close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సహకారం

సహకారం
- అప్పరాజు నాగజ్యోతి

గత రెండు నెలలుగా ఒకే ఆలోచన మనసంతా తొలిచేస్తోంది. పెద్దది తొమ్మిదో తరగతికొచ్చింది. మరో నాలుగేళ్ళు గడిచాక ఇంజినీరింగ్‌లో ఏ ఊళ్ళో సీట్‌ దొరికితే అక్కడికి వెళ్ళి చేరవలసి ఉంటుంది. ఆ తరవాత క్యాంపస్‌ సెలక్షన్‌, ఉద్యోగం, పెళ్ళి... ఆపైన దాని జీవితం దానిది. పెద్దదానికీ చిన్నదానికీ వయసు భేదం రెండేళ్ళే కాబట్టి మరో రెండేళ్ళలో చిన్నదాని సంగతీ అంతే! అంటే, నేను నా పిల్లలతో తనివితీరా గడిపేందుకుగానీ వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దేందుకుగానీ నాకు మిగిలిన కాలం మహా అయితే నాలుగేళ్ళు లేదా ఆరేళ్ళు.తల్లిగా కీలకమైన పాత్రని పోషించవలసిన తరుణంలో నేనిలా ఆఫీసునే అంటిపెట్టుకుని ఉంటే నా పిల్లల పట్ల నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించినట్లేనా?

డిగ్రీ పూర్తవుతూనే దేశంలో అత్యున్నతమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షని రాసి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్‌ని సాధించి ఇరవైరెండేళ్ళ వయసులో కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్‌1 ఆఫీసరుగా చేరాను.

ఒక సెమినార్‌లో మా డిపార్టుమెంటు తరఫున నేను ప్రెజెంట్‌ చేసిన పేపరు బాగా నచ్చడంతో నా వద్దకువచ్చి తన్నుతాను పరిచయం చేసుకుని, ఆపైన ఆరు నెలలపాటు నా వెంటపడి నాచేత ఓకే అనిపించుకుని నా మెళ్ళో తాళి కట్టారు మావారు.

నేనూ మావారూ కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండటం మూలాన ఆఫీసుల్లో మీటింగ్‌లూ పని ఒత్తిళ్ళూ ఎక్కువే! పెళ్ళయిన నాలుగేళ్ళకి మా పెద్ద పాప ధన్య, ఆపైన మరో రెండేళ్ళకి చిన్నది ధాత్రి మా జీవితాల్లోకి అడుగుపెట్టడంతో ఇంట్లో కూడా పనిభారం పెరిగింది. దాంతో ఒకరి మీద ఒకరం చిర్రుబుర్రులాడటం, అలగడం లాంటివి నాకూ మావారికీ మధ్యన చాలానే జరుగుతుండేవి. మా ఈ చిరాకులూ పరాకుల ప్రభావం పిల్లల మీద పడకూడదనే ఉద్దేశ్యంతో నేనే కాస్త తగ్గి, సహనంతో వ్యవహరించడాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాను.

పిల్లలు ఉదయం ఏడున్నరకల్లా ఆదరాబాదరాగా టిఫిన్లు తినేసి లంచ్‌ కారియర్‌లు తీసుకుని స్కూలుకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అరగంటలో ఆఫీసుకి బయల్దేరివెళ్ళే నేను రాత్రి ఇంటికి చేరుకునేసరికి ఏడూ ఏడున్నర అవుతుంది. పిల్లలేమో మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇల్లు చేరుకుని డైనింగ్‌ టేబుల్‌ మీద నేను పెట్టినవేవో తినేసి హోంవర్క్‌లు పూర్తిచేసుకుని నాకోసం ఎదురు చూస్తుంటారు. నేను ఇంటికి చేరుకోగానే వాళ్ళ స్కూలు విశేషాలన్నీ నాతో పంచుకోవాలని ఇద్దరూ పోటీపడుతుంటారు. ఓ పక్క వాళ్ళ కబుర్లని వింటూనే మరోపక్క డిన్నర్‌ ఏర్పాట్లలో మునిగిపోతుంటాను.

ఈ విధమైన మా దినచర్యలో రోజు మొత్తంలో మా పిల్లలతో నేను గడిపే సమయం ఒక గంటకి మించి ఉండటం లేదు. ఆ గంటలోనూ ఇలా నేను వంటింట్లో పనిచేసుకుంటూనో లేదా బెడ్‌రూమ్‌లో బట్టలు మడతపెట్టుకుంటూనో మాట్లాడటం లేదా వాళ్ళు చెప్పేదానికి ‘ఊ’ కొట్టడం తప్పిస్తే పట్టుమని పది నిమిషాలైనా తీరిగ్గా వాళ్ళ పక్కన కూర్చుని సరదాగా వాళ్ళతో గడుపుతున్నది లేదు.‘పిల్లలతో రోజులో కనీసం అరగంటైనా నిమ్మళంగా గడపలేనప్పుడు ఎందుకీ జీవితం? పిల్లలకంటే కూడా ఉద్యోగం, జీతం ఇవే నీకెక్కువా? నీ ఈ ఉరుకుల పరుగులహడావుడికసలు అర్థమంటూ ఉందా?’ ఒక్క తీరున నన్ను నిలదీస్తున్న మనసుకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను.

అలాగని ఇరవై ఏళ్ళుగా ఇష్టంగా చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్నట్లుండి వదిలేయడమంటే నా శరీరాన్నుంచి ఒక భాగాన్ని నిర్దాక్షిణ్యంగా కోసి పారేస్తున్నట్లనిపిస్తోంది.

ఆఫీసులో ఇరవై ఏళ్ళ సర్వీసు పూర్తయింది కాబట్టి వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా నాకు పూర్తి పెన్షన్‌ వస్తుంది. సొంత ఇంటిని ఎన్నడో సమకూర్చుకున్నాం. మెడికల్‌ సౌకర్యాలకి సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌కార్డ్‌ ఉండనే ఉంది. బ్యాంకులో సేవింగ్స్‌ కూడా బాగానే ఉన్నాయి. పైగా ఆయన జీతం ఎలాగూ ఉండనే ఉంటుంది. ఏ రకంగా చూసినా మాకు ఆర్థిక సమస్యలన్నవి లేనేలేవు. అలాంటప్పుడు ఉద్యోగం మానేసేయటానికి ఏమిటి ప్రాబ్లమ్‌? అయితే ఇంతకాలమూ డిపార్టుమెంటులో పనిచేసింది కేవలం ఆర్థిక సంపాదన కోసమేనా?

నా హృదయాంతరాళాల నుంచి ఉవ్వెత్తున లేచిన ప్రశ్న నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

నా చదువునీ ప్రతిభనీ దేశం కోసం ఉపయోగించాలనుకోవడమూ... ఆ ప్రయత్నంలో ఎన్నో ట్రైనింగులకి హాజరై నన్ను నేను మరింత సమర్థంగా తీర్చిదిద్దు కోవడమూ... ఇవన్నీ కూడా నేనెంతో ఇష్టంగా చేసిన పనులే తప్ప కేవలం నెల చివరలో వచ్చే జీతం రాళ్ళకోసం మాత్రమే చేసినవి కావని ఖచ్చితంగా చెప్పగలను.

ఉద్యోగమా... పిల్లలా..? తేల్చుకోలేకపోతున్నా!

ఆయనే గనక కొద్దిపాటి సహకారాన్ని అందించివుంటే నేనింతలా మధనపడవలసిన అగత్యం ఉండేది కాదు కదా!

ఆలోచిస్తూపోతే మనసుకి మరింత బాధే తప్పిస్తే ఏ విధమైన ప్రయోజనమూ లేదు.

ఇక లాభంలేదు, రెండు పడవల్లో కాళ్ళు పెట్టి అటు ఆఫీసుకీ ఇటు పిల్లలకీ కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏదో ఒక దాన్ని వదిలేసుకోవడమే శ్రేయస్కరం.
ఊగిసలాడుతున్న మనసుని స్థిరపరచుకున్నాను.

*               *              *

ఈవేళ సెలవురోజు కావడంతో తీరిగ్గా పనులన్నీ ముగించుకున్న మీదట పిల్లలు లంచ్‌ చేస్తుండగా నా నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాను. ‘‘ఇక నుంచీ అమ్మ ఇంట్లోనే ఉంటుందోచ్‌’’ అంటూ.

ఎగిరి గంతులేస్తారనుకున్నా, కానీ నేను చెప్పినదానికి కొద్ది క్షణాలపాటు ఉలుకూ పలుకూ లేనట్లుగా ఉండిపోయారు పిల్లలు.

ముందుగా మా పెద్దది నోరు విప్పింది. ‘‘అమ్మా, ఆఫీసులో నువ్వు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేస్తూ మంచిపేరుతో పాటు ఎన్నో అవార్డులని తెచ్చుకున్నావు. పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా తీరిక చేసుకుని మా స్టడీ ప్రాజెక్ట్సులో మాకు సాయం చేస్తుంటావనీ, మాతోపాటుగా రాత్రుళ్ళు మేలుకుని ఉండి మా సందేహాలన్నీ తీరుస్తుంటావనీ మా ఫ్రెండ్స్‌ అందరికీ నువ్వంటే ఎంతో అడ్మిరేషన్‌ తెలుసా! నిన్నొక రోల్‌మోడల్‌లా చూస్తారమ్మా వాళ్ళంతా. అలాంటిది నువ్వు ఉద్యోగం మానేయడమేమిటి?’’

చిన్నది కూడా పెద్దదానికి వంతపాడింది.

‘‘అవునమ్మా, ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఇల్లూ ఉద్యోగం రెండూ సమర్థంగా చూసుకోవాలి’ అంటూ మాకెప్పుడూ చెబుతుంటావుగా. అలాంటిది నువ్విప్పుడు సడెన్‌గా ఉద్యోగం మానేయడం
దేనికమ్మా?’’ నేనూహించని విధంగా వాళ్ళు స్పందించడంతో మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత నా ఆలోచనలనీ, సరైనంత సమయాన్ని వాళ్ళతో గడపలేని నా అశక్తతనీ, ఉద్యోగం మానేయవలసిన ఆవశ్యకతనీ వాళ్ళకి వివరించాను.

కానీ, నా ఆలోచనలతో వాళ్ళు ఎంత మాత్రమూ ఏకీభవించలేదు.

‘‘అమ్మా, మాకవసరమైన ప్రతిసారీ నువ్వు మాకు అందుబాటులోనే ఉన్నావు. నువ్వేదో లోటు చేస్తున్నావన్న ఫీలింగ్‌ మాకైతే ఎప్పుడూ కలగలేదు’’ అంటూ ధన్య ఆపగానే ధాత్రి అందుకుంది.

‘‘అవునమ్మా, మన ప్యాషన్‌ని మనమెన్నడూ వదులుకోకూడదని నువ్వే చెబుతుంటావుగా! మరి నీ ఉద్యోగం అంటే నీకు ఎంతో ఇష్టం కదా, అలాంటి ఉద్యోగాన్ని నువ్వెందుకు మానేయడం? నీకు ఇంట్లో పని ఎక్కువైనట్లుగా అనిపిస్తుంటే నాన్ననెలాగైనా ఒప్పించి వంటకి మనిషిని పెట్టుకుందాం. మిగతా పనుల్లోనూ మేమిద్దరమూ నీకు సాయం చేస్తాం’’ అని చెబుతూనే నా బుగ్గ మీద ముద్దుపెట్టింది ధాత్రి.

‘‘అవునమ్మా, నువ్వు ఉద్యోగం మానేయొద్దు. నువ్వెప్పుడూ మా సూపర్‌ మదర్‌లాగే ఉండాలి. వి ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యు’’ అంటూ తన రెండు చేతులూ నా మెడచుట్టూ వేసింది ధన్య.

పిల్లల మనసుల్లో తల్లిగా నాకంత చక్కటి స్థానముండటమూ నన్నొక ఐడియల్‌ మదర్‌గా వాళ్ళు భావించడమూ నా మనసుకి చెప్పలేనంత ఆనందాన్ని కలిగించాయి.

ఆఫీసు వ్యవహారాలలో బిజీగా ఉంటూ పిల్లలకి లోటు చేస్తున్నానేమోనని నేనింతకాలంగా అనుకుంటున్నదంతా ఒట్టి అపోహేనని తేలిపోవడంతో తేలికైన మనసుతో పిల్లలని ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నాను. ఇక ఉద్యోగ విరమణ
అన్న ఆలోచనని నా మనసు నుంచి దూరంగా తరిమేశాను.

*               *              *

ఆరోజు నుంచీ మావారిలో కొట్టొచ్చినట్లుగా ఏదో మార్పు.

రోజూ ఇంటికి వస్తూనే ఇల్లు శుభ్రంగా లేదనో కూరలో ఉప్పు ఎక్కువయిందనో లేదా పండగపూట వాళ్ళ అమ్మలాగా గుమ్మాలకి శ్రద్ధగా పసుపు రాయలేదనో మామిడి తోరణాలని కట్టలేదనో వాళ్ళ వదినలా కడిగిన ముత్యంలా ఫ్రెష్‌గా ఉండకుండా జిడ్డోడుతూ ఉన్నాననో... ఏవేవో సూటీ పోటీ మాటలంటుండే మావారికి ఏమైందో తెలీదు, ఏ విధమైన వ్యంగ్య బాణాలనీ విసరకుండా మౌనంగా ఉండసాగారు.

ఆఫీసులో ఏమైనా తీవ్రమైన టెన్షన్లని ఎదుర్కొంటున్నారేమో మరి!

*               *              *

శుక్రవారం రాత్రి పనులన్నీ ముగించేసుకున్నాక బెడ్‌రూమ్‌లోకి వచ్చిన నాకు బెడ్‌ మీద వెల్లకిలా పడుకుని గది పైకప్పుని తదేక దీక్షతో చూస్తున్న మావారు కనిపించారు.

‘ఏమైందబ్బా ఈయనకి, అడిగేస్తే పోలా?’ నేను నోరు తెరిచేలోపే, పడుకున్నవారల్లా అదాటున లేచొచ్చి నా ఒళ్ళో తల పెట్టుకున్నారు మావారు.

ఆయనలా చేయడమంటే చేసిన తప్పుని ఒప్పుకుంటూ నాకు సారీ చెప్పడమన్నమాట.

నాతో ప్రేమలోపడిన తొలిరోజుల్లోనూ ఆ తరవాత మా పెళ్ళైన కొత్తలో హనీమూన్‌ రోజుల్లోనూ తప్పిస్తే మళ్ళీ ఎన్నడూ ఆయన ఇలా నాకు సారీ చెప్పిందిలేదు.

కళ్ళల్లో నీళ్ళు జివ్వున చిమ్మగా అసంకల్పితంగానే ఆయన్ని అనునయిస్తున్నట్లుగా నా చేతులు ఆయన క్రాఫ్‌ని సవరించాయి. రెండు నిమిషాల అనంతరం మనసు తేలికపడిందేమో మరి, నా రెండు చేతులనీ పట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పసాగారు.

‘‘నన్ను క్షమించు రాజీ, ఇన్నేళ్ళ మన కాపురంలో మన పిల్లలు అర్థంచేసుకున్నంతగా కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆడపిల్లలు కదూ... నీ ఇష్టాయిష్టాలని గమనించి నీకు ఆసరాగా నిలబడతామనీ, తమ వంతు తాము సహకరిస్తామనీ చిన్నపిల్లలైనా సరే, పెద్ద మనసుతో హామీ ఇచ్చారు. నేను మాత్రం భర్తగా నీకేవిధమైన సహకారాన్నీ ఇవ్వకపోగా సూటీపోటీ మాటలతో నిన్ను వేధిస్తుండేవాడిని కదూ!’’

‘‘ఇప్పుడవన్నీ ఎందుకండీ...’’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేశారు.

‘‘నన్నాపొద్దు రాజీ, నా తప్పు నాకింత కాలానికి తెలిసొస్తోంది. నా భావాలని నీతో పంచుకుని నా గుండె బరువుని తగ్గించుకోనీ’’ అంటూ కంటిన్యూ చేశారు.

‘‘నీతో ప్రేమలోపడి, ఆ తర్వాత నీ వెంటపడి నిన్ను పెళ్ళి చేసుకున్నాను కదూ! అందమూ తెలివితేటలతోపాటుగా చక్కటి ఉద్యోగం కూడా చేస్తున్న నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేసి పొంగిపోయాను.

కానీ, ఆ తరవాత ప్రతీక్షణం ఒక వర్కింగ్‌ లేడీగా నువ్వు నాకేదో తక్కువ చేస్తున్నట్లుగానూ, ఇంటిపనుల్లో ఏదో లోపం చేస్తున్నట్లుగానూ భావించసాగాను.

మా అమ్మలా రుచిగా వంట చేయవనీ, వదినలా బ్యూటీపార్లర్‌కి వెళ్ళి మేకప్‌ అవ్వవనీ నిన్నెప్పుడూ చులకన చేస్తుండేవాడిని. మా అమ్మ కూడా నా మాటలకి వంత పాడుతుండేది కదూ!’’ ఒక్క క్షణం ఆగిన ఆయన మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా చెప్పసాగారు.

‘‘ఆ వేళ అన్నయ్యకి గుండెనొప్పి వచ్చింది. సమయానికి నేను ఊళ్ళో లేను. వదిన ఏడుస్తూ కూర్చుంది. అమ్మకేమో కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేయడమే కాకుండా, అంబులెన్స్‌ వచ్చే లోపల అన్నయ్యకి ప్రథమ చికిత్స కూడా చేశావు. సమయోచితంగా నువ్వు స్పందించిన తీరుని డాక్టర్‌ ఎంతో మెచ్చుకున్నాడు. ఇన్ని చేసిన నీకు కనీసం ‘థాంక్స్‌’ అన్న రెండు అక్షరాలు కూడా చెప్పలేనంత పురుషాహంకారం నాది.

ఆ తరవాత రెండు రోజులకేననుకుంటా... అమ్మ చేసిన గుత్తొంకాయ కూరని తింటూ ‘ఎప్పుడూ వేపుడు ముక్కలే తప్పిస్తే ఇలాంటి కూరలు మా ఆవిడ పొరపాటున కూడా చేయదు. ఒకవేళ చేసినా వాటిల్లో రుచీపచీ ఉండదు’ అంటూ నేను వ్యంగ్యంగా అన్నదానికి ఎప్పటిలా మా అమ్మ వంత పాడలేదు, మౌనంగా ఉండిపోయింది.

కానీ, మా వదిన మాత్రం నన్ను చెడామడా కడిగేసింది. ‘బాబూ, మా తోడికోడలు నీకు కావలసినట్లుగా వంట చేయలేకపోవచ్చు, కానీ ఆమె నెలనెలా నీతో సమానంగా ఉద్యోగం చేస్తూ ఇంటి ఖర్చులని పంచుకోవడమే కాకుండా క్లిష్టమైన సమస్యలెదురైనప్పుడు మగవాళ్ళతో సమానంగా నిబ్బరంగా నిలబడగలదు. ఆనాడు అపెండిసైటిస్‌ వల్ల నీకు కడుపునొప్పి వచ్చినా, మొన్నటికి మొన్న మీ అన్నయ్యకి గుండెపోటు వచ్చినా మీ ప్రాణాలని నిలబెట్టింది ఆ దేవతే. అంతవరకూ ఎందుకు... నీ మానాన నువ్వు ఆఫీసు ట్రైనింగులనీ టూర్లనీ చెప్పి వెళ్ళిపోతే మీ పిల్లల స్కూల్‌ అడ్మిషన్లూ ఇంటర్వ్యూలూ కౌన్సిలింగ్‌... ఇవన్నీ కూడా తనే చూసుకునేదన్న విషయం నీకు మాత్రం తెలియనిదా?’ వదిన మాటలకి అవమానంతో నా మొహం ఎర్రబడడాన్ని గమనించినా అన్నయ్యగానీ అమ్మ కానీ మా వదినని వారించనూ లేదు, ఆమె మాటలని తప్పుపట్టనూ లేదు. వాళ్ళంతా కూడా నీలో గుర్తించిన గొప్పతనాన్ని నేను మాత్రం గమనించనట్లే ఉండిపోయాను.

నిజమే, మా వదిన చెప్పినట్లుగానే ఆరోజు అర్ధరాత్రివేళ నేను కడుపునొప్పితో గిలగిలలాడుతుంటే, నువ్వు స్వయంగా కారుని డ్రైవ్‌ చేసుకుంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌లో నన్ను అడ్మిట్‌ చేశావు. డాక్టర్లు అపెండిసైటిస్‌ అని చెప్పి వెంటనే ఆపరేషన్‌ చేశారు. బెంబేలుపడకుండా సమయానికి ట్రీట్‌మెంట్‌ అందించావని నా కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌ అందరూ కూడా నిన్ను ఎంతో మెచ్చుకున్నారు. అంత చక్కటి భార్యని పొందిన నా అదృష్టాన్ని పొగిడారు కూడా.

అయినా నిన్ను అర్థంచేసుకోలేని నా మూర్ఖత్వం ‘అర్ధరాత్రిపూట ఎవరినీ సాయానికి పిలవకుండా పెద్ద మగరాయుడిలా కారు నడిపావు’ అంటూ నీమీద ఎగిరేట్టు చేసింది.

‘సగటు ఆడదాని భయమూ భక్తీ ఒద్దికా అనేవి లేశమాత్రమైనా లేవు నీకు, అన్నీ నేనే చేసేయగలనన్న అహంకారం నీది’ అంటూ నిన్ను తూలనాడానే తప్పితే అహంభావానికీ ఆత్మవిశ్వాసానికీ మధ్యనుండే సన్నటి గీతని గుర్తించలేకపోయాను’ తనకు తనే చెప్పుకుంటునట్లుగా చెప్పుకుపోతున్నారు మావారు.

‘వారానికి అయిదు రోజులు అష్టావధానం చేసే నువ్వు వారాంతాలు కాస్త ఎక్కువసేపు నిద్రపోతే విసుక్కోవడం, వంటకి మనిషిని పెడితే సర్దుకుపోకుండా ‘ఆవిడ చేసే వంట నచ్చడం లేదు, నువ్వే చేయి’ అంటూ నిన్ను శాసించడం - అబ్బబ్బ ఒకటా రెండా? అసలు నాలాంటి మనిషిని ఇన్నేళ్ళుగా నువ్వెలా భరిస్తూ వచ్చావు రాజీ?

ఇన్ని పనుల్ని చేస్తూ అలిసిపోయిన నువ్వు బెడ్‌రూమ్‌లోకి వస్తే, నీ అలసటని గమనించకపోగా ఆ సమయంలో కూడా నిన్ను మా వదినతో పోలుస్తూ తప్పుగా మాట్లాడటం - ఛఛ, తలుచుకుంటుంటే నామీద నాకే అసహ్యం కలుగుతోంది’’ ఆయాసం వచ్చినట్లుగా ఒక్క క్షణం ఆగిన ఆయన మాటల ప్రవాహం తిరిగి కొనసాగింది.

‘‘ఉద్యోగం చేస్తూనే ఇంటిపనులూ వంటపనులతోపాటు పిల్లల చదువులు కూడా ఒంటిచేత్తో నెట్టుకొచ్చావు. అవన్నీ నీ బాధ్యతే అన్నట్లుగా కన్వీనియెంట్‌గా ఉండిపోయాను ఇన్నేళ్ళూ. ఉద్యోగం చేసే భార్యగా నువ్వు ఇచ్చే సౌకర్యాలన్నీ ఒక పక్క అనుభవిస్తూనే మరోపక్క ఇంటిపట్టున ఉండే భార్య చేసే పనులన్నీ కూడా ఏ లోటూ లేకుండా నువ్వు చేయాలని నేను ఆశించడం చాలా తప్పు కదూ!

నాలుగు రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా ఇస్తానని నువ్వు చెప్పినప్పుడు మన పిల్లలు నీపట్ల వెలిబుచ్చిన భావాలూ కల్మషంలేని ఆ పసివాళ్ళ మాటలూ నా కళ్ళని తెరిపించి, నాలో అంతర్మధనాన్ని కలిగించాయి. నీ ఉద్యోగమంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఇకనైనా అన్నింట్లోనూ నీకు తోడుగా ఉంటూ, అన్ని బాధ్యతలనీ నీతో సమానంగా పంచుకుంటూ భర్తగా నీకు పూర్తి సహకారాన్ని అందించకపోతే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను రాజీ’’ ఆర్తిగా నన్ను చుట్టేసుకున్న మావారి పరిష్వంగంలో ఏళ్ళ తరబడిగా నా మనసులో పేరుకుపోయిన నిరాశా అలసటా ఆవేదనలన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోయాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.