close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైద్యో నారాయణో హరీ

వైద్యో నారాయణో హరీ
- షేక్‌ అహమద్‌ బాష

నేనొక ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడిని. పట్టణంలో నాకు చాలా మంచి పేరుంది. అందుకే నా ప్రాక్టీసు కూడా బాగుంది. నా బాధంతా ఒకటే, నా పేషంట్‌లందరూ ముసలివారు. పాతిక ముప్ఫై ఏళ్ళలోపువారు ఒక్కరంటే ఒక్కరు కనబడరు. నేను ఎంబీబిఎస్‌ తర్వాత కోరికోరి పీజీలో కార్డియాలజిస్ట్‌ కోర్సును ఎన్నుకున్నాను. ఆ తర్వాత డిఎం కూడా చేశాను. కానీ దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ ముసలివాళ్ళు వస్తే ఒక పట్టాన వదిలిపెట్టరు. వారి ఆరోగ్యంతోపాటు, వారి ఇతర బాధలూ, గుండెజబ్బులపైన ఉన్న వారి పరిజ్ఞానాన్నంతా నా దగ్గర ప్రదర్శిస్తారు. నేనిచ్చే సలహాలనూ ఒక్కోసారి ప్రశ్నిస్తారు. దీంతో రోజురోజుకూ నాలో అసహనం పెరిగిపోతోంది. ఈరోజు కూడా నాకున్న హాస్పిటల్లోని ఇన్‌పేషంట్స్‌ను ఒక రౌండ్‌ వేసి, యధావిధిగా నా ముఖానికి చిరునవ్వు పులుముకుని ఓపీ ప్రారంభించాను.

మొదటి పేషంట్‌ లోపలికి వచ్చాడు.
‘‘నమస్తే డాక్టర్‌, బాగున్నారా?’’
(ఇలాంటి కేసులు నాకు రోజూ కనీసం అరడజను తగులుతుంటాయి. అతనొచ్చింది, అతని ఆరోగ్యం కోసం. కానీ, వస్తూనే నన్ను బాగున్నారా అని అడుగుతాడు.
అసలు డాక్టరును ‘మీరు బాగున్నారా’ అని అడగొచ్చా? తిక్క మనుషులు) ‘‘రండి రండి, చాలా రోజుల తర్వాత వస్తున్నారు, ఎలా ఉన్నారు?’’ అన్నాను లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ.

‘‘చాలా రోజుల తర్వాత ఏమీ కాదండీ, ప్రతి సంవత్సరం ఈ నెలలోనే వస్తుంటాను డాక్టర్‌. చూడండి నా ఫైల్‌- గత సంవత్సరం పదో తేదీ వచ్చాను, ఈసారి ఆరో తేదీనే వచ్చేశాను. నాకెందుకో మంగళవారం, శుక్రవారం డాక్టర్‌ వద్దకు రాబుద్ధికాదు.
(నేనేదో మాట వరసకు అడిగిన ప్రశ్నకు ఈయన తన సెంటిమెంట్‌ సోదంతా చెప్పాడు, ఇదంతా నేను వినాల్సిందే, తప్పదు. ఇప్పుడే తెలిసింది నా ప్రాక్టీస్‌ మంగళ, శుక్రవారాలు ఎందుకలా ఏడుస్తుందో) నావద్దకు వచ్చే ముందే వారివారి  లిపిడ్‌ ప్రొఫైల్‌, ఈసీజీ ముందే చెక్‌ చేసుకుని వస్తారు. నేను ఆయన ఫైల్‌ తీసి అవి చూశాను. అంతా బాగానే ఉంది. బీపీ చూశాను, అదీ సరిగ్గానే ఉంది.

‘‘సార్‌, అంతా బాగుంది. నేనింతకుముందు రాసిన మందులనే కొనసాగించండి. రోజూ మార్నింగ్‌ వాక్‌కి వెళుతున్నారా?’’
(బుద్ధి లేకుండా పొరబాటుగా ఆ ప్రశ్న అడిగాను. ఇక నాకు తెలుసు ఆయన  సుత్తి కొడతాడని)

‘‘ఎంత మాటన్నారు, ఏం వదిలినా నడక మాత్రం వదలను. ఎండాకాలం అయితే తెల్లవారి అయిదున్నరకే బయలుదేరేస్తాను, చలికాలం అయితే ఏడు గంటల తర్వాత బయలుదేరుతాను. ఇక వర్షాకాలం నడక కుదరకపోతే ఇంట్లోనే స్టాటిక్‌ సైకిల్‌ ఉంది, దానిమీద కనీసం అరగంటైనా తొక్కుతాను. అరగంటలో నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. మీరు చెప్పినట్టే ఎక్కువ నూనె వస్తువులూ బజార్లో దొరికే వడలూ పకోడీల్లాంటివి అసలు తినను. ఆదివారం ఒక్కరోజే నాన్‌ వెజిటేరియన్‌ తీసుకుంటాను. పండ్లూ ఆకుకూరలూ కాయగూరలూ ఎక్కువ తీసుకుంటాను.’’
(నేనెప్పుడో చెప్పిన మాటలు నాకే ఒప్పగించాడు. తప్పదు, చిరునవ్వుతో తలాడించాను. ఇక నన్ను వదలరా బాబూ, బయట ఇంకా పేషంట్స్‌ ఉన్నారు, నువ్విచ్చే మూడు వందల రూపాయలకు నా ‘విలువైన’ సమయాన్ని తినేయవద్దు)

అతను వెళ్ళగానే నా రెండో పేషంట్‌ వచ్చాడు. ‘‘నమస్తే సార్‌’’ అంటూ కూర్చుని తన రిపోర్ట్‌ అందించాడు.

అవి చూస్తూ ‘‘మీకు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కాస్త పెరిగాయి, కొన్ని కొత్త మందులు రాస్తాను, అవి సక్రమంగా వేసుకుంటే మీ లెవెల్స్‌ తగ్గి ఎటువంటి సమస్యా ఉండదు’’ అని చెప్పాను.

‘‘డాక్టర్‌గారూ, కొలెస్ట్రాల్‌ 250 వరకూ ఉండవచ్చని హెగ్డేగారు చెబుతుంటారు కదండీ, అదీకాక అందరికీ ఒకే లెవల్‌ ఉండాల్సిన పనిలేదని కూడా ఆయన చెబుతున్నారు. కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు ఇచ్చే స్టాటిన్స్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనీ, అవి కేవలం అమెరికా కంపెనీల 200 బిలియన్‌ డాలర్ల స్కాం అని కూడా ఆయన చెబుతుంటారు. ఆయన యూట్యూబ్‌ ప్రసంగాలు మీరు చూశారా డాక్టరుగారూ’’ అమాయకంగా అడిగాడు.

(ఈ డాక్టర్‌ హెగ్డే ఒకడు, మా ప్రాణానికి దాపురించాడు. ఆయన ఇంగ్లండులో పనిచేసిన కార్డియాలజిస్ట్‌. మనదేశంలో మణిపాల్‌ మెడికల్‌ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్స్‌లర్‌గా కూడా పనిచేశాడు. ఆయన్ను ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ బిరుదుతో సత్కరించింది కూడా. అసలు ఆయన ఎలా ఒక అల్లోపతీ డాక్టర్‌ అయ్యాడో ఆశ్చర్యమేస్తుంది. మేం చెప్పేదంతా వ్యతిరేకిస్తాడు. జీవన విధానం, ఆలోచనా విధానం, ఆహార నియమాలు పాటిస్తే చాలంటాడు. ఎక్కువ మాట్లాడితే అసలు అల్లోపతికన్నా ఆయుర్వేదం, హోమియోపతీ మేలంటాడు. ఆయన చెప్పేదంతా నిజమే కనుక ఆయన్ను మేం విమర్శించలేం. అలా ఒకరిద్దరు విమర్శించి అపఖ్యాతి పాలయ్యారు కూడా).

‘‘డాక్టర్‌ హెగ్డేగారు తెలుసండీ, ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయి. అందరూ ఆయన చెప్పినట్లే చేస్తే మరి ఇంతమందికి గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఏవో ప్రసంగాలు విని నేను ఇచ్చే మందులను వాడకపోతే  మీ ఆరోగ్యానికి నేను భరోసా ఇవ్వలేను’’ చిరునవ్వుతోనే బెదిరించాను.(నా ఆసుపత్రిలోనే ఒక మందుల షాపు కూడా ఉంది. మరి ఈ మాత్రలంతా నేను రాయకపోతే ఆ మందులను ఎవరు కొంటారు. నాకు లాభం ఎలా వస్తుంది?) అతని కళ్ళలో భయం కనిపించింది. ‘‘లేదులేండి. మాట వరసకు తెలుసుకుందామని అడిగాను. మీరు ఏమిస్తే అదే వాడతాను డాక్టర్‌’’ వినయంగా చెప్పాడు.

అతను వెళ్ళగానే మరో పేషంట్‌ లోపలికి వచ్చాడు. నమస్కారం పెట్టి, (దీనికేం తక్కువ లేదు, ఇతనేం మాట్లాడతాడో... వచ్చే ప్రతి పేషంట్‌ అడిగే ప్రశ్నలకు భయపడాల్సి వస్తోంది) అతని రిపోర్ట్‌  నా ముందుంచాడు. తను రెండు సంవత్సరాల ముందు నా వద్దకు వచ్చినట్లు ఉంది అందులో. అప్పుడు అతని కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరాయిడ్స్‌ ఎక్కువ ఉన్నందువల్ల కొన్ని మందులు వాడమనీ, ఒక సంవత్సరం తర్వాత రమ్మనీ రాసిచ్చాను. కానీ,  అతను రెండు సంవత్సరాల తర్వాత వచ్చి నా ముఖాన్నే పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు. అతను ఇప్పుడు చేయించుకున్న పరీక్షల రిపోర్టులు చూశాను. పోయినసారికీ ఇప్పటికీ అతని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ బాగా తగ్గాయి. నేను సంతోషంగా అతనివైపు చూసి చెప్పాను. ‘‘చూశారా, నేను చెప్పిన మాత్రలు వాడటంవల్ల మీ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ బాగా తగ్గాయి. మీ ఇతర టెస్టులు కూడా బాగున్నాయి. మీ బీపీ కూడా నార్మల్‌గా ఉంది’’ అన్నాను.

అతను ఇంకా నావైపు అలాగే పరిశీలనగా చూస్తున్నాడు. భయమేసింది- కొంపతీసి ఈయన కూడా ఏదన్నా క్లాసు పీకుతాడా అని.

అతను నవ్వుతూ చెప్పాడు ‘‘డాక్టర్‌గారూ, మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ నేను ఉపయోగించలేదు. అసలు ఆ మందులే కొనలేదు. రెండు సంవత్సరాల ముందు మీ హాస్పిటల్‌ నుంచి అడుగు బయటపెడుతూనే నేను ఒక కొత్త మనిషి అయిపోయాను.

నా లైఫ్‌స్టైల్స్‌ పూర్తిగా మార్చేశాను. ఆరోజే నా స్కూటరును మూలపడేసి సైకిల్‌ తీసుకున్నాను. రోజూ కనీసం ఒక గంట నడక ప్రారంభించాను. నా డైట్‌ కూడా పూర్తిగా మార్చేశాను. మాంసాహారం మానేసి, పండ్లూ కాయగూరలూ ఆకుకూరలూ తినసాగాను. ఒక్కోరోజు మా ఇంటిపక్కనే ఉన్న కొండ కూడా ఎక్కి అక్కడున్న  లేత వేపాకు, తులసి, తిప్పతీగాకు, తెల్లగలిజేరు... ఇలాంటివి తినసాగాను. చూడండి సార్‌, మీ కళ్ళెదుటే నాలో ఎంత మార్పొచ్చిందో, మీరేమంటారు?’’

(ఏమంటాను, నా ఖర్మ కాలిందంటాను. మరి ఆకులూ అలములూ తిని ఆరోగ్యం బాగుచేసుకుంటే నా దగ్గరకు రావడం ఎందుకు? నన్ను ఆటపట్టించేందుకా! ఇంకా నయం నాకూ కొన్ని ఆకులు తెచ్చివ్వలేదు. ఇలా ప్రతి ఒక్కరూ లైఫ్‌స్టైల్‌ మార్చుకుంటే ఇక మేమంతా ఇంతింత చదువుకుని, ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ప్రాక్టీస్‌ చేయడమెందుకు? ఇదండీ మా పరిస్థితి. ఈమధ్య ప్రతి దినపత్రికా ఆరోగ్యం గురించి వారంలో ఒక పేజీ కేటాయిస్తుంది. ఇక ఇంటర్నెట్లో ఎన్నో ఆరోగ్య వెబ్‌సైట్లున్నాయి. అవన్నీ చూసి ఈమధ్య మా పేషంట్లు మాకే సలహా ఇచ్చే స్థాయికి ఎదిగారు. కాస్త చదువుకున్నవాడు లోపలకు వస్తేనే భయమేస్తోంది).

అతనికి నేను ఏదో సలహా ఇవ్వాలి గనుక నోరు విప్పాను ‘‘మీరు చాలా మంచిపని చేశారు. అందరూ మీలా చేస్తే ఇక సమస్యలే ఉండవు. కానీ, అందరికీ ఇది సాధ్యంకాదు కదా. అందుకే, మందులు కూడా తీసుకోవాలి’’ అంటూ అతన్ని సాగనంపాను. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మరో పది సంవత్సరాల తరవాత ఎలా ఉంటుంది? అందుకే, నా పిల్లలను డాక్టర్‌ కోర్సు చదివించకూడదనే నిర్ణయానికి వచ్చేశాను. నేను చెప్పింది కొన్నే, కొందరయితే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా చెప్పుకొస్తారు. నేను మనసులో తిట్టుకుంటూనైనా చిరునవ్వుతో ఊఁ కొట్టాల్సిందే.

              *

ఒక పనిమీద హైదరాబాద్‌ వెళ్ళి తిరిగి వస్తున్నాను. సెకండ్‌ ఏసీలో పైబెర్త్‌ మీద వెచ్చగా కప్పుకుని మంచి నిద్రలో ఉన్నాను. ఏదో స్టేషన్‌లో బండి ఆగి కదిలింది. అక్కడే కొంతమంది దిగేశారు. మరికొంతమంది ఎక్కారు. తెల్లవారుజామున పట్టే కలతనిద్ర చెదిరింది. కింద వచ్చిన కొత్త ప్రయాణీకుడు అప్పటికే నాతో ప్రయాణిస్తున్న మరొకతనితో మాటలు కలిపాడు. అలా మాటల్లో ఆరోగ్యం గురించి చర్చ మొదలయ్యింది. అక్కడే ఎక్కినతను చెప్పసాగాడు. ‘‘మా ఊర్లో ఒక డాక్టర్‌ ఉన్నారు (ఆశ్చర్యంగా నా పేరు చెప్పాడు. నేను చెవులు రిక్కించి వినసాగాను) మీరు నిజమైనా అనుకోండి, అబద్ధమైనా అనుకోండి... ఆయన దేవుడితో సమానం. అసలు ఆయన ముఖం చూస్తూనే నా బీపీ తగ్గిపోతుందనుకోండి. మేం ఏం చెప్పినా ఆయన చిరునవ్వుతో వింటారు, మంచి సలహాలిస్తారు. ఒకసారి ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు రెగ్యులర్‌ చెకప్‌ కోసం మరో డాక్టర్‌ వద్దకు వెళ్ళాను. ఆయన ముఖం మొటమొటలాడుతుంటుంది. అసలు మావైపు చూడడు, ఏం చెప్పినా వినడు. కేవలం రిపోర్టులను మాత్రమే చూసి మందులు రాసేస్తాడు. ఏమన్నా అడిగితే సమాధానం చెప్పడు, అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకోమంటాడు. ఆయన గదిలో ఉన్నంతసేపూ నా బీపీ పెరిగిపోవడమేకాక, ముళ్ళమీద కూర్చున్నట్లు ఉండింది. అదే  మా డాక్టరయితేనా... ఎంతో ఓపిగ్గా  ఏం చెప్పినా వింటాడు. అతని ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగదు. అందుకే, నాకు తెలిసినవారందరికీ ఆయన దగ్గరకే వెళ్ళమని సలహాలిస్తాను. వెళ్ళొచ్చిన తరవాత వారు కూడా ఆయన్ను పొగిడేవారే. ‘వైద్యో నారాయణో హరీ’ అన్నారుగానీ, దేవుడికన్నా మా డాక్టరు ఎంతో గొప్పవాడు.’’

ఆ మాటలు వింటున్న నేను ఎలా అనుభూతి చెందానో మీకెలా వర్ణించను? నిండా కప్పుకున్న నా దుప్పట్లో మానవత్వపు కాంతిపుంజం ఒకటి విచ్చుకుంది. నా కృత్రిమ చిరునవ్వే నా పేషంట్లకు ఇంత స్ఫూర్తినీ ఆనందాన్నీ ఇవ్వగలిగితే ఇక నిజమైన మానవత్వపు చిరునవ్వు ఇంకెంత మంచి చేస్తుంది? అసలు మేము మెడిసిన్‌ చదువుకునేటప్పుడే చెప్పేవారు...

‘మందులు కేవలం సగం పనే చేస్తాయి, మిగిలిన సగం డాక్టరు ఇచ్చే మానవత్వపు పలకరింపు చేస్తుందని.’

ఆ మరుసటిరోజునే నా హాస్పిటల్‌ను పూర్తిగా మార్చేశాను. అక్కడే ఉన్న ఫార్మసీని మూసేశాను. ఇప్పుడు చౌకగా దొరికే  జెనెరిక్‌ మందులనే రాస్తున్నాను. అనవసరపు టెస్టులూ స్కానింగులూ రాయడం లేదు.

నా ముఖం మీద ఇప్పుడు కృత్రిమ చిరునవ్వుకు బదులు, మానవత్వంతో కూడిన చిరునవ్వు చోటుచేసుకుంది. స్నేహంగా అభిమానంగా మాట్లాడే స్వరం నన్ను మరీ ప్రముఖంగా మార్చేసి, ప్రజాదరణ పెంచేసింది. దాంతోపాటు నా ఆదాయం కూడా! డబ్బు సంపాదన కోసం  తప్పుడు విధానాలు కొనసాగించడం అనవసరమనిపించింది. ముఖ్యంగా  నా మనసులో ఇన్ని రోజులూ ఉన్న  గిల్టీ ఫీలింగ్‌ పోయి నా మానసిక ఆరోగ్యం కూడా బాగుపడింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.