close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరుదైన ప్రాణదాతలు!

అరుదైన ప్రాణదాతలు!

దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. కానీ బెంగళూరుకు చెందిన శ్రీధర్‌, హెగ్డేలు మాత్రం అంతకు మించి చేస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి తమ రక్తాన్ని అందిస్తూ పునర్జన్మకు కారణమవుతున్నారు. ఆపదలో ఉన్నవారు ఎంత దూరంలో ఉన్నా సరే తమ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి మరీ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌ దాతల గురించి...

హీరో గోపీచంద్‌ ‘ఒక్కడున్నాడు’ సినిమా తర్వాతే బాంబే బ్లడ్‌గ్రూప్‌కి సంబంధించిన చర్చ అంతటా ఎక్కువైంది. నిజానికి ఇదో అరుదైన బ్లడ్‌ గ్రూప్‌. ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల మందికి మాత్రమే ఉన్న ఈ రక్తం దొరకడం చాలా కష్టం కూడా. అసలు దీని కథేమిటంటే... సుమారు ఆరు దశాబ్దాల కిందట, విధులు నిర్వహిస్తూ గాయపడిన రైల్వే కార్మికుడూ కత్తిపోటుకు గురైన మరో వ్యక్తీ ముంబయిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. చికిత్స చేస్తున్న వైద్యులు అప్పటికే 160 మంది దాతల నమూనాలతో వారి రక్తాన్ని పోల్చిచూశారు. కానీ, ఒక్కటి కూడా మ్యాచ్‌ కాలేదు. చాలా ప్రయత్నాల తర్వాత చివరికి స్థానికంగా ఉండే ఒక వ్యక్తి రక్తం సరిపోవడంతో ఆ ఇద్దరి ప్రాణాలు నిలబెట్టగలిగారు వైద్యులు. అయితే, ఆ రక్తం అప్పటివరకూ ఉన్న గ్రూపుల్లోని దేనితోనూ పోలిలేదు. ఆ అరుదైన రక్తం ముంబయిలో దొరకడంతో దీన్ని బాంబే బ్లడ్‌ గ్రూప్‌గా పేర్కొంటున్నారు. వైద్య పరిభాషలో దీన్ని హెచ్‌హెచ్‌ బ్లడ్‌ గ్రూప్‌గా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమందికే ఉండే ఈ రకమైన రక్తం ముంబయిలో మాత్రం ప్రతి పదివేల మందిలో ఒకరికి ఉండటం విశేషం.

నిజానికి ఈ బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఉన్నవారిలో ఎక్కువ శాతం మరణాలు సరైన సమయంలో రక్తం అందకపోవడం వల్లే జరుగుతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన బెంగళూరుకు చెందిన శ్రీధర్‌, హెగ్డేలు ఇద్దరూ ఆపదలో ఉన్నవారికి తమ రక్తాన్ని ఇస్తూ ప్రాణదాతలవుతున్నారు. దూరాన్ని సైతం లెక్కచేయకుండా వెళ్లి రక్తదానం చేస్తూ తమ పెద్దమనసును చాటుకోవడమే కాకుండా సాయానికి ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు.

ఎంతదూరమైనా...
బెంగళూరుకు చెందిన శ్రీధర్‌ది బాంబే బ్లడ్‌ గ్రూప్‌. 2002లో చిన్న చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా తనది బాంబే బ్లడ్‌ గ్రూప్‌ రక్తమనీ, ఇది దొరకడం చాలా కష్టమనీ డాక్టర్లు చెప్పారు. తనలాంటి అరుదైన రక్తం ఉన్నవారికి సరైన వైద్యం అందడం కంటే రక్తం దొరకడమే అసలైన కష్టమని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు శ్రీధర్‌. అప్పటి నుంచీ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్లు ఎంత దూరం ఉన్నా సరే అక్కడికి వెళ్లి తన రక్తాన్ని అందిస్తున్నారు. ఒకసారి... గోరఖ్‌పూర్‌కి చెందిన సందేశ్‌ కుమార్‌కి పుట్టుకతోనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉంది. దాన్ని ఆపరేషన్‌ ద్వారా సరిచేయడానికి సిద్ధమవుతున్న డాక్టర్లకు మరో సమస్య ఎదురైంది. సందేశ్‌ది దేశంలోనే అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌ గ్రూపని తెలిసింది. దీంతో సందేశ్‌ బంధువులూ తల్లిదండ్రులూ సోషల్‌ మీడియాలో తమ బిడ్డ పరిస్థితిని తెలుపుతూ దాతల సహాయాన్ని కోరారు. విషయం తెలుసుకున్న శ్రీధర్‌ రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లి ఆ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. ఇలాంటి ఉదాహరణలు శ్రీధర్‌ జీవితంలో ఎన్నో. దేవుడు ఈ రకమైన రక్తం ఇవ్వడం తన అదృష్టమనీ జీవితాంతం రక్తదానం చేస్తూనేఉంటానంటున్నారు శ్రీధర్‌.

ఆదిత్యా హెగ్డే...
బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి ఆదిత్య హెగ్డేది కూడా బాంబే బ్లడ్‌ గ్రూపే. ఆర్థిక నిపుణుడిగా పనిచేస్తున్న ముప్ఫైనాలుగేళ్ల ఈ యువకుడు ఆపదలో ఉన్నవారికి తన రక్తాన్ని ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. గతేడాది డిసెంబరులో తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి మరీ తల్లీబిడ్డలకు ప్రాణదానం చేశారాయన. గ్రామంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఒక మహిళకు అత్యవసరంగా రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చింది. మొదటిసారి ఆసుపత్రికి వచ్చినప్పుడే ప్రసవానికి పదిహేను రోజులు ముందు వస్తే, రక్తాన్ని తీసి భద్రపరిచి అవసరమైతే ఉపయోగిస్తామని తెలిపారు. కానీ, ఆ విషయాన్ని మర్చిపోయిన ఆమె చివరి క్షణంలో ఆసుపత్రిలో చేరింది. అప్పటికప్పుడు ఆమెకు రక్తం దొరకలేదు. శతవిధాలా ప్రయత్నించిన డాక్టర్లు చివరకు స్వచ్ఛంద సంస్థల సహాయంతో హెగ్డేను సంప్రదించారు. వెంటనే చెన్నై బయలుదేరిన హెగ్డే ఆమెకు రక్తం ఇచ్చి, కనీసం కృతజ్ఞతలు కూడా ఆశించకుండా వెంటనే వెనుదిరిగి, మరుసటిరోజు యథావిధిగా తన విధులకు హాజరైపోయారు.

ఒకచేత్తో చేసిన దానం మరో చేతికి తెలియకూడదంటారు. ఆ విషయాన్ని తు.చ తప్పక పాటించే ఈ ఇద్దరూ రేపటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.