దు రేఖ వెళుతుంది. అందుకే ఆయన్ని బర్మాలో భోజనం చేసి భారత్‌లో పడుకుంటాడు అంటారు. గతంలో పాలించిన రాజుకి 60 మంది భార్యలట. ఈ గ్రామీణులందరూ ఇరుదేశాల్లోనూ పౌరులే. అందుకే వాళ్లు ఉద్యోగాలకు బర్మాకీ వెళుతుంటారు. అక్కడ ఇళ్లని వాళ్లు వేటాడిన జంతువుల పుర్రెలూ ఎముకలతో అలంకరించారు. తలవేటకి పేరొందిన వీళ్లు, పూర్వం శత్రువుల తలలు కూడా ఇంట్లో అలంకరించేవారట. అక్కడి నుంచి చెక్కవస్తువులకీ, ‘వేద’ అనే శిఖరానికీ పేరొందిన షాంగన్యు గ్రామానికి వెళ్లాం.

తరవాతి మజిలీ ఆర్కిడ్లూ పండ్లతోటలకి పేరొందిన వోఖా జిల్లా. లోథా తెగ స్వస్థలమైన ఈ జిల్లాలో రిఫియమ్‌ గ్రామంలోని దోన్యన్‌ నదిమీద కట్టిన ఆనకట్ట సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. అక్కడినుంచి ఖొనొమా గ్రీన్‌ విలేజ్‌గా పిలిచే ఊరు చూసి  హార్న్‌బిల్‌ వేడుక జరిగే కిసమా గ్రామానికి వెళ్లాం.

హార్న్‌బిల్‌ అందమైన అరుదైన పిట్ట. పసుపూనారింజ రంగుల మేళవింపుతో తలపైన టోపీ, కిందకి వంగిన పొడవైన పెద్ద ముక్కూ, నల్లని ఈకలూ, తెల్లని తోకతో కనువిందు చేస్తుందీ పక్షి. ఎంతో చురుకైనది. అందుకే అదంటే నాగాలకు అభిమానం. పాత తరాలు దాన్ని వెంటాడి వేటాడి చంపి తినేయడంతో అది దాదాపుగా అంతరించిపోయి, ఈతరానికి జ్ఞాపకంగా మిగిలిపోయింది. దాంతో వాళ్లు సాంస్కృతిక కార్యక్రమాల్లో దానికో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

నాగాలాండ్‌లో పదహారు తెగలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా 2000 సంవత్సరం డిసెంబరు ఒకటో తేదీన ఈ పండగకు శ్రీకారం చుట్టింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. పర్యటకశాఖ నిర్వహించే ఈ ఉత్సవం కారణంగా నాగాలాండ్‌కు వచ్చే పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. అక్కడి తెగల జీవనశైలి, ఆచారవ్యవహారాలకు చెందిన విశేషాలన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చి యావత్‌ ప్రపంచానికి తెలియజేసే పండగగా దీన్ని చెప్పవచ్చు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది పర్యటకులు వస్తారు. విదేశీయులెక్కువ.

ఈ వేడుకకోసం కోహిమాకు 12 కి.మీ. దూరంలోని కిసమా అనే పల్లెలో చిన్న కొండమీద ఓ హెరిటేజ్‌ విలేజ్‌ను నిర్మించారు. ప్రధానినీ, రాష్ట్రపతినీ ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తారు. ఈ పండగలో ప్రధాన ఆకర్షణ పదహారు శిబిరాలు. ఒక్కో తెగకీ ఒక్కో శిబిరాన్ని కేటాయించి, ఆ శిబిరంలో వాళ్ల జీవనశైలిని ప్రతిబింబించే ప్రదర్శనను ఏర్పాటుచేస్తారు. వాళ్ల నివాసాలూ, పద్ధతులూ, వంటకీ వేటకీ వ్యవసాయానికీ వాడే సామగ్రిని అక్కడ చూడవచ్చు. ఆయా వివరాలను వాళ్లు ఎంతో ఉత్సాహంగా వివరించారు. వాళ్లంతా చక్కని ఇంగ్లిష్‌ మాట్లాడతారు. ప్రతీ శిబిరం దగ్గరా ఆ తెగల రుచులను అందించే క్యాంటీన్లు ఉన్నాయి. ముఖ్య అతిథులు రాగానే నోటితో అరుస్తూ కొమ్ము బూరల్లాంటి వాటితో ఊదుతూ ఆహ్వానం పలికారు. ఆనాటి ముఖ్య అతిథి అయిన గవర్నర్‌ని కొందరు ఆదివాసీలు తమ దుస్తులూ ఆయుధాలతో అలంకరించగా, గవర్నర్‌ ఓ కర్ర దూలానికి వేలాడుతున్న లోహపు పళ్లెంపై చెక్కతో చేసిన సుత్తితో కొట్టడం ద్వారా వేడుకను ప్రారంభించారు.

కంటనీరు పెట్టించింది!
వేదికను అందమైన పూలకుండీలతో అలంకరించారు. నాగా తెగల ప్రాచీన చరిత్ర గురించి ప్రదర్శించిన దృశ్యకావ్యం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. నాటి తెగల మధ్య స్వార్థపూరిత తగాదాలూ, కోట్లాటల్ని హృద్యంగా ప్రదర్శించారు. ఆ గొడవల్లో ఎంతోమంది చనిపోయిన దృశ్యం స్థానిక నాగాలను కదిలించింది. చివరలో కొంతమంది ముందుకొచ్చి తెగల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి అన్ని తెగలనూ ఏకీకృతం చేయడంతో ఆ ప్రదర్శన ముగుస్తుంది. రెండోది హార్న్‌బిల్‌ వేట. ఓ యువకుడు హార్‌్్నబిల్‌ వేషంలోనూ మరికొంతమంది వేటగాళ్ల వేషాల్లోనూ నటించారు. వేటగాళ్లు నిర్దాక్షిణ్యంగా తమ వెంటపడి వేటాడుతుంటే ఆత్మరక్షణకోసం ఆ పక్షి పడే ఆరాటాన్ని చూపించారు. తరవాత భిన్న తెగల నృత్యాలూ విన్యాసాలూ ప్రదర్శించారు.

మిర్చిమీద మిర్చి!
అక్కడ జరిగిన పోటీల్లో ప్రధానమైనది కింగ్‌ చిల్లీ ఈటింగ్‌ కాంపిటీషన్‌. పోటీదారులు అంత ఘాటైన మిరపకాయల్ని తినడం ఆశ్చర్యం కలిగించింది. గ్రీజ్డ్‌ బేంబూ క్లైంబింగ్‌ పోటీ కూడా అలాంటిదే. సుమారు 25 అడుగుల ఎత్తున్న లావుపాటి వెదురు కర్రలను నేలలో గట్టిగా పాతారు. వాటికి బాగా గ్రీజు రాసి ఉంచుతారు. నిక్కర్లు వేసుకున్న నాగా యువకులు వాటినెక్కి, వెదురు కర్ర చివరి భాగాన్ని చేరుకోవడమే పోటీ. ఎక్కుతూ జారిపోతూ వాళ్లు పడే పాట్లు చూసి జనం చేసే గోలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. హెడ్‌ హంటర్స్‌ షో కూడా అలరించింది. పది రోజుల పండగ కాబట్టి ప్రదర్శనలెన్నో. వాటిల్లో నాగా రాక్‌బ్యాండ్‌, ఫ్లవర్‌ షో, షెఫ్‌ పోటీ, మోటార్‌ రేస్‌ చెప్పుకోదగ్గవి.