close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలా హీరోయిన్‌ అయ్యా..!

అలా హీరోయిన్‌ అయ్యా..!

ఒకప్పుడు అందం అభినయం ఉన్న కథానాయికలంటే తెలుగులో కొద్ది పేర్లే వినిపించేవి.  కానీ ఈమధ్య ట్రెండ్‌  మారిపోయింది. సమంత, అనుష్క, తమన్నా, కాజల్‌ లాంటి సీనియర్‌ కథానాయికలున్నా కొత్తతరం అమ్మాయిలూ వస్తున్నారు. తమ అందచందాలూ నటనతో ఆకట్టుకుంటున్నారు. వీరిలో కొంతమంది అనుకోకుండా సినిమాల్లోకి వస్తే మరికొందరు చిన్నప్పట్నుంచీ కన్న కలను నిజం చేసుకుంటూ తెరంగేట్రం చేశారు. ఇంతకీ హీరోయిన్‌గా వారికి తొలి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..!

కీర్తి సురేష్‌

హానటి... సినిమాతో గొప్ప నటి అనిపించుకున్న కీర్తి సురేష్‌ సినిమాల్లోకి రావాలని చిన్నప్పుడే నిర్ణయించేసుకుందట. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవ్వాలనీ పోలీసుల పిల్లలు పోలీసులు కావాలనీ కోరుకున్నట్లే కీర్తి పాతతరం మలయాళ నటి అయిన వాళ్లమ్మ మేనకను చూసి తానూ హీరోయిన్‌ అవ్వాలనుకుందట. ఆ విషయాన్నే తల్లికి చెప్పగా ‘ముందు చదువుకో తర్వాత చూద్దాం’ అందట. ‘సినిమా కుటుంబం కావడం వల్ల అవకాశాల కోసం నేను సినిమా కష్టాలేవీ పడలేదు... డిగ్రీ ఫైనలియర్‌ చదువుతుండగా మోహన్‌లాల్‌ అంకుల్‌ హీరోగా, ప్రియదర్శన్‌ అంకుల్‌ దర్శకుడిగా మొదలుపెట్టిన మలయాళ ‘గీతాంజలి’లో నన్ను నటించమని అడిగారు. వాళ్లిద్దరూ నాన్నకు మంచి స్నేహితులు కావడంతో వాళ్ల సినిమాతోనే నేను తెరంగేట్రం చేస్తే బాగుంటుందని అనుకున్నారట. ఆ చిత్రానికి నిర్మాత నాన్నే.’ అలా మొదలైన కీర్తి సురేష్‌ ప్రయాణం మహానటి చిత్రంతో ఎన్నో మెట్లు పైకెక్కిందని ప్రత్యేకంగా చెప్పేదేముందీ..?

నివేతా థామస్‌

జెంటిల్‌మన్‌, జైలవకుశ... లాంటి చిత్రాలతో అందరి మన్ననలూ అందుకున్న నివేతాథామస్‌ హీరోయిన్‌ ఎలా అయిందంటే... ‘మాది సినిమాలకు అస్సలు సంబంధం లేని కుటుంబం. చిన్నప్పట్నుంచీ ఆటలూ పాటలూ డాన్సులూ లాంటి వాటిలో ఎప్పుడూ ముందుండేదాన్ని. అలా చెన్నైలోని ‘మాంట్‌ ఫోర్ట్‌’ స్కూల్లో చదువుతున్నపుడు బాలల ఉత్సవానికి వచ్చిన తమిళ నటి పూర్ణిమా ఇంద్రజిత్‌ నన్ను చూశారు. ఆమెకు తెలిసినవాళ్లు ఓ సినిమా కోసం నా వయసున్న పాప కోసం వెతుకుతున్నారట. నా వివరాలు కనుక్కుని అమ్మానాన్నలతో మాట్లాడారు. కట్‌ చేస్తే 2002లో ‘విరుతె ఒరు భార్య’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేశాను. ఆ సినిమా కథ నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. బాలనటిగా కేరళ ప్రభుత్వం ఇచ్చే అవార్డునూ తెచ్చిపెట్టింది ఆ చిత్రం. తర్వాత బాలనటిగా సహాయ నటిగా కొన్ని చిత్రాలు చేశాక మలయాళ చిత్రం ‘మనీ రత్నం’లో హీరోయిన్‌గానూ చేశాను. కానీ తెలుగులో వచ్చిన జెంటిల్‌మన్‌తోనే హీరోయిన్‌గా నిలదొక్కుకున్నా. దానికిముందు తమిళంలో వచ్చిన దృశ్యం సినిమా రీమేక్‌ ‘పాపనాశం’లో కమల్‌హాసన్‌కి కూతురిగా నటించా. అది విడుదలయ్యాక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ ఆఫీసులో ఎవరో యూట్యూబ్‌లో చూస్తుండగా అటుగా వెళ్తున్న మోహన్‌ స్క్రీన్‌మీద నన్ను చూశారట. నచ్చడంతో మా ఇంటికొచ్చి జెంటిల్‌మన్‌ సినిమాలో  చెయ్యమని అడిగారు.  తర్వాత కథ మీకు తెలిసిందే’.

మెహరీన్‌ కౌర్‌ పిర్‌జాదా

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో మొదలు పెట్టి ‘రాజా ది గ్రేట్‌’, ‘జవాన్‌’... లాంటి చిత్రాల్లో నటించి తన అందచందాలతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తున్న మెహరీన్‌ కూడా సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చిందట. ‘మాది దిల్లీలో ఉండే పంజాబీ కుటుంబం. ప్లస్‌టూ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదవడానికి కెనడా వెళ్లా. అక్కడ చదువు తప్ప వేరే పనిలేకపోయేసరికి బాగా లావైపోయా. ఆ సమయంలోనే అక్కడ దక్షిణాసియా నుంచి వచ్చినవారికే ప్రత్యేకమైన అందాలపోటీని నిర్వహిస్తున్నారని తెలిసి అందులో పాల్గొనమని అమ్మ నా వెంటపడింది. పోటీ కోసమైనా సన్నబడతానన్నది అమ్మ ఆలోచన. నిజంగానే బాగా సన్నబడ్డా. మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఏషియా-కెనడా 2013 కిరీటం కూడా అందుకున్నా. అప్పట్నుంచి ప్రకటనల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. వాటిలో చూసే హను రాఘవపూడి కృష్ణగాడి వీరప్రేమగాథ కోసం అడిగారు’ అంటూ తన గురించి చెబుతుంది మెహరీన్‌.

అనుపమా పరమేశ్వరన్‌

‘నటిని అవ్వాలని కానీ అవుతానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. నేను హీరోయిన్‌ అవడం ఇప్పటికీ ఏదో మాయలా అద్భుతంలా అనిపిస్తుంది. మాది కేరళలోని కొట్టాయం. మధ్యతరగతి కుటుంబం. బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలనే కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో ఉన్నపుడే మలయాళ ‘ప్రేమమ్‌’కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి ఓ ఫ్రెండ్‌ నా ఫొటోల్ని పంపించింది. అవి చూసి వాళ్లు  ఆడిషన్‌కి పిలవడంతో విషయం ఇంట్లో చెప్పా. అంతే, చాలా  కోప్పడ్డారు. కానీ సినిమాలో అవకాశం వచ్చాక మాత్రం అలాంటి  అవకాశం ఎవరికో గానీ రాదు అనే కారణంతో ఏమనలేదు. ప్రేమమ్‌  పెద్ద హిట్టే కానీ నాకు టర్నింగ్‌ పాయింట్‌ అయింది మాత్రం తెలుగులో వచ్చిన ‘అఆ’ సినిమానే. ప్రేమమ్‌ చూసే త్రివిక్రమ్‌ గారు నాగవల్లి పాత్ర చెయ్యమని అడిగారు. అది నెగెటివ్‌ రోల్‌ కావడంతో మొదట భయపడ్డా. కానీ అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది...’ అదండీ సంగతి... అదృష్టం హీరోయిన్‌ కమ్మని వెనకబడిందన్నమాట.

అను ఇమ్మాన్యుయేల్‌

‘మజ్ను’ సినిమా అను ఇమ్మాన్యుయేల్‌కి మంచి హిట్‌ని అందివ్వడమే కాదు, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌లాంటి స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్నీ తెచ్చిపెట్టింది.  అనూ మలయాళ చిత్రం ‘యాక్షన్‌ హీరో బిజు’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తండ్రి థంకచన్‌ ఇమ్మాన్యుయేల్‌ మలయాళ సినిమాల నిర్మాత కావడంతో తనకూ సినిమాల మీద ఆసక్తి కలిగి  ఆ రంగంలోనే తెరమీదో తెరవెనకో కెరీర్‌ని ప్రారంభించాలనుకుంది ఈ భామ. ‘హీరోయిన్‌ అవ్వాలనే కోరికతోనే టెక్సాస్‌లో చదువు అయిపోగానే కొన్ని ఫొటోలతో ప్రొఫైల్‌ తయారుచేసుకున్నా. అది మలయాళ దర్శకుడు అబ్రిడ్‌ షైన్‌ ‘యాక్షన్‌ హీరో బిజు’ సినిమా కోసం హీరోయిన్‌ని వెతుకుతున్న సమయం. ఎలాగో నా ఫొటోల్ని చూసిన ఆయన వీడియో ప్రొఫైల్‌ పంపించమని ఫోన్‌ చేశారు. అదీ ఆయనకు నచ్చడంతో హీరోయిన్‌గా ఎంపిక చేశారు’ అంటూ తన తెరంగేట్రం గురించి చెబుతుంది అను. నిజానికి ఈ అమ్మడికి అంతకుముందే దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించే అవకాశం వచ్చిందట. కానీ అప్పటికి చదువు పూర్తి కాలేదని ఒప్పుకోలేదట.

సాయి పల్లవి

ముఖం మీద మొటిమలూ ఉంగరాల జుట్టూ జీర గొంతూ... ఫిదాలో ఆ అమ్మాయిని చూసిన కుర్రాళ్లు తమ గర్ల్‌ఫ్రెండే అన్నట్లు మురిసిపోయారు. ఈ అమ్మడి తెరంగేట్రం ఎలా జరిగిందంటే... ‘మాది ఊటీ దగ్గర్లోని కోత్తగిరి. అమ్మ రాధ మంచి డాన్సర్‌. అందుకే, నాకూ డాన్స్‌ అంటే చిన్నప్పట్నుంచే ఇష్టం. స్కూల్‌ స్థాయిలోనే రకరకాల డాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నా. తమిళంలో స్టార్‌ విజయ్‌లోనూ, తెలుగులో ఈటీవీ ‘ఢీ’ లోనూ డాన్స్‌ చేశా. ఆ షోల ద్వారా ఎంత పేరొచ్చిందంటే అప్పుడే సినిమాల్లో హీరోయిన్‌ అవకాశాలు వచ్చాయి. కానీ నాన్న ముందు చదువు పూర్తి చెయ్యాల్సిందే అనడంతో మెడిసిన్‌ చదవడానికి జార్జియా వెళ్లిపోయా. నాలుగేళ్ల చదువులో సినిమాల ఆలోచనని పూర్తిగా మర్చిపోయా. ఆ సమయంలోనే మలయాళ ‘ప్రేమమ్‌’ సినిమాలో నటించమంటూ దర్శకుడు ఆల్ఫోన్స్‌ మెయిల్‌ పెట్టారు. ముందు ఎవరో ఆకతాయి అనుకున్నా. తర్వాత నిజమే అని తెలిసి సెలవుల్లో వచ్చి నటించడానికి ఒప్పుకున్నా. అది హిట్టవడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. ‘ఫిదా’ సినిమా మొదలయ్యేసరికి నా చదువూ పూర్తైంది కాబట్టి పూర్తిగా సినిమాల మీదే దృష్టిపెట్టా’.

రాశీఖన్నా

ధ్యతరగతి కుటుంబం కావడం వల్ల ఆర్థిక సమస్యలెలా ఉంటాయో రాశీఖన్నాకి బాగా తెలుసు. అందుకే, బాగా చదువుకుని మంచి భవిష్యత్తుని నిర్మించుకోవాలని కలలు కంది. అనుకున్నట్లే స్కూల్లో కాలేజీలో ఫస్ట్‌ ర్యాంకర్‌గానే ఉండేది. కానీ బోలెడంత బిడియం, సిగ్గూ ఉండటంతో చదువుకునేటపుడు రాశీ ఎప్పుడూ స్టేజీ ఎక్కిందే లేదట. ‘డిగ్రీలో ఉన్నపుడు ఓసారి దిల్లీలోని ఓ షాపింగ్‌ మాల్‌కి వెళ్లా. అక్కడ వ్యాజ్‌లీన్‌ సంస్థకు సంబంధించిన స్టాల్‌లో వారి లోషన్‌ ఉపయోగించిన వాళ్ల ఫొటోలు తీసుకుంటున్నారు. అలా తీసిన వాటిలో ఎంపికైన వారి ఫొటోను ఫెమీనా మ్యాగజీన్‌ కవర్‌పైన వేస్తారని చెప్పారు. ఊరికే లోషన్‌ వస్తుంది కదా అని నేనూ ఫొటోకి పోజిచ్చా. ఆశ్చర్యం... ఓ వారం తర్వాత వాళ్లు ఫోన్‌ చేసి మీరే ఎంపికయ్యారని చెప్పారు. ఆ కవర్‌ మార్కెట్లోకి వచ్చిన కొన్నిరోజులకు టీవీ ప్రకటన చేసే అవకాశం వచ్చింది. నాకసలు మోడలింగ్‌ కోరిక లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంట్లోవాళ్లు ప్రయత్నించమనేసరికి చదువుకుంటూనే ప్రకటనలు చేయడం మొదలుపెట్టా. తర్వాత నా ఫ్రెండ్‌ వాణీకపూర్‌(బాలీవుడ్‌ నటి) మోడలింగ్‌లో కెరీర్‌ బాగుంటుంది ముంబయి వెళ్లి కొంతకాలం ప్రయత్నిద్దాం అనడంతో అక్కడికివెళ్లి కొన్ని ప్రకటనలు చేశా. ఆ సమయంలోనే నన్ను చూసిన బాలీవుడ్‌ క్యాస్టింగ్‌  డైరెక్టర్‌ ఒకరు ‘మద్రాస్‌ కెఫే’ సినిమా ఆడిషన్‌కి పిలిచారు.
ఆ సినిమాలో జాన్‌ అబ్రహం భార్యగా చేశా. అది విడుదలయ్యాక ‘ఊహలు గుసగుసలాడే...’ సినిమాకి  అవకాశం వచ్చింది’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.