close
శివపార్వతులకి ఒకే పీఠం..!

శివపార్వతులకి ఒకే పీఠం..!

అర్ధనారీశ్వర స్వరూపుడైన ఆ పరమశివుడు జగదాంబతో కలిసి ఏకపీఠం మీద వెలసిన క్షేత్రం ఘంటసాల. అగస్త్య మహామునే స్వయంగా ఇక్కడి స్వామిని ప్రతిష్ఠించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. వేల సంవత్సరాల నుంచీ ఇక్కడ మహాదేవుడు బాలపార్వతీ సమేత జలధీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.

పార్వతీదేవితో కలిసి ఏక పీఠంమీద దర్శనమిచ్చే జలధీశ్వరుడు శ్వేతరూపుడై, నమ్మిన భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. స్థలపురాణం ప్రకారం... దక్షుని కుమార్తె అయిన సతీదేవి అగ్నికి ఆహుతైన అనంతరం హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించింది. పరమశివుడినే భర్తగా పొందాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేసింది. పార్వతి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ఆమె భక్తినీ సంకల్పాన్నీ పరిపరి విధాల పరీక్షించిన తర్వాత పెళ్లికి అంగీకరిస్తాడు. హిమవంతుని అనుమతితో ఉత్తరపథాన జరుగుతున్న వివాహమహోత్సవాన్ని వీక్షించేందుకు దేవతలతోపాటు సమస్త ప్రాణికోటీ అటువైపు చేరుకుంది. దీంతో బరువంతా ఒకవైపు పెరిగి భూమాత కొంత ఒరిగిపోయింది. దీన్ని గమనించిన మహాశివుడు అగస్త్య మహామునిని పిలిచి, వెంటనే దక్షిణా పథానికి వెళ్లి ఒక చక్కటి ప్రదేశంలో ఆలుమగలైన తామిద్దర్నీ ప్రతిష్ఠించి, భక్తి శ్రద్ధలతో పూజిస్తే తమ కల్యాణాన్ని దర్శించే భాగ్యం కలుగుతుందని చెప్పాడు. పరమేశ్వరుడి ఆజ్ఞతో దక్షిణా పథానికి బయలుదేరిన అగస్త్యుడు సముద్రం ఒడ్డున శివపార్వతులిద్దర్నీ ప్రతిష్ఠించాలని భావించాడు. ఘంటసాల ప్రాంతానికి చేరుకుని మనసులో ఆ పరమేశ్వరుడిని ధ్యానించినంతనే శ్వేతలింగాకారుడై చెంతన పరమేశ్వరితో ఏక పీఠంమీద ఉద్భవించాడు ఆ దేవదేవుడు. సాధారణంగా శివాలయాల్లో గర్భాలయంలో ఎదురుగా శివుడూ ఒక పక్కగా అమ్మవారూ దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఒకే పీఠంమీద ఆది దంపతులిద్దరూ పూజలందుకోవడం విశేషం. ఈ క్షేత్రంలోని విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో అలరారుతూ ఉంటుంది.

ప్రాచీన దేవాలయం
జలధీశ్వర ఆలయానికి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సిద్ధార్థుని గుర్రమైన కంటకం పేరుమీదుగా ఈ గ్రామానికి కంటకశైలం, కంటకశిల అనే పేర్లు వచ్చాయి. తర్వాతి కాలంలో అది ఘంటసాలగా స్థిరపడిందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకారంభంలో ఈ ప్రాంతం ఒక ప్రముఖ రేవు పట్టణంగా ఉండేది. అయితే మరో కథనం ప్రకారం... 11వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని చోళపాండ్యపురం అని పిలిచేవారట. మొదటి వేయి సంవత్సరాలూ ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. ఇక్కడున్న జలనిధిని ఈశ్వరుడిగా భావించి జలధీశ్వరస్వామి ఆలయాన్ని ఏర్పరిచారు. పలనాటి సున్నపు రాతితో ఈ లింగాన్ని రూపొందించారని చెబుతారు. ఇక్కడి మూల విరాట్టు శ్వేతలింగంగా భక్తులకు దర్శనమిస్తాడు.

ప్రత్యేక పూజలు
ప్రముఖ శైవక్షేత్రంగా చరిత్రపుటల్లో ప్రత్యేకత పొందిన ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే...’ అన్నట్లు జలధీశ్వరాలయానికి ద్వారపాలకులుగా నరసింహస్వామీ, కాలభైరవుడూ దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో అభిషేక ప్రియుడైన జలధీశ్వరుడికి నిత్యాభిషేకాలతోపాటు, మాఘ పౌర్ణమి రోజున శాస్త్రోక్తంగా శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తారు. ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా నమక చమకాలతో రుద్రాభిషేకం నిర్వహిస్తారు. శివుడికి అత్యంత ప్రియమైనదిగా పేర్కొనే కార్తిక మాసం నెలరోజులూ ఈ క్షేత్రంలో పండగ వాతావరణం నెలకొంటుంది. విశేష అభిషేకాలూ, నిత్య కల్యాణాలూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవచ్చు
ఈ ఆలయానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచీ ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే మార్గంలో దాదాపు 60కి.మీ. దూరంలోని కొడాలికి చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులూ లేదా ఆటోల్లో ఆలయానికి వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి కరకట్ట మీదుగా 40కి.మీ. దూరంలోని శ్రీకాకుళం వచ్చి అక్కడి నుంచి ఆటోలో ప్రయాణించి జలధీశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. రైలు మార్గానికి వస్తే మచిలీపట్నం ఇక్కడికి అతి సమీప రైల్వే స్టేషన్‌. అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా ఘంటసాల చేరుకోవచ్చు.

- ఎం.నారాయణరావు, ఈనాడు అమరావతి
చిత్రాలు: కె.జగన్మోహనరావు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.