close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఫీసు.. మారింది బాసూ!

ఆఫీసు.. మారింది బాసూ!

ఓ కంపెనీ సీఈవోకి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వొచ్చు. మరో కంపెనీ సీఎండీతో కలిసి కాఫీ తాగొచ్చు. పనిచేసి చేసి విసుగొస్తే లాంజ్‌లో సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. మరీ అలసటగా ఉంటే ఓ కునుకూ తీయొచ్చు. రిలాక్సవ్వాలంటే జిమ్‌కి వెళ్లొచ్చు. బాస్‌ కోప్పడతాడన్న భయం లేదు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారన్న దిగుల్లేదు. అవును... ఇది కొత్తతరం ఆఫీసు మరి! ఇక్కడ రూల్స్‌కన్నా గోల్స్‌ ముఖ్యం!

రిగ్గా పదేళ్ల క్రితం... పారిస్‌లో ఓ సాయంత్రం. బయట వర్షం పడుతోంది. చేతుల్లో లగేజీ ఉంది. ఓ కాన్ఫరెన్స్‌కి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరు మిత్రులు. కష్టసుఖాలు చెప్పుకుంటూ టాక్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అది తప్ప ఏదైనా దొరికేటట్లుంది ఆ పారిస్‌ వీధిలో. ‘ఫోన్‌లో ఓ బటన్‌ నొక్కగానే టాక్సీ వచ్చి వాకిట్లో నిలబడితే ఎంత బాగుణ్ణు...’ అన్నాడో మిత్రుడు. ‘మనం ఇంకా అంత ఎదగలేదు బ్రో... టాక్సీ దొరకాలని ఆశపడు, అత్యాశ వద్దు’ అన్నాడు రెండో మిత్రుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పటికి వారి ఆలోచన ఇంటికి వెళ్లడమెలా అన్నదే. కానీ వెళ్లాక అసలు పనిలో పడ్డాయి రెండు బుర్రలూ. ‘ఫోనులోకి ఇంటర్నెట్టే వచ్చింది. తలచుకుంటే ట్యాక్సీ కూడా తెప్పించొచ్చు...’ అనుకున్నారు. ఇద్దరూ కలిసి న్యూయార్క్‌లోని కో వర్కింగ్‌ స్పేస్‌ ‘ద యార్డ్‌’లో ఒక టేబుల్‌ అద్దెకు తీసుకుని మేథోమథనం మొదలెట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు ఉబర్‌ బయటకు వచ్చింది. అస్పష్టంగా ఉన్న ఒక ఆలోచన స్పష్టమైన రూపం దాల్చి ఉబర్‌ ఆప్‌గా రూపుదిద్దుకోడానికి స్ఫూర్తి కేవలం ఆ ఆఫీసు వాతావరణమేనంటారు ఉబర్‌ వ్యవస్థాపకులు ట్రావిస్‌ కలానిక్‌, గారెట్‌ క్యాంప్‌.

ఎనిమిదేళ్ల క్రితం కెవిన్‌, మైక్‌ క్రీగర్‌- ఇద్దరూ కలిసి చిన్నగా సోషల్‌ నెట్‌వర్క్‌ ఆప్‌ని అభివృద్ధి చేశారు. దాని పరిధి చాలా తక్కువ. వారు పనిచేస్తున్నది కోవర్కింగ్‌ స్పేస్‌లో. పనిచేసుకుంటూనే చుట్టూ ఉన్నవారి డెస్కుల్నీ కంప్యూటర్లనీ గమనించేవాడు క్రీగర్‌. చిన్నప్పటి ఫొటోలూ పిల్లల ఫొటోలూ చాలామంది డెస్కులమీద కన్పించేవి. బుర్రలో ఏదో ఆలోచన మెదిలింది. అంతే- రెండే రెండు నెలలు కష్టపడ్డాడు. ఫొటోషేరింగ్‌ ఆప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తయారైంది. అదెంత సక్సెస్‌ అయిందో మనకు తెలుసు. ఇలాంటి కథలెన్నో! ఈ తరం స్టార్టప్‌ విజయగాథల్లో ముఖ్యమైన అంశం ‘పంచుకోవడం’. వాళ్ల ఐడియాలే కాదు, ఆ ఐడియాలను అభివృద్ధి చేసుకునే స్థలమూ పంచుకునేదే కావడం కాకతాళీయం మాత్రం కాదు. ఎందుకంటే...ఆలోచనలు గాలిలో నుంచి ఊడిపడవు. టేబుల్‌ సొరుగులో ఉండవు. సీట్లో కూర్చుని తపస్సు చేస్తే రావు. మనుషుల్లోంచి వస్తాయి. మాటల్లోనుంచి వస్తాయి. పదిమంది తీరుతెన్నులను పరిశీలిస్తే వస్తాయి.ఆ అవకాశాన్ని ఇస్తుంది- ఈ కలిసి పనిచేసే కార్యాలయం!

ఆ సంస్కృతే వేరు!
ఇంట్లో కూర్చుని పనిచేసుకోడానికీ ఆఫీసుకు వెళ్లడానికీ తేడా ఉంది. అలాగే గవర్నమెంటాఫీసుకీ ప్రైవేటు ఆఫీసుకీ తేడా ఉంటుంది. పాతిక ముప్పై మంది పనిచేసే స్టార్టప్‌ కార్యాలయానికీ వేల మంది పనిచేసే మల్టీ నేషనల్‌ కార్పొరేట్‌ కార్యాలయానికీ తేడా ఉంటుంది. ఆ తేడా మనుషుల్లో కాదు, అర్హతల్లో కాదు. మరెక్కడా అంటే- సంస్కృతిలో. దాన్నే వర్క్‌ప్లేస్‌ కల్చర్‌ అంటారు. షేర్డ్‌ వర్క్‌ ప్లేస్‌ కల్చర్‌ మామూలు ఆఫీసు వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. స్వేచ్ఛ, వెసులుబాటు ఆ కల్చర్‌లో కీలకం.  మనం ఆఫీసుకు వెళ్తాం. నేరుగా మన సీటు దగ్గరకు వెళ్లి కూర్చుని పని చేసుకుంటాం. బాస్‌ పిలిస్తే మాట్లాడతాం. కారిడార్స్‌లో స్నేహితులూ సహోద్యోగులూ పలకరిస్తే హాయ్‌ చెప్తాం. పని చేసి చేసి విసిగిపోయి కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకుంటే వెళ్లి టీ తాగి వస్తాం. అంతా రొటీన్‌గా ఉంటుంది. ఈ పద్ధతి ఇప్పటి తరానికి నచ్చడం లేదు. సీటు నుంచి లేచి అటూ ఇటూ తిరగడమూ, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులతో కబుర్లు చెప్పడమూ అందరూ కలిసి లంచ్‌ ఆర్డర్‌ చేసి కలిసి తినడమూ... సంప్రదాయ కార్యాలయ సంస్కృతిలో కన్పించదు. స్థాయీభేదమూ ఆఫీసు క్రమశిక్షణా  లాంటి ఎన్నో అంశాలు అందుకు అడ్డువస్తాయి. కో వర్కింగ్‌ స్పేస్‌లో అలా కాదు, ఎవరు ఎవరితోనైనా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక్కడ కబుర్లంటే కాలక్షేపం కాదు. కొత్త ఆలోచనలు మొగ్గ తొడగడానికి  అవసరమైన ప్రేరణ. ఉద్యోగులు తమ నైపుణ్యాలనూ సామర్థ్యాలనూ తెలుసుకోవడానికి లభించే అవకాశం. అందుకే స్టార్టప్‌లన్నీ  కోవర్కింగ్‌ ప్లేసుల్లోనే పురుడుపోసుకుంటున్నాయి. దిగ్విజయంగా ముందుకు  సాగుతున్నాయి. విజయం సాధించి వందల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నా సొంత కార్యాలయం పెట్టుకోకుండా కో వర్కింగ్‌ ప్లేసులోనే కొనసాగడానికి వారు ఇష్టపడుతున్నారంటే... దాని వల్ల ఒకటీ రెండూ కాదు, చాలానే లాభాలున్నాయి!

అన్ని సౌకర్యాలూ అక్కడే...
బ్రహ్మాండమైన స్టార్టప్‌ ఆలోచన ఉంది. భాగస్వాములూ దొరికారు. ఇక ఆఫీసు పెట్టడమే తరువాయి... అనుకుంటున్నారా? అదే అన్నిటికన్నా పెద్ద పని అంటారు ఆ తిప్పలు పడినవారు. మనం ఆఫీసు తెరవాలనుకున్న వెంటనే మనకి నచ్చిన చోట, మనకు నచ్చిన రీతిలో ఉన్న భవనం దొరకడం అంత ఈజీ కాదు. అదృష్టవశాత్తూ దొరికిందనుకుందాం. దాంట్లోకి ఫర్నిచర్‌ కొనాలి. ఆధునికంగా ఇంటీరియర్స్‌ చేయించాలి. కంప్యూటర్లూ, ప్రింటర్లూ, ఇంటర్నెట్‌ కనెక్షనూ, కాన్ఫరెన్స్‌ హాలూ, పెట్టుబడిదారులతో, కస్టమర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ పెట్టుకోడానికి ఏర్పాట్లూ... ఇవన్నీ చేయించుకోవాలంటే బోలెడు డబ్బూ సమయమూ రెండూ ఖర్చు చేయాల్సిందే. మొదట్లో పది మంది ఉద్యోగులే ఉంటారు కాబట్టి చిన్న ఆఫీసు తీసుకుంటే కొన్నాళ్లకే మళ్లీ పెద్ద భవనంలోకి మారాల్సివస్తుంది. ముందే పెద్దది తీసుకుంటే అనవసరంగా ఎక్కువ అద్దె కట్టాలి. ఆఫీసు పెట్టాక మరో రకం తిప్పలు మొదలవుతాయి. ఒక ప్రయత్నం విజయంగా మారడానికి మధ్య చాలా ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో మెంటార్ల మార్గదర్శకత్వం, పెట్టుబడిదారుల ప్రోత్సాహం, ఉద్యోగుల్లో మోటివేషన్‌... ఇవన్నీ అవసరం. మనం పెట్టుకున్న ఒక చిన్న సంస్థను వెదుక్కుంటూ వీరెవరూ మన  దగ్గరకు రారు. ఈ సమస్యలన్నిటికీ వన్‌ స్టాప్‌ షాప్‌ లాంటి పరిష్కారం- కోవర్కింగ్‌ లేదా షేర్డ్‌ వర్క్‌ స్పేస్‌. అక్కడ ఈ తిప్పలేమీ ఉండవు. ఆఫీసుకు కావలసిన సకల సౌకర్యాలూ తక్కువ ఖర్చులో లభిస్తాయి. పెద్ద భవనాన్ని అందుకు కేటాయిస్తారు కాబట్టి చాలా కార్యాలయాలు ఒకే కప్పు కింద కలిసి పనిచేస్తాయి. సౌకర్యాలను అందరూ కలిసి పంచుకుంటారు. పదేళ్ల క్రితం ఎక్కడో ఒకటీ అరా ఉన్న ఈ కోవర్కింగ్‌ కార్యాలయాలు
ఈ మధ్య శరవేగంగా విస్తరించడానికి కారణం మిలెనియల్స్‌ ఉద్యోగ వ్యాపార రంగాల్లోకి రావడం. వారికి రొటీన్‌ నచ్చదు. స్వేచ్ఛ కావాలి. ప్రతి దాంట్లోనూ వైవిధ్యం ఉండాలి. పైగా వారెంచుకుంటున్న కెరీర్లూ చాలావరకూ స్వతంత్రంగా(ఫ్రీలాన్సింగ్‌) పనిచేసుకునేవే. దాంతో వారి అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాలూ తమ రూపురేఖలనూ  సంస్కృతినీ మార్చుకోవాల్సివస్తోంది. దాని  పర్యవసానమే పెరుగుతున్న కోవర్కింగ్‌ ట్రెండ్‌.

ఎందుకూ... ఎలా?
కార్యాలయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. మొదట నాలుగో వంతు ఖర్చు తగ్గిపోతుంది. ఎలా అంటే...
* మొత్తం భవనానికి అద్దె కట్టనక్కరలేదు. కరెంటూ ఇంటర్నెట్టూ ఫర్నిచరూ లాంటివన్నీ కలిపే తీసుకునే స్థలానికి అద్దె నిర్ణయిస్తారు.
* ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణ మొదలెట్టవచ్చు. అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రోజునుంచే పని ప్రారంభించొచ్చు.
* ఒక్క బెంచీతో మొదలుపెట్టి ఎంతవరకూ అయినా అవసరాన్ని బట్టి విస్తరించుకోవచ్చు.
* దీర్ఘకాల లీజుల గొడవ ఉండదు. ఒకటి రెండు నెలలకైనా, సంవత్సరాలకైనా అప్పటికప్పుడు ఒప్పందం చేసుకోవచ్చు.
ఇవన్నీ సౌకర్యాలు. వ్యాపారాభివృద్ధికి పనికొచ్చే లాభాలూ ఉన్నాయి. అవేంటంటే...
* ఎన్నో రకాల వ్యాపారాలూ, పనులూ చేసే సంస్థలు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి చాలా విషయాలు తెలుస్తాయి. కొత్త పరిచయాలూ స్నేహాలూ ఏర్పడతాయి. మేథోమథనానికీ, కొత్త ఆలోచనలు అంకురించడానికీ అవసరమైన వాతావరణం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఎవరి పని పట్ల వారికి గౌరవమూ సానుకూల దృక్పథమూ ఏర్పడతాయి.
* కొత్త వ్యాపారాలను ప్రోత్సహించే పెట్టుబడిదారులూ, మెంటార్లూ అక్కడికే వస్తారు. కంపెనీలూ హోదాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు.
నెట్‌వర్కింగ్‌ ఈతరం వ్యాపారాలకు చాలా అవసరం. అది ఇక్కడ తేలిగ్గా లభిస్తుంది. పదిమందితో కలిసి ఉండడమూ అభిప్రాయాలు పంచుకోవడమూ కొత్త ఆలోచనలకు ముడిసరుకవుతుంది. ఈ కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సభ్యులంతా కలుసుకునే ఏర్పాటు చేస్తుంటాయి.
కొత్తగా ఒక వ్యాపారంలోకి దిగేవారిలో రకరకాల ఆందోళనలు ఉంటాయి. విజయం సాధించగలమో లేదోనన్న ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా తమ కార్యాలయంలో కూర్చుని
పనిచేస్తే అది మరింత పెరుగుతుంది. అదే ఈ ఆఫీసుల్లో అయితే తమలాంటి వాళ్లే చాలామంది కన్పించడంతో ధైర్యంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అందుకే ఒకప్పుడు కారు గ్యారేజీల్లో, వరండాల్లో
అంకురించిన స్టార్టప్‌లు ఇప్పుడు కోవర్కింగ్‌ప్లేసుల్లో ప్రాణం పోసుకుంటున్నాయి.
* 24/7 తెరిచివుంటాయి కాబట్టి ఎక్కువ గంటలు పనిచేసి గడువులోపల ప్రాజెక్టు పూర్తిచేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అంత పని లేదు, మధ్యలో బ్రేక్‌ తీసుకుని ఒక గంట జిమ్‌కి వెళ్లివద్దామనుకుంటే ఆ వెసులుబాటూ ఉంటుంది.
* స్వేచ్ఛ ఉంటుంది కానీ దాన్ని దుర్వినియోగం చేయడం ఇక్కడ కన్పించదు. చుట్టుపక్కల ఉన్నవారితో సంఘీభావం సెల్ఫ్‌
మేనేజ్‌మెంట్‌ని నేర్పుతుంది. ఫార్మాలిటీ పలకరింపులుండవు. కలిసి ఎదుగుదామనే స్నేహపూర్వక వాతావరణమే ఉంటుంది.
* పైగా ఈమధ్య కాలంలో ఉద్యోగాల తీరు బాగా మారింది. స్వతంత్రంగా పనిచేసే కెరీర్లు ఎక్కువయ్యాయి. రకరకాల వృత్తులకు సంబంధించి సలహాలిచ్చేవాళ్లూ, కళాకారులూ, ఫ్రీలాన్సర్లూ తదితరులు కెరీర్‌ తొలి దశలోనే సొంత కార్యాలయం ఏర్పాటుచేసుకోవడమంటే ఖర్చుతో కూడిన పని. వారు ఇలాంటి చోట సౌకర్యంగా పనీ చేసుకోవచ్చు. పరిచయాలూ పెంచుకోవచ్చు.

ఎలా కావాలంటే అలా..!
టేబుళ్లూ కుర్చీలను అద్దెకిచ్చే కార్యాలయం కాబట్టి అదేదో గోడౌన్‌లాగా ఉంటుందనుకోవద్దు. అత్యంత ఆధునికంగా కట్టిన భవనంలో మీకు కావలసినంత స్థలం, కుర్చీలూ టేబుళ్లతో సహా మాత్రమే కాదు కోరుకున్న అలంకరణతోనూ మీకు అప్పజెబుతారు. అందరితో కలిసి హాలులాంటి చోట పనిచేయడం మీకిష్టమైతే, అలాగే చేసుకోవచ్చు. కాదు, నన్ను ఎవరూ డిస్టర్బ్‌ చేయకూడదు ఒంటరిగా ప్రశాంతంగా పనిచేసుకుంటానూ అనుకుంటే అందుకు తగినట్లుగానే ఓ పక్కగా ఎలాంటి గందరగోళం విన్పించకుండా మీ టేబుల్‌ సిద్ధమవుతుంది. ఇంట్లో ఉన్నట్లుగా రిలాక్స్‌డ్‌గా పనిచేసుకోవాలీ, వీలైతే మధ్యలో ఓ కునుకుతీయాలీ అనుకుంటే- అదీ సాధ్యమే.
కూర్చుని పేపర్లు చదువుకోవడానికీ కబుర్లుచెప్పుకోడానికీ లాంజ్‌, కాఫీషాప్‌ ఉంటాయి. మీటింగ్‌ పెట్టుకోడానికి కాన్ఫరెన్స్‌ హాలు ఉంటుంది. స్నాక్స్‌ లాంటివి అందుబాటులో ఉంటాయి. అందరూ కలిసి లంచ్‌ చేయాలనుకుంటే సంకోచం అక్కర్లేదు, తెప్పించుకుని హ్యాపీగా తినవచ్చు. ఇతరుల పనికి ఆటంకం కలిగించకుండా ఎవరు ఏమైనా చేసుకోవచ్చు.

మనదేశంలోనూ...
గత రెండు మూడేళ్లలోనే కోవర్కింగ్‌ కార్యాలయాలు మన దేశంలో పెద్ద ఎత్తున విస్తరించాయి. ఇండియా ఆఫీసు ప్రాపర్టీ మార్కెట్‌ రివ్యూ 2017 ప్రకారం ఒక్క 2016 సంవత్సరంలోనే అప్పటివరకూ ఉన్న దానికన్నా దాదాపు నాలుగు రెట్ల కోవర్కింగ్‌ స్పేస్‌కి డిమాండ్‌ వచ్చింది. దేశంలో అందుబాటులో ఉన్న కోవర్కింగ్‌ స్పేస్‌లో 31 శాతం వాటాతో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా 18 శాతంతో దిల్లీ రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవర్కింగ్‌ రంగంలో కోటికిపైగా సీట్ల అవసరం ఉందని అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి చోట్ల 300లకు పైగా సంస్థలు సేవలందిస్తున్నాయి. వీటిల్లో వంద దాకా ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థలే. అన్ని సంస్థల్లోనూ దాదాపుగా నూరు శాతం ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. 91 స్ప్రింగ్‌బోర్డ్‌, కో వర్క్‌, వీ వర్క్‌, రీగూస్‌, రెంట్‌ఎడెస్క్‌ లాంటి పలు సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి. ఈ రంగంలో ఏటా 40 నుంచి 50శాతం పెరుగుదల ఉంటోందనీ, కోవర్కింగ్‌ సంస్థలకు పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయనీ నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యాలయాలు చాలానే పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు సహకరిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టీహబ్‌ దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌గా పేరొందింది. అంకురపరిశ్రమలకే కాక ఆవిష్కర్తలకూ అవసరమైన ప్రోత్సాహాన్నిస్తూ ముందుకు నడిపిస్తోంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలన్నిట్లోనూ ఇప్పుడు ప్రైవేటు కోవర్కింగ్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. స్టార్టప్‌లూ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలే కాదు, మల్టీనేషనల్‌ సంస్థల శాఖలూ వీటిల్లోనే పనిచేస్తున్నాయి.

*  *  *

మెన్లో ఇన్నొవేషన్స్‌... మిషిగాన్‌లోని సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ. ఉద్యోగులూ వినియోగదారులూ కూడా సంతోషంగా ఉండేలా సృజనాత్మక విధానాలను ఆచరిస్తారని మంచి పేరు. ఈ సంస్థ తమ ఆఫీసు భవనానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొంది. అందులో ఏడువేల చదరపు అడుగుల కోవర్కింగ్‌స్పేస్‌ని అభివృద్ధి చేసింది. పలు కొత్త కంపెనీలు అక్కడ పనిచేయడం మొదలెట్టాయి. ఆ స్టార్టప్‌లూ యువ ఎంట్రప్రెన్యూర్లతో తమ ప్రోగ్రామర్లు కలిసి పనిచేస్తే సృజన కొత్త పుంతలు తొక్కుతుందన్నది సంస్థ ఆలోచన. అంటే తమ ఆఫీసును కో వర్కింగ్‌ స్పేస్‌గా రివర్స్‌ ఇంజినీరింగ్‌ చేసిందన్నమాట. అదీ, ఇప్పుడు కోవర్కింగ్‌కి లభిస్తున్న ప్రాధాన్యం!


అలా మొదలైంది!

పంచుకోవడం అనేది మనిషి స్వభావం లోనే ఉంది. ఆస్తుల్నే కాదు, ప్రేమల్నీ పంచుకుంటాం. హాస్టల్‌రూమ్‌ని పంచుకున్నట్లే పేయింగ్‌ గెస్టులతో ఇంటినీ పంచుకుంటాం. అటువంటప్పుడు ఆఫీసును ఎందుకు పంచుకోకూడదు?
ఈ ఆలోచన ఇప్పటిది కాదు, 1995లో తొలిసారి జర్మనీలో కొంతమంది కంప్యూటర్‌ నిపుణులు కలిసి ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. హ్యాకర్స్‌ ఎవరైనా అక్కడికొచ్చి పనిచేసుకోవచ్చు. వారికి అవసరమైన కంప్యూటర్లూ అంతర్జాలం తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తారు. అద్దె చెల్లిస్తే చాలు. తమలాంటి వారంతా ఒకేచోట కలుసుకునే వీలుంటుందని చాలామంది అక్కడ పనిచేసుకోడానికి మొగ్గు చూపారు. అప్పటికి అది ‘హ్యాకర్‌స్పేసెస్‌’గానే ఉంది. 1999లో కోవర్కింగ్‌ అన్న కాన్సెప్ట్‌ వచ్చింది. ఆ ఏడాదే న్యూయార్క్‌ సిటీలో 42వెస్ట్‌24 అనే సంస్థ తొలిసారిగా కోవర్కింగ్‌ స్పేస్‌ని ప్రారంభించింది. అయితే కొత్తలో ఇప్పుడున్నన్ని వెసులుబాట్లు లేవు. కేవలం ఆఫీసులకు స్థలాన్ని అద్దెకివ్వడంగానే ఉండేది. క్రమంగా  ఈ విధానం మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడున్న రూపానికి వచ్చింది. పదేళ్ల క్రితం వేగంగా విస్తరించడం మొదలైంది. ప్రతి ఏటా కో వర్కింగ్‌ కార్యాలయాల సంఖ్య రెట్టింపవుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి.  ఈ విధానానికి వేగంగా డిమాండ్‌  పెరుగుతున్న దేశాల్లో భారత్‌ ముందుంది. పెరుగుతున్న స్థిరాస్తుల విలువా, ఉద్యోగాల తీరును బట్టి చూస్తే భవిష్యత్తులో  ఆఫీసులన్నీ కోవర్కింగ్‌ కార్యాలయాలుగానే ఉంటాయంటున్నారు నిపుణులు.


పరిశోధించారు!

మామూలు సంప్రదాయ కార్యాలయాలకన్నా కోవర్కింగ్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు చాలా సంతోషంగా, వృత్తి పట్ల సంతృప్తిగా ఉంటున్నారట. హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ వాళ్లు ఈ అధ్యయనం చేశారు. అంత సంతృప్తిగా ఎందుకుంటున్నారో తెలుసుకోవడానికి వారు ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించారు. వర్క్‌ప్లేస్‌ షేరింగ్‌ వల్ల ఉద్యోగుల ప్రవర్తనాధోరణి మారుతోందట. అర్థవంతమైన పనీ, చేసే పని మీద నియంత్రణా, తనలాంటి మరి కొంతమంది చుట్టూ ఉన్నారన్న ధైర్యమూ... అన్నీ కలిసి ఉద్యోగి ఆత్మవిశ్వాసాన్నీ స్థైర్యాన్నీ పెంచుతున్నాయట. అందుకే సాధారణ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కన్నా ఇలాంటి చోట పనిచేసే ఉద్యోగులు వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ పై స్థాయిలోనే ఉంటున్నారు. ఆ కారణం  వల్లే కొత్తగా రూపుదిద్దుకుంటున్న  స్టార్టప్‌లే కాదు, విజయవంతంగా కొనసాగుతున్న పెద్ద పెద్ద కంపెనీలూ దీనికే జైకొడుతున్నాయి. జీఈ,  కేపీఎంజీ, మెర్క్‌ లాంటి కంపెనీలు కూడా కోవర్కింగ్‌ స్పేస్‌ని ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఉత్పాదకత  పెరుగుతుందని కంపెనీలు నమ్ముతున్నాయనీ, అందుకు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నాయనీ కోవర్కింగ్‌ స్పేస్‌ ప్రొవైడర్‌ ‘వియ్‌ వర్క్‌’ పేర్కొంటోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.