close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నల్లానల్లాని పండు...

నల్లానల్లాని పండు...

ప్పుడే నేరేడు పండ్లు వచ్చేశాయే అన్న ఆనందం, ఆ ధర వినగానే ఆవిరైపోవచ్చుగాక. అయినా సరే, అవి వచ్చినంత కాలం రోజూ ఓ నాలుగు పండ్లయినా తినేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నున్నగా నిగనిగలాడుతూ కొంచెం వగరు, కొంచెం ఘాటు, కొంచెం తీపి కలగలిసిన నేరేడు రుచి అందరికీ నచ్చదు. అయినప్పటికీ వాటినో మందులా అయినా తినడం అలవాటు చేసుకుంటున్నారు... కారణం అందులో ఉన్నన్ని ఔషధగుణాలు మరే పండులోనూ లేకపోవడమే.
పురాణకాలంనుంచీ నేరేడు మనదగ్గర వాడుకలో ఉంది. అరణ్యవాసంలో రాముడు ఈ పండ్లనే ఎక్కువగా తినేవాడట. దీన్నే జంబూఫలం, జామూన్‌ అనీ అంటారు. ఈ పండ్ల కారణంగానే మనదేశానికి జంబూద్వీపం అని పేరు. సాధారణంగా ఈ పండ్లు రెండు రకాలు. పెద్దగా అండాకారంలో ఉండే వాటిని సువా జామూన్‌ అనీ, గుండ్రంగా చిన్నగా ఉండేవాటిని కట్టా జామూన్‌ అనీ అంటారు. చిన్నవాటికన్నా పెద్దగా ఉండేవే రుచెక్కువ.

పండు... అద్భుత ఔషధం..!
విటమిన్‌-ఎ, విటమిన్‌-సి సమృద్ధిగా ఉండే నేరేడుపండులో డయాబెటిస్‌ను తగ్గించే  ఔషధగుణాలు మెండు. ఈ పండ్లను చిన్నప్పటినుంచీ తినడంవల్ల మధుమేహం రాదనీ ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా త్వరగా రాదనీ సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తంలో పేరుకునే చక్కెరకి  నేరేడుని మించిన విరుగుడు లేదట.
* ఉదయాన్నే ఉప్పు లేదా తేనెతో కలిపి ఈ పండ్లను తింటే పైల్స్‌ వ్యాధి తగ్గుతుంది.
* ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఐరన్‌ రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
* ఈ పండ్ల గుజ్జు దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధుల్నీ తగ్గిస్తుంది. క్రమం తప్పక తింటే కోరింతదగ్గు, టీబీ వంటివి తగ్గుతాయి.
* నేరేడుపండ్లలో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లను స్రవించేలా చేసి కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి. జీలకర్రపొడి, బ్లాక్‌సాల్ట్‌తో కలిపి తింటే ఎసిడిటీ తగ్గుతుంది. పూర్వం కాలేయవ్యాధులకి ఈ పండ్లనే వాడినట్లు  చరకసంహిత ద్వారా తెలుస్తుంది.
* క్రమం తప్పక తింటే రక్తనాళాల్లో కాల్షియం పేరుకోకుండా ఉంటుంది. తద్వారా హృద్రోగాలనీ నియంత్రించుకోవచ్చు.
* వానాకాలంలో ఎక్కువగా వచ్చే అతిసాంం, కలరా వ్యాధులతోబాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లనీ నేరేడు అరికడుతుంది.
* ఈ పండ్లు చిగుళ్ల వ్యాధుల్నీ జలుబునీ ఇన్ఫెక్షన్లనీ అడ్డుకుంటాయి.
* వృద్ధాప్యాన్నీ క్యాన్సర్‌వ్యాధుల్నీ కూడా నియంత్రిస్తాయి. మొత్తంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలోని  ఆస్ట్రింజెంట్‌ గుణాల కారణంగా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

చెట్టంతా మందే!
పండ్లే కాదు, ఈ చెట్టులోని ప్రతీ భాగమూ ఔషధభరితమే. గింజలూ ఆకులూ బెరడూ అన్నీ ఆరోగ్యాన్ని పెంచేవే. గింజల్లోని గ్లైకోసైడ్‌ని జంబోలిన్‌ అంటారు. ఇది పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుపడుతుంది. ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ గింజల్లో మెండుగా ఉన్నాయి. అందుకే గింజల్ని ఎండబెట్టి పొడి చేసి టీస్పూను పొడిని మూడునాలుగుసార్లు నీళ్లలో కలిపి తాగడం వల్ల మూత్రంలో చక్కెర పోకుండా ఉంటుంది. మధుమేహం నియంత్రణలోనూ ఉంటుంది. అతిమూత్రవ్యాధితో బాధపడేవాళ్లకీ ఈ పొడి మంచిదే. ఈ పొడి అతిదాహాన్నీ తగ్గిస్తుందట. నేరేడుగింజల పొడిని రోజూ ఒకటీ లేదా రెండు టీస్పూన్ల చొప్పున మజ్జిగతోపాటు తీసుకుంటే వానాకాలంలో వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు. గింజల పొడిలో కాసిని పాలు కలిపి మొహానికి పట్టిస్తే మొటిమలూ తగ్గుతాయి. అలాగే పరగడుపునే ఆకుల్ని నమలడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండటంతోబాటు జీర్ణసంబంధ రోగాలన్నీ తగ్గుతాయి. ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి పండ్లపొడిలా వాడితే చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
అసలే అద్భుత ఔషధం, కానీ అవేమో రెండుమూడు నెలలే దొరుకుతాయి. అందుకే ఏడాదికి సరిపడా ఆరోగ్యాన్ని ఒకేసారి సొంతం చేసుకోవాలన్న అత్యాశతో అతిగా ఈ పండ్లు తినకూడదు. మందుని మందులానే తినాలి. లేదంటే ఒళ్లునొప్పులూ జ్వరాలూ వస్తాయి. గొంతులోనూ ఊపిరితిత్తుల్లోనూ పట్టేస్తుంది. అదీగాక ఇప్పుడు నేరేడు ఎండురూపంలోనూ తాండ్రల రూపంలోనూ జ్యూస్‌లాగానూ నిత్యం మార్కెట్లో దొరుకుతోంది. పైగా పండ్లను స్క్వాష్‌ రూపంలోనూ నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్‌ నిండా నేరేడు పండ్లే... ఇంకెందుకు ఆలస్యం..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.