close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేరుకే దొంగలు... వీళ్లు పుస్తకాల రాజులు!

పేరుకే దొంగలు... వీళ్లు పుస్తకాల రాజులు!

ఆ సంస్థ పేరు బుక్‌చోర్‌ డాట్‌కామ్‌! పేరు చూసి ‘పుస్తకాల దొంగల అడ్డానా?!’ అని భయపడిపోకండి. నిజానికి ఆ సంస్థ నిర్వాహకులు పుస్తకప్రియుల మనసుల్ని టోకున దోచేస్తున్నారు. సెకెండ్‌హ్యాండ్‌ పుస్తకాల కోసం దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ అమ్మకాల సంస్థను నడుపుతూ ఆహా అనిపిస్తున్నారు. ఈ సైట్‌లో పుస్తకాలు అమ్మడం, కొనడమే కాదు పేద విద్యార్థులకి దానం కూడా చేయొచ్చు. దేశవ్యాప్తంగా నాలుగులక్షల మంది సభ్యులున్న బుక్‌చోర్‌డాట్‌కామ్‌కి ఇంకెన్ని ప్రత్యేకతలున్నాయో చూడండి...

కాలేజీలు తెరిచే కాలం కదా.. హైదరాబాద్‌లోని కోఠి, విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఇసుకేస్తే రాలనంతమంది ఉంటారు! సెకెండ్‌ హ్యాండ్‌ పుస్తకాల కోసం షాపులన్నింటినీ జల్లెడపడుతుంటారు. దిల్లీలోని దర్యాగంజ్‌ కూడా అలాంటి పాతపుస్తకాల అడ్డానే. మూడేళ్లకిందట భవిష్‌ శర్మ, ప్రతీక్‌ మహేశ్వర్‌, అలోక్‌రాజ్‌ శర్మ అనే బీటెక్‌ విద్యార్థులు అక్కడ పుస్తకాలు కొనడానికని వెళ్లారు. వాళ్లకి కావాల్సినవాటిని కొనడానికి రోజంతా పట్టిందట. అంత కష్టపడి కొన్న ఆ పుస్తకాలు బాగున్నాయా అంటే అదీ లేదు! కొన్ని పేజీలూ గల్లంతై ఉన్నాయి. ‘సెకెండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు కొనడం ఇంత కష్టంగానే ఎందుకుండాలి? వాటిని మరింత నాణ్యంగా విద్యార్థులకి ఎందుకు చేర్చకూడదు..’ అని ఓ రోజు క్యాంటీన్‌లో కూర్చుని ఆలోచించారు ఆ ముగ్గురు. దాన్ని మామూలు ‘చాయ్‌ పే చర్చ’గా వదిలేయకుండా వాళ్ల కాలేజీ పరిధిలో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. పుస్తకాలు కొనాలనుకునేవాళ్లు అందులో తమకుకావాల్సిన వాటి వివరాలని నమోదుచేస్తే... ఈ ముగ్గురే తీసుకెళ్ళి వాటిని అందించేవాళ్ళు. ఆ సేవకి స్పందన అదిరిపోయింది. ఆ దన్నుతో 2015 అక్టోబరులో ‘బైమీబుక్‌ డాట్‌కామ్‌’ అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ‘సేవలు బాగున్నాయికానీ వెబ్‌సైట్‌ పేరే చప్పగా ఉంది..’ అని కొందరు విద్యార్థులు చెప్పడంతో ‘బుక్‌చోర్‌ డాట్‌కామ్‌’ అని మార్చారట!

ఇవీ ఆ అంచెలు..
అసలే విద్యార్థులు మొదలుపెట్టిన సంస్థ.. పైగా అది పాత పుస్తకాలకి సంబంధించిన బిజినెస్‌ కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. భవిష్‌, ప్రతీక్‌, అలోక్‌రాజ్‌ ముగ్గురూ రకరకాలుగా ప్రయత్నించి విసిగివేసారారు. చివరికి భవిష్‌ తల్లిదండ్రులు 34 లక్షల రూపాయలిచ్చారు. అల్జీరియాలో ఉద్యోగం చేస్తున్న భవిష్‌వాళ్ల బావ విద్యుత్‌ శర్మ దాన్ని మానేసి దిల్లీ వచ్చి వీళ్లతో చేతులు కలిపారు. అలా నలుగురయ్యారు. ముందు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ను రూపొందించి, దిల్లీ, ముంబయిలోని పాత పుస్తకాల దుకాణాదారుల వద్ద మాట్లాడి తమకి పుస్తకాలివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదంతా చేశాక... మార్కెటింగ్‌కి డబ్బులు సరిపోలేదు. దాంతో సంప్రదాయ ప్రకటనలని వదిలేసి వీళ్లే స్వయంగా బడుల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పుస్తకాలు కొనే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా గ్రీటింగ్‌ కార్డుల్లాంటి చక్కటి లేఖలు పంపించేవారు. ఆ లేఖలే మొదట వీళ్లకంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. క్రమంగా పాఠ్య పుస్తకాలతోపాటూ ఆంగ్ల నవలలూ, ఇతరత్రా పుస్తకాలనూ విక్రయించడం ప్రారంభించారు. ఈ రెండేళ్లలో ఈ సైట్‌కి వచ్చే పుస్తకప్రియుల సంఖ్య మూడులక్షలకి పెరిగింది. ప్రస్తుతం వీళ్ల దగ్గర నాలుగు లక్షల పుస్తకాలున్నాయ్‌! మూడు కోట్లరూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నారు.

ఇవీ ప్రత్యేకతలు..
బహుళజాతి సంస్థల నుంచి బస్తీస్థాయి అంగళ్లదాకా ఇప్పుడెన్నో పుస్తకాల షాపులు ఈ-కామర్స్‌లోకి అడుగుపెట్టేస్తున్నాయి! మరి వీటి మధ్య బుక్‌చోర్‌ ప్రత్యేకతేమిటీ? ఇది పేరుకి పాతపుస్తకాలు అమ్మే వెబ్‌సైటేకానీ వీళ్ల దగ్గర మనం కొనే పుస్తకాలు అసలు పాతగా అనిపించవు. ఏమాత్రం చిరుగుల్లేకుండా చక్కగా ఉన్నవాటినే ఎంపికచేసి, చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు. మనదగ్గర పాత పుస్తకాలనీ వీళ్లు మంచి ధరకే కొంటారు. అంతేకాదు, పుస్తకాలని దానంగా కూడా తీసుకుని దిల్లీ చుట్టుపక్కల్లోని పేద విద్యార్థులకి అందిస్తున్నారు. గత ఏడాది అలా పదివేల పుస్తకాలని సేకరించి ఇచ్చారు. పుస్తకాల కొనుగోలూ, అమ్మకం, దానం... ఇలా ఈ మూడు సేవలనూ ఒకే వెబ్‌సైట్‌లో అందిస్తున్న సంస్థ ఇదొక్కటేనని చెప్పాలి.

ఇవాళ హైదరాబాద్‌లో..!
బుక్‌చోర్‌ సంస్థ ‘లాక్‌ ది బాక్స్‌’ పేరుతో వినూత్నమైన ఆఫ్‌లైన్‌ విక్రయాలనీ ప్రారంభించింది. మనదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేస్తోంది. ఆ ప్రదర్శన కేంద్రంలో పుస్తకాలతోపాటూ మూడు వేర్వేరు సైజుల్లో అట్టపెట్టెల్ని పెడతారు. ఒక్కోపెట్టెకు ఇంత ధర అని ఉంటుంది. పాఠకులు ఆ ధర చెల్లించి తమకు కావాల్సిన పుస్తకాలని ఆ బాక్సుల్లో ఎన్ని పడితే అన్ని పెట్టుకుని పట్టుకెళ్ళొచ్చు. ఇప్పటికే ఈ లాక్‌ ది బాక్స్‌ కార్యక్రమం పుణె, బెంగళూరు, చెన్నైల్లో పెద్ద హిట్టయ్యింది. ఈనెల 15 నుంచి హైదరాబాద్‌లో మొదలైన ఈ ప్రదర్శనకి ఇవాళే ఆఖరు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.