close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటిలోన ఇంద్రధనుస్సు!

ఇంటిలోన ఇంద్రధనుస్సు!  

పిల్లలు సబ్బు నీటితో బుడగలు ఊదుతుంటే గాల్లోకి ఎగిరిన ఆ బుడగలు సూర్యకిరణాలతో చెట్టాపట్టాలేసుకుని సప్తవర్ణాల్లో మెరుస్తుంటే ప్రకృతిలోని అందమంతా ఆ క్షణం కళ్లముందు ఊయలలూగుతున్నట్లు ఉండదూ... అలాంటి సొగసు స్టీలు పాత్రల్లోనూ ఇంటి అలంకరణలోనూ ఆభరణాల్లోనూ కనిపిస్తే మనసు పులకరించిపోదూ... అందుకే, ఇంద్రధనుస్సు రంగుల్ని ఇంట్లోకి తెస్తోన్న రెయిన్‌బో స్టీల్‌ని చూడగానే ప్రేమలో పడిపోతున్నారు జనం.

వంటింట్లో ఇంద్రధనుస్సు విరబూసినట్లు ఉంటుంది... డైనింగ్‌ టేబుల్‌ రకరకాల కళాఖండాలను పేర్చిన షోకేసులా దర్శనమిస్తుంది...
 ముక్కు హరివిల్లుని ఆభరణంగా చుట్టుకుని మురిసిపోతుంది... అదే ఇంద్రధనుస్సు స్టీలు ప్రత్యేకత. వీటిని చూడగానే ‘రంగులు వేసిన పాత్రలు కూడా స్టీలు మెరిసినట్లూ ఇంతలా ఎలా మెరిసిపోతున్నాయీ’ అనిపిస్తోంది కదూ... నిజానికి రెయిన్‌బో స్టీలు(ఇరిడిసెంట్‌ స్టీలు) పాత్రల పైన కనిపించే ఈ రంగులు వేసినవి కాదు. ఇవన్నీ స్టీలు పాత్రల్ని టైటానియం ద్రావకంలో ముంచి విద్యుదీకరణ ప్రక్రియకు గురిచేయడం వల్ల ఏర్పడిన రంగులే. ఈ కారణంతోనే ఈ రంగుల స్టీలుని టైటానియం స్టీల్‌ అని కూడా అంటారు. ఒక్కో కోణంలో చూసినపుడు ఒక్కో రంగులో కనిపించడంతో పాటు, కాంతి పడినపుడు మరింతగా ధగధగలాడటం వీటి ప్రత్యేకత. అందుకే, మార్కెట్లోకి వచ్చీరాగానే ఈ హరివిల్లు స్టీలు అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టింది. స్పూనులూ గరిటెలూ ప్లేటులూ కప్పులూ గ్లాసులూ టీ పాట్‌లూ బాటిళ్లలాంటి వంటింటి సామానుతోపాటు ముక్కు పుడకలూ గాజులూ వాచ్‌లూ బ్రేస్‌లెట్లూ పోగులూ ఉంగరాలూ లాకెట్లలాంటి అలంకరణ సామగ్రి వరకూ అన్నింటిపైనా రెయిన్‌బో స్టీలు అందాలు అంటుకుపోతున్నాయి.

నయా ట్రెండ్‌
ఒకప్పుడు ఇంట్లో సామానంటే ఎక్కువగా స్టీలువే ఉండేవి. సౌకర్యంలోనూ మిగిలినవాటితో పోల్చితే అదే రారాజు. కానీ ఇంటికొచ్చిన అతిథుల్ని ఫిదా చెయ్యడానికి చిటికెలో తినేసే వంటకాల్నే బోలెడంత కష్టపడి అలంకరించేస్తోంది ఈతరం. అలాంటిది ఆ వంటల్ని వడ్డించే ప్లేటులూ తినడానికిచ్చే స్పూనుల విషయంలో మాత్రం లైట్‌ తీసుకుని ఎలా ఊరుకుంటారు? అందుకే, హరివిల్లు స్టీలుతో డైనింగ్‌ టేబుల్‌ని కళకళలాడించేస్తున్నారు. వంటగదిని వర్ణరంజితం చేసేస్తున్నారు. స్టీలు పాత్రల్ని ఒకచోట పేర్చితే మామూలుగానే తళతళలాడిపోతుంటాయి. అలాంటిది ఇన్ని వర్ణాలు  కలగలిసి మెరిసిపోతుంటే ఇంటికొచ్చిన  వారెవరైనా కళ్లప్పగించి చూడకుండా ఉంటారా... ఇక, ఇంత అందమైన ప్లేట్లలో వడ్డించే వంటకాలకు ప్రత్యేకంగా అలంకరణ కూడా అవసరంలేదనడంలో అతిశయోక్తి ఏముంటుందీ... మెరిసిపోయే స్పూన్లతో తింటుంటే కడుపుకే కాదు, కళ్లకూ విందే. ఆభరణాల విషయానికొస్తే... ఈ తరహా ఇంద్రధనుస్సు మెరుపులతో ఉన్న ఆభరణాలూ యాక్సెసరీస్‌ ఇంతకు ముందు ఎపుడూ రాలేదు. ఫ్యాషన్‌కూ ట్రెండ్‌కూ ఉండాల్సిన ప్రధాన అర్హత కూడా అదే. ఏదైనా కొత్తగా వినూత్నంగా ఉంటే చాలు, యువత  ఓటు పడినట్లే మరి. దానికి తోడు బోలెడంత అందం కూడా రెయిన్‌బో స్టీలు సొంతం. ఇంకేముందీ, ఈ ఆభరణాలు యువత మనసుని ఇట్టే దోచేసుకున్నాయి. కొంతమంది ఒంటికి చాలా లోహాలు పడవు. వాటితో చేసిన నగలను వేసుకుంటే వెంటనే అలర్జీలు వచ్చేస్తుంటాయి. కానీ ఇంద్రధనుస్సు స్టీలుతో  ఆ సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే ఎలాంటి చర్మతత్వం  ఉన్నవారికైనా టైటానియం వల్ల హాని జరగదు. ఆ లోహపు ద్రావకంలో ముంచి విద్యుదీకరణ ప్రక్రియ జరిపి తయారుచేస్తారు కాబట్టి రెయిన్‌బో స్టీలు నగల్ని ఎంచక్కా వేసుకోవచ్చు. నగలేకాదు, హెడ్‌ఫోన్స్‌, ఫోన్‌కేసుల్లాంటి  యాక్సెసరీలూ పిల్లలు ఆడుకునే స్పిన్నర్లూ ఇతర ఆటవస్తువులెన్నో రెయిన్‌బో స్టీలు అందాలను అద్దుకుంటున్నాయి.

అందంతో పాటు
ప్లాస్టిక్‌, పింగాణీ వస్తువుల్లో బోలెడు రంగులూ రకరకాల డిజైన్ల  ప్రింట్లుంటాయి, అవి చూడ్డానికీ బాగుంటాయి. కానీ ప్లాస్టిక్‌ ఆరోగ్యానికీ  పర్యావరణానిక్కూడా మంచిదికాదు, పైగా కొంతకాలం వాడేసరికి గీతలు
పడిపోయి, పాతగా మారిపోయి ప్లాస్టిక్‌ వస్తువులు చూడ్డానికి అస్సలు బాగోవు. ఇక, పింగాణీ పాత్రలు చేయి జారితే పగలకుండా ఆపడం ఎవరి తరమూ కాదు. అపుడు మళ్లీ కొత్తవాటిని కొనాల్సిందే. అదే స్టీలు పాత్రలైతే ఒక్కసారి కొంటే ఎంత కాలమైనా అలానే ఉంటాయి. ఇక, ప్లాస్టిక్‌ వస్తువులమీదా ఇతర లోహాలమీదా అందం కోసం వేసిన పెయింట్లు వాడినకొద్దీ కరిగి తినే  ఆహారంలో కలుస్తుంటాయి. అది ఆరోగ్యానికీ మంచిది కాదు. కానీ టైటానియం రంగుల వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అదండీ సంగతి... అందం, ఆరోగ్యం, సౌకర్యాల కలయికే రెయిన్‌బో స్టీల్‌. నవతరం ఫ్యాషన్‌ దాహం తీర్చడానికి ఆకాశమే హరివిల్లుని అప్పిచ్చి సృష్టించినట్లుంది కదూ ఈ కొత్త ట్రెండ్‌!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.