close
వాళ్లు రోగులు కాదు... మా అతిథులు!

వాళ్లు రోగులు కాదు... మా అతిథులు!  

అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేయాలనుకున్న అతడి ఆశలకు ఒక్క సంఘటనతో కత్తెర పడింది.  సునామీ అతని ప్రాణాలు తీయకపోయినా జీవితంలో కొత్త సవాలు విసిరింది. అయినా అతడు బెదిరిపోలేదు, వెనుకంజవేయలేదు. విధిని ఎదిరించాడు, ఒడుదొడుకుల్ని తట్టుకుని నిలబడ్డాడు. అవకాశం వచ్చినపుడు తనలాంటి వారికోసం ఒక సంస్థనే ప్రారంభించాడు. అతడు... డయాలసిస్‌ సేవలు అందించే నెఫ్రోప్లస్‌ సహ వ్యవస్థాపకుడైన కమల్‌ షా. అతడి జీవితం ఓ స్ఫూర్తి పాఠం!

స్మానియా యూనివర్సిటీ నుంచి 1997లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. మాస్టర్స్‌ చేయడానికి యూఎస్‌ బయలుదేరుతున్నాను. వీసా కూడా వచ్చింది. వెళ్లేముందు వ్యాక్సినేషన్స్‌ వేయించుకోవాలని చెబితే వేయించుకున్నాను. ఆ తర్వాత నాకు ఒంట్లో తిప్పినట్టనిపించింది. సాయంత్రానికి చిన్నగా వాంతులు మొదలయ్యాయి. అది సాధారణమేననీ, ఒకట్రెండు రోజుల్లో అంతా తగ్గిపోతుందనీ చెప్పారు. కానీ మూడు రోజుల తర్వాతా అదే పరిస్థితి. అప్పుడు డాక్టర్‌ని సంప్రదిస్తే... కొన్ని పరీక్షలు చేయించి కిడ్నీలో సమస్య ఉన్నట్టు తేల్చారు. జన్యుపరంగా ఉన్న లోపం వ్యాక్సిన్స్‌తో  బయటపడింది. నెఫ్రాలజిస్టుని కలిస్తే వెంటనే డయాలసిస్‌ ప్రారంభిస్తే పదిరోజుల్లో మార్పు రావచ్చన్నారు. డయాలసిస్‌ ప్రారంభించి మూడు నెలలు దాటినా మార్పులేదు. తర్వాత ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్‌,  ఆక్యుప్రెజర్‌, మంత్రాలూ, పూజలూ... అన్నీ ప్రయత్నించాం. వీటితో ఏడాదిన్నర గడిచిపోయింది. లాభంలేదు కిడ్నీ మార్చాలన్నారు. అమ్మ కిడ్నీ ఇవ్వడంతో 1999 మార్చిలో కిడ్నీ మార్పిడి చేశారు. నేనూ సాధారణ జీవితాన్ని గడపొచ్చనుకున్నాను. ఓ పది రోజులు అంతా బాగనే ఉంది. పదకొండో రోజున కొత్త కిడ్నీలోనూ పాత సమస్య వచ్చింది. దాంతో మళ్లీ డయాలసిస్‌ మొదలుపెట్టారు. వారంలో రెండు మూడు రోజులు చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇక నా జీవితం ఇంతేనా అనిపించింది. ఆ సమయంలో ఇంటర్నెట్‌లో దీని గురించి సెర్చ్‌ చేస్తున్నపుడు పెరిటోనియల్‌ డయాలసిస్‌ అనే పరిష్కారం కనిపించింది. ఈ పద్ధతిలో హాస్పిటల్‌కి వెళ్లకుండా ఎక్కడైనా సొంతంగా డయాలసిస్‌ చేసుకోవచ్చు. అరగంట చొప్పున రోజుకు మూడుసార్లు అలా చేయాలి. దాంతో పరిస్థితి కొంత నయమైంది. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరాను. తర్వాత మా ఫ్రెండ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడితే దాని నిర్వహణలోనూ చురుగ్గా ఉండేవాణ్ని. ఉద్యోగం, వ్యాయామం, విహారయాత్రలూ... మొత్తంగా సాధారణ జీవితం గడిపేవాణ్ని.

సునామీ కోరల్లోంచి...
డిసెంబరు 26, 2004. బంగాళాఖాతంలో సునామీ వచ్చినరోజు. ఆరోజు స్నేహితులతో కలిసి చెన్నై శివారులో ఉన్న సముద్రతీర ప్రాంతం... మహాబలిపురం విహారయాత్రలో ఉన్నాను. సునామీ వచ్చిన సమయానికి మేం కాటేజీలో ఉన్నాం. అక్కడికీ పీకల్లోతు నీరు వచ్చేసింది. క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. మా పక్కనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ మేం బిల్డింగ్‌ పిట్టగోడ మీదకు వెళ్లి ప్రాణాల్ని కాపాడుకున్నాం. సునామీ తగ్గిన వెంటనే డయాలసిస్‌ కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కి వెళ్లాను. పెరిటోనియల్‌ డయాలసిస్‌ చేసుకోవడానికి పొట్టభాగంలో సూది దూరేంత చిన్న రంధ్రం చేస్తారు. దాంట్లోకి సముద్రం నీరు వెళ్లి  ఇన్‌ఫెక్షన్‌ అయింది. పొట్టలోకీ ఇన్‌ఫెక్షన్‌ వెళ్లడంతో నా శరీరం పెరిటోనియల్‌  డయాలసిస్‌కి పనికిరాకుండా పోయింది.  ఆ సమయంలో ఇంటి దగ్గర ఉండి హీమోడయాలసిస్‌ చేయించుకోమని సలహా ఇచ్చారు వైద్యులు. అది రోజుకు ఏడు గంటలు చొప్పున వారంలో ఆరు రోజులు చేసుకోవాలి. ముంబయిలో ఒకరిద్దరు చేయించుకుంటున్నారంటే వెళ్లి చూశాను. 2006లో ఆ యంత్రాల్ని తెప్పించి మొదలుపెట్టాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత లైఫ్‌ మళ్లీ సాధారణంగా అనిపించింది. ఆరోజునుంచీ నేటికీ రాత్రి నిద్రపోతూ డయాలసిస్‌ మొదలవుతుంది. నిద్ర నుంచి లేస్తూ దాన్ని ఆపుచేస్తాను. మొదట్లో ఒంటికి వైర్లు ఉంటే నిద్రపట్టేది కాదు. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. ఇలా రోజూ డయాలసిస్‌ చేయించుకోవడంవల్ల ఆహారం, నీరు తీసుకోవడంలో మిగతా రోగుల్లా కఠిన నియమాలు పాటించక్కర్లేదు.

అనుకోని స్నేహం
కిడ్నీ సమస్యలూ, డయాలసిస్‌ గురించి నా అనుభవాలతో ఒక బ్లాగ్‌ రాయడం మొదలుపెట్టాను. దానికి మంచి స్పందన వచ్చింది. 2008లో విక్రమ్‌ ఉప్పల నుంచి నాకు ఈ-మెయిల్‌ వచ్చింది. ‘మీ బ్లాగ్‌ చదివాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’ అనేది సారాంశం. తను అమెరికాలో వైద్యసేవల విభాగంలో పదేళ్లపాటు పనిచేసి ఇండియా తిరిగి వచ్చాడు. డయాలసిస్‌ జరిపే తీరు బయట అస్సలు బాగాలేదని నా అనుభవాలని తనతో పంచుకున్నాను. ‘దీన్ని  పరిష్కరించడానికి  ఏదైనా చేద్దాం’ అన్నారు విక్రమ్‌. అప్పటికే డయాలసిస్‌ చేసే తీరుని మార్చాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు కొన్ని పరిమితులున్నాయి! విక్రమ్‌ ఆ మాట చెప్పాక వెంటనే అంగీకరించాను. డయాలసిస్‌ నిర్వహణను ఎవరూ పేషెంట్ల వైపునుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. మేం ప్రధానంగా ఆ కోణంలో చూడాలనుకున్నాం. సరిగ్గా డయాలసిస్‌ చేయకపోవడంవల్ల డయాలసిస్‌ కేంద్రానికి వచ్చే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చేది. కిడ్నీ సమస్యతో వెళ్తే, లివర్‌ సమస్యో, ఇంకోటో వచ్చేది. సీడీసీ హైదరాబాద్‌ కేంద్రంతో ఈ విషయమై మాట్లాడితే పరికరాల్లో,  బెడ్‌లపైనా రక్త అవశేషాలు ఉండి ఇన్‌ఫెక్షన్లు వస్తున్నట్టు చెప్పింది. పరిష్కారంగా మేం ఒక కొత్త కిట్‌ను తయారుచేశాం. ఒకరికి ఉపయోగించిన కిట్‌ మరొకరికి ఉపయోగించకుండా చూశాం. యంత్రాలపైనా, బెడ్‌పైనా రక్తం అవశేషాలు లేకుండా చేశాం. జీరో ఇన్‌ఫెక్షన్‌ కిట్‌ తేవడంతోపాటు, డయాలసిస్‌ సెంటర్‌ నిర్వహణకు కొన్ని ప్రమాణాలు పెట్టుకున్నాం. ఈరోజుకీ ఒక్కరికి కూడా నెఫ్రోప్లస్‌లో  ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందన్న ఫిర్యాదులేదు. మేం పేషెంట్‌ని ‘అతిథి’ అని పిలవడం ప్రారంభించాం. నిజానికి డయాలసిస్‌ చేయించుకునేవాళ్లలో చాలామంది సాధారణ జీవితం  గడుపుతారు. వాళ్లని పేషెంట్లని అనలేం. అలా పిలిస్తే వారిని అగౌరవపరిచినట్లే.

ఒక్కటిగా మొదలై...
2010 మార్చిలో బంజారాహిల్స్‌లో ఆరు బెడ్లతో నెఫ్రోప్లస్‌ మొదటి కేంద్రాన్ని ప్రారంభించాం. ఒక కేంద్రం ఏర్పాటుకి సగటున రూ.కోటి ఖర్చవుతుంది. సేవా పద్ధతిలో మేం ఈ కేంద్రాల్ని నిర్వహిస్తే జీవిత కాలంలో
గరిష్ఠంగా 10 కేంద్రాల్ని పెట్టగలం. దీన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలంటే సేవతోపాటు వ్యాపార కోణం ఉండాలనుకున్నాం. అప్పుడు పెట్టుబడులూ వస్తాయి. ఏడాది తర్వాత సికింద్రాబాద్‌లో మరో కేంద్రాన్ని ప్రారంభించాక నిర్వహణ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ వాటిని తొందరగానే అధిగమించాం. తర్వాత మహబూబ్‌నగర్‌లో ఓ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మమ్మల్ని పిలిచి డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయమని అడిగింది. ‘మీరే పెట్టుకోవచ్చుగా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు’ అనడిగితే, ‘మీరు పూర్తిగా డయాలసిస్‌మీదే పనిచేస్తున్నారు. మీ ప్రమాణాలూ బావున్నాయి. అందుకే’నని సమాధానమిచ్చారు. స్వల్పవ్యవధిలో అంతటి గుర్తింపు రావడంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడ మూడో కేంద్రం మొదలైంది. ఆ తర్వాత అమెరికాకు చెందిన బెసమర్‌ సంస్థ రూ.23 కోట్లు పెట్టుబడి పెట్టింది. అప్పుడు బెంగళూరు, చెన్నై, ఆగ్రా, దిల్లీ...ఇలా అన్నిచోట్లకీ విస్తరించాం. ఒకేచోట పెద్ద కేంద్రాన్ని కాకుండా 6-8 లక్షల మందికి అందుబాటులో ఉండేలా 10-15 బెడ్‌లు ఉండేలా విస్తరిస్తూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చేవారు హాస్పిటల్‌కి వెళ్లేట్టు ఒక్కసారి వచ్చి వెళ్లిపోరు. ప్రతి రెండ్రోజులకీ రావాలి. కాబట్టి అలా ఎక్కువ మంది దగ్గరకు వెళ్లేలా చూసుకున్నాం. ఇదే సమయంలో మా బోర్డులోకి మరికొందరు నిపుణులు వచ్చిచేరారు. మంచి నాణ్యత, తక్కువ ధరకే డయాలసిస్‌ సేవలు అందించడం ప్రపంచ బ్యాంకుకి కూడా నచ్చి 2014లో రూ.48 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదే సమయంలో బెసమర్‌ మరోసారి రూ.12 కోట్లు పెట్టింది. 2016లో చేపట్టిన సిరీస్‌ సి ఫండింగ్‌లో ప్రపంచబ్యాంకూ, సీలింక్‌ అనే సంస్థా వంద కోట్లు పెట్టాయి. ప్రస్తుతం నెఫ్రోప్లస్‌కు 18 రాష్ట్రాల్లోని 86 నగరాల్లో 141 డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. వీటిలో మొత్తం 1600 బెడ్స్‌ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, పట్నా, గుల్‌బర్గాలో ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లోనూ మా కేంద్రాలున్నాయి. సింగరేణి కాలరీస్‌, నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ హాస్పిటల్స్‌లోనూ మా కేంద్రాల్ని పెట్టాం.

అలా ప్ర‌వ‌రిస్తే ఇంటికే....

నెఫ్రోప్లస్‌కీ బయటి సంస్థలకీ ప్రధానమైన తేడా సిబ్బంది. బయటి సిబ్బందిని నియమించుకుంటే వారికి మా లక్ష్యాలూ, ప్రమాణాలూ తెలియవు. అందుకని మొదట్నుంచీ అకాడమీ కూడా ఏర్పాటుచేసి వారికి శిక్షణ ఇస్తున్నాం. అమెరికాకు చెందిన బోనెంట్‌ సంస్థ వీరికి సర్టిఫికెట్లు ఇస్తుంది. థియరీతోపాటు సిమ్యులేటర్‌పైన ప్రాక్టికల్స్‌ చేయిస్తాం. ఇండియాలో డయాలసిస్‌ శిక్షణ కోసం సిమ్యులేటర్‌ని మొదటిసారి వినియోగంలోకి తెచ్చింది మేమే. మేం ఎన్నిచోట్లకు విస్తరించినా డయాలసిస్‌ చేయించుకునేవాళ్లకి సాధారణ జీవితం అందించాలనే మా లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. మా కేంద్రాలు కార్పొరేట్‌ స్థాయిలో ఉంటాయి. కానీ వాటికంటే 30 శాతం తక్కువ ధరలకే సేవలు అందిస్తున్నాం. డయాలసిస్‌ నాలుగు గంటలపాటు ఉంటుంది. అందుకే ప్రతి బెడ్‌కీ టీవీ ఉంటుంది. ఎవరికీ ఇబ్బందిలేకుండా ఇయర్‌ ఫోన్స్‌ ఉంటాయి. మా సిబ్బంది వ్యవహరించే తీరు ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఎక్కడైనా దురుసుగా ప్రవర్తించారని తెలిస్తే వెంటనే వారిని విధులనుంచి తొలగిస్తాం. ఈ విషయంలో అస్సలు రాజీ పడం.

విహారంలో తోడుగా
డయాలసిస్‌ అవసరమయ్యేవాళ్లకి ‘హాలీడే డయాలసిస్‌’ విభాగాన్ని ప్రారంభించాం. ప్రధాన నగరాలతోపాటు గోవా, ఆగ్రా,తిరుపతి, అలెప్పీ... ఇలా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మా డయాలసిస్‌ కేంద్రాలున్నాయి. ఇక్కడ డయాలసిస్‌ చేసుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తాం. వారికి మొత్తం టూర్‌ ప్లాన్‌ కూడా చేస్తాం. రెండేళ్ల కిందటే దీన్నిప్రారంభించాం. ఈ ప్యాకేజీ కారణంగా చాలామంది కొన్నేళ్ల తర్వాత మళ్లీ విహారయాత్రకు వెళ్లామని చెబుతారు. ఆ మాటలు ఎంతో సంతృప్తినిస్తాయి. నిజానికి నాకు విహారయాత్రలు ఇష్టం. ఆ అనుభవం నుంచి వచ్చిందే ఈ ఆలోచన. నేనూ బయటి నగరాలకు వెళ్లేటపుడు నెఫ్రోప్లస్‌లో డయాలసిస్‌ చేయించుకుంటాను. డయాలసిస్‌ చేయించుకునేవాళ్లకి ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఆటల పోటీల్ని నిర్వహించాం. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో, గతేడాది దిల్లీలోఈ పోటీలు నిర్వహించాం. వాకింగ్‌, సైక్లింగ్‌, చదరంగం, సుడోకు, టేబుల్‌ టెన్నిస్‌లాంటి పోటీలు పెట్టాం. వందలమంది పాల్గొన్నారు.‘మమ్మల్ని మళ్లీ సాధారణ వ్యక్తుల్ని చేసిన మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు’ అంటారు వారంతా. వివిధనగరాల్లో డయాలసిస్‌ చేయించుకునేవాళ్లకి స్థానికంగా ప్రతియేడూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేస్తుంటాం.అధిక ధరలు, డయాలసిస్‌ కేంద్రం అందుబాటులో లేకపోవడం... కారణం ఏదైనా కావొచ్చు కానీ దేశంలో డయాలసిస్‌ అవసరమైన వాళ్లలో కేవలం 15 శాతం మాత్రమే చేయించుకోలగుతున్నారు. అందుకే పేదల డయాలసిస్‌ ఖర్చుల కోసం విరాళాల్నీ సేకరించే ప్రాజెక్టునీ ప్రారంభించాం.ఈ విభాగంలో దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ మాది. భవిష్యత్తులో ఇంకా విస్తరించాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది విదేశాల్లోనూమా అతిథుల్ని పలకరిస్తాం!

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.