close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దృష్టి

దృష్టి
- నందిరాజు పద్మలతా జయరాం

కొందరికి కొన్ని అలవాట్లుంటాయ్‌. పోనీ వాటిని షౌకులు అనొచ్చేమో. అలా నాకు నా పదవి, అనుభవం, ప్రమోషన్లు... వీటి గురించి నలుగురికీ చెప్పుకోవటం ఇష్టం. వాటిని కొందరు గొప్పలు చెప్పుకోవటంగా భావిస్తారు. అది తప్పు. మనకు మనం గౌరవం ఇచ్చుకోవడం, మనమేంటో అందరికీ తెలియాలనుకోవడం చాలా అవసరం. సరే, ఇంతకీ విషయమేమిటంటే... ఈరోజు రాత్రి సదాశివ కూతురు పెళ్ళికి కుటుంబ సమేతంగా వెళ్తున్నాను. హైదరాబాదులోని గోదావరి ఫంక్షన్‌ హాల్‌లో విందు, అర్ధరాత్రి పెళ్ళి. నిజానికి నా హోదాకి సదాశివ ఇంటి ఫంక్షన్‌కి హాజరవకపోయినా తప్పు పట్టేవాళ్ళెవరూ ఉండరు. అయితే, గౌరవింపబడాలంటే సమాన స్థాయి వాళ్ళకన్నా కాస్త కిందిస్థాయి అయితేనే ఉత్తమం.

ఇక్కడ మీకు సదాశివ గురించి కాస్త చెప్తా. ఒక మోస్తరు కుటుంబ నేపథ్యం. ఏడో ఎనిమిది మంది పిల్లల్లో ఇతడు ఆఖరి సంతానం. ఇతను పుట్టేసరికి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కావడంవల్లా, పెద్ద పిల్లల పెళ్ళిళ్ళకీ చదువులకీ ఉన్న కాస్తా హరించుకుపోవడం వల్లా సదాశివని శ్రద్ధగా పట్టించుకున్నవాళ్ళు లేరు. దాంతో రోజంతా బలాదూరు తిరిగి భోజనంచేసి పడుకునేవాడు. పదో తరగతి నాలుగుసార్లు రాస్తేగానీ పాసవలేదట. అందుకే అన్నలు బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినా సదాశివ మాత్రం అటెండరు ఉద్యోగంలో చేరాడు. అతనే చెప్పాడివన్నీ. అతనికి ముగ్గురు పిల్లలనీ, చిన్న ఇంట్లో ఉంటూ సంసారాన్ని లాక్కొస్తున్నాడనీ నాకు తెలుసు. ఈ పాతికా ముప్ఫై ఏళ్ళుగా, అంటే... నేను క్లర్క్‌గా చేరినప్పటి నుంచీ ఈరోజు వరకూ వచ్చిన మార్పు ఏమిటీ అంటే... నేను సీనియర్‌ అధికారిని అవడం, అతను ఎలాగోలా గుమాస్తాగా ఎగబాకటం. ఒకేసారి చేరాం కనుక ఇద్దరికీ స్నేహం అయితే ఉంది. కానీ, మునుపటిలాకాక కాస్త ఎడంగా ఉండటం నేర్చుకున్నాను. అప్పట్లో సదాశివ పెళ్ళికి వెళ్ళాను. చాలా బీద కుటుంబం నుంచీ వచ్చిన పిల్ల. అందంగానే ఉంది. వెంటవెంటనే ముగ్గురు పిల్లలు. నాకు చాలా చిరాకు- స్థాయికి తగ్గట్టు ఉండకపోతే. ఆ సంపాదనకి ముగ్గురు పిల్లలు అవసరమా? ఏమిటో, కొందరంతే. కానీ, ఏ మాటకామాట చాలా బాగా పనిచేస్తాడు. తన పని తాను పూర్తిచేశాక, ఆఫీసులోనే ఓ మూల కూర్చుని ఏమేమో చేసేవాడు. పిల్లల పుస్తకాలు బైండు చేయడం, అట్టలు వేయడం, గ్రీటింగు కార్డులు తయారుచేయడం, వాచీలు, సెల్‌ఫోన్లు, రేడియోలు, టేపు రికార్డర్లు రిపేరు చేయడం... వగైరా పనులు చేస్తూ చిల్లర సంపాదన చేస్తూ ఉంటాడు. ఎలక్ట్రిక్‌ పనులు కూడా కొంత తెలుసని విన్నాను. నా ఉద్దేశ్యం, సదాశివ ఏటియం కార్డు- పెళ్ళాం పిల్లలు లాగేసుకుని ఇతగాడి చేతికి పైసా దక్కనివ్వడం లేదు కనుక, ఏదో ఇలాంటి పనులతో సంపాదించిన డబ్బుని తన ఖర్చులకి వాడుకుంటూ ఉంటాడని.

‘‘తప్పక రావాలి సార్‌... గోదావరి ఫంక్షన్‌ హాల్‌, ఈనెల ఇరవయ్యో తేదీ, ఆదివారం... కుటుంబ సమేతంగా రావాలి’’ శివపార్వతి కల్యాణం బొమ్మతో ఉన్న అచ్చతెలుగు ఫోల్డింగ్‌ కార్డు. చాలా మామూలుగా ఉంది. ఫొటోలూ గట్రా లేవు. పాపం, తక్కువలో వస్తుందని ఇలా వేయించి ఉంటాడు.

‘‘అంతగా చెప్పాలా సదా, తప్పకుండా వస్తాం. గోదావరి హాలు అద్దె చాలా ఎక్కువనుకుంటానే!’’
‘‘మగపెళ్ళివారే బుక్‌ చేశారు. పెళ్ళి ఖర్చు సగం సగం అన్నారు. చాలా మంచివాళ్ళు సార్‌’’ ఆనందంగా చెప్పాడు.

‘‘అదృష్టవంతుడివేనోయ్‌. మాలాంటివాళ్ళకే అది అందనంత ఎక్కువ అద్దె. ఇంతకీ అల్లుడు ఏం చేస్తున్నాడు?’’

‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, చెన్నైలో ఏదో కంపెనీ.’’
‘‘వెరీగుడ్‌. చాలా సంతోషంగా ఉంది సదాశివా. డబ్బులేమన్నా కావాలా, తర్వాత వీలుచూసి ఇద్దువుగానీ.’’

‘‘థాంక్యూ సార్‌. ప్రస్తుతానికి అక్కరలేదు. వాళ్ళు కట్నాలూ లాంఛనాలూ ఏవీ వద్దన్నారు. పెళ్ళిలో భోజనాలు మాత్రం బఫే వద్దు అని అడిగారంతే, వస్తాను సార్‌’’ అని వెళ్ళిపోయాడు.
‘హమ్మయ్య’ అనిపించింది. ఏదో నోరు జారానే కానీ, అప్పు ఇస్తే ఈ చిరుద్యోగి తిరిగిస్తాడని నమ్మకమేముంది?

నా భార్యా పిల్లల్ని పిలిచి చెప్పాను ‘‘మనం తప్పకుండా వెళ్ళాలి. నామీద గురుభావం అతనికి. చిన్న ఉద్యోగం, పెద్ద సంసారం. సింపుల్‌గా ఉంటుందనుకో. పాపం... ముగ్గురు పిల్లలు. అయినా
కూతురికి సాఫ్ట్‌వేర్‌ సంబంధం తెచ్చాడంటే గొప్ప విషయమే.’’

* * *

‘‘రండి సార్‌, అమ్మా రండి’’ కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టగానే సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు సదాశివ. భార్యనీ మగపిల్లలనీ పరిచయం చేశాడు. ఎప్పుడో పెళ్ళిలో చూశాన్నేను అతని భార్యని. చక్కని వేంకటగిరి పట్టుచీర కట్టుకుని, కాసంత కుంకుమ బొట్టుతో ఎంతో నిండుగా హుందాగా ఉంది. తప్పు అని తెలిసినా నా భార్యతో పోల్చుకున్నాను. ఈమధ్య టీవీ సీరియళ్ళ ప్రభావంతో మా ఆవిడ కట్టుబొట్టూ జుత్తు తీరూ చాలా మారింది. వాటి పరమార్థం మారి కేవలం పటాటోపం మిగిలింది. ఇక అమ్మాయి నాకు గారాలపట్టి. తను అడగదు, హుకుం జారీ చేస్తుంది. నేను కాదూ వద్దూ లేదూ అనే అవకాశం లేదంతే. సినీ తారామణులు ఏవి ధరిస్తే అవి అమాంతం మా అమ్మాయిని అలంకరించాల్సిందే. ఏం చేస్తాం... ఏం చెప్పగలం... పెద్దలు చెప్తే పిల్లలు వినే రోజులా ఇవి!

‘‘సుధా, ఇతనే సదాశివ. చాలా మంచివాడు, పనిమంతుడు. మొదట్లో అటెండరు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నా దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడు. ఏమ్మా, నేను గుర్తున్నానా? మీ పెళ్ళికి వచ్చాన్నేను’’ మా ఆవిడకి పరిచయం చేసి, సదా భార్యని కూడా పలకరించాను.

‘‘గుర్తున్నారండీ. మీరందరూ ఇచ్చిన వెంకటేశ్వరస్వామి పటం మా పూజగదిలో ఇప్పటికీ ఉంది. రండి, కాఫీ పంపిస్తాను’’ మర్యాదగా చెప్పి లోపలికెళ్ళింది సదా భార్య గౌరి. వాళ్ళు వెళ్ళాక నేను పిల్లలకి చదువుకోక
పోతే వచ్చే అనర్థాల గురించీ పేదరికం గురించీ, సంఘంలో లభించని గౌరవ మర్యాదల గురించీ చిరు సంపాదనలతో పడే కష్టాల గురించీ వివరణాత్మకమైన లెక్చరు ఇచ్చి అందుకు సజీవ ఉదాహరణగా సదాశివని చూపించాను.
పెళ్ళి వేదిక చాలా సాధారణంగా ఉంది. కొబ్బరాకుల్ని అల్లి పందిరి వేశారు. దానికి నాలుగు మూలలా అరటిచెట్లు గెలలతో సహా గర్వంగా నిల్చున్నై. పందిరిని మల్లె, మరువం, కనకాంబరాల కదంబమాలలతో వరుసలు వరుసలుగా అలంకరించారు. పెళ్ళి పీటల వెనుకగా గోడని ఆనుకుని అతి పెద్ద శివపార్వతుల కల్యాణ ఘట్టం తైలచిత్రం. నాకు మా అత్తవారి ఊరిలో జరిగిన మా పెళ్ళి గుర్తొచ్చింది. ఇంకా పెళ్ళికూతురు పీటల మీదికి రాలేదు. పెళ్ళికొడుకు వరపూజ చేస్తున్నాడు. కుర్రవాడు బాగానే ఉన్నాడు.

‘‘డాడ్‌, ఆ ఆంటీ... అదే పెళ్ళికూతురి మదర్‌ ఎవరో తెల్సా!’’ గుసగుసగా అడిగాడు మా అబ్బాయ్‌ కిరణ్‌.

‘‘సదాశివ భార్య’’ నవ్వుతూ చెప్పాను.
‘‘అదికాదు డాడ్‌, ఆవిడ నాకు ఇంజినీరింగ్‌లో అప్లైడ్‌ మాథ్స్‌ మేడం. ఫస్టియర్‌లో మాత్రమే ఆవిడ దగ్గర చదువుకున్నా కదా, అందుకే ఆవిడ నన్ను గుర్తుపట్టలేదు.’’

‘‘నీ మొహం... ఆవిడా ఈవిడా ఒకలా ఉన్నారేమో. సదాశివ భార్య ఏమిటీ... ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌ ఏమిటీ?’’
‘‘కాదు. కావాలంటే అడుగు. కేదారగౌరి మేడమ్‌ ఆవిడ’’ స్పష్టంగా అన్నాడు వాడు.

ఇంకా పెళ్ళి తంతు మొదలు కాకపోవడంతో, పెళ్ళివారిచ్చిన కాఫీ తాగి తెలిసిన వాళ్ళెవరినైనా పలకరిద్దామని చూడసాగాను. మా ఆఫీసువాళ్ళు చాలామందే ఉన్నారు. మొదటగా నా దగ్గర పనిచేసే భాస్కర్‌ నన్ను గమనించి మిగతావాళ్ళని కూడా తీసుకొచ్చాడు. పరస్పర నమస్కారాలూ పరిచయాలూ అయ్యాయి.

‘‘ఇదిగో వీళ్ళందరూ నా కింది స్టాఫ్‌’’ గర్వంగా చెప్పాను నా వాళ్ళకి.

సదాశివకి వీళ్ళందరూ జిగిరీ దోస్తులు. వారి నోటినుండి వరుడి వివరాలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఐఐటి, చెన్నైలో మాస్టర్స్‌ చేశాడట. అతి పెద్ద కంపెనీలో అతడు ప్రిన్సిపల్‌ ఇంజినీర్‌ అట.
‘నక్కని తొక్కుంటాడు సదా... లేకపోతే అలాంటి సంబంధం ఎలా సాధ్యం?’ మనసులో అనుకున్నాను. గ్రహించినట్లున్నాడు భాస్కర్‌.

‘‘సర్‌, సదాశివ కూతురు...అదే పెళ్ళికూతురు కూడా అదే ఐఐటీలో చదివింది కదా... తన గురించి తెలుసుకుని పెద్దవాళ్ళని పంపించాడట.’’
షాక్‌ తిన్నాను. అది కనిపించనివ్వకుండా అడిగాను- ‘‘మరి మిగతా పిల్లలిద్దరూ... వాళ్ళేం చేస్తున్నారు?’’

‘‘పెద్దబ్బాయి పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేశాడు. ఆమధ్య ‘ఈగ’ అని యానిమేటెడ్‌ సినిమా వచ్చింది చూడండి... దానికి ఆ అబ్బాయివాళ్ళ టీమ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ ఇచ్చింది. మంచి పొజిషన్‌లో ఉన్నాడిప్పుడు. రెండోవాడు బియ్యే ఫైనార్ట్స్‌ చదువుతున్నాడు. అదిగో పీటల వెనుక గోడమీద అంటించి ఉందే... అది వాడు వేసిందే. మంచి చిత్రకారుడు.’’

నాకు నోటమాట రావడంలేదు. ఈ అత్యల్పజీవి సదాగాడికి ఇంత టాలెంటెడ్‌ సంతానమా! మరి నాకింతవరకూ ఎవరూ చెప్పలేదే!
ఇంతలో సదాశివ చిన్నబ్బాయి నా దగ్గరకి వచ్చాడు.

‘‘అంకుల్‌, నాన్నగారు మిమ్మల్ని ఓసారి లోపలికి రమ్మంటున్నారు, ప్లీజ్‌...’’ అతని వెంటే నడిచాం మేం నలుగురం.

‘‘సర్‌, క్షమించాలి. కాసేపట్లో హడావుడి మొదలవుతుంది. మిమ్మల్ని నేను సరిగ్గా రిసీవ్‌ చేసుకోలేనేమో అని పిలిచాను. చిన్నారీ, ఒక్కసారి ఇలా రా తల్లీ. వీరు మా బాస్‌ వెంకట్రావుగారు. వారు... వారి శ్రీమతీ, పిల్లలు’’ అంటూ పెళ్ళికూతురిని పిలిచారు.

అప్సరసలా ఉంది అమ్మాయి. ఆధునిక అలంకారాలేమీ లేవు. ఎక్కడో చూసినట్లు అనిపించింది. తక్షణం స్ఫురించింది. ఈ అమ్మాయి కోణార్క్‌ ఫెస్టివల్‌లో నర్తించింది. అన్ని పత్రికలూ ఆ ఫొటో ప్రచురించాయి.

ఇంతలో కొత్త పెళ్ళికూతురు ధరిత్రి మా దంపతులకు పాద నమస్కారం చేయడం, సదా భార్య మా ఇద్దరికీ బట్టలు పెట్టడం జరిగిపోయింది. కలలోలాగా ఆశీర్వదించి గది గుమ్మం దాటాను. చేదు మింగినట్లు ఉంది.

‘‘అన్నయ్యగారూ, ముహూర్తం వేళకి ఉంటున్నారు కదూ’’ అడిగింది సదాశివ భార్య.
‘‘ఉంటున్నాం. రాత్రిపూట డ్రైవింగ్‌ నాకు కష్టమని డ్రైవర్‌ని ఉండమన్నాను.’’

‘‘చాలా సంతోషం సర్‌. ముందు భోంచేసి రండి. ముహూర్తానికి ఇంకా సమయముంది. మీ డ్రైవర్ని కూడా భోంచేయమని చెప్పండి’’ అంటూనే, ‘‘ఇదిగో ప్రకాశం, మా సార్‌ వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళు. సార్‌, వీడు మా అక్క కొడుకు. వెళ్ళి రండి.’’

* * *

భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. వెరైటీలు లేవు అంటూ పెదవి విరిచిన పిల్లలిద్దరూ బల్లల మీద అరటిఆకుల్లో వడ్డించిన పదార్థాల్ని కొంచెం కూడా మిగల్చకుండా లాగించేశారు. గుత్తొంకాయ కూరా కందిపచ్చడీ ముద్దపప్పూ మజ్జిగ పులుసూ పూర్ణం బూరెలూ ఆవబెట్టిన చింతపండు పులిహోరా పచ్చకర్పూరం వేసిన లడ్డూ సొంఠిచారూ, ఆఖరున గడ్డ పెరుగూ చిక్కటి మజ్జిగా... పెద్ద గొప్ప మెనూ కాకపోయినా చాలాకాలం తర్వాత పెళ్ళి భోజనం చేసిన ఫీలింగ్‌ కలిగింది మాకు. మధ్యమధ్య సదా చుట్టాల పిల్లలు కొసరి కొసరి వడ్డనలు. భాస్కర్‌వాళ్ళు కూడా మమ్మల్ని పలకరిస్తూ, మాకు ఏం కావాలో కనుక్కుంటూనే ఉన్నారు. తాంబూలాలు వేసుకుని డ్రైవర్ని కూడా వచ్చి తినమని పిలిచి, మళ్ళీ వేదిక దగ్గరికి వెళ్ళాం.

హడావుడి మొదలైంది. సదా అన్నలూ అక్కలూ వాళ్ళవాళ్ళ చుట్టాలూ చాలామంది గిరగిరా తిరుగుతున్నారు - ఏవో పనుల మీద. అర్ధరాత్రి పెళ్ళికి మామూలుగా అయితే చాలా తక్కువమందే ఉంటారు. కానీ, సదాకి బలగం ఎక్కువనుకుంటా.

వేదికకి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నాం. మాపక్క కుర్చీల్లో పండు ముసలి దంపతులు కూర్చొని ఉన్నారు. అడక్కుండానే వాళ్ళు సదా తల్లిదండ్రులని పోలికల్నిబట్టి అర్థమైంది మాకు. పరిచయం చేసుకుని మాటలు కలిపాను. పెద్దవాళ్ళు కదా... కదిలిస్తే చాలు కబుర్లు కట్టలు తెగి ప్రవహిస్తూ ఉన్నాయి.

‘‘మిగతా పిల్లలందరూ చదువుల్లో ఉద్యోగాల్లో పైకి వచ్చారు. సదాశివుడి పరిస్థితి ఏమవుతుందో అని ఎంతో భయపడ్డాం. చిన్నప్పటినుంచీ వాడికి చదువు ఎక్కేదికాదు. ఊళ్ళో వృత్తి పనివాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ పనులు నేర్చుకొచ్చేవాడు. కుమ్మరం, మగ్గం, వ్యవసాయం, వలలు అల్లడం, చివరికి చేపలు పట్టడం కూడా... ఇలా చూసింది చూసినట్లు చేస్తూ సమయం వృథా చేస్తున్నాడని వాడిని చింతబరికతో చావగొట్టేవాడిని. తర్వాత్తర్వాత తెల్సింది... వాడి బుర్ర ఓ కర్మాగారం... శ్రమించి సంపాదించడం వాడికి కూసు విద్య. ఆ దేవుడి దయ... మా కోడలు పెళ్ళయ్యాక, తల్లయ్యాక పెద్ద చదువులు చదివి పంతులమ్మయింది. పిల్లలు పైకి వచ్చారు. విచిత్రంగా వాళ్ళూ చిన్నతనం నుంచీ సంపాదిస్తున్నారు. తల్లితో కలిసి మగపిల్లలు ట్యూషన్లు చెబుతారు. ధరిత్రి సొంతంగా ఒడిస్సీ నృత్యశాల నడుపుతోంది’’ పుత్రోత్సాహం పెల్లుబుకుతోంది ఆ తండ్రిలో.

‘‘నా చిన్నకొడుకు మీద నాకెప్పుడూ అపనమ్మకం లేదు. మమ్మల్ని ప్రాణంగా చూసుకుంటున్నాడు నా నాయన. దాని కడుపు చల్లగా, గౌరమ్మ నాకు కోడలు కాదు బాబూ... నా కూతురు’’ చెంగుతో కళ్ళు తడుచుకుంది ఆ పండు ముత్తైదువ.

‘‘మరి ఇంకా ఆ చిన్నాచితకా పనులు చేస్తాడే సదాశివ. డబ్బుకు కొరత లేనప్పుడెందుకు అంతలా కష్టపడటం. విశ్రాంతిగా ఉండవచ్చు కదా...’’
‘‘పిచ్చి సన్నాసి. పనిలోనే నాకు విశ్రాంతి అంటాడు. చెప్పినా వినడు’’ పెద్దాయన అంటూ ఉండగానే మంగళవాద్యాలు గట్టిగా మ్రోగాయి.

నిజం నింగిని తాకుతూంటే ఇన్నాళ్ళూ నా ఊహ నేలబారుగా సాగుతోంది. సదాశివలోని ఎదుగుదలను అంచనా వేయలేకపోయాను. అతని స్థాయిని మాత్రమే చూశాను. కించపరిచాను. పాతికేళ్ళకిందటి గతమే వర్తమానమూనూ అనుకున్నాను. నిజానికి నేను నా కుటుంబానికి నా పరపతిని చూపించాలనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది... ప్చ్‌!

చెమర్చిన కళ్ళతో పెళ్ళివారి గదివైపు చూపు తిప్పాను. పెళ్ళికూతురిని బుట్టలో కూర్చోబెట్టి మేనమామ వరసవాళ్ళని పిలుస్తున్నారు పంతులుగారు. చటుక్కున లేచి వెళ్ళి నా భుజం అందించాను. నేనిప్పుడు బరువు మొయ్యడం లేదు, అహంకారపు బరువును దించుకుంటున్నాను... నిజం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.