close
మునెమ్మ మాట

మునెమ్మ మాట
మధుసూదన్‌

‘‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి మునెమ్మా’’ పక్కింటి ఆమె అంది.

‘‘రేపు రాత్రికి టీవీ వార్తల్లో నువ్వు కనిపిస్తావు, ఎల్లుండి న్యూస్‌పేపర్లనిండా నీ ఫొటో అచ్చవుతుంది. అదీ మొదటిపేజీలో, రంగుల ఫొటో వస్తది అక్కా’’ సంబరంగా చెప్పాడు మునెమ్మ తమ్ముడు.

ఇంతలో మండల ఆఫీసు నుంచి వాహనం వచ్చింది. అందులోనుండి దిగిన లేడీ ఎమ్‌డీఓ సన్నటి అంచు ఉన్న తెల్లటి చీర ఇచ్చి ‘‘మునెమ్మా, రేపు నువ్విది కట్టుకో’’ అంది.

‘‘నాకెందుకమ్మా ఇవన్నీ’’ అంది మునెమ్మ.

‘‘అట్లా అనకు, మంత్రిగారి ముందు నిలబడాలిగా... పైగా పెద్ద ప్రోగ్రామ్‌, కాస్త బాగుండాలని. దీనికి సరిపడా జాకెట్టు ఉందా?’’ అడిగింది.

‘‘అవన్నీ వద్దులే మేడమ్‌, ఏదో ఒకటి కట్టుకుంటాను’’ మొహమాటపడింది.

‘‘ఫర్వాలేదులే’’ అని మునెమ్మతో అని, ‘‘దాసూ, మునెమ్మ ఆది జాకెట్‌ ఒకటి తీసుకుని రాత్రికి టౌన్‌లో కొత్త జాకెట్‌ కుట్టించి తీసుకుని రా’’ అంటూ అటెండర్‌కి పురమాయించింది.

‘‘ఎంఎల్‌ఏ మనుషులూ, ఎమ్‌డీఓ గారూ అందరూ నీకోసం వస్తున్నారంటే నువ్వు చాలా ఫేమసైపోయినట్టే అక్కా’’ తమ్ముడన్నాడు.

ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది మునెమ్మ.

ఈ హడావుడికంతా కారణం మర్నాడు ఆ మండలంలో మంత్రిగారి కార్యక్రమం ఉంది. ఆ మండలానికి ఏ మంత్రీ ఇంతవరకూ రాలేదు. ఇదే మొదటిసారి రావడం. ప్రభుత్వం తాలూకు ఒక కొత్త పథకాన్ని మంత్రిగారు ప్రారంభించబోతున్నారు. అది మునెమ్మతో మొదలుపెడుతున్నారు. అందుకే ఆమెకు పార్టీ నాయకులూ ప్రభుత్వ అధికారులూ అంత ప్రాముఖ్యతనిచ్చి హడావుడి చేస్తున్నారు. మంత్రిగారి కార్యక్రమం... అందునా ప్రభుత్వ పథకం ప్రారంభ వేడుక కావడంతో బహిరంగసభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నుంచి పెద్ద కాంట్రాక్టర్‌ వారం ముందే వచ్చి పెద్దపెద్ద క్రేన్‌లను ఉపయోగించి పెద్ద సభావేదిక, సాంస్కృతిక వేదిక లాంటివన్నీ సభా ప్రాంగణంలో అందంగా
ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ ఏర్పాట్లకే రెండుమూడు కోట్లు ఖర్చయి ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు.

ఇక మండలమంతా పార్టీ జెండాలూ బ్యానర్లూ ఫ్లెక్సీలూ హోర్డింగులతో అలంకరించారు. ప్రతిదాంట్లో పథకం మొదటి లబ్ధిదారు అయిన మునెమ్మ ఫొటో ప్రచురించారు. ఒక అధికారి వచ్చి ప్రారంభించబోయే పథకం గురించి వివరించి, సభావేదిక మీద మంత్రిగారి ముందు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పాడు. ‘‘మునెమ్మా, మాకు మాట రానివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడమ్మా’’ అని వెళుతూ మరోసారి చెప్పి వెళ్ళాడు.

మంత్రిగారు ఇంకా రాలేదు. సభా ప్రాంగణమంతా పార్టీ నాయకులు ‘మోసుకొచ్చి’న జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మునెమ్మని వేదిక ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టారు- పిలవగానే వేదిక మీదకి వెళ్ళడానికి వీలుగా.

రయ్‌రయ్‌ మంటూ పోలీస్‌ పైలెట్‌ జీప్‌, ఆ వెనకే పది కార్లూ వచ్చి ఆగాయి. ఎంఎల్‌ఏ, కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులూ కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళారు. ఇద్దరు పండితులు మంత్రిగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మేళతాళాలతో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. అధికారులు ఆరోజు ప్రవేశపెట్టబోయే పథకం గురించి క్లుప్తంగా వివరించాక, ఎంఎల్‌ఏ మైకు అందుకుని, మంత్రిగారు తమ మండలానికి రావడం ఎంత శుభదినమో వివరిస్తూ ఆయన్ని పొగిడిపొగిడి అలసిపోయాడు.

ఆ తర్వాత ఒక మహిళా నాయకురాలు మైకుని అందుకుని, దానికి అతుక్కుని, తమ ప్రభుత్వం మహిళలకి చేస్తున్న సేవల గురించి అరిచి చెపుతూ, మధ్యమధ్యలో మంత్రిగారిని పొగుడుతూ, మొక్కుతూ ఆవేశపడిపోయింది. తర్వాత
చిన్నాచితకా నాయకులు మాట్లాడాక మంత్రిగారి వంతు వచ్చింది.

మంత్రిగారు మైకు ముందుకువచ్చి అందరికీ నమస్కారం చెప్పి ‘‘మా ప్రభుత్వం పేదప్రజల ప్రభుత్వం. పేద ప్రజల కోసం ఎన్నో చేసింది... ఇంకా చేస్తుంది. మాకు ఆడపడుచులంటే చాలా గౌరవం. ఆడవారి కష్టాలను మా ప్రభుత్వం తమ కష్టాలుగా భావిస్తుంది. ‘ఆడవారి కంట్లో కన్నీళ్ళు ఉండకూడదు’ అన్నదే మా ప్రభుత్వ ఆశయం. అందుకే విధి వక్రీకరించిన ఆడవాళ్ళ కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నాం. అదే వితంతువు పెన్షన్‌. చిన్న వయసులోనే విధివశాత్తు భర్తని కోల్పోయి ఆర్జించే అవకాశం కోల్పోయిన ఆడబడుచులకి అండగా నెలకి వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇవ్వదలుచుకున్నాం.’’

జనాలందరూ చప్పట్లు కొట్టారు.

‘‘మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని మీ ఊరిలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి

ఈ అదృష్టం మీ ఊరి మునెమ్మకు దక్కడం ఇంకా ఆనందంగా ఉంది.’’

అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు.

మునెమ్మని స్టేజీ మీదకి ఆహ్వానించారు.

మునెమ్మ స్టేజీ మీదకు వచ్చి మంత్రిగారికీ అక్కడవున్న ఎంఎల్‌ఏకీ ఇతర నాయకులకీ అధికారులకీ కలిపి నమస్కారం చేసివినయంగా నిలబడింది.

మునెమ్మని సభకి చూపిస్తూ మంత్రి ‘‘నిండా పాతికేళ్ళు లేని మునెమ్మ వితంతువు కావడం దురదృష్టం. దేవుడు ఆమెకి అన్యాయం చేశాడు. కానీ ఆమెని ఆదుకోవడానికి మా ప్రభుత్వం ఉంది. ప్రతి నెలా ఆమెకి వెయ్యి రూపాయలు వితంతువు పింఛను మంజూరు చేస్తున్నాం.’’

సభంతా చప్పట్లతో మారుమోగింది.

అధికారి ఒకరు మంత్రి చేతికి చెక్కు ఇచ్చాడు. చెక్కు అందుకున్న మంత్రి స్టేజీ మధ్యలో ఉన్న మునెమ్మ చెంతకు వచ్చాడు.

‘‘అయ్యా, ముందుగా ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి’’ అభ్యర్థించింది మునెమ్మ.

‘‘తప్పకుండా’’ అంటూ మునెమ్మకి మైకు అందించమని చెప్పి తన సీట్లో కూర్చున్నారు మంత్రి.

‘‘మంత్రిగారికీ మా ఎంఎల్‌ఏగారికీ ఆఫీసర్లకీ ఇంకా అందరికీ నమస్కారాలు. నాకీ వితంతువు పింఛను మంజూరు చేసినందుకు ప్రభుత్వానికీ, అది నాకు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన మంత్రిగారికీ నా ధన్యవాదాలు. అయితే, ముందుగా నా గురించి కొద్దిగా చెప్పుకోవాలి. దయచేసి వినండి సార్లూ- మా ఆయన పేరు శేఖర్‌. తాపీమేస్త్రీగా పనిచేసేవాడు. ఈ చుట్టుపక్కల చిన్నగోడ కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా ప్లాస్టరింగు పని చేయాలన్నా మా ఆయన్నే పిలిచేవాళ్ళు. అంత బాగా పనిచేసేవాడు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా మా ఆయనే కట్టాడు.

ఏ ఇంజినీరు కాగితం లేకుండానే పద్ధతిగా కట్టాడు. అంత మంచి పనోడు. మాకు ఒక పాప. నన్నూ, నా కూతుర్నీ ఎంత బాగా చూసుకునేవాడో! ఏ పండక్కో పబ్బానికో కాస్త మందు తీసుకునేవాడు- అది సరదాకేగానీ అలవాటు లేదు. అలాంటిది ఈ బెల్ట్‌షాపుల మూలంగా మా ఇంటిపక్కనే సారా అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పుడో ‘సరదాకి ఒక రోజు’ మందు తీసుకునే మా ఆయన ‘సరదాగా రోజూ’ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ అలవాటుని ఆపడం నావల్ల కాలేదు. పోనీ బెల్ట్‌షాప్‌ని అడ్డుకుందామంటే అది ప్రభుత్వ ఆదాయమని చెప్పారు. బెల్ట్‌షాపులో స్టాకు లేకపోతే సారా మా ఊర్లో నీళ్ళ ప్యాకెట్లు దొరికినంత తేలిగ్గా దొరుకుతుంది. పొరపాటున ఎవరైనా తాటిచెట్టెక్కి కల్లు గీస్తే వాడిని ఎక్సైజ్‌ పోలీసులు లోపలేసి కుళ్ళబొడుస్తారు. మరి, సారా మా ఊర్లో ఏరులై పారినా పట్టించుకోరు.

ఆ సారా కాసే వ్యక్తి మా ఎంఎల్‌ఏగారి పక్కన కూర్చుంటారు. ఆయనతోపాటే కారులో వెళతారు. పాపం ఎక్సైజ్‌ పోలీసులు ఏం చేయగలరు?

మా ఆయనకి చేస్తున్న పనిమీద శ్రద్ధ తగ్గింది. ఉదయం లేచి తాగడం, ఎలక్షన్లప్పుడు ఫ్రీగా ఇచ్చిన టీవీ ముందు కూర్చుని కాలక్షేపం చేయడం... అంతే. ఖాళీగా ఉన్న మా ఆయన్ని అప్పుడప్పుడూ నాయకులు
తీసుకెళ్ళి వేలిముద్రలు వేయించి పనికి ఆహారపథకం బియ్యాన్ని ఒక మూట ఇచ్చి, దొంగలెక్కలకి సహకరించినందుకు ఉచితంగా మందు పోసేవారు. కూలీలకి ఇవ్వవలసిన బియ్యాన్ని లారీకి ఎక్కించి పక్క రాష్ట్రాలకి తరలించేందుకు మా ఆయన్ని వాడుకునేవారు. అలా ఆయన్ని దొంగని చేశారు మా నాయకులు. కాస్త డబ్బూ, ముఖ్యంగా మందు ఫ్రీగా దొరకడంతో కష్టపడి సంపాదించేదానికన్నా అదే హాయిగా ఉండేది ఆయనకి. అలాంటి దొంగపనులు లేకపోతే రేషన్‌షాపులో ఇచ్చే చవక బియ్యం ఉండనే ఉంది. నెలకి సరిపడా బియ్యం తెచ్చి పడేయటమే ఇంటి బాధ్యత అనుకునేవాడు. బియ్యం వండుకుని పచ్చడితో తింటున్నామో లేక నీళ్ళు పోసుకుని తింటున్నామో పట్టించుకునేవాడు కాదు. ఇష్టంగా చూసుకుంటున్న నన్ను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతుర్ని కసురుకోసాగాడు.

మొత్తానికి మా సంసారం నాశనం అయింది.

ఆరోజు ఆయన ఫుల్‌గా తాగి బైకు మీద ఇంటికి వస్తూ బ్యాలెన్స్‌ తప్పి రోడ్డుమీద పడ్డాడు. మీకా రోడ్డు గురించి చెప్పాలి...

మా పంచాయతీ నుండి మండలానికి వెళ్ళే మెయిన్‌రోడ్డు మీద పెద్దపెద్ద కంకర పరిచి సంవత్సరం దాటింది. ఎక్కువ లాభం కోసం నాసిరకంగా రోడ్డు వేస్తుంటే, నిజాయితీగల ఆఫీసర్‌ అడ్డుకున్నాడని ఆ కాంట్రాక్టర్‌ అలిగి రోడ్డుపని ఆపేశాడు. ప్రజలు ఎంత ఇబ్బందిపడుతున్నా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దాని గురించి పట్టించుకున్నవాళ్ళు లేరు.

ఆ కాంట్రాక్టర్‌ని ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే, ఆయన కూడా మా ఎంఎల్‌ఏగారి పక్కన కూర్చోగలిగే నాయకుడు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే- మీరు వస్తున్నారని మొన్న రాత్రికి రాత్రే తారురోడ్డు వచ్చింది సార్‌. ఒకసారి వచ్చి వెళ్ళిపోయే మీకోసం తారురోడ్డు వేశారు కానీ, సంవత్సరం నుండీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వేయలేదు.

మా ఆయన అదే రోడ్డుమీదపడి కంకర కొట్టుకుని తల పగిలింది. విషయం తెలుసుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళితే అక్కడ డాక్టర్‌ లేడు. నర్సులు ఏమన్నా చేద్దామంటే మందులు లేవు, టౌన్‌కి తీసుకెళ్ళదామంటే హాస్పిటల్లో ఉన్న అంబులెన్స్‌ మూలపడివుంది. తలనుండీ ఒంటినుండీ రక్తం కారిపోతున్నా నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చూస్తూండగానే నా కళ్ళముందే ఆయన కన్నుమూశాడు’’ అంటూ భోరున విలపించింది మునెమ్మ.
కొద్ది క్షణాల తర్వాత తేరుకుని కన్నీళ్ళు తుడుచుకుని ‘‘అయ్యా, మా ఆయన చనిపోయాడా లేక చంపబడ్డాడా- అన్న ప్రశ్న నా మనసుని తొలుస్తోంది. అందుకని, అది తేలేవరకూ నేను ఆ పింఛను తీసుకోలేను. నన్ను క్షమించండి. మంత్రిగారు నాకోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి, నేను రెండు మాటలు చెపుదామనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకుండా వినండి సార్‌.

సార్‌, ఈ స్టేజీ, ఈ ఏర్పాట్లూ చేయడానికి రెండుమూడు కోట్లు అయి ఉంటుందని అంటున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే అయ్యే ఉంటుందని అనిపిస్తుంది. సార్‌, నాకు వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేందుకు ఇంత ఖర్చుపెట్టడం అవసరమా? ఇదే డబ్బుని నేరుగా మా ఊరి స్కూలుకో, ఆసుపత్రికో, పిల్లల వసతి గృహాలకో ఖర్చుపెట్టొచ్చుగా. మా ఊర్లో అవి ఎంత దరిద్రంగా ఉన్నాయో చూశారా? నాకు బాగా చదువుకోవాలని ఉండేది కానీ, అయిదో తరగతి తర్వాత మా ఊర్లో బడి లేదు. ఆడపిల్లనని నన్ను వేరే ఊరు పంపలేదు. పెళ్ళి చేసుకున్నాక నేను ఈ ఊరు వచ్చాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఊర్లో అదే పరిస్థితి. చాలా ఊర్లలో ఇదే పరిస్థితి.

సంవత్సరం నుండీ కంకరరోడ్డు మీద మేము వెళ్ళలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోలేదు. ఖరీదైన కారులో వచ్చి గంటసేపు ఉండే మీకోసం రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. ఇదేమి న్యాయం చెప్పండి. మీరేమో కోట్లు కోట్లు ఇలా వృథాగా ఖర్చుపెడతారు, మళ్ళీ ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహిస్తారు. పైగా మీకు ఆదాయం వస్తే చాలు, అమ్మేవాడు అధిక ధరలకి అమ్ముతున్నాడా కల్తీ చేస్తున్నాడా అన్నది మీకు అనవసరం. ‘సొమ్ములు మీకు, చావులు మాకా’ మంత్రిగారూ. ఇది కరెక్ట్‌ కాదు సార్‌, పెద్ద మనసుతో ఆలోచించండి.

రేపు పేపర్లలో, టీవీలో కనిపిస్తాననీ, ఫేమస్‌ అవుతాననీ మా తమ్ముళ్ళు అన్నారు. కానీ మంత్రిగారి దగ్గర చెక్కు తీసుకోలేదు కాబట్టి, పత్రికలవాళ్ళు మొదటిపేజీలో రాయరేమో. పత్రికలవాళ్ళకి దండంపెట్టి చెపుతున్నాను- మంత్రిగారి చేతి నుంచి నేను చెక్కు తీసుకునే ఫొటో కాదు మీరు వేయాల్సింది, ఈ మునెమ్మ చెప్పిన మాటలు దయచేసి మొదటిపేజీలో రాసి, మా ఊరి స్కూలూ, ఆసుపత్రి ఫొటోలూ వేయండి. అలాగే ఇంకో విన్నపం- ఈరోజు నా మాటలు పట్టుకుని ప్రతిపక్ష పార్టీవాళ్ళో, ఇంకో పార్టీవాళ్ళో నాకు మద్దతు అన్నట్టుగా మా ఇంటి దగ్గరికి వచ్చి సందడి చేయకండి. రేపు నేను కూలిపనికి వెళ్ళాలి. ఈ మాటలు నేను ఒక పార్టీకో, ఒక నాయకుడికో చెప్పటం లేదు. అన్ని పార్టీలకీ, అందరు నాయకులకీ, అన్ని ప్రభుత్వాలకీ చెపుతున్నాను. ప్రజలకి పనికివచ్చే పథకాలు పెట్టండి కానీ, మీ ఓట్లకోసం ప్రజలని చేతకానివాళ్ళుగా చేసే పథకాలు పెట్టి వాళ్ళ ఉసురుపోసుకోకండి’’ అని చెప్పి అందరికీ దండాలుపెట్టి స్టేజీ దిగి వెళ్ళిపోయింది మునెమ్మ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.