close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోషకాల ‘పుట్ట’గొడుగు!

పోషకాల ‘పుట్ట’గొడుగు!

గ్రహాంతర జీవులేవో పొరబాటున తొలకరి చినుకుల్లోంచి భూమ్మీదకి జారిపడి ఉంటాయి. మళ్లీ అక్కడికి వెళ్లడం తెలీక అలాగే భూమిలోపలే ఉండిపోయాయి. కానీ ఏటా తొలకరి చినుకు తడి తగలగానే మళ్లీ ఆ లోకానికి ఎగిరిపోవచ్చన్న ఆశతో తెల్లని గొడుగుల్లా ఇలా పైకి లేస్తుంటాయి కాబోలు... మనం రోజూ తినే కూరగాయలూ పండ్లు వేటితోనూ రంగులోకానీ రూపంలోకానీ సరిపోలని పుట్టగొడుగుల్ని చూసినప్పుడు ఇలాంటి సందేహమే కలుగుతుంది కొంతమందికి. ఆ సందేహాన్ని అలా ఉంచితే, అసలేమిటీ పుట్టగొడుగులు... కాయా పండా మాంసాహారమా శాకాహారామా... చూద్దాం.

‘అబ్బా జిగురు...’ అంటూ వాటిని చూడగానే కొద్దిమంది ముఖం చిట్లించినా ‘ఆహా... పుట్టగొడుగులా...’ అంటూ లొట్టలేసేవాళ్ల సంఖ్యే ఎక్కువ. కాస్త మసాలా దట్టించి వండితే పుట్టగొడుగుల కూర ముందు నాటుకోడయినా బలాదూరే అనేస్తారు భోజన ప్రియులు. పుట్టగొడుగుల్లోని పోషకాలకి సాటేదీ అనుకుంటూ వాటిని ఇతర కూరల్లో కలగలిపి తినేసేవాళ్లు మరికొందరు. కూరలనే కాదు, బిర్యానీలూ సూపులూ సలాడ్లూ... ఇలా అన్ని రకాల వంటల్లోనూ కాసిని పుట్టగొడుగుల్ని గుప్పిస్తున్నారు
ఆధునిక షెఫ్‌లు.

అత్యంత ప్రాచీనకాలం నుంచీ కూడా పుట్టగొడుగుల్ని మనిషి తింటూనే ఉన్నాడు. అందులో సందేహం లేదు. ఇవి తింటే మరణం ఉండదని ఈజిఫ్షియన్లు భావించేవారు. దాంతో ఫారో చక్రవర్తులు మాత్రమే తినేవారు. సామాన్యులకి నిషేధం. చైనీయులు సంప్రదాయ వైద్యంలో భాగంగా తింటే, హిందువులూ, జొరాస్ట్రియన్లూ ఇవి దైవసంబంధమైనవనీ వీటిని తింటే అతీతశక్తులు వస్తాయనీ నమ్మేవారట. పుట్టగొడుగుల్లోని కొన్ని రకాలు తిన్నప్పుడు ఒకలాంటి భ్రాంతికి లోనై, గాల్లో తేలిపోతున్న అనుభూతి కలగడమే అందుకు కారణం. నమ్మకాలూ అనుభూతులూ పక్కనబెడితే, పుట్టగొడుగులు పోషక సిరులు అని ఏనాడో గుర్తించారు. ప్రొటీన్‌లోపంతో బాధపడే శాకాహారులకీ డి-విటమిన్‌ లోపం ఉన్నవారికీ క్యాన్సర్‌ రోగగ్రస్తులకీ ఇవి బలవర్థకమైన ఆహారం. కూరగాయల్లో దొరకని ఫోలిక్‌ ఆమ్లంతోబాటు ధాన్యాల్లో దొరకని లైసీన్‌, ట్రిఫ్టోఫాన్‌ వంటి అమైనోఆమ్లాలూ వీటిల్లో పుష్కలం. ఎ, బి, సి, డి విటమిన్లతోబాటు ఖనిజాలూ ఎక్కువే. పెరిగే పిల్లలకీ రక్తహీనతతో బాధపడేవారికీ ఇవెంతో మేలు. పుట్టగొడుగుల్లోని ఎర్గొథియోనైన్‌ని మాస్టర్‌ యాంటీఆక్సిడెంట్‌గా పిలుస్తారు. ఇది హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగించి రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్లనీ గుండెవ్యాధుల్నీ నివారిస్తుంది. ఇదేకాదు, వీటిల్లోని బీటా-గ్లుకాన్లూ, లినోలిక్‌ ఆమ్లాలూ, యాంటీక్యాన్సర్‌ కారకాలుగా పనిచేస్తాయి. అందుకే మెనోపాజ్‌ దశలో ఉన్న స్త్రీ, పురుషులిద్దరికీ ఇది మంచి ఆహారం.

వీటిల్లోని సహజ యాంటీబయోటిక్స్‌ సూక్ష్మక్రిములు పెరగకుండా నివారిస్తాయి. దాంతో అల్సర్‌ సంబంధిత గాయాలూ ఇన్ఫెక్షన్లూ తగ్గేందుకూ సహకరిస్తాయివి.

పుట్టగొడుగుల్లో దొరికే పీచూ ప్రొటీన్లూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించడం ద్వారా హృద్రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. ఐరన్‌ లోపంతో బాధపడేవాళ్లకీ ఇవి మంచివే. పుట్టగొడుగులు కాలేయ ఆరోగ్యాన్నీ ఇన్సులిన్‌ శాతాన్నీ పెంచడం ద్వారా చక్కెర వ్యాధినీ నిరోధిస్తాయి. వీటిల్లో సమృద్ధిగా ఉండే డి-విటమిన్‌ కాల్షియం శోషణనీ జీవక్రియనీ పెంచుతుంది.

పొటాషియం అత్యధికంగా ఉండటంతో బీపీనీ తగ్గిస్తాయివి. ఇవి రక్తనాళాలను వ్యాకోచింపజేయడంతో జ్ఞాపకశక్తీ తెలివితేటలూ పెరుగుతాయి. ఎక్కువగా జంతుప్రొటీన్లలో మాత్రమే దొరికే సెలీనియం పుట్టగొడుగుల్లో పుష్కలం. దాంతో శాకాహారులకు ఎంతో మేలు. బరువుతగ్గాలనుకునేవాళ్లకీ మంచివే. అందుకే నేడు తినగలిగే అన్ని రకాలనీ ఫామ్స్‌లో పెంచుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో వీటి సాగు ఎక్కువ.

అసలెలా పుడతాయి..?
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చూస్తుండగానే పెరిగిపోయే పుట్టగొడుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు మైకాలజిస్టులు. ఇవి మొక్కలూ కాదు, జంతువులూ కాదు. ఆ రెండింటి లక్షణాలనూ పుణికిపుచ్చుకున్న ఒకరకం శిలీంధ్రాలు(ఫంగస్‌). ఈ జీవుల అసలు రూపం కంటికి కనిపించదు. అది నేలలోనే ఉంటుంది. భూమిలోంచి చొచ్చుకుని వచ్చే గొడుగు రూపం దాని పండు మాత్రమే. ఆ గొడుగు నిండా కంటికి కనిపించని సైజులో అనేక విత్తనాలు(స్పోర్సు) ఉంటాయి. పండు ఎండిపోయే దశలో అవి నేలమీద పడి భూమిలోపల భద్రంగా ఉంటాయి. కొన్ని రకాలయితే శతాబ్దాలపాటు సుప్తావస్థలో ఉంటాయి. అనుకూల వాతావరణం రాగానే తిరిగి కుప్పలుతెప్పలుగా మొలకెత్తుతాయి. అందుకే ఎన్నిసార్లు పరిష్కరించినా మళ్లీ మళ్లీ వచ్చే సమస్యల్ని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి అంటుంటారు.

సూపర్‌ ‘బటన్‌’
సాధారణంగా చల్లని వాతావరణం ఉన్న కొండగుట్టల్లోనూ పాముపుట్టల దగ్గరా మొలుస్తుంటాయి. పుట్టల దగ్గరున్న ఆ వాతావరణం వాటికి అనుకూలంగా ఉండటంవల్లేమో అక్కడే ఎక్కువగా వస్తాయి. పుట్టకొక్కులు,
పుట్టగొడుగులు అని పిలిచేదీ అందుకే.

14 లక్షలకు పైగా జాతులున్న పుట్టగొడుగుల్లో తినేవి రెండు వేల రకాలే. సాధారణంగా కాడ మధ్యలో స్కర్టులా పలుచని పొర వేలాడుతూ ఉండేవన్నీ విషపూరితమైనవిగా చెబుతారు. అయితే తినేవి ఏవో తినకూడనివి ఏవో గుర్తుపట్టడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఫామ్స్‌లో కొనుగోలు చేయడమే మంచిది. పుట్టగొడుగుల్ని సేకరించే వాళ్లను మైకోఫాగిస్ట్‌లనీ ఆ వేటను మష్రూమింగ్‌ అనీ అంటారు. తినేవాటిల్లోనూ మనదగ్గర ఎక్కువగా వచ్చేవీ పెంచేవీ బటన్‌, ఆయిస్టర్‌ రకాలే. ప్రపంచవ్యాప్తంగా తొలినాళ్ల నుంచీ మనిషి తిన్నదీ ప్రస్తుతం ఎక్కువగా తినేదీ బటన్‌ మష్రూమ్‌ల్నే. వీటినే కామన్‌, టేబుల్‌, ఛాంపియన్‌, చెస్ట్‌నట్‌ మష్రూమ్స్‌... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. 70కి పైగా దేశాల్లో సాగుచేస్తోన్న వీటిల్లో అన్ని రకాల పోషకాలూ పుష్కలమే. ఇవి గోధుమ, తెలుపు, బూడిదవర్ణాల్లో దొరుకుతాయి.

ఆయిస్టరే ఎందుకు?
చూడ్డానికే కాదు, రుచిలోనూ ఆల్చిప్పల్ని తలపించే ఆయిస్టర్‌ రకంలో ప్రొటీన్‌ శాతం చాలా ఎక్కువ. బి-విటమిన్లూ పుష్కలమే. కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలూ ఎక్కువే. అందుకే వీటిని ఫ్రీజ్‌ చేసి లేదా ఎండబెట్టి మరీ విక్రయిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము, పేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రించే గుణాలు వీటిల్లో ఎక్కువని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆంకాలజీ పేర్కొంటోంది. హెచ్‌ఐవీ వైరస్‌నీ నియంత్రించే గుణాలూ ఉన్నాయని తేలింది. మామూలుగా చెట్లమీద పెరిగే ఆయిస్టర్‌ రకాలు లేత గోధుమరంగులోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్ని రంగుల్లోనూ పండిస్తున్నారు. చిన్నగొడుగు ఉండే బేబీ ఆయిస్టర్‌, భారీ కాడ ఉండే జెయింట్‌ రకాలూ వస్తున్నాయి.

ఇవేకాదు, క్రెమిని, పొర్టొబెల్లొ, ఎనొకి, షిటేక్‌, మట్సుటేక్‌... రకాలన్నీ తినేవే. వీటిని చైనా, జపాన్‌వాసులు ఎక్కువగా తింటుంటారు. అందుకే వాళ్లలో రోగనిరోధక శక్తి ఎక్కువ. క్యాన్సర్లు తక్కువ. కొన్ని రకాలు మానసిక రోగులకు మందయితే, కొన్ని ఇతరత్రా నాడీవ్యాధుల్ని తగ్గిస్తాయి. అయితే, ఏ రకమైనా బాగా కడిగి, ఉడికించి మాత్రమే తినాలి. అప్పుడే వాటిల్లో ఎక్కడైనా కాస్త టాక్సిన్లు ఉన్నా తొలగిపోతాయి. మొత్తమ్మీద మష్రూమ్‌ కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధం కూడా.

ఇవి చాలా ఖరీదు..!

కాశ్మీరుకొండల్లో మాత్రమే దొరికే గుచి లేదా మోరల్‌ రకం కిలో ధర రూ. 10,000 నుంచి 30,000 ఉంటుంది. ప్రపంచంలోకెల్లా ఖరీదైన పుట్టగొడుగులు ఇవే. అందుకే వీటిని రాయల్‌ మష్రూమ్స్‌ అంటారు. తేనెతుట్టలా కనిపించే ఈ రకాన్ని 
సేకరించడం మినహా మరో మార్గం లేదు. కృత్రిమ వాతావరణంలో పెంచలేకున్నా కాంగ్రా, మనాలి ప్రాంతాల్లో కొండల్లోనే పెరిగేలా చేస్తున్నారు. మార్చి నుంచి మే చివరి వరకూ దొరికే ఈ పుట్టగొడుగుల సేకరణ చాలా కష్టం. వందల మైళ్లు నడవాలి. పైగా అక్కడ ఉండే వందల రకాల్లో నుంచి వీటిని ఏరాలి. అందుకే వీటికంత ధర. పైగా ఇవి ఒక ఏడాది వచ్చినచోట ఆ మరుసటి ఏడాది కనిపించవు. ఎక్కడ వస్తాయో ఊహించడం కష్టం. అయితేనేం... వీటి రుచి అద్భుతం. ఎండురూపంలో దొరికే వీటిని నానబెట్టి ఉడికించి వండుతారు. వీటితో చేసే బిర్యానీ సూపర్‌ అంటారు ఆ రుచి తెలిసినవారు. ఉదరకోశవ్యాధులకీ గుచి మంచి మందు. యునాని వైద్యంలోనూ దీని వాడకం ఎక్కువే.

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.