close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వడగళ్ల వానలో చచ్చి బతికాం..!

వడగళ్ల వానలో చచ్చి బతికాం..!

‘ఎన్నిసార్లు వెళ్లినా ఏ దారుల్లో తిరిగినా మనిషికి ఏమాత్రం అంతుచిక్కని అందాలకు ఆలయాలే హిమాలయ సానువులు. ఎత్తైన శిఖరాలూ మంచు పర్వతాలూ వాటి మధ్యలో మరెన్నో లోయలూ హిమనదాలూ నదీప్రవాహాలూ... అందుకే ఈసారి తీర్థన్‌ నదీ ప్రవాహ మార్గంలో ప్రయాణించాలనుకుని బయలుదేరాం’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.ఎన్‌.సీతారత్న.

హైదరాబాద్‌ నుంచి చంఢీఘడ్‌కు వెళ్లి, అక్కడినుంచి ఇన్నోవాలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ మీదుగా ఔట్‌ టన్నెల్‌ పక్కగా ప్రయాణించి లార్జి వద్ద వ్యాస్‌(బియాస్‌)నదిలో కలిసే తీర్థన్‌ నదీ సంగమ ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడి నుంచి గుషైని దాటి సాయిరోపా గ్రామాన్ని చేరుకున్నాం. సమీపంలోని తీర్థన్‌ స్ట్రీమ్‌ స్పిరిట్‌ అనే హోమ్‌స్టేలో మా బస. అక్కడికి చేరుకోవాలంటే నదిని దాటాలి. ఇనుప తీగలకు అనుసంధానించిన ట్రాలీ ద్వారా ఆవలి ఒడ్డుకు చేరుకున్నాం. తీర్థన్‌ వ్యాస్‌ నదికి ప్రధాన ఉపనది. ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఉంది. గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్కు లోపల ఉన్న హన్స్‌కుండ్‌ అనే హిమానీనదం నుంచి పుట్టి తీర్థన్‌లోయగుండా ప్రవహిస్తుంది. దీని ప్రవాహమార్గంలో హిమశిఖరాలూ, దేవదారు, కోనిఫెరస్‌ జాతులకు చెందిన అడవులూ, పచ్చికమైదానాలూ కనువిందు చేస్తాయి. ఆ ప్రాంతం జీవవైవిధ్యానికి పుట్టిల్లు.

గంటలు నిమిషాల్లా...
తీర్థన్‌ లోయనీ దానికి పక్కనే ఉన్న సైంజ్‌ లోయనీ కూడా గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్కులో భాగంగానే చెబుతారు. దీని ఉత్తర, దక్షిణ దిశలలో ఎత్తైన హిమశిఖరాలు ఉన్నాయి. ఈ శాంక్చువరీలో స్నోలెపర్డ్‌, కస్తూరి మృగం, నల్ల ఎలుగుబంట్లు, ఎరుపు నక్కలు, పామ్‌ సివెట్‌ ... వంటి అరుదైన జంతువులూ, మోనల్‌, వెస్ట్రన్‌ ట్రాగోఫాన్‌,  రెడ్‌ బిల్డ్‌ బ్లూ మాగ్‌ పై... వంటి 200 రకాల పక్షులు కనిపిస్తాయి.

సాహసక్రీడలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ పర్యటకుల శాతం తక్కువే. అదీ విదేశీయులే ఎక్కువ. అందుకే అక్కడి సహజ ప్రకృతి దెబ్బతినకుండా ఉంది. రివర్‌ క్రాసింగ్‌, రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌, రివర్‌ సైడ్‌ క్యాంపింగ్‌, విలేజ్‌ హాపింగ్‌(కాలినడకన గ్రామాల్లో తిరగడం), పర్వతారోహణ, ట్రౌట్‌ ఫిషింగ్‌ వంటివి చేయాలనుకునే పర్యటకులు వారాల తరబడి తీర్థన్‌లోయలో బస చేస్తుంటారు. చేపలు పట్టడానికి రోజుకి వంద రూపాయలు చెల్లించాలి. నదికి అడ్డంగా బలమైన తాళ్లు కట్టి ఒకేసారి 15 మందిని నది నీళ్లలోని తాళ్లమీదకి దించి రివర్‌ క్రాసింగ్‌ చేయిస్తారు. ప్రకృతిప్రేమికులు కొండలమీద నుంచి ఉరుకుతూ లయబద్ధంగా పరవళ్లు తొక్కే నదీప్రవాహ సడిని వింటూ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతినీ హిమాలయాల సౌందర్యాన్నీ చూస్తూ కూర్చుంటే చాలు, గంటలు నిమిషాల్లా కరిగిపోతాయి. ఈ లోయలో సాయిరోపా, నాగిని, మూంగ్లా, రోపా, గుషైని, బంజార్‌... వంటి గ్రామాలు చాలానే ఉన్నాయి. మేం అల్పాహారం తిని, కెమెరా భుజాన వేసుకుని, ఒక్కో గ్రామం తిరుగుతూ అక్కడి ప్రకృతినీ పక్షుల్నీ వ్యవసాయ క్షేత్రాలనీ గ్రామీణుల్నీ చూస్తూ గడిపి, మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వచ్చేవాళ్లం.

కాళ్లకు చక్రాలు కట్టుకోవాల్సిందే!
తీర్థన్‌లోయలో హోటళ్లూ రెస్టరెంట్లూ ఉండవు. అరుదుగా టీ దుకాణాలే ఉంటాయి. పర్యటకులూ అన్నింటికీ హోమ్‌ స్టే, రిసార్టులమీద ఆధారపడాల్సిందే. ఒకరోజు గ్రేట్‌ హిమాలయన్‌ పార్కు చూడ్డానికి బయలుదేరాం. దానికి సాయిరోపా గ్రామంలో ఉన్న అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. అక్కడే ఆయుర్వేద మందులూ తైలాలూ వెదురుబుట్టలూ బొమ్మలూ అన్నీ అమ్ముతారు. ఆ పార్కుకి వెళ్లాలంటే గుషైనీ నుంచి కాలినడకన బయలుదేరి గైడ్‌ సాయంతో రోపా అనే గ్రామానికి నడవాలి. అక్కడినుంచే పార్కు మొదలవుతుంది. దట్టమైన అడవిలో ఉన్న ఆ గ్రామంలో అన్నీ కలిపి 30 ఇళ్లు కూడా ఉండవు. గ్రామస్థులు నేతపనిలోనో బుట్టలు అల్లుకుంటూనో వ్యవసాయ పనులు చేసుకుంటూనో ఉంటారు. జలోరి పాస్‌ నుంచి ఖోర్లీ పోహి ప్రాంతం మోనల్‌ పక్షుల సంతాన కేంద్రం. అనుమతి ఉంటే తప్ప రానివ్వరు.

ఒకరోజు బాగీ గ్రామానికి టాక్సీలో బయలుదేరాం. అక్కడ శ్రింగా రుషి ఆలయం ఉంది. ఇక్కడ దేవుడి 24 ఆకారాలను దారు శిల్పాలుగా చెక్కారు. కొమ్ములున్న జింక కడుపున పుట్టడంవల్ల ఆయనకి శ్రింగా రుషి అనే పేరు వచ్చిందట. తీర్థన్‌లోయలోని గ్రామీణులందరికీ ఆయనే ఇష్టదైవం. అక్కడి నుంచి మరో మూడు కి.మీ. నడిస్తే ఓ మందిరం వచ్చింది. అందులో 18 మంది దేవతలు ఉన్నారు. వాళ్లంతా తీర్థన్‌లోయలోని 384 మంది చిన్న దేవతలకు గురు దేవతలట.

చెహ్నకోఠి అనే గ్రామంలో 1500 ఏళ్ల క్రితం కట్టిన రాజభవనాన్ని చూశాం. కలప, రాతి స్తంబాలతో నిర్మించిన ఈ భవనం కుల్లు రాజుదట. ఇది పశ్చిమ హిమాలయాల్లోకెల్లా ఎత్తైనది. అది చూసి రోపాకి 50 కి.మీ. దూరంలోని షాన్‌ఘర్‌ గ్రామానికి వెళ్లాం. పచ్చని ప్రకృతికి అది ఆలవాలం. పాండవులు స్వర్గారోహణకు ఇక్కడినుంచే వెళ్లారని ప్రతీతి.

అక్కడినుంచి వచ్చి మూడు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరాం. ఈసారి మేం ఇన్నోవాలో మూడు గంటలు ప్రయాణించి, అక్కడి నుంచి కాలినడకన గోధుమ, బార్లీపొలాలు దాటుకుంటూ గుట్టలూ బండలూ ఎక్కి అతి ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాం. దారిలో ఊదా ఆర్కిడ్‌ పుష్పాలు అందాలవిందు చేశాయి. ఎత్తైన గోడ కట్టినట్లుగా కోనిఫెర్‌, దేవదారు వృక్షాలు కాశ్మీర్‌ను తలపించాయి. దారిలో పశువుల్ని మేపుతున్న మహిళలు అందంగా ఉన్నారు. వృద్ధ మహిళలు చెట్టుకింద కూర్చుని ఊలు పేనుతూ కనిపించారు.