close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ చిన్నారి డీక్యూ ఎంత?

మీ చిన్నారి డీక్యూ ఎంత?

21వ శతాబ్దంలో పుట్టినవాళ్లు డిజిటల్‌ పౌరులు! వీళ్లు ఎక్కువగా సమాచారం తెలుసుకునేది, స్నేహాలూ కట్టేదీ, షాపింగ్‌ చేసేదీ డిజిటల్‌ ప్రపంచంలోనే. ‘డిజిటల్‌ ప్రపంచంలో బతకాలంటే ఐక్యూ, ఈక్యూలతోపాటు డీక్యూ ఉండాలంటోంది డీక్యూ ఇన్‌స్టిట్యూట్‌. డీక్యూ అంటే ఏంటి, డీక్యూని ఎలా పరీక్షించాలి లాంటి సందేహాలు ఉన్నాయా, అయితే చదవండి!

రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత పిల్లలకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా... చాలామంది తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రశ్న ఇది. ఇప్పటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రశ్నే అనవసరం. ఎందుకంటే కంప్యూటర్లు పిల్లల జీవితాల్లోనూ భాగమైపోయాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా ఈ సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పడమే.

పిల్లలే లక్ష్యంగా...
భవిష్యత్తు తరాలు డిజిటల్‌ ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా మార్పు తేవాలనుకుంది డబ్ల్యూఈఎఫ్‌(ప్రపంచ ఆర్థిక వేదిక). ఈ సంస్థ ఇచ్చిన పిలుపునకు దక్షిణ కొరియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇన్‌ఫొలుషన్‌ జీరో, సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పందించి సంయుక్తంగా ‘డిజిటల్‌ ఇంటెలిజెంట్‌ కొషెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌’ని అందుబాటులోకి తెచ్చాయి. ఐక్యూ(తెలివితేటలు), ఈక్యూ(భావోద్వేగాల నియంత్రణ సామర్థ్యం)లకు తోడుగా ఈతరం జీవనానికి అవసరమైందే డీక్యూ(డిజిటల్‌ ప్రజ్ఞాలబ్ధి) అని నిర్వచించింది డీక్యూ ఇన్‌స్టిట్యూట్‌. ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ బాధ్యతాయుత పౌరులుగా మెలిగేందుకు చిన్నారుల డీక్యూని పెంచాలని లక్ష్యం పెట్టుకుందీ సంస్థ. దీన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8-12 మధ్య వయసుగల చిన్నారుల ఆన్‌లైన్‌ అలవాట్ల గురించి 30 దేశాల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో... ఈ వయసు పిల్లల్లో 50 శాతం మందికి ఇంటర్నెట్‌ సదుపాయంతో కూడిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి, వారిలో అవగాహన లోపంవల్ల 56 శాతం మందికి సైబర్‌ ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది, అభివృద్ధి చెందిన దేశాల పిల్లలకంటే అభివృద్ధి చెందుతున్న, వెనబడిన దేశాల్లోని పిల్లలకు సైబర్‌ ముప్పు ఇంకా ఎక్కువ... లాంటి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నారు. పరిష్కారంగా 2017 మార్చిలో ‘డీక్యూ ఎవ్రీఛైల్డ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిందీ సంస్థ. ఈ కార్యక్రమంలో భాగంగా 8-12 ఏళ్ల మధ్య పిల్లల్ని డిజిటల్‌ పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంది. గత 15 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల మంది పిల్లలకు డీక్యూపైన అవగాహన కల్పించింది. ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఇతరుల మనోభావాలను గౌరవించడం, తమ పనులను క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోవడం, ఇతరుల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడం, నకిలీ వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండటంలాంటి అంశాలకు సంబంధించి పిల్లల్లో అవగాహన పెంచడమే డీక్యూ ఎవ్రీఛైల్డ్‌ ఉద్దేశం. దీన్లో భాగంగా సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడం, ఆన్‌లైన్లో తార్కిక ఆలోచనలతో మెలగడం, బెదిరింపుల్ని సమర్థంగా ఎదుర్కోవడం, సైబర్‌ భద్రత నిర్వహణ, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వీక్షణ సమయ నిర్వహణ మొదలైన అంశాల్లో పిల్లలకు ఆన్‌లైన్లో శిక్షణ ఇస్తారు. 'dqworld.net' లో వీరికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

డీక్యూ తెలుసుకోవచ్చిలా...
వ్యంగ్యచిత్రాలూ, వీడియోలూ, స్లైడ్‌షోలూ తదితర సాధనాలతో సైబర్‌ నైపుణ్యాలను ఆన్‌లైన్లో బోధిస్తారు. ఈ బోధనలో వివిధ స్థాయులు ఉంటాయి. ఒక్కో స్థాయిని దాటుకుంటూ వెళ్తే మార్కులు కలుస్తూ ఉంటాయి. అలాగే ప్రతి అంశం చివరా అప్పటివరకూ నేర్చుకున్న అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. అన్ని విభాగాల్నీ, స్థాయుల్నీ పూర్తిచేశాక చివరగా డీక్యూ స్కోర్‌ తెలుస్తుంది. దీన్ని 85 నుంచి 130 మధ్యన లెక్కిస్తున్నారు. డీక్యూ స్కోర్‌ 115కంటే ఎక్కువగా ఉంటే, ఆ చిన్నారికి ఆరోగ్యకరమైన ఆన్‌లైన్‌ అలవాట్లూ, అత్యుత్తమ డిజిటల్‌ పౌరసత్వ నైపుణ్యాలూ ఉన్నట్టు లెక్క. 100-115 మధ్య స్కోర్‌ ఉంటే డీక్యూ సంతృప్త స్థాయిలో ఉంది కానీ, ఇంకొన్ని బలహీనతలమీద దృష్టిసారించాలని అర్థం. 85-100 మధ్యలో స్కోరు సాధిస్తే ఆ చిన్నారులకు సైబర్‌ ముప్పు ఎదురుకాగల ప్రమాదం ఉన్నట్లు. వీరి స్కోర్‌ మెరుగయ్యేంతవరకూ స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వకుంటే మేలు. సోషల్‌ మీడియాకూ దూరంగా ఉంచాలి.
ఇక 85కంటే తక్కువ మార్కులు వస్తే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నపుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. డీక్యూవరల్డ్‌డాట్‌నెట్‌లో తల్లిదండ్రులూ, టీచర్ల విభాగమూ ఉంది. పిల్లల్లో సైబర్‌ నైపుణ్యాల్ని పెంపొంచేందుకు పెద్దలు తమ వంతుగా ఏం చేయొచ్చో ఇక్కడ ఉంటుంది. స్కూళ్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావొచ్చు.

మరెందుకు ఆలస్యం మీ పిల్లల డీక్యూ పరీక్షించండి, వారికి సురక్షిత డిజిటల్‌ భవిష్యత్తును ఇవ్వండి!

- వద్దిరాజు శివ ప్రసాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.