close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్నను... నేనున్నా!

నాన్నను... నేనున్నా!

ఐపీఎల్‌ ఫైనల్‌... చెన్నై జట్టు మ్యాచ్‌ గెలిచింది. స్టేడియంలో అభిమానుల సందడి.మైదానంలో జట్టు సభ్యుల కేరింతలు. కెప్టెన్‌ మాత్రం మిస్సింగ్‌.దూరంగా మైదానంలోకి పరిగెడుతూ వస్తోంది తెల్లని గౌనులో ఓ బుజ్జి పాపాయి. ఎదురెళ్లి ఆమెను అమాంతం ఎత్తుకుని ముద్దాడి జట్టుతో కలిశాడు కెప్టెన్‌ ధోనీ. ఆ ఫొటోతో సోషల్‌మీడియా పండగే చేసుకుంది. ధోనీ రియల్‌ట్రోఫీ ఇదేనంటూ అభిమానుల కామెంట్లూ లైకులతో ట్విటర్‌ వెల్లువెత్తింది. ధోనీనే కాదు, ఇప్పటి తండ్రులంతా తమ పిల్లల్ని అపురూపమైన కానుకల్లాగే చూసుకుంటున్నారు. దేవుడిచ్చిన బహుమతుల్లానే భావిస్తున్నారు. సగర్వంగా ఎత్తుకుని ప్రపంచానికి చూపుతున్నారు.

నాన్న మారిపోయాడు... నిజమే! బయటి బాధ్యతల్ని అమ్మ పంచుకున్నట్లే ఇంటి బాధ్యతల్ని ఇప్పుడు నాన్న పంచుకుంటున్నాడు. బిడ్డతో పాటు నాన్నా కొత్తగా పుడుతున్నాడిప్పుడు! పిల్లలతోపాటు తానూ నేర్చుకుంటూ ఎదుగుతున్నాడు. పిల్లల మార్కుల కన్నా ముందు తనలో వచ్చిన మార్పుల్ని అబ్బురంగా చూసుకుంటున్నాడు. నాన్న కావడానికి ముందూ... తర్వాతా... అంటూ తన జీవితంలోని ఈ రెండుదశల ప్రయాణాన్నీ అది తనపై చూపిన ప్రభావాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాడు. నాన్న పాత్ర విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. నేనూ నా వాళ్లూ అన్న స్వార్థాన్ని అధిగమించి సమాజంవైపూ దృష్టిని సారిస్తున్నాడు. తన పాత్రను మరింతగా విస్తరించుకుంటున్నాడు. తాను మారిన నాన్న ఇప్పుడు సమాజాన్నీ మారుస్తున్నాడు!

పిల్లల్ని చూసే...

సినిమా హీరో- అదీ మహేష్‌ బాబులాంటి పెద్ద హీరో ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఆ హీరో కూడా తొలి ప్రాధాన్యమిచ్చేది పిల్లలకే. మితభాషి అయిన మహేష్‌ పిల్లల గురించి చెప్పమంటే మాత్రం ఎంతసేపైనా మాట్లాడతాడు. ‘ఒక బిడ్డ భూమ్మీదకు రావడం ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్లను చూసి తల్లిదండ్రులు ఎంత ఉద్వేగానికి లోనవుతారో గౌతమ్‌ పుట్టాకే తెలిసింది. డెలివరీ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. ఆ అద్భుతమైన క్షణాల్ని ప్రత్యక్షంగా చూశా. షూటింగ్‌ లేనప్పుడంతా బాబు పక్కనే ఉండేవాడిని. తండ్రి బాధ్యత వ్యక్తిగా నన్ను మార్చేసింది. కొత్త జీవితాన్నిచ్చింది. బాబు పలికిన తొలి మాట, వేసిన తొలి అడుగు... అన్నీ చూశాను. ఎక్కడో షూటింగ్‌లో లేకుండా అప్పుడు తన పక్కన ఉండగలగడం నా అదృష్టం. నా జీవితంలోనే అపురూపమైన క్షణాలవి. పాపతో కూడా అంతే. సాధ్యమైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపాలనుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంజాయ్‌ చేయగలగడం పిల్లల్ని చూసే నేర్చుకున్నా. ఒకసారి ఇంట్లోకి వచ్చానంటే పిల్లలు తప్ప నాకింకేం గుర్తుండదు. పిల్లల్ని కోప్పడడం, చదివించడం, హోంవర్కు చేయించడం... నావల్ల కాదు. అదంతా వాళ్లమ్మ డ్యూటీనే. నాకు వదిలేస్తే పిల్లల్ని బడికి కూడా పంపను...’ అంటాడు. గౌతమ్‌ ఏడాది పిల్లవాడుగా ఉన్నపుడు మహేష్‌కి కెరీర్లో కొంత విరామం వచ్చింది. దాన్ని తండ్రిగా చక్కని అనుభూతుల్ని సొంతం చేసుకోడానికి ఉపయోగించుకున్నాడు మహేష్‌. ‘హీల్‌ ఎ చైల్డ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకి అంబాసిడర్‌గా పనిచేశాడు మహేష్‌. గౌతమ్‌ నెలలు నిండకముందే పుట్టాడు. దాంతో కొన్ని రోజులు బాబుని ఆస్పత్రిలోఉంచాల్సివచ్చింది. ఇంటికి వచ్చాక కూడా చిన్నగా ఉన్న బాబుని చూసి బాధనిపించేదంటాడు మహేష్‌. తన దగ్గర డబ్బుంది కాబట్టి ఆస్పత్రిలో ఉంచి చూసుకోగలిగామనీ డబ్బులేనివారి పరిస్థితి ఏమిటన్న ఆలోచనే తనను ఆ ఎన్జీవోతో కలిసి పనిచేసేలా ప్రోత్సహించిందంటాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ‘మేక్‌ ఎ విష్‌’ ఫౌండేషన్‌ సాయంతో మహేష్‌ని చూడడానికి వస్తుంటారు. తనని చూడగానే వాళ్ల కళ్లలో కన్పించే మెరుపు చూసి మహేష్‌ భావోద్వేగానికి లోనవుతుంటాడట.

మరిచిపోలేని ముద్దు

కప్పుడు ఇమ్రాన్‌హష్మి పేరు చెప్పగానే అతని సినిమాల్లోని ముద్దుసీన్లను గుర్తుచేసుకునేవారు అభిమానులు. కానీ అతడు ఎదుర్కొన్న అనుభవాలూ రాసిన పుస్తకమూ చూశాక కంటతడి పెట్టని వారు లేరు. తన వ్యక్తిగత జీవితం గురించి ఏనాడూ బయటకు చెప్పని ఇమ్రాన్‌ మూడున్నర పదుల వయసులోనే తన అనుభవాలను పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం పేరు ‘కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’. ఇమ్రాన్‌ ఏకైక కుమారుడు నాలుగేళ్ల అయాన్‌కి మూత్రపిండాల పైన ట్యూమర్‌ వచ్చింది. పరీక్ష చేయిస్తే అది క్యాన్సర్‌ అని తేలింది. అది వినగానే కాళ్లూ చేతులూ ఆడలేదు ఆ తండ్రికి. ‘ఏం తప్పు చేశాను? ఇంత చిన్న వయసులో బాబుకు ఎందుకీ పరీక్ష?’ అని తల్లడిల్లిపోయింది తండ్రి మనసు. చికిత్స కోసం బాబుని కెనడా తీసుకెళ్లారు. భార్యా ఇతర కుటుంబ సభ్యులూ బాబును కంటికి రెప్పలా కాచుకుంటున్నా ఇమ్రాన్‌ బిడ్డను విడిచి ఉండలేకపోయేవాడు. రాత్రింబగళ్లు కొడుకు పక్కనే ఉండి సర్జరీలూ కీమోథెరపీల బాధను మరిపించడానికి ప్రయత్నించేవాడు. చిన్నారి అయాన్‌కి బ్యాట్‌మ్యాన్‌ అంటే ఇష్టం. అందుకని తాను షూటింగ్‌ కోసం ఇండియా వచ్చినప్పుడల్లా గొంతుమార్చి బ్యాట్‌మ్యాన్‌లాగా కొడుకుతో ఫోనులో మాట్లాడేవాడు ఇమ్రాన్‌. ‘త్వరగా కోలుకో మనం కలిసి ఆడుకుందామ’ని ధైర్యం చెప్పేవాడు. నాలుగేళ్ల అయాన్‌ అది నిజమేనని నమ్మేవాడు. సూపర్‌హీరో తనతో మాట్లాడడం ఆ అబ్బాయికి ఎంతో నచ్చింది. పిల్లవాడు అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఇమ్రాన్‌ అలా తనకు చేతనైనవన్నీ చేశాడు. ఓ స్నేహితుడి సూచన మేరకు తన అనుభవాలనూ క్యాన్సర్‌ గురించి తాను నేర్చుకున్న విషయాలనూ పుస్తకంగా రాశాడు. అలా రాయడం వల్ల తనకీ మానసికంగా కాస్త భారం తగ్గినట్లయిందంటాడు ఇమ్రాన్‌. అయాన్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకుని బడికి వెళ్తున్నాడు. ఇమ్రాన్‌ నటుడిగా తన కెరీర్‌ని కొనసాగిస్తూనే క్యాన్సర్‌కి సంబంధించి అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. పిల్లలకు వచ్చే క్యాన్సర్‌ చాలావరకూ నయమవుతుందనీ, తల్లిదండ్రులు ధైర్యం కోల్పోకుండా ఉండాలనీ చెబుతుంటాడు ఇమ్రాన్‌.

ఈ నాన్న స్వార్థపరుడు!

పిల్లలకు ఉత్తరం రాసే అవసరం ఎప్పుడొస్తుంది ఏ తండ్రికైనా? ఒకప్పుడు చదువుకోడానికి వేరే ఊరు వెళ్లినప్పుడు పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉత్తరాలు రాసేవారు. ఈ సెల్‌ఫోన్‌ రోజుల్లో ఆ అవసరమే లేదు. కానీ అసలు పెళ్లే చేసుకోని కరణ్‌జోహార్‌ 45 ఏళ్ల వయసులో సరొగసీ ద్వారా కవలపిల్లలకు తండ్రయ్యాడు. పిల్లలు ఆర్నెల్ల వయసులో ఉండగా వారిని ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశాడు. టెడ్‌ టాక్స్‌ వేదిక మీద దాన్ని చదివి ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాడు కరణ్‌. ‘మీరు వచ్చి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. మొదటిసారి మీ కోసం నా పద్ధతులన్నీ మార్చుకున్నా. ముఖ్యంగా చాలా స్వార్థపరుణ్ణయ్యా. వేళకు తింటూ ఆరోగ్యంగా ఉండడంపైన దృష్టిపెట్టా. జిమ్‌కీ వెళ్తున్నా. మీరు పెద్దవారయ్యేవరకూ అమ్మనీ నాన్ననీ నేనే అయ్యి చూసుకోవాలి కదా మరి. మీ కోసం నేను కంటున్న మొదటి కల... సాధ్యమైనంత ఎక్కువకాలం మీ వెంట ఉండాలనీ మీ ఆనందంలో భాగం పంచుకోవాలనీ. మరో విషయం బంగారాలూ... రేపు మీరు బడికి వెళ్తే అక్కడ పిల్లలందరికీ అమ్మలుంటారు. పిల్లల్ని బడికి తీసుకొస్తారు. వారంతా కలిసి ఓ వాట్సప్‌ గ్రూపు పెట్టుకుని పిల్లల హోంవర్కుల గురించి చర్చించుకుంటారు. బహుశా ఆ గ్రూపులో ఉండే ఏకైక నాన్నని నేనే కావచ్చు. అమ్మలేదని మీరు బాధపడొద్దు. ఆ లోటు లేకుండా చూసుకునే నేనున్నా. మా చిన్నప్పుడు జీవితం  చాలా సాధారణంగా ఉండేది. ఇప్పుడు ఎదిగే ప్రతి దశలోనూ సవాళ్లే. ఒంటరి తండ్రిగా నా సవాళ్లను నేను ఎదుర్కొంటూనే మీకు అండగా ఉంటాను. రంగూ రూపం మతం... వీటన్నిటిని బట్టీ సమాజం మనమీద రకరకాల ముద్రలు వేస్తుంది. మన వెనకాల మాట్లాడుకుంటుంది. అవేవీ మనని ఇబ్బందిపెట్టకూడదు. నలుగురికీ భిన్నంగా ఉండడం తప్పు కాదు. మా నాన్న నన్ను ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు. నేనూ మిమ్మల్ని చేయను. స్వేచ్ఛగా మీ జీవితాలను మలచుకోండి. జీవితం మనకు లభించిన గొప్ప బహుమతి. ఎవరేమనుకుంటారోనన్న దిగులు లేకుండా ఆ బహుమతిని ఆస్వాదించాలి. గొప్ప కలలు కనండి. కానీ నేలమీదే నిలబడండి...’ అంటూ కరణ్‌ రాసిన లేఖ అతనిలోని నాన్న మనసుకు అద్దం పట్టింది, సోషల్‌ మీడియాలో పెద్ద సంచలనమైంది.

అమ్మానాన్నలుగా కలిసే...

భార్యాభర్తలుగా ఒకరితో ఒకరికి పడకపోతే విడిపోవచ్చు. కానీ పిల్లలకు తల్లిదండ్రులుగా విడిపోనక్కరలేదని నిరూపిస్తున్నారు హృతిక్‌రోషన్‌ దంపతులు. పిల్లల కోసం కలిసి ఉండి రోజూ పోట్లాడుకునేకన్నా విడివిడిగా ఉండి పిల్లల్ని బాగా చూసుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చింది ఈ జంట. అందుకే తమ విడాకుల వ్యవహారాన్ని ఎంతో హుందాగా తేల్చుకున్నారు. ఆ తర్వాత పిల్లల విషయంలో ఎలాంటి లోటుపాట్లూ రాకుండా తమ కార్యక్రమాలను ప్లాన్‌ చేసుకుంటున్నారు. పిల్లలు తల్లితో ఉంటున్నా అవార్డు ఫంక్షన్లకీ, పార్టీలకీ వారిని తనతో తీసుకెళ్తాడు హృతిక్‌. వాళ్లను తరచూ స్కూల్లో దింపడం, స్పోర్ట్స్‌డే లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో తండ్రిగా హాజరుకావడం వంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడు. ఆదివారాలు తన దగ్గర ఉంచుకుని వారితో కలిసి వంట చేస్తాడు. తనతోపాటు వ్యాయామం చేయిస్తాడు. తండ్రీ కొడుకులు ముగ్గురూ ఎక్కడున్నా అక్కడ నవ్వులు పూస్తుంటాయి. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోవడం హృతిక్‌కి ఇష్టం. ఇక సెలవుల్లో తప్పకుండా ఇద్దరూ కలిసి పిల్లల్ని ఇతర దేశాలకు తీసుకెళ్లి సరదాగా గడిపివస్తారు. ఆ సమయంలో - తాము విడిపోయామన్న విషయాన్ని గుర్తుతెచ్చుకుని ఎడమొహం పెడమొహంగా ఉండకుండా తల్లిదండ్రులుగా కలిసిమెలిసి ఉంటారు. హృతిక్‌కి చిన్నప్పుడు విపరీతమైన నత్తి ఉండేది. తోటి పిల్లలు చాలా ఏడిపించేవారు. ఎంతో పట్టుదలతో సాధన చేసి దాన్ని వదిలించుకున్న హృతిక్‌ పిల్లలు ఏ విషయంలోనూ ఆత్మన్యూనతకు గురికాకుండా చూసుకుంటాడు. చాకొలెట్లు ఎక్కువగా తినడంతో తాను ఐదేళ్ల పాటు పంటినొప్పితో నరకయాతన అనుభవించానని చెప్పే హృతిక్‌ పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. వేళకు సరైన ఆహారం తీసుకునేలా చూస్తాడు. పెద్దలను చూసే పిల్లలు విలువలు నేర్చుకుంటారని నమ్ముతాడు హృతిక్‌. వాళ్లు పెద్దయ్యాక సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని తాను కోరుకుంటున్నాననీ అందుకే అలాంటి విలువలే వారు నేర్చుకునేలా జాగ్రత్త పడుతున్నాననీ చెబుతాడు.

అమెరికాలో చూసి...

కొన్నాళ్లక్రితం ‘మేము’ అని ఒక సినిమా వచ్చింది. అందులో పిల్లల ఇష్టాయిష్టాలకు ఎందుకు ప్రాధాన్యమివ్వాలో తల్లిదండ్రులకు వివరించి చెప్పే సైకియాట్రిస్టు పాత్ర పోషించాడు సూర్య. నటుడిగానే కాదు, నిజజీవితంలోనూ సూర్య మంచి తండ్రి. తమ పిల్లలు దియా, దేవ్‌లకు స్నానాలు చేయించడం, కథలు చెప్పి పడుకోబెట్టడం సూర్యకు చాలా ఇష్టమైన పనులు. షూటింగ్‌లు లేకుండా ఇంట్లో ఉన్న సమయమంతా అతడు పిల్లలతోనే గడుపుతాడు. ‘ఇంట్లో ఉంటే పిల్లల బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా. అలా గడిపితేనే నాకు తృప్తి. వాళ్లను పడుకోబెట్టేటప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుంటాం. ఆ కబుర్లలోనే వాళ్ల ఊహాప్రపంచాన్ని చూస్తాను. దియాకి కథలు వినడం ఇష్టం. దేవ్‌కి బొమ్మలు గీయడం ఇష్టం. వాళ్లు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబులిస్తాను.

నిజానికి పిల్లలతో ఇంతగా ఇన్వాల్వ్‌ అవడం గురించి గతంలో నేనెప్పుడూ ఆలోచించలేదు. మా తరం వాళ్లందరిలాగే నాకూ నాన్నంటే కొంచెం భయంగానే ఉండేది. నేనూ జ్యోతికా అమెరికా వెళ్లినప్పుడు చూశాం. అక్కడ పిల్లల్ని స్కూల్లో దించేటప్పుడూ, పార్కుకి తీసుకెళ్లినప్పుడూ... అన్నిటికీ తండ్రులే వెంట ఉండేవారు. అలాగని వాళ్లు మొక్కుబడిగా అక్కడ ఉండి ఫోను చూసుకునేవారు కాదు. పిల్లల మాటలు వింటూ ఆడుతూ పాడుతూ గడిపేవారు. వాళ్లల్లో పెద్ద పెద్ద ఉద్యోగులూ, ప్రొఫెషనల్సూ ఉండేవారు. అది చూసి మొదట ఆశ్చర్యపోయాం. తర్వాత ఆలోచించాం. మేమూ అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇద్దరమూ నటులమన్నది బయటే. ఇంట్లో పిల్లల దగ్గర మామూలు తల్లిదండ్రుల్లానే ఉంటాం...’ అని చెబుతాడు సూర్య. సమాజంలో పలు కారణాల వల్ల చదువుకు దూరమవుతున్న పిల్లలకోసం ‘అగరం ఫౌండేషన్‌’ నెలకొల్పి సేవలందిస్తున్నాడు సూర్య.

పాప... అతని జీవితాన్నే మార్చేసింది!