close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనసుతో వినండి!

మనసుతో వినండి!

ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నారాయణమంత్రం విన్నాడనీ... అభిమన్యుడు అమ్మ గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి విని నేర్చుకున్నాడనీ... పురాణాల్లో చదువుకున్నాం. తల్లి గర్భంలోని శిశువు ఆర్నెల్ల వయసునుంచే వినగలుగుతుందని పరిశోధకులూ తేల్చిచెప్పారు. ఇవి పుట్టక ముందు సంగతులు. పుట్టాక... బాల్యంలో... అమ్మ జోల పాడితే మైమరచి నిద్రపోతాం. నాన్న చెప్పే కథల్లో లీనమై పోతాం. బడిలో టీచరు చెప్పే పాఠాలనూ శ్రద్ధగా వింటాం. పెద్దయ్యాకే వస్తోంది తంటా. ఒక్కసారి గుర్తుచేసుకోండి... మీ భాగస్వామి కళ్లలోకి చూస్తూ తను చెప్పే కబుర్లు విని ఎన్నాళ్లైంది?

‘అమ్మా...!’
‘ఊఁ...’
‘ఇవాళ స్కూల్లో ఏమైందో తెలుసా?’
‘చెప్పు’
‘మరే... లలితాంటీ వాళ్ల పాప ఉంది కదా, తనూ... నువ్వు వినటం లేదు...’
‘వింటున్నా చెప్పమన్నాను కదా’
‘మరి నావైపు చూడవేం...’
‘కళ్లతో కాదుగా వినేది. నేను ఎటు చూస్తే నీకెందుకు? విషయం చెప్పకుండా ఏంటీ సోది?’
ఇంకేం చెబుతుంది? అమ్మ మీద అలిగి... అవతలికి వెళ్లిపోతుంది చిట్టితల్లి.
మనకేమో బోలెడన్ని పనులు. పాపాయి కళ్లలోకి చూస్తూ ముంగురులు సవరిస్తూ కబుర్లు వినే తీరికెక్కడ? ఈ చేత్తో ఒక పనీ ఆ చేత్తో మరో పనీ చేసుకుంటూనే వాళ్లు చెప్పేదీ వినాలనుకుంటాం. కానీ అలా  వినడాన్ని మనసు పెట్టి వినడం అనరనీ, అలాంటివారితో అసలు మాట్లాడాలనే  అనిపించదనీ అంటున్నారు నిపుణులు.
మన చెవులు మన చుట్టూ అయ్యే చప్పుళ్లన్నిటినీ గ్రహిస్తాయి. మెదడు మాత్రం వినాలనుకున్న కొన్ని చప్పుళ్లనే గుర్తుంచుకుంటుంది. అందులో కొన్నిటి గురించే ఆలోచిస్తుంది.
ఏ ఒకటి రెండిటికో మాత్రమే స్పందిస్తుంది. అంటే విన్పించేవాటిలో మనం నిజంగా ‘వింటున్నది’ చాలా కొంచెమేనన్నమాట.
మనిషికి భౌతికంగా గాలీ నీరూ తిండీ ఎంత అవసరమో మానసికంగా ఇతరులు తనని అర్థం చేసుకోవడం, తాను ఇతరులను అర్థం చేసుకోవడం అంతే అవసరం. దానికి తోడ్పడేది ఈ వినడమనే ప్రక్రియే. నిజానికి మాట్లాడడమూ వినడమూ నాణేనికి రెండు వైపుల్లాంటివి. రెండూ కలిస్తేనే సంభాషణ అవుతుంది. అందుకే పెద్దలు మాట్లాడడమే కాదు, వినడమూ ఓ కళేనన్నారు. మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్లు మన మాట వినడానికి ఇష్టపడేలా మాట్లాడాలనీ, వినేటప్పుడు ఎదుటివాళ్లు మనసు విప్పి చెప్పుకోవాలనిపించేలా వినాలనీ పెద్దలు చెబుతారు.
ఒక్కసారి గుర్తుచేసుకోండి. మీరు ఈ మధ్య సావధానంగా ఏమి విన్నారు? చిట్టితండ్రి చెప్పిన సూపర్‌హీరో కథలు విన్నారా? అమ్మాయి చెప్పిన కాలేజీ కబుర్లు విన్నారా? బాస్‌ చెప్పిన కొత్త ప్రాజెక్టు ప్రణాళికలు విన్నారా? భాగస్వామి చెప్పిన ఇంటి సమస్యలు విన్నారా? అన్నీ విన్నారా... సరే మరి, ఆ విన్నవన్నీ గుర్తున్నాయా? ఏమిటీ... ఆలోచిస్తున్నారా..?!

చెవులు వింటాయి కానీ...
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలకు ఓ వర్కుషాప్‌ జరుగుతోంది. రెండు సెషన్లకు మధ్య  ఆటవిడుపుగా అభ్యర్థుల్లో ఉత్సాహం  నింపడానికి ట్రైనర్‌ ఓ కథ చెప్పాడు.
‘మీరు ఒక బస్సు నడుపుతున్నారు. బస్సు బయల్దేరినప్పుడు అందులో ఆరుగురున్నారు. తర్వాత స్టాపులో మరో 12 మంది ఎక్కారు. జాగ్రత్తగా వినండి. రెండో స్టాపులో ఆరుగురు దిగి నలుగురు ఎక్కారు. మూడో స్టాపులో ఎవరూ దిగలేదు. ఇద్దరు ఎక్కారు. బస్సు డ్రైవరు వయసు ఎంత?’
ఎంత మంది ఎక్కారూ ఎంత మంది దిగారూ... అన్న లెక్కల్లో మునిగితేలుతున్న వారంతా చివరి ప్రశ్న విని అవాక్కయ్యారు. ప్రశ్నకీ డ్రైవరు వయసుకీ సంబంధం  ఏమిటనీ, డ్రైవరు వయసు తమకు తెలిసే అవకాశం లేదనీ సమాధానాలిచ్చారు.
నిజానికి వారు వచ్చిందే అక్కడ ఏం చెప్పినా విని నేర్చుకోవడానికి. అలాంటప్పుడు  అప్రమత్తంగా ఉండి ట్రైనర్‌ చెప్పేదంతా వినాలి. కానీ ‘జాగ్రత్తగా వినండి’ అనేవరకూ ఎవరూ అతను చెప్తున్న దానిమీద దృష్టి పెట్టలేదు. పెట్టినవారు కూడా అంకెలు రాగానే లెక్కలు  వేయడంలో మునిగిపోయారు. సరిగ్గా ‘విని’ ఉంటే ప్రశ్న తొలి వాక్యంలోనే సమాధానం ఉంది. ‘మీరు బస్సు నడుపుతున్నారు...’ అంటే డ్రైవరు వయసుగా అక్కడున్న ప్రతి అభ్యర్థీ తన వయసే చెప్పాలి కదా!
‘మనలో చాలామంది అర్థం చేసుకోడానికి వినడం లేదు. కేవలం సమాధానం ఇవ్వడానికి మాత్రమే వింటున్నారు...’ అంటారు అమెరికన్‌ రచయిత స్టీఫెన్‌ కోవె. దానికి ఉదాహరణే పై సంఘటన. వినడం చెవులతో మాత్రమే చేసే పని కాదు.
వినడమనే పనికి చాలా సీనుంది. అది సరిగ్గా జరగకపోతే మనుషుల మధ్యా  సమాజాల మధ్యా దేశాల మధ్యా అపార్థాలు చోటు చేసుకుంటాయి. అనుబంధాలు చెడిపోతాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మొత్తంగా మన సామాజిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే వినడం ఎందుకు ముఖ్యమో, సరిగ్గా ఎలా వినాలో చూద్దాం.

బంధాలకు బలం
వినడం కేవలం కమ్యూనికేషన్‌లో ఒక భాగం కాదు. ఇంకా పెద్ద పాత్రే దానిది. ఒక మంచి సంభాషణ ప్రారంభమయ్యేది మంచి శ్రోత ఉన్నప్పుడే. ఇద్దరు మనుషుల మధ్య పరిచయాన్ని అనుబంధంగా మార్చే శక్తి కేవలం వినే ప్రక్రియకే ఉంది. ఎవరు చెప్పేది అయినా మనం జాగ్రత్తగా వింటున్నామంటే వారి పట్ల మన గౌరవాన్ని తెలియజేస్తున్నామన్నమాటే. నిత్యం ఇంట్లో కుటుంబసభ్యులతో, ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడతాం. అందరు చెప్పిందీ వింటాం. దాని వల్ల కేవలం పనులు అవడమే కాదు, వారికీ మనకీ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. స్నేహానుబంధాలు బలపడడానికి పునాది వేసేది ఇద్దరి మధ్యా జరిగే సంభాషణే.
ఎదుటివారు చెప్పేది ఓపిగ్గా వినేవారే మంచి స్నేహితులు అవుతారు. అలా వినే అలవాటు స్వతహాగా లేకపోతే సాధనతో నేర్చుకోవాలి. స్నేహితులూ, పరిచయస్తులూ ఎక్కువగా ఉన్న వ్యక్తికి తన మీద తనకు నమ్మకం పెరుగుతుందట. అది పిల్లల్లో చదువులో రాణించడానికి తోడ్పడితే పెద్దలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందట. మాట్లాడడం వల్ల బీపీ పెరుగుతుందనీ అదే శ్రద్ధగా వినడం వల్ల ఎక్కువగా ఉన్న బీపీ తగ్గుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఎలాగైనా వీలు చేసుకుని తరచూ స్నేహితులను పలకరించాలి. వాళ్ల కష్టసుఖాలను వినాలి. రోజూ కాసేపు ఫోనూ టీవీలన్నీ కట్టిపెట్టి కుటుంబసభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి. పిల్లలు చెప్పే కబుర్లు వినాలి. దాని వల్ల అటు
ఆనందమూ ఇటు ఆరోగ్యమూ.
ఎలా వినాలంటే...
కళ్లలోకి చూడాలి: వినేటప్పుడు మాట్లాడుతున్నవారి కళ్లలోకి చూస్తూ వినడం చాలా ముఖ్యం. పిల్లలు మనం వారివైపు చూడకపోతే చెప్పడం ఆపేస్తారు. ‘నేను చెప్పేది నువ్వు వినడం లేదు...’ అని మొహాన అడిగేస్తారు. ఇతరులు అలా చెప్పరు కానీ వింటున్నవారికి ఆసక్తి లేదని తెలుసుకుంటారు.
మనసుతో వినాలి: మనసు పెట్టకుండా కేవలం చెవులతో విషయాన్ని వింటే సరిగ్గా వినడం అనరు. మనసు పెట్టి వినడం అంటే ఒక విషయాన్ని ఎలా చెబుతున్నారూ ఏయే పదాలు వాడుతున్నారూ గొంతులో ఎలాంటి భావం పలుకుతోందీ... అన్నీ
గమనిస్తూ వినడం అన్నమాట. మాట్లాడేవారి బాడీ లాంగ్వేజ్‌ కూడా అందులో ఒక ముఖ్యమైన అంశమే. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని విన్నప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది.
అడ్డుపడకూడదు: కొంతమంది ఉంటారు- వాళ్లకు మాట్లాడడమే తప్ప వినే అలవాటు ఉండదు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ ఒక్క వాక్యం కూడా పూర్తిగా మాట్లాడనివ్వరు. మాటిమాటికీ అడ్డుపడుతుంటారు. అన్నీ తమకే తెలుసన్నట్లుగా ఏదో ఒకటి  మాట్లాడేస్తూ మొత్తానికి సంభాషణనే  పక్కదారి పట్టించేస్తారు.
దానికీ ఓ మర్యాద ఉంది: ఒక ప్రాజెక్టుకి సంబంధించి మీరో ప్రజెంటేషన్‌ ఇవ్వాలి. ఉత్సాహంగా మీరు ప్రజెంటేషన్‌ మొదలుపెట్టారు. ప్రేక్షకుల స్థానంలో కూర్చున్న మీ టీమ్‌లో ఒకరు ఫోన్‌ చూసుకుంటున్నారు. మరొకరు ఫైల్‌ ఏదో తిరగేస్తున్నారు.
ఇంకొకళ్లు కుర్చీలో వెనక్కి వాలి పైకప్పును చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు... అప్పుడు మీకేమనిపిస్తుంది? వారెవ్వరికీ మీ ప్రజెంటేషన్‌ పట్ల ఆసక్తి లేదూ, ఆసక్తి లేదన్న విషయాన్ని అంత బాహాటంగా వ్యక్తం చేయడం సరికాదన్న సంస్కారం కూడా లేదనే కదా! నిజమే వినడానికీ ఓ ఎటికెట్‌ ఉంది.
వినేటప్పుడు మాట్లాడుతున్నవారినే చూడాలి. ఫోను పక్కన పెట్టేయాలి. చేతులూ పాదాలూ విశ్రాంతిగా ఉండాలి. నిటారుగా కూర్చుని లేదా కొద్దిగా ముందుకు వంగి  ఆసక్తిగా వినాలి. అసహనంగా కదలడమూ, దిక్కులు చూడడమూ, తల గోక్కోవడమూ, మెటికలు విరవడమూ, మెడ తడుముకోవడమూ, నుదురు రుద్దుకోవడమూ, దగ్గడం, క్రేకరించడం వంటి శబ్దాలు  చేయడమూ... లాంటివి చేయకూడదు. అవి మన అనాసక్తిని పట్టిస్తాయి. మాట్లాడుతున్నవారికి అసంతృప్తిని కలిగిస్తాయి.
సహానుభూతి కావాలి: ఎదుటి వ్యక్తి తన సమస్యల గురించి చెబుతున్నప్పుడు సహానుభూతితో వినాలి. మాటమాటకీ వారి తప్పుల్ని ఎత్తిచూపుతూ చిన్నబుచ్చకూడదు.
వింటున్నామని తెలియాలి: జాగ్రత్తగా వింటేనే సరిపోదు, వింటున్నామని ఎదుటివారికి అర్థమయ్యేలా మన చేతలు ఉండాలి. అంటే- విన్నదాంట్లో సందేహాలుంటే అడగడం, వింటున్నది అర్థమైందని తెలిసేలా తల  పంకించడం, కళ్లతో సమ్మతిని తెలియజేయడం, మాట్లాడుతున్నవారి హావభావాలతో మమేకం కావడం... ఇవన్నీ మనం ఆసక్తిగా వింటున్నామన్న విషయాన్ని వారికి  అర్థమయ్యేలా చేస్తాయి.

అయినా అంత ఈజీ కాదు...
పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా వినడం అంత తేలికైన పని కాదు సుమా! ఎందుకంటే- ఏ విషయం గురించైనా, ఎవరు మాట్లాడుతున్నా రెండు మూడు  నిమిషాలు- ఎక్కువలో ఎక్కువ ఐదు  నిమిషాలు వినేసరికి మన ఆలోచన విన్న మాటల సారాంశం మీదికి పోతుంది. వినడం మీది నుంచి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం మీదికి దృష్టి మళ్లిపోతుంది. దాంతో మిగతా ప్రసంగాన్ని సరిగ్గా వినలేకపోతాం. అది పూర్తిగా మన తప్పు కాదు.
దానికో శాస్త్రీయ కారణమూ ఉంది. మన మెదడు నిమిషానికి మనం విన్నదానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ పదాలను ప్రాసెస్‌ చేయగలదు. అంటే విని అర్థం చేసుకుని అందులో పనికొచ్చేదాన్ని గుర్తుంచుకోవడం, దాని గురించి అంతకు ముందే మనకు తెలిసిన విషయాన్ని జతచేయడం లాంటి పనులన్నమాట. కానీ సాధారణంగా ఎవరైనా మాట్లాడేది నిమిషానికి 125- 150 పదాలే. అందుకని సామర్థ్యానికి తగిన పని లేక మెదడు వేర్వేరు విషయాల గురించి ఆలోచిస్తుంటుంది. ఆ క్రమంలో అసలు ప్రసంగాన్ని మిస్సయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని జాగ్రత్తలతో అలాంటి అవరోధాలను అధిగమించవచ్చు.
* ముందుగా ‘వినడానికి’ మనసును సిద్ధం చేసుకోవాలి.
* మాట్లాడుతున్న వ్యక్తి మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా దాన్ని పక్కనపెట్టి ఏం మాట్లాడతారో విందామన్న కుతూహలాన్ని పెంచుకోవాలి.
* ఏ విషయం గురించి వింటున్నా దాని గురించి ఎంతో కొంత మనకు ముందే తెలిసి ఉండవచ్చు.  అంతమాత్రాన కొత్తగా వీళ్లేం చెబుతారులే అనుకుంటే మంచి శ్రోత కాలేరు, కొత్త విషయాలూ నేర్చుకోలేరు. మనకు తెలిసిన విషయంపైనే అయినా ఇంకా కొత్త సమాచారం ఏం చెబుతారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే వినడానికి ఉపక్రమించాలి.
* ప్రసంగిస్తున్న వ్యక్తి గురించీ విషయం గురించీ పక్కవారితో గుసగుసలాడడం, కామెంట్‌ చెయ్యడం కూడదు.

ఎక్కువ వినాలంటే...
ఎవరైనా సరే, తక్కువగా మాట్లాడినప్పుడే ఎక్కువగా వినగలరు. అలాంటి అలవాటు ఉన్నవారే గొప్ప వ్యాపారవేత్తలూ నాయకులూ అయ్యారని అధ్యయనాలూ పేర్కొంటున్నాయి. ‘మాట్లాడడం అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలను ఇతరులకు చెప్పడం. అదే వినడం అంటే తెలియని కొత్త విషయాలను తెలుసుకోవడం...’ అంటారు బౌద్ధ గురువు దలైలామా. తక్కువ మాట్లాడి ఎక్కువ వినేందుకే మనకు రెండు చెవులూ ఒక నోరూ ఉన్నాయంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
ఏ కెరీర్‌లో అయినా ముందుకు వెళ్లడానికి సరిగ్గా వినడం అనేది చాలా అవసరం. ఇరువర్గాల మధ్య ‘నమ్మకం’ ఏర్పడడానికి ప్రధాన మాధ్యమం అదే. అందుకే కార్పొరేట్‌ కార్యాలయాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్నీ అప్రమత్తంగా ఉండే స్వభావాన్నీ పెంచడానికి తరచూ రకరకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఉద్యోగుల కష్టసుఖాలను ఓపిగ్గా విని, మంచి పని చేసినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యవస్థ ఉన్న సంస్థల్లో ఉత్పాదకత పెరుగుతోందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మంచి శ్రోతలు జాగ్రత్తగా విని తాము కొత్త విషయాలు తెలుసుకోవడంతోపాటు, వక్త ఉత్సాహాన్ని రెట్టింపు చేసి వాళ్లలో సృజనాత్మకత పెరిగేందుకూ దోహదపడతారు.

ఎంత నష్టం!
ఉద్యోగులు సరిగా వినకుండా పనులు చేయడం వల్ల వ్యాపారరంగంలో నిత్యం ఎంతో నష్టం జరుగుతుందట. వ్యాపారంలో అంకెలే కాదు, వాడే ప్రతి పదమూ కీలకమే. ఏ కొంచెం తేడావచ్చినా విలువైన సమయమూ డబ్బూ కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయమై ఎస్‌ఐఎస్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ అనే సంస్థ ఒక అధ్యయనం జరిపింది. దాని ప్రకారం- వంద మంది సిబ్బంది ఉన్న ఓ వ్యాపార సంస్థలో కేవలం వివిధ స్థాయుల్లో సిబ్బందికి సమాచారాన్ని సరిగ్గా తెలియజేసేందుకే వారానికి సగటున 17 గంటల సమయం పడుతోందట. అంటే ఒక విషయాన్ని సరిగా చెప్పలేకపోవడం వల్ల- అదే విషయాన్ని మళ్లీమళ్లీ చెప్పాల్సిరావడంతో అంత సమయం వృథా అవుతోందనీ దాన్ని డబ్బులోకి మారిస్తే ఏడాదికి రూ. 300 కోట్లకు పైమాటేననీ తేలింది.

*         *          *

మెదడు... సమాచారం కోసం వింటుంది.
విన్నదాంట్లో ఉండే వాస్తవాలనూ లాజిక్‌నీ గుర్తుపెట్టుకుంటుంది.
హృదయం... భావోద్వేగాలకు ప్రతినిధి.
విన్న సమాచారంలో బంధాలను పెనవేసే విషయాలపై దృష్టి పెడుతుంది.
శరీరం...భౌతిక అంశాలకు బాధ్యత వహిస్తుంది. వింటున్న దాని లక్ష్యం ఏమిటి, ఎందుకు, ఎవరు, తర్వాత జరగాల్సిందేమిటి... లాంటి ప్రాక్టికల్‌ లెక్కలన్నీ వేస్తుంది. మెదడూ, హృదయమూ, శరీరాల సమన్వయంతో వినడమే ఆలకించడం. అలా వినేవారే మంచి శ్రోత కాగలరు!

వినడంలో... వాస్తవాలివి!

మాట్లాడే వ్యక్తి ముఖ కవళికలను బట్టే 55 శాతం విషయాన్ని శ్రోతలు అర్థం చేసుకుంటారట. 38 శాతం చెప్పే విధానాన్ని బట్టీ, ఏడు శాతం మాత్రమే మాట్లాడిన పదాల అర్థాన్ని బట్టీ అర్థం చేసుకుంటారట.
* నూటికి ఒకరిద్దరు కూడా వినడం అనేది ఒక కళ అనీ దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలనీ ఆలోచించడం లేదట.
* ఉద్యోగార్హతల్లోనూ పదోన్నతి విషయంలోనూ అభ్యర్థిలో సంస్థలు చూసే ప్రధాన లక్షణం- చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌. అందులో మొదటిది వినడంలో అప్రమత్తత. అందుకే గ్రూప్‌ డిస్కషన్‌లాంటి కార్యక్రమాలు పెడుతుంటాయట.
* మంచి శ్రోతే మంచి నాయకుడు కాగలుగుతాడు. శ్రద్ధగా వినే అలవాటు ఉన్నవారు ఎదుటి వ్యక్తి మీద ముందుగానే ఓ నిర్ణయం ఏర్పరచుకోకుండా ఏమి మాట్లాడినా వినడానికి సిద్ధంగా ఉంటారు. భావోద్వేగాలకు లోనవకుండా వింటారు. విన్నదాన్ని విన్నట్లుగా మూడో వ్యక్తికి వివరించి చెప్పగలరు.
* మనకి విన్పించే మాటల్లో 17 నుంచి 25 శాతం పదాల్ని మాత్రమే మెదడు ఆలోచనకు స్వీకరిస్తుంది.
* కొందరి మాటలు వినడమూ ఆరోగ్యానికి హానికరమే! తరచూ ఫిర్యాదులు చేస్తూ నస పెట్టేవారి మాటలు ఒక అరగంట విన్నామంటే చాలు, మన మెదడులో సమస్యల్ని పరిష్కరించే భాగం నీరసించిపోతుందట. అదే నచ్చిన సంగీతం వింటే ఒత్తిడి తగ్గి, మెదడు ఉత్తేజితమవుతుందట.
* భోజనం చేసేటప్పుడు మంద్రంగా మంచి సంగీతం వింటే తక్కువ కెలొరీలతోనే కడుపు నిండిపోతుందట. అదే సంగీతాన్ని వాహనం నడిపేటప్పుడు వింటే మాత్రం ప్రమాదాలకు అవకాశం ఎక్కువట.
* ఓ ప్రసంగాన్ని బాగా విన్నాననుకున్న వ్యక్తిని 8 గంటల తర్వాత తాను విన్న విషయాలు చెప్పమంటే సగం మాత్రమే చెప్పగలడట.

ఓపిగ్గా వినేది వారే!

హిళలే మంచి శ్రోతలట. మగవాళ్లు వినేటప్పుడు సగం మెదడునే ఉపయోగిస్తారనీ స్త్రీలు మెదడులోని రెండు భాగాలనూ ఉపయోగిస్తారనీ కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. పైగా బాగా వినే పురుషులనే స్త్రీలు ఇష్టపడతారనీ వారు అంటున్నారు. ఓపిగ్గా వినడం అలవాటులేకపోవడం వల్లనే చాలామంది పురుషులు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడుతుంటారని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.