close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నలుపూ తెలుపూ కలగలుపు...!

నలుపూ తెలుపూ కలగలుపు...!

కన్నెకాటుక కళ్లు నలుపు... ఆ కళ్లలోని కనుపాపల కాంతి తెలుపు.కమ్మని కలలతో నిద్రపుచ్చే నిశిరాత్రి నలుపు... ఆ రాతిరిలో తళుకులీనే తారల కాంతి తెలుపు. ఆ నలుపులో అందం చూడాలన్నా ఈ తెలుపులోని సౌందర్యం తెలియాలన్నా రెండూ ఒకదానికొకటి నేపథ్యం కావాల్సిందే. ఒకదాన్ని ఒకటి నిరంతరం వెన్నంటి ఉండే ఆ చీకటివెలుగుల సమ్మేళనం అత్యంత సమ్మోహనం. ఆ నలుపూతెలుపుల కలయిక ఎన్నటికీ చెరిగిపోని ఫ్యాషన్‌ మాత్రమే కాదు, ఆ రంగుల కలబోతకు ఈ ఎండావానల సంగమ కాలం ఎంతో అనుకూలం కూడా.

కొందరికి నలుపంటే మహా ఇష్టం... జీవితాంతం అదే వేసుకుంటామనేంత. మరికొందరికి తెలుపుమీద తగని ప్రేమ... అది తప్ప వేరేది వేసుకోమన్నంత. అయితే చాలామందికి ఆ రెండింటిమీదా తగని వ్యామోహం. అలా పుట్టుకొచ్చిందే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌... ఎవర్‌ గ్రీన్‌ ఫ్యాషన్‌.

రంగుల సమ్మేళనం గురించి చెప్పమంటే ఆకుపచ్చాఎరుపూ, పసుపూఎరుపూ, గులాబీఆకుపచ్చా, పసుపూనారింజా... ఇలా ఎన్నో చెప్పొచ్చు. కానీ నలుపూతెలుపూ అనుబంధం మాత్రం విడదీయలేనిది. విడివిడిగా చూసినా ఈ రెండూ మిగిలిన ఏ రంగుమీదకయినా నప్పడం వాటికున్న ప్రత్యేకత. కానీ ఎన్నింటితో జతకట్టినా ఆ రెండింటి మేళవింపు తరవాతే మిగిలినవేవయినా. అందుకే బ్లాక్‌ అండ్‌ వైట్‌ని క్లాసిక్‌ కలర్‌ కాంబినేషన్‌ అంటారు ఫ్యాషన్‌ నిపుణులు. దుస్తులూ యాక్సెసరీలూ నగలూ వాహనాలూ చివరకు ఇంటీరియర్‌లోనయినా సరే, ఆ కలబోతని చూసినవాళ్లెవరయినా కళ్లప్పగించాల్సిందే. అందుకే నిత్యం నలుపూ తెలుపూ దుస్తుల్ని ధరించే ఫ్యాషన్‌ పిపాసులూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు.

రంగుల్లేని జీవితం!
నిజానికి నలుపూ తెలుపూ అసలు రంగులే కావు, ఏ రంగూ లేనిది- అంటే కాంతికిరణాల్లో లేనిది నలుపు అయితే, అన్ని రంగుల కాంతినీ ప్రతిఫలించేది తెలుపు అంటారు కాంతిశాస్త్ర నిపుణులు. కానీ రంగులన్నింటిలోకీ ఆ రెండింటినీ అత్యంత అందమైన రంగులుగా చెబుతారు కలర్‌థెరపిస్టులు.

నలుపు అందమైనదే కాదు, శక్తిమంతమైనది కూడా. దీన్ని ఇష్టపడేవాళ్లు చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. ఏ పనయినా ఏకాగ్రతతో సమగ్రంగా చేస్తారు. ఎదుటివారిని కచ్చితంగా అంచనా వేయగలరు. భావావేశాల్ని నియంత్రించుకోగల శక్తి ఎక్కువే. కానీ అందరితో కలవడానికి ఇష్టపడరు. జీవితం పట్ల తిరుగుబాటు ధోరణీ ఎక్కువే. అందుకే ఎంత అందంగా ఉన్నా పైనుంచి కింది వరకూ నలుపే ధరిస్తే చూడ్డానికి మొహం మొత్తినట్లుగా ఉంటుంది. మానసికంగా కూడా ఒంటరిగా మారిపోయే అవకాశం ఎక్కువ. పైగా నల్లని రంగుని విచారానికీ అంతుపట్టని రహస్యానికీ చెడుకీ సంకేతంగానూ చెబుతారు.

దీనికి పూర్తి భిన్నమైనదే తెలుపు. చూడగానే హాయిగా అనిపిస్తుంది. ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఈ రంగుని ఎక్కువగా ధరించేవారు ప్రశాంతంగా ఆలోచిస్తారు. స్థిరచిత్తులై, ఆశావాదులై ఉంటారు. కొత్తదనానికీ తెలుపు సంకేతమే.
ఎప్పటికప్పుడు పాతను వదిలేస్తూ కొత్తగా ఆలోచించేవాళ్లంతా ధవళవర్ణం పట్లే మక్కువ చూపిస్తారట. మంచికీ తెలుపే ప్రతినిధి. మొత్తంగా తెల్లదనం స్వచ్ఛతకీ శాంతికీ శుభ్రతకీ ప్రామాణికం. వైద్యులూ నర్సులూ నిత్యం దీన్నే ధరించడానికి అదే కారణం. ఇది కాంతిని ప్రతిఫలింపజేస్తూ వ్యాధుల్నీ దూరం చేస్తుంది. అందువల్లే ఆసుపత్రులకీ భవనాలకూ ఎక్కువగా ఆ రంగునే వేస్తుంటారు. పాశ్చాత్యదేశాల్లో తెలుపు రంగుని శుభకరంగా భావిస్తారు. కాబట్టే అక్కడి పెళ్లి దుస్తుల్లో శ్వేతవస్త్రాలదే హవా.

అయితే నలుపులో ఎన్ని లోపాలున్నా బ్లాక్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అంటోంది నవతరం. సంపూర్ణమైన ధవళ వర్ణాన్ని మించిన అందమున్నదా అంటోంది వృద్ధతరం. కాదు కాదు, ఆ రెండింటి మేళవింపు అద్భుతం, వర్ణనాతీతం అంటోంది ఫ్యాషన్‌ తరం. అదీగాక, రేయింబగళ్లూ కలిపితే ఒక రోజు అయినట్లే మంచీ చెడూ కలిస్తేనే జీవితం. ఈ రెండింటినీ విడదీయలేం అన్నదానికి సంకేతంగా రెండింటినీ కలిపి ధరించడం అనేది ప్రాచీన కాలంలోనే ప్రారంభమైంది. నలుపు స్థలాన్ని ఇరుకుగా చేస్తుంది. తెలుపు విశాలంగా చేస్తుంది. నలుపు హోదాకీ హుందాతనానికీ ప్రతీక అయితే, తెలుపు అమాయకత్వాన్నీ సింప్లిసిటీనీ ప్రతిబింబిస్తుంది. అంటే రెండూ పరస్పరం వ్యతిరేకం. అందుకే ఎప్పుడూ ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటూ అంటిపెట్టుకుని ఉంటాయి. ‘కాంట్రాస్ట్‌ క్రియేట్స్‌ కంప్లీషన్‌’ అన్నదానికి ఈ రెండు రంగులూ చక్కగా సరిపోతాయి. అంటే- ఈ రెండు రంగులూ దేనికది అందమైనవే, ఆకర్షణీయమైనవే, శక్తిమంతమైనవే. కానీ వాటిని విడివిడిగా చూసినప్పటికన్నా రెండింటినీ కలగలిపినప్పుడు దేనికేది అందాన్నిచ్చిందో చెప్పడం చాలాకష్టం.

ఈ రెండు రంగులనూ కలిపి చూడటం కంటికీ హాయిగానే ఉంటుంది. తెల్లని పేజీల్లో నల్లని అక్షరాలను ముద్రించేదీ అందుకేమరి. అవి చదివించినంతగా మరే రంగూ చదివించదు. కాబట్టే నాటి నుంచీ నేటివరకూ పుస్తకాలూ వార్తాపత్రికలూ అన్నింటా ఆ రెండింటి జోడీ అవిచ్ఛన్నంగా కొనసాగుతోంది.

ఎలా ధరించాలి?
రొమాంటిక్‌గా కనిపించాలంటే గులాబీ, స్టైలిష్‌గా ఉండాలంటే నీలం, భావోద్వేగాలు కనిపించనీయకుండా గంభీరంగా ఉండాలనుకున్నప్పుడు నలుపూతెలుపూ అంటుంటారు కలర్‌ థెరపిస్టులు. వయసుతో సంబంధం లేకుండా ఆడామగా తేడా లేకుండా ఈ కాంబినేషన్‌ అందరికీ చక్కగా నప్పేస్తుంది. వైట్‌ షర్ట్‌తో బ్లాక్‌ ప్యాంట్‌ కాంబినేషన్‌ ఎలాంటి సందర్భంలోనయినా క్లాసీగా కనిపించేలా చేస్తుంది. అలాగే నల్లని స్కర్టు లేదా లెగ్గింగ్‌ మీద తెల్లని టాప్‌ వేసుకున్నా, తెల్లచీరమీదకి నల్లజాకెట్టు వేసుకున్నా అదుర్సే. టూటోన్‌ ట్రెండ్‌ ఎటూ నడుస్తూనే ఉంది. పైగా తెలుపుమీద నల్లని రేఖాగణిత ప్రింట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

నిజానికి వానాకాలానికి సూటయ్యేరంగు నలుపే అనేది ఫ్యాషన్‌ పండితుల ఉవాచ. వాతావరణంలోని కాస్తో కూస్తో వేడిని నలుపు రంగు పీల్చుకుని ఒంటిని వెచ్చగా ఉంచుతుందన్న కారణంతో అలా చెబుతుంటారు. అలాగని మొత్తంగా నలుపే ధరిస్తే గ్లూమీగా ఉంటుంది. అందుకే దానికి ప్రకాశవంతమైన తెలుపుని జతచేస్తే ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈస్టా వెస్టా అన్నదానితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఈజ్‌ ద బెస్ట్‌ అంటున్నారు నయా ఫ్యాషనిస్టులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.