close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్నీ అద్దెకు దొరికేస్తాయ్‌!

అన్నీ అద్దెకు దొరికేస్తాయ్‌!

నగరంలో ఉద్యోగం చేస్తున్న అరవింద్‌కి కొత్తగా పెళ్లైంది. అప్పటివరకూ బ్యాచిలర్‌గా హోటల్లో తింటూ రూమ్‌లో ఉంటున్న అతడు వెంటనే కొత్త కాపురం పెట్టాల్సొచ్చింది. అంటే... కొత్త ఇంటిని చూసుకోవడంతోపాటు, ఇంట్లోకి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కోవాలన్నమాట. అసలే పెళ్లి ఖర్చు... ఆ పైన ఒక్కసారిగా అన్నీ కొనాలంటే ఇబ్బందే. కానీ అరవింద్‌ ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, టీవీ, మంచం, సోఫాలన్నిటినీ కలిపి రూ.పదివేలకే తెప్పించేశాడు. ఇపుడు ఆన్‌లైన్‌లో అన్నీ అద్దెకు దొరికేస్తున్నాయి మరి..!వేసవి ఎండలు మండిపోతున్నాయ్‌... ఏసీ కొనుక్కుందామంటే బోలెడంత ఖర్చు. వేసవి దాటితే దాని అవసరం పెద్దగా ఉండదు. పైగా అదే అద్దె ఇంట్లో ఎంతకాలం ఉంటామో తెలీదు. వచ్చే ఏడాదికి వేరేచోటికి ట్రాన్స్‌ఫర్‌ కూడా అవ్వొచ్చు. అప్పుడు ఏసీ లాంటివాటిని జాగ్రత్తగా తరలించడం పెద్ద పని. ఇక, ఆఫీసు పనిమీద ఉద్యోగులు రెండు మూడు నెలలు వేరే నగరంలో ఉండాల్సివచ్చినపుడూ విద్యార్థులు కోర్సులు నేర్చుకోవడానికి కొత్త చోటుకి వెళ్లినపుడూ కొద్దిరోజులకోసం కావల్సిన సామగ్రినంతా కొనుక్కోవాలంటే బోలెడంత ఖర్చవుతుంది. కొనుక్కోకపోతే ఇబ్బంది పడాల్సొస్తుంది. అలాంటివారికి ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలూ ఫర్నిచర్‌తో పాటు రకరకాల మోడల్‌ బైక్‌లూ ల్యాప్‌టాప్‌లు కూడా తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో అద్దెకు దొరికితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినవే  గ్రాబ్‌ఆన్‌రెంట్‌, రెంటొమొజొ, రెంటికిల్‌ లాంటి వ్యాపారసంస్థలు. ఈ సైట్లలో టీవీలూ వాషింగ్‌మెషీన్‌లూ ఫ్రిజ్‌లూ కూలర్లూ ఏసీలూ ఓవెన్‌లూ వాటర్‌ ఫిల్టర్లూ మంచాలూ సోఫాలూ దివాన్‌కాట్‌లూ బీరువాలూ టేబుళ్లూ డ్రెస్సింగ్‌ టేబుళ్లతో పాటు ల్యాప్‌టాప్‌లూ డెస్క్‌టాప్‌లూ బైక్‌లూ స్కూటీలూ వ్యాయామ పరికరాలు కూడా అద్దెకు లభిస్తాయి. వీటిని దేనికదే విడివిడిగానూ అద్దెకు తీసుకోవచ్చు. లేదంటే నాలుగైదు వస్తువులకు కలిపి ప్యాకేజ్‌లు ఉంటాయి. అలా అయితే ఇంకాస్త తక్కువ అద్దె పడుతుంది. సైజులూ మోడల్‌ని బట్టి గృహోపకరణాల్లో ఒక్కో వస్తువు నెలవారీ అద్దె రూ.100 నుంచి మొదలై రూ.1500 వరకూ ఉంటుంది. బైక్‌లూ ల్యాప్‌టాప్‌లాంటి వాటి అద్దె ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. సామగ్రిని ఒకేసారి మూడు నెలలకూ ఆరు నెలలక్కూడా అద్దెకు తీసుకోవచ్చు.
రెంటికిల్‌, రెంటొమోజో, గ్రాబ్‌ఆన్‌రెంట్‌... సంస్థలు హైదరాబాద్‌తో సహా ఇతర ప్రముఖ నగరాల్లోనూ సేవలందిస్తున్నాయి. ఆయా సైట్లలోకి వెళ్లి కావల్సిన వస్తువుల్ని ఎంపికచేసుకుని గుర్తింపు పత్రాలను అప్‌లోడ్‌చేసి కొంత రుసుముని చెల్లిస్తే చాలు, సామగ్రిని వాళ్లే ఇంటికి పంపిస్తారు. ఫర్నిచర్‌, ఏసీ, టీవీలాంటి వాటిని కంపెనీ సిబ్బందే అమర్చి మరీ వెళ్తారు. మన అవసరం తీరిపోయాక సమాచారం అందిస్తే మళ్లీ వాళ్లే వచ్చి తీసుకెళ్తారు.ఉన్నంతలో విలాసంగా...
ఎంత ఖరీదైన వస్తువైనా సరే ఒకసారి కొన్నాక అది నచ్చినా నచ్చకపోయినా దాని అవసరం మనకు లేదని అనిపించినా తిరిగిచ్చేయడానికి కుదరదు. పోనీ ఎవరికైనా అమ్మేద్దాం అంటే రెండు రోజులు వాడినా సెకండ్‌ హ్యాండ్‌ అయిపోతుంది. అదే అద్దెకు తెచ్చుకుంటే అవసరం ఉన్నన్ని రోజులూ వాడుకుని తిరిగిచ్చేయొచ్చు. మనకు దాని అవసరం బాగా ఉందనిపిస్తే అప్పుడే కొనుక్కోవచ్చు. ఇక, కొత్తగా పెళ్లైన జంటలు వెంటనే ఇంట్లోకి అవసరమైన సామగ్రినంతా కొనేయాలంటే కష్టం. పైగా అప్పటికే పెళ్లి ఖర్చు బోలెడంత అయి ఉంటుంది. పోనీ ఉన్నదాంట్లో సరిపెట్టుకుని తక్కువ ధరలో కొనుక్కుందామనీ అనుకోవడం లేదు ఈతరం. ‘మళ్లీమళ్లీ కొంటామా ఏంటీ...’ అంటూ ఉన్నంతలో విలాసవంతంగా ఉన్న ఫర్నిచర్‌, లేటెస్ట్‌ మోడల్‌ ఎల్‌ఈడీ టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌... అన్నీ ఆధునికంగానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అవన్నీ ఒక్కసారిగా కొనాలంటే లక్షలు కావాల్సిందే. అందుకే, ముందు కావల్సినవాటిని అద్దెకు తీసుకుని, డబ్బులు చేతికి వచ్చాక మనసుకు నచ్చినవాటిని కొనుక్కుంటున్నారు.చూసి తీసుకోవచ్చు
‘ఈతరం యువతీయువకుల జీవనవిధానాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టే ఆన్‌లైన్‌లో అద్దె వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది’ అంటారు రెంటొమొజొ వ్యవస్థాపకుడు, సీయీవో గీతాన్ష్‌ బమానియా. ·దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో విస్తరించిన ఈ సంస్థకు 22వేలమందికి పైగా వినియోగదారులున్నారు. కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ.20 కోట్లు. ఇక, గ్రాబ్‌ఆన్‌రెంట్‌ సంస్థకైతే  35వేల మందికి పైగా వినియోగదారులున్నారు. ఈ సంస్థకు నెలనెలా పదిహేనువందలకు పైగా ఆర్డర్లు వస్తుంటాయట. ‘మన దగ్గర సామగ్రిని అద్దెకివ్వడం ఎప్పట్నుంచో ఉంది. కానీ ఏ రకం వస్తువులు ఎక్కడ అద్దెకు దొరుకుతాయో తెలుసుకోవడం, వెళ్లి తెచ్చుకోవడం... అంతా పెద్ద తతంగంలా ఉండేది. అదే ఆన్‌లైన్‌లో అన్నిరకాల సామగ్రీ ఒకచోటే దొరికితే సౌకర్యంగా ఉంటుందనే కారణంతోనే గ్రాబ్‌ఆన్‌రెంట్‌ని స్థాపించా’నంటాడు ఆ కంపెనీ సీయీవో శుభమ్‌ జైన్‌.
ఆన్‌లైన్‌ సైట్లలో ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. ప్రతి వస్తువు ఫొటో, దాని పని తీరూ, అద్దె వివరాలను ముందుగానే చూసుకునే వీలుంటుంది. పైగా ఉన్నచోటునుంచే నిమిషాల్లో బుక్‌ చేసుకుని తెప్పించేసుకోవచ్చు. అందుకే, చాలామంది ఈవైపు మొగ్గుచూపుతున్నారు. అద్దెకు తెచ్చుకోవడం ఇప్పుడో ట్రెండ్‌ అయిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి.. ?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.