close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అల్లం టీ తాగుదామా..?

అల్లం టీ తాగుదామా..?

వేసవిలో అల్లం టీనా... అని చాలామందే అనుకోవచ్చుగాక. కానీ అల్లం టీ వేసవికీ ఎంతో పనిచేస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే టీ రుచిగా ఉండటమే కాదు, జలుబు, ఫ్లూ వంటి జ్వరాలతోబాటు గొంతునొప్పి, అజీర్తి వంటివీ తగ్గుతాయి. రోజుకి రెండు కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పక తీసుకుంటే బీపీ కూడా తగ్గుతుంది.
* ఇందులో ఉండే యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.
* అల్లంలోని జింజరాల్స్‌, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులని తొలగించి, గుండె వ్యాధులు రాకుండా కాపాడతాయి.
* వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ తాగితే వెంటనే రిలీఫ్‌ వస్తుంది. ఇందులోని జింజిబర్‌ అనే పదార్థం హానికర బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది. తేన్పుల్నీ తగ్గిస్తుంది.
* ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా వచ్చే నొప్పుల్నీ మంటల్నీ దురదల్నీ కూడా నివారిస్తుంది అల్లం టీ. అందుకే కండరాలు, కీళ్లనొప్పులూ ఆర్థ్రయిటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లకి ఇది ఎంతో మేలు.


ఆ వ్యసనాన్ని వదిలించాల్సిందే..!

కౌమారదశలో ఉన్న పిల్లలు సోషల్‌మీడియాకి అతుక్కుపోతున్నారన్న విషయం కొత్తదేం కాదు. అయితే అది ఎంత తీవ్ర రూపం దాలుస్తుందీ అంటే వాళ్లు అందులోపడి బంధాలనూ అనుబంధాలనూ పూర్తిగా మరిచిపోతున్నారని రష్యాకి చెందిన కాజన్‌ వైద్య విశ్వవిద్యాలయ నిపుణులు  చెబుతున్నారు. ఇందుకోసం వాళ్లు 14-19 ఏళ్ల మధ్య వయసులోని పిల్లల్ని ఎంపికచేసి మరీ అధ్యయనం చేశారట. అందులో వాళ్లు సోషల్‌ మీడియాకి పూర్తిగా దాసోహమయ్యారని తెలిసింది. స్నేహబంధాలైనా బంధుత్వాలైనా అన్నిటికీ ఆ వర్చువల్‌ ప్రపంచమే వేదికగా మారిందనీ అందులోంచి బయటకు వచ్చి నేరుగా మాట్లాడటం లేదా ఫోనులో పలకరించడం మానేశారనీ ఆ అధ్యయనంలో తెలిసింది. ఇంకా చెప్పాలంటే వాళ్లు జీవించడం మరిచిపోయి, ఆ వెబ్‌ ప్రపంచంలోనే బతికేస్తున్నారని తెలిసింది. అందుకే వాళ్లను అందులోంచి బయటకు తీసుకువచ్చేందుకు తలిదండ్రులతోబాటు ఉపాధ్యాయులూ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. లేదంటే వాళ్లు భవిష్యత్తులో అనేక మానసిక సమస్యలకి లోనవడంతోబాటు శారీరకంగానూ అనేక రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.


గాఢ తైలాలతో జుట్టు పెరిగేనా?!

నకి బాదం, ఆలివ్‌, కొబ్బరి... వంటి నూనెలన్నింటినీ శిరోజాల సంరక్షణకోసం వాడటం తెలిసిందే. అయితే కొన్ని రకాల గాఢ తైలాలు వెంట్రుకల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అవేమంటే... జొజొబా, లావెండర్‌, థైమ్‌... వంటి నూనెల వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందట. గుండు చేయించిన తరవాత వీటిని రాస్తే త్వరగా పెరుగుతుందట. పెప్పర్‌మింట్‌ వల్ల మరింత వేగంగా పెరుగుతుందనేది ఓ పరిశీలన. ఇది కొత్త జుట్టు రావడానికీ తోడ్పడుతుందట. ఇందులోని మెంథాల్‌ కారణంగా చర్మంలోపలి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో రక్తప్రసరణ మెరుగై శిరోజాల పెరుగుదలకి తోడ్పడుతుంది. ఇదేమాదిరిగా చమేలీ, రోజ్‌మేరీ, సేజ్‌... వంటి ఔషధ మూలికల నూనెలు కేశ సంపదకు దోహదపడతాయి. అయితే వీటిని వాడేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమంటే... ఇవన్నీ గాఢ తైలాలు కాబట్టి వాటిని నేరుగా రాయకూడదు. కొబ్బరి నూనెతో కలిపి వాడాలి. రెండు చుక్కల గాఢ తైలానికి టేబుల్‌ స్పూను కొబ్బరి నూనె కలపాలి. ఇప్పుడు దీన్ని తలకి పట్టించి రెండు మూడు నిమిషాలపాటు మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ఎవరికైనా ఇవి పడక దురద, వాపు, మంట వంటివి వస్తే వెంటనే షాంపూతో కడిగేయాలి.


నిద్రలేమికీ ఓ మందు!

తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవాళ్లకి మెలటోనిన్‌ ఉన్న ట్యాబెట్లను ఇస్తుంటారు. అయితే అదెలా పనిచేస్తుందన్న విషయం మాత్రం ఇటీవలే నిరూపితమైంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ మిసోరి స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్లో చేసిన పరిశోధనలో మెలటోనిన్‌ కారణంగా అవి గాఢంగా నిద్రపోయినట్లు తెలుసుకున్నారు. ఆ హార్మోన్‌ ప్రభావం వల్ల మెదడులోని న్యూరాన్లన్నీ చైతన్యస్థితిలోంచి నిద్రాస్థితిలోకి వెళ్లినట్లుగా గుర్తించారు. మెదడులో మెలటోనిన్‌ను స్రవించే రిసెప్టర్లు ఉంటాయనీ అవి సరిగ్గా పనిచేయకపోవడమే నిద్రలేమికి కారణమనీ అందుకే తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవాళ్లకి మెలటోనిన్‌ ట్యాబ్లెట్లను ఇస్తుంటారనీ అంటున్నారు సంబంధిత నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.