close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మురుగు పనులకు.. ఇక మరమనిషి!

మురుగు పనులకు.. ఇక మరమనిషి!

దారిన వెళుతున్నప్పుడు ఎక్కడ మురుగు పొంగుతున్నా.. చటుక్కున ముక్కు మూసుకుని అక్కణ్ణుంచి వడివడిగా  అడుగులు వేసేస్తుంటాం. ఆ అడుగు పొరబాటున అక్కడి బురదలోనే పడితే మనల్ని మనమే చీదరించుకుంటాం. అలాంటిది... మనలాంటి మనిషి ఒకడు ఆ నీట్లోకి మెడలోతున దిగి పూడిక తీయడాన్ని చూస్తూ ఉండాల్సిన  పరిస్థితి. అలా చూసి ‘అయ్యో.. పాపం!’ అనుకోవడం తప్ప ఇంతకాలం ఏమీ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు, దేశంలోనే తొలిసారి, హైదరాబాద్‌లో ఈ డ్రైనేజీల పూడిక తీయడానికి రోబోలని వాడుతున్నారు!

భాగ్యనగరంలో ఏడువేల కిలోమీటర్ల మురుగునీటి పైపులైన్‌లు ఉన్నాయని అంచనా. వీటిలో చాలాభాగం నిజాం  జమానాలో నిర్మించినవి. అప్పట్లో మూణ్ణాలుగు లక్షలైనా లేని జనాభాని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటుచేసినవి. ఇప్పుడు హైదరాబాద్‌ జనాభా దాదాపు 70 లక్షలు! ఈ ఒత్తిడిని తట్టుకోలేకే తరచూ ఇక్కడి డ్రైనేజీలు మొరాయిస్తున్నాయి. మాటికోసారి పూడికలతో మురుగునీటిని రోడ్లపై పొంగిపారిస్తున్నాయి. ఆ సమస్య నివారించడానికి తక్షణ పరిష్కారంగా తమ కడగొట్టుస్థాయి సిబ్బందినే మ్యాన్‌హోళ్ళలోకి దింపి పూడిక తీయిస్తూ వచ్చింది హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగు నీటి నిర్వహణ మండలి(హెచ్‌ఎంఎస్‌ఎస్‌బీ). ఈ పద్ధతి అమానవీయంగా ఉన్నా... వేరే సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేక దాన్నే కొనసాగిస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వ సంస్థతోపాటూ అక్కడక్కడా కొన్ని ప్రైవేటు కంపెనీలూ మురుగుతీయిస్తామంటూ తమ సిబ్బందిని ఇదే పనికి వినియోగిస్తూ వస్తున్నాయి. ఇది ప్రమాదాలకి దారితీస్తోంది. కొన్ని మ్యాన్‌హోళ్లలో ఏర్పడే మీథేన్‌, హైడ్రో సల్ఫేట్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులు ఈ కార్మికుల ప్రాణాలని తీసేస్తున్నాయి. గత ఏడాది హైదరాబాద్‌లో ఇలా మ్యాన్‌హోళ్ళలోకి దిగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు! వీటిని నివారించేందుకు అధికారులు అత్యాధునిక ఎయిర్‌టెక్‌ మెషిన్లని తెప్పించి వినియోగించడం ప్రారంభించారు. కానీ ఇవి ఇరుకైన పైపులైన్లలో పనిచేయలేక చేతులెత్తేస్తున్నాయి. దాంతో వాటిల్లో మళ్లీ సిబ్బందే దిగాల్సి వస్తోంది. అలా దిగిన ఇద్దరు ఈ మధ్యే చనిపోయారు!

ఒక్కోటి పదిలక్షలు..
ఈ పద్ధతిని పూర్తిగా నివారించడానికంటూ హెచ్‌ఎంఎస్‌ఎస్‌బీ సంస్థ దిల్లీలో సాంకేతిక నిపుణులతోనూ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్న మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ వంటివాళ్లతోనూ ఓ సమావేశం నిర్వహించింది. అందరూ కలిసి... హైదరాబాద్‌కంటూ ప్రత్యేకంగా పారిశుద్ధ్య రోబోలకి ఓ రూపమిచ్చారు. బెంగళూరుకి చెందిన శానిటర్‌ అనే సంస్థ వీటిని అందించింది. మే నుంచి హైదరాబాద్‌లోని పలుచోట్ల వీటిని వినియోగించడం మొదలుపెట్టారు. ఒక్కో రోబో ధర పదిలక్షల రూపాయలు. రోబో అనగానే రజినీకాంత్‌ సినిమాలోలా మనిషి ఆకారంలో ఉంటాయనుకోకండి. ఇవి యంత్రాల రూపంలోనే ఉంటాయి. కానీ మనిషికన్నా ఎంతో  నిశితంగా, తెలివిగా తమ పని చేసుకుపోతాయి. ఈ యంత్రుడికి ప్రధానంగా రెండు భాగాలుంటాయి. అవేంటంటే...

360 డిగ్రీల కెమెరా కన్ను: ఈ రోబో పనితీరుకి ఇదే కీలకం. 360 డిగ్రీల మేర సునిశితంగా చూడగలిగే కెమెరా కన్ను ఇది. డ్రైనేజీలో సమస్య వచ్చినప్పుడు మొదట ఇదే రంగంలోకి దిగుతుంది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వస్తువుల్నే కాదు, పనిలోపనిగా పైపుల నాణ్యతనీ అంచనా వేస్తుంది. పైపులు ఎక్కడైనా డొల్లగా ఉన్నా... వాటికి చిల్లులు ఏర్పడినా ఇట్టే పసిగట్టేస్తుంది. అక్కడి పరిస్థితిని వీడియోల రూపంలో బయటున్న మానిటర్‌కి చెబుతుంది.

సెవర్‌క్రాక్‌ : కెమెరా కన్ను అడ్డంకులని పసిగట్టగానే.. ‘సెవర్‌క్రాక్‌’ రంగంలోకి  దిగుతుంది. సుమారు 12 కిలోల బరువుతో, గుండ్రంగా ఉండే ఈ యంత్రానికి మూడు వైపులా ఆరు వరసల్లో చక్రాలుంటాయి. దాంతో ఈ యంత్రం ఎటువైపైనా సులభంగా వేగంగా కదలగలుగుతుంది. దీనికి ముందు వైపున్న బలమైన బ్లేడ్లు బండ రాళ్లనూ, ఇనుప వస్తువుల్నీ కూడా తునాతునకలు  చేసి... ప్రవాహానికి అడ్డు తొలగిస్తాయి. ఇవి రెండూ కాకుండా... మ్యాన్‌హోళ్లలో  విషవాయువులు ఏవైనా ఉన్నాయో లేవో  చెప్పేందుకు ప్రత్యేక గ్యాస్‌ డిటెక్టర్‌ కూడా ఇందులో ఉంటుంది.
అంతరిక్షానికీ, అత్యాధునిక సౌకర్యాలకే ఇప్పటిదాకా మనం మరమనుషుల్ని  వినియోగిస్తూ వస్తున్నాం! అలాంటిది మురుగు పనులకూ వాటిని వాడటం  మనుషులుగా మనం వేసిన ఓ మంచి ముందుడుగు. ఈ ముందడుగు పారిశుద్ధ్యానికి మనుషుల్ని వినియోగించే అమానవీయతకి చరమగీతం పాడుతుందని ఆశిద్దాం!

- గొర్లె బాలకృష్ణ ఈనాడు, హైదరాబాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.