close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ అఫ్గానీ... భారత్‌ అభిమాని!

ఈ అఫ్గానీ... భారత్‌ అభిమాని!

‘అఫ్గానిస్థాన్‌ నుంచి ఏదొచ్చినా హైదరాబాద్‌ తన సొంతం చేసేసుకుంటుంది. ఒకప్పుడు బిర్యానీని అలా అక్కున చేర్చుకుంది. ఇప్పుడేమో రషీద్‌ఖాన్‌ని!’ - మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి గత ఏడాది చేసిన కొంటె ట్వీట్‌ ఇది! బిర్యానీ విషయాన్ని పక్కనపెడితే.. రషీద్‌ఖాన్‌ని ఒక్క హైదరాబాదే కాదు యావత్‌ భారతదేశం తన సొంతం చేసేసుకుందని చెప్పాలి. ఎంతగా అంటే ‘రషీద్‌ఖాన్‌కి భారత్‌ పౌరసత్వం ఇవ్వండి..’ అని నెటిజన్‌లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ని అడిగేంత! తన లెగ్‌స్పిన్‌తో భారతీయుల హృదయాలని దోచుకున్న పందొమ్మిదేళ్ల ఈ అఫ్గానీ జీవిత కహానీ ఇది..

ది 2017వ సంవత్సరం.  హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ స్టేడియం. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య పోటీ! మొదట ఆడిన సన్‌రైజర్స్‌ 207 పరుగులు సాధించింది. దాన్ని ఛేదించడానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బరిలోకి దిగింది. ఆ జట్టు తరఫున ఓపెనర్‌గా క్రిస్‌ గేల్‌ సిక్సులతో సునామీ సృష్టిస్తున్నాడు. మరో ఓపెనర్‌ మన్‌దీప్‌తో కలిసి ఐదు ఓవర్లకే 52 స్కోరు చేశాడు. అదే వేగంతో పోతే వాళ్లిద్దరే ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించేలా ఉన్నారు. సరిగ్గా ఆరో ఓవర్‌కి కెప్టెన్‌ బంతిని రషీద్‌ ఖాన్‌ చేతికిచ్చాడు.  తొలి బంతి మన్‌దీప్‌కే వేయాలి. వేశాడు..  ఆ బంతి క్రికెట్‌ ప్రపంచం ఇప్పటిదాకా చూడని భ్రమణంతో తిరుగుతూ మందుకెళ్లడం మొదలుపెట్టింది..! ఆ భ్రమణం వెనక పద్దెనిమిదేళ్ల ఆ అఫ్గానీ కుర్రాడి కలలున్నాయి. ఆ బాల్‌ తన లక్ష్యాన్ని ఛేదించిందో లేదో తెలుసుకోవడానికి ముందు ఆ కలల నేపథ్యం ఓ సారి చూస్తే..

శరణార్థి శిబిరాల నుంచి..
అఫ్గానిస్థాన్‌ యువత క్రికెట్‌ నేర్చుకున్నదంతా శరణార్థి శిబిరాల్లోనే! అవి పాకిస్థాన్‌లోనే ఉండేవి. 1979 నుంచే అఫ్గాన్‌ ప్రజలు బాంబుల నుంచి  తలదాచుకోవడానికి ఆ దేశాన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు. పాక్‌ ప్రజలకున్న క్రికెట్‌ పిచ్చి వాళ్లకీ అంటుకుంది. అక్కడి ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని చూసి తానూ అతనిలా కావాలని కలలుకన్నాడు రషీద్‌ ఖాన్‌! పుట్టింది 1998లో. తండ్రి విదేశాల నుంచి కార్ల టైర్లు దిగుమతి చేసుకుని అమ్ముతుండేవాడు. ఆయనకి గంపెడు సంతానం. రషీద్‌ఖాన్‌ ఆ ఇంట పన్నెండో పిల్లవాడు. ఏడుగురు అన్నలూ, నలుగురు అక్కల తర్వాతివాడు. కూటికి ఇబ్బందిలేకపోయినా.. గూడే వాళ్లకి సమస్యగా మారింది. అఫ్గాన్‌లో యుద్ధం కారణంగా రషీద్‌ చిన్నప్పుడే అతని కుటుంబం కాందిశీకులుగా పాకిస్థాన్‌కి వెళ్లాల్సి వచ్చింది. అతని బాల్యం అక్కడి  శిబిరాల్లోనే గడిచింది. అతనికి క్రికెట్‌  పరిచయమైంది కూడా అప్పుడే! శిబిరంలో కాందిశీకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పాఠశాలకి వెళ్లిరాగానే.. అన్నదమ్ములందరూ క్రికెట్‌లోనే మునిగి తేలేవారు. ‘మా పెద్దన్నయ్య మంచి బ్యాట్స్‌మన్‌. ఆయనకి స్పిన్‌ అయినా సరే.. స్లోగా వేస్తే కోపంతో ఊగిపోయేవాడు. ఫాస్ట్‌గా వేయమని బ్యాట్‌  పుచ్చుకుని కొట్టేవాడు. ఆ భయంతోనే నేను స్పిన్‌ వేగంగా వేయడం నేర్చుకున్నాను. ప్రస్తుతం గంటకి 92-97 కిలోమీటర్ల వేగంతో బాల్‌ వేస్తున్నానంటే కారణం ఆయనే!’ అంటాడు రషీద్‌.

చదువుల్లో ఫస్ట్‌..!
అంతర్జాతీయ రాజకీయ పరిణామాల కారణంగా అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి కొద్దిగా చల్లబడింది.  తాలిబన్‌ల శక్తి సన్నగిల్లింది. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దాంతో రషీద్‌ కుటుంబం స్వదేశానికి వచ్చింది. అఫ్గానిస్థాన్‌లోని నింగర్హర్‌ రాష్ట్రరాజధాని జలాలాబాద్‌కి వచ్చి స్థిరపడ్డారు.  పాకిస్థాన్‌ శిబిరాల్లో కాందిశీకులుగా ఉన్నంత వరకూ పిల్లల చదువుపట్ల వాళ్ల తల్లి ఎన్నికలలు కన్నదో తెలియదుకానీ.. స్వదేశానికొచ్చాక తన పిల్లలందరూ ఉన్నత విద్య చదివితీరాలని పట్టుబట్టింది. రషీద్‌ఖాన్‌ డాక్టర్‌ కావాల్సిందేనని తేల్చిచెప్పింది. అమ్మ మాటే విన్నాడతను. ఏడు నుంచి పదో తరగతిదాకా క్లాసులో ‘టాప్‌ 3’లో ఉండేవాడు. ఇంగ్లిషు బాగా రావాలని కోచింగ్‌కీ వెళ్లాడు. రెండు నెలల్లోనే  ఆ భాషని చక్కగా నేర్చుకుని.. తానే టీచర్‌గా మారాడు. వీటిన్నింటికీ సమయంపోగా మిగిలిన ఖాళీ వేళల్లోనే క్రికెట్‌! రషీద్‌ క్రికెట్‌ ఆడటానికి ప్రత్యేకంగా స్నేహితులెవ్వరి అవసరం లేకపోయింది. రషీద్‌ అన్నదమ్ములూ, మేనల్లుళ్లు అందరూ కలిస్తే ఓ క్రికెట్‌ టీమ్‌ అయిపోయేది! వాళ్ల చలవతోనే చక్కటి బ్యాటింగ్‌, స్పిన్‌ అలవాటు చేసుకున్న రషీద్‌ స్కూలు స్థాయిలో అద్భుతమైన విజయాలు నమోదుచేశాడు. వాటి ద్వారా రాష్ట్రస్థాయిలో  రాణించాడు. అలా జాతీయస్థాయిలో అండర్‌-19కి క్రికెట్‌కీ ఎంపికయ్యాడు.

ఆ ఇద్దరిలో ఒకడు..
‘నేను భారత్‌ అభిమానిని. ఈ దేశం నాకు రెండో పుట్టిల్లు..’ అని చెబుతాడు రషీద్‌. అతనిపైన ఇక్కడివాళ్లు కురిపిస్తున్న అభిమానాన్ని చూసి మాత్రమే అంటున్న మాటలు కావు అవి. అదో లోతైన కృతజ్ఞతాభావం. అంత కృతజ్ఞత ఎందుకంటే.. అతని జీవితాన్ని ఇంతస్థాయికి తెచ్చినవాళ్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారుకాబట్టి. వారిలో మొదటివాడు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌. 1980లలో భారత్‌ తరపున ఆడిన బ్యాట్స్‌మన్‌ ఆయన. అఫ్గానిస్థాన్‌ జట్టుకి కోచ్‌గా పనిచేశాడు. అండర్‌-19లోకి వచ్చిన రషీద్‌లోని స్పిన్‌ ప్రతిభని గుర్తించింది అతనే.‘సాధారణంగా కోచ్‌లందరూ స్పిన్‌.. షేన్‌వార్న్‌లా చాలా స్లోగా ఉండాలనే ఒత్తిడి తెస్తుంటారు. ఆయన అలా చేయలేదు. నాదైన వేగానికి అనుమతిచ్చారు. అదే నన్ను ప్రపంచంలోని మిగతా స్పిన్నర్లమధ్య ప్రత్యేకంగా నిలిపింది..’ అంటాడు రషీద్‌! ఆ స్వేచ్ఛే 2016లో ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అఫ్గానిస్థాన్‌ అనధికారిక టెస్టు మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టేలా చేసింది! అఫ్గానిస్థాన్‌ 2016 దాకా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)లో అనుబంధ సభ్యదేశంగా ఉండేది. శాశ్వత సభ్యత్వం పొందడానికి కొన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. వాటన్నింటా.. ప్రధాన పాత్ర పోషించాడు రషీద్‌ఖాన్‌. ఆ విజయాలు చూశాకే కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ అతణ్ణి మరో మెట్టు ఎక్కించాడు. అదే ఐపీఎల్‌!

మరొకడు మన లక్ష్మణుడు!
2013లో హైదరాబాద్‌ ఐపీఎల్‌ జట్టు  ‘సన్‌రైజర్స్‌’ వచ్చినప్పటి నుంచీ దాని  మెంటార్‌గా ఎన్నో ప్రయోగాలు చేస్తూ  వస్తున్నాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌. 2017లో  సరికొత్త బౌలర్స్‌ కావాల్సి వచ్చింది అతనికి. మామూలు బౌలర్‌ కాదు, వాళ్లలో ఏదో ఒక మాయ ఉండాలి అనుకున్నాడు. మేటి బ్యాట్స్‌మన్‌లనైనా తబ్బిబ్బు చేసే ఇంద్రజాలం కావాలనుకున్నాడు. దానికి అతను ‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’ అని పేరుపెట్టాడు. అలాంటివాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అప్పుడే లక్ష్మణ్‌కి రషీద్‌ ఖాన్‌ గురించి లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌  చెప్పాడు. ‘నువ్వు అతడి మ్యాచ్‌ల వీడియోలు చూడు.. అతనేంటో తెలుస్తుంది’ అన్నాడు. లక్ష్మణ్‌ చూశాడు.. కానీ జవాబేమీ చెప్పకుండా గుంభనంగానే ఉండిపోయాడు. 2017 ఐపీఎల్‌ వేలం పాట.. బెంగళూరు వేదిక. ఆ రోజు రషీద్‌పడ్డ టెన్షన్‌ని అతని మాటల్లో చెప్పాలంటే.. ‘ఈ వేలం పాట వివరాలు నా సెల్‌ఫోన్‌కి ఎప్పటికప్పుడు లైవ్‌ స్ట్రీమ్‌గా వస్తూ ఉన్నాయి. స్నేహితులందరూ నాకు అవకాశం ఉంటుందని చెబుతున్నా నేను నమ్మలా. అఫ్గాన్‌కిచెందిన నాలాంటి అనామక క్రికెటర్‌ని ఎవరు తీసుకుంటార్లే  అనే ఆలోచన నాది. నా నిరాశకి తగ్గట్టే క్రికెట్‌ ప్రపంచం ‘సూపర్‌ స్పిన్నర్‌’గా ప్రస్తుతిస్తున్న దక్షిణాఫ్రికా బౌలర్‌ ఇమ్రాన్‌ని ఎవ్వరూ తీసుకోలేదు! ఆయనకే ఆ పరిస్థితుంటే నేనెక్కడ అనిపించింది. తర్వాత మా సీనియర్‌ నబీని 30 లక్షలకి సన్‌రైజర్స్‌ తీసుకుంది. నాకూ అంతే వస్తే చాలనుకున్నా. కానీ అది అలా అలా పెరుగుతూ మూడుకోట్లు దాటింది. చివరకు సన్‌రైజర్స్‌ జట్టు నన్ను రూ.4 కోట్లకు సొంతం చేసుకుంటే నమ్మలేకపోయాను. నేను కలలోనైనా ఊహించనంత సొమ్ము అది’ అని చెబుతాడు రషీద్‌.

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌..
అలా భారత గడ్డపై తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడటానికి వచ్చాడు రషీద్‌. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియమే అతని మంత్రజాలానికి వేదికైంది. ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 207 లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చనుకుంటూ గేల్‌ రెచ్చిపోతున్నాడు. మన్‌దీప్‌ అతనికి జతయ్యాడు. రషీద్‌  తొలి బాల్‌ అతనిపైనే ప్రయోగించాడు.  బాల్‌ గిర్రున తిరుగుతూ బ్యాట్స్‌మన్‌ ముందు పడింది. అతనూ మామూలువాడు కాదు. ఒడుపుగా దానికి తన బ్యాట్‌ని బలంగా తాకించాడు. ఆ దెబ్బకి బంతి కాస్త వంపు తిరిగి తడబడినా.. తన లక్ష్యానికి దూరం కాలేదు. మధ్య స్టంప్‌ని నేరుగా వెళ్లి గట్టిగా ముద్దాడేసింది. వికెట్‌ పడింది! గేల్‌-మన్‌దీప్‌ భాగస్వామ్యం కూలింది. ఆ తర్వాత కీలకమైన మరో వికెట్‌. సన్‌రైజర్స్‌కి ఆ రోజు విజయం దక్కింది. అలా.. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఓ స్పిన్‌ మాంత్రికుడి ప్రయాణం గంభీరంగా మొదలైంది!!

ఇది కూడా రికార్డే కానీ..
ఇప్పటిదాకా రికార్డులతో చరిత్ర సృష్టిస్తూ వచ్చిన రషీద్‌ ఖాన్‌.. ఇటీవల భారత్‌తో  జరిగిన అఫ్గానిస్థాన్‌ తొలి టెస్టు మ్యాచ్‌లో  ఓ ‘ప్రతికూల’ రికార్డు సృష్టించాడు. టెస్టు మ్యాచ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే బౌలర్లు ఎవ్వరూ ఇవ్వనన్ని పరుగులు (155) ఇచ్చాడు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ నుంచీ ఆకాశంలోనే విహరిస్తున్న అతని ఊపు.. తొలిసారి నేలకు దిగింది. కానీ పూర్తిగా బాధపడటానికీ లేదు. అతని బాల్స్‌కి ఎక్కువ పరుగులు పిండుకున్న భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ అతనిపై పరోక్షంగానే ప్రశంసలు కురిపించాడు. ‘ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ జట్టులో అతనితో కలిసి బాగా నెట్‌ ప్రాక్టీస్‌ చేయడం కలిసొచ్చింది. అతని బౌలింగ్‌ని ఎదుర్కొనే శక్తి వచ్చింది...’ అని చెప్పాడు! ఓ రకంగా అలాంటి నెట్‌ప్రాక్టీస్‌ లేకుంటే అతన్ని ఎదుర్కోవడం అసాధ్యమనే ఒప్పుకున్నాడు.  రషీద్‌కి ఇప్పుడు 19 ఏళ్లే. ఎంతలేదనుకున్నా అతని కెరీర్‌ మరో 10-15 ఏళ్ల దాకా నిరాటంకంగా సాగొచ్చు. ఆ పదిహేనేళ్ల తర్వాత ఇతను గొప్ప క్రికెటర్‌గా నిలిచిపోతాడనే  చెబుతున్నారు క్రికెట్‌ పండితులు!

అతిచిన్న వయసులోనే..

ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్‌లో నెంబర్‌ వన్‌ స్థానం సాధించాడు. 19 ఏళ్లకే అది సాధించిన అతిపిన్నవయస్కుడిగానూ రికార్డు సృష్టించాడు. ఆ రకంగా అంత చిన్నవయసులో ఐసీసీ ర్యాంక్‌లో నెంబర్‌వన్‌కి వెళ్లిన సచిన్‌ తెందుల్కర్‌, సక్లైన్‌ ముస్తక్‌ రికార్డుల్ని బద్దలుకొట్టాడు. మార్చిలో అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకుల్లోనూ టాప్‌గా నిలిచాడు.
* మార్చిలో జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌కి అఫ్గానిస్థాన్‌ జట్టుకి రషీద్‌ఖానే కెప్టెన్‌గా వ్యవహరించాడు.  ఆ రకంగా వన్‌ డే ఇంటర్నేషనల్‌లో కెప్టెన్‌గా మారిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నమోదుచేశాడు.
* క్వాలిఫయిర్‌ పోటీల్లో వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో తన వందో వికెట్‌ మైలురాయిని చేరుకున్నాడు. అది అతని 44వ మ్యాచ్‌. ఆ రకంగా అతితక్కువ మ్యాచ్‌లతోనే వంద వికెట్లు తీసినవాడిగానూ రికార్డు నమోదైంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.