close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది సామాన్యుల స్టార్‌ హాస్పిటల్‌!

ఇది సామాన్యుల స్టార్‌ హాస్పిటల్‌!

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు ఏవి ఎందుకు వైరల్‌ అవుతాయో చెప్పలేం. ఏవి సంచలనం కోసమో ఏవి ప్రజాహితానికో తేల్చుకోలేం. తమిళనాడు మదురైలో ఉన్న వేలమ్మాళ్‌ ఆసుపత్రి గురించి ఈ మధ్య హల్‌చల్‌ చేసిన వీడియో అలాంటిదే. ‘ఓ స్టార్‌హోటల్‌ను తలపించే కార్పొరేట్‌ ఆసుపత్రిలో దాదాపు ఉచితం అనిపించేంత తక్కువ ధరతో చికిత్స అందిస్తున్నారు’ అన్నది ఆ వీడియో సారాంశం. అదేదో ఉబుసుపోని వీడియో కాదనీ.. ఆ విశేషాలన్నీ నిజాలేనని నిరూపిస్తోంది ఆ ఆసుపత్రి.దురై నగరానికి తూర్పు శివారు అనుప్పానడి అనే ప్రాంతంలో ఉంటుంది వేలమ్మాళ్‌ ఆసుపత్రి. మొత్తం 140 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించారు. ఈ ఆసుపత్రికింద రెండు విభాగాలు పనిచేస్తాయి. ఒకటి, మెడికల్‌ కాలేజీ ఆవరణలో బోధనాసుపత్రిగా పనిచేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియోలు దీనికి సంబంధించినవే. ఇక్కడ కన్సల్టన్సీ ఫీజేమీ ఉండదు. శస్త్రచికిత్స ఏదైనా సరే కేవలం ఆపరేషన్‌ థియేటర్‌ ఛార్జి మాత్రమే వసూలు చేస్తారు. రోగి ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు భోజనానికీ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సాయానికి వచ్చినవారికీ రాయితీల మీద ఆహారమందిస్తారు. కాకపోతే ఈ విభాగంలో వార్డ్స్‌ మాత్రమే ఉంటాయి.. ప్రత్యేక గదులు ఉండవు. అయినా సరే.. శుభ్రతపరంగానూ, ప్రమాణాలపరంగానూ ఎక్కడా తేడా ఉండదు. ఇక్కడికి వెళ్లడానికేమీ మనం నిరుపేదలుగా ఉండక్కర్లేదు. ధ్రువపత్రాలేవీ చూపక్కర్లేదు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆ విభాగంలో చేరొచ్చు. ఇక కార్పొరేట్‌ విభాగంలో మిగతా అన్ని ఆసుపత్రుల్లానే ప్రత్యేక గదులూ, ఇతర ఖరీదైన వసతులూ ఉంటాయి. కన్సల్టన్సీ, శస్త్రచికిత్స అన్నింటా మిగతా కార్పొరేట్‌ ఆసుపత్రులకంటే 40 శాతం తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు... ఎక్స్‌రే, స్కాన్‌లకి బయటి మార్కెట్‌తో పోలిస్తే మూడు నుంచి ఆరోవంతు మాత్రమే తీసుకుంటారు. ఉదాహరణకి ఛాతీ ఎక్స్‌రేకి ఇదే మదురైనగరంలో మూడువందల నుంచి నాలుగువందల రూపాయలుంటే ఇక్కడ యాభైరూపాయలిస్తే చాలు! సీటీ, ఎమ్మారై స్కాన్‌, వీడియో ఎండోస్కోపీ విషయంలోనూ ఇంతే. నాణ్యమైన మందులు కూడా తక్కువ ధరకే ఇస్తారు. వీటన్నింటి కారణంగా బయట ఆసుపత్రుల్లో 80 వేలరూపాయలయ్యే చికిత్సకి ఇక్కడ 35 నుంచి 40 వేల రూపాయలే ఖర్చవుతుంది.నిపుణులెంతోమంది...
తమిళనాడులోని ఉన్నతస్థాయి వైద్య నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక్క మదురైలోనే కాదు దక్షిణ తమిళనాడు మొత్తానికీ తొలిసారి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించింది ఇక్కడే. మోకాలిచిప్ప మార్పిడికి అరుదైన కీ-హోల్‌ సర్జరీని ఈ ప్రాంతానికి వీళ్లే పరిచయం చేశారు. ఈ మధ్యే ఓ వృద్ధుడి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వేరుశనగని శస్త్రచికిత్స ద్వారా తొలగించి వార్తలకెక్కారు ఇక్కడి నిపుణులు!ఓ ఆదర్శంతోనే...
వేలమ్మాళ్‌... తమిళనాట విద్యారంగంలో సుపరిచితమైన పేరు ఇది! చెన్నైలో ఉన్న వేలమ్మాళ్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీలు దక్షిణాదిమొత్తం మంచి పేరుతెచ్చుకున్నాయి. ఇవే కాకుండా ‘వేలమ్మాళ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు’ కింద తమిళనాడులోని ప్రధాన జిల్లాలన్నింటా కలిపి యాభైకి పైగా విద్యా సంస్థలున్నాయి. ఎమ్వీ ముత్తురామలింగం వీటి వ్యవస్థాపక ఛైర్మన్‌. ఆయన తండ్రి చనిపోయారు. తల్లి వేలమ్మాళ్‌.. కూలీనాలీ చేసి ముత్తురామలింగాన్ని ఇంజినీరింగ్‌ చదివించింది. ఆ తర్వాత మదురై నుంచి రాజధానికి వచ్చిన ఆయన చెన్నైలో కొంతకాలం ప్రభుత్వోద్యోగం చేశారు. తర్వాత నిరుపేద పిల్లలని పదో క్లాసు పాస్‌చేయించడమే లక్ష్యంగా వేలమ్మాళ్‌ పాఠశాలని 1986లో ప్రారంభించారు. అదే ‘ఇంతింతై..’ అన్నట్టు ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యాసంస్థల సమాహారంగా మారింది. అంతగా ఎదిగిన ముత్తురామలింగం తాను పెరిగిన మదురై నగరం కోసం పెద్ద స్థాయిలో ఏదైనా చేయాలనుకున్నారు. తన విద్యాసంస్థల రజతోత్సవం సందర్భంగా 2012లో ఈ వేలమ్మాళ్‌ బోధనాసుపత్రిని స్థాపించారు. అలా ఆరేళ్ల నుంచి సొంత లాభాలు కొంత మానుకుని చక్కటి ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు సామాన్యులకి అందుబాటులో తెస్తున్నారాయన... అదీ చుట్టూ ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రుల పోటీని తట్టుకుంటూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.