close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందాల పూలలోయ..!

అందాల పూలలోయ..!

‘హిమాలయాలు...  మంచుకొండలూ హిమనదాలూ జీవనదులూ సరోవరాలూ... వంటి ప్రకృతి అందాలకీ రకరకాల జీవజాతులకీ రంగురంగుల పూలజాతులకీ ముఖ్యంగా అరుదైన బ్రహ్మకమలాలకీ పుట్టిల్లు. అందుకే ఆ కొండల్లో ఎన్నిసార్లు తిరిగినా చూడాల్సినవేవో ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అలాంటిదే జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే దారిలో ఉన్న పూల లోయ ఉరఫ్‌ వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌...’ అంటున్నారు పుణెకి చెందిన కర్రా నాగలక్ష్మి.వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలంటే ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని గోవింద్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటికన్నా అక్కడినుంచి నడకదారినగానీ గుర్రాలూ లేదా డోలీల్లోగానీ ప్రయాణించడమే మేలు. ఇక్కడ హిమపాతం, వర్షపాతం రెండూ ఎక్కువే. దాంతో హెలీకాప్టర్‌ సేవలు తరచూ రద్దు అవుతుంటాయి. హరిద్వార్‌ నుంచి గోవింద్‌ఘాట్‌కి 296 కి.మీ. అక్కడికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నడుపుతున్న బస్సులూ ట్యాక్సీలతోబాటు ప్రైవేటు బస్సులూ ఉంటాయి. బస్సులో ఎక్కువ సమయం పడుతుందని టాక్సీలో బయలుదేరాం.గోవింద్‌ఘాట్‌లో...
ముందుగా ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కి చేరుకున్నాం. రాత్రి అక్కడ బస చేసి ఉదయాన్నే బయలుదేరి జోషిమఠ్‌కి వెళ్లాం. అప్పటికే గోవింద్‌ఘాట్‌కు వెళ్లే దారి మూసేశారట. దాంతో ఆ రోజు అక్కడే బస చేశాం. అక్కడినుంచి గోవింద్‌ఘాట్‌కి సుమారు 20 కిలోమీటర్లు. జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే మార్గాన్ని ఆనుకొనే ఉంటుంది గోవిందఘాట్‌. ఉదయాన్నే బయలుదేరి, ఓ కిలోమీటరు ప్రయాణించాక ఘాట్‌కు చేరుకున్నాం. అక్కడ హోటళ్లు అన్ని వర్గాలవాళ్లకీ అందుబాటులో ఉన్నాయి. సమీపంలోనే ఓ పక్క అలకనందా నది కనిపిస్తుంటుంది. దాని ఒడ్డున గురుద్వారా ఉంది. అందులో యాత్రికులకు ఉచిత భోజన, పార్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. అక్కడి నుంచి కాలిబాట మొదలవుతుంది. మేం గురుద్వారా దగ్గరే ఆగి, తేలికపాటి బ్యాగుల్లో రెండు రోజులకి సరిపడా బట్టలూ ఇతరత్రా నిత్యావసర వస్తువులూ సర్దుకుని మిగిలినవి టాక్సీలోనే వదలి నడకదారిన బయలుదేరాం. గురుద్వారాలో లగేజీని దాచుకునే సౌకర్యం ఉంది. ఈ యాత్రకు అవసరమైన మాయిశ్చరైజింగ్‌ క్రీమూ సన్‌స్క్రీనూ చలిని ఆపే కోట్లూ కొండల్లో నడవడానికి వీలుగా ఉండే షూ తప్పనిసరి. తలనొప్పి, జ్వరం... వంటి వాటికి అవసరమైన మందుల్నీ వెంట తీసుకెళ్లాలి. టార్చిలైట్‌ తప్పనిసరి.నదీ సంగమం!
ఓ అరకిలోమీటరు నడిచాక గానీ గుర్రాలూ డోలీలూ దొరకవు. నడక దారిన వెళ్లేవారికి సామాన్లు మోసేవారూ దొరుకుతారు. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌తోబాటు హేమకుండ్‌ సాహెబ్‌ చూడ్డానికి గుర్రాలు మాట్లాడుకున్నాం. సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాక ఘంగారియాకి చేరుకున్నాం. అక్కడి నుంచి ముందుగా వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలనుకున్నాం. ఆ దారిలో కాస్త దూరం మట్టి, బురద. మరికాస్త దూరం బండరాళ్లు. ఎత్తు ఎక్కువగా ఉన్నచోట గుర్రాలమీద నుంచి దిగి నెమ్మదిగా ఎక్కసాగాం.
దారిలో అలకనందా నది పరవళ్లు తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. అత్యంత కష్టమ్మీద ఆ పన్నెండు కిలోమీటర్లూ ప్రయాణించాక పచ్చని మైదానం, చిన్న చిన్న సెలయేళ్లూ ప్రవహిస్తూ కనువిందు చేశాయి. ఘంగారియాకి వెళ్లడానికి మొత్తంగా ఆరుగంటల సమయం పట్టింది.
ఘంగారియా బైందరలోయలో ఉంది. బైందర గంగ, పుష్పవతి నదుల సంగమ ప్రదేశమే ఘంగారియా. ఈ రెండు నదులూ సంగమించి లక్ష్మణ గంగగా ప్రవహించి గోవింద్‌ఘాట్‌ దగ్గర అలకనందలో కలుస్తాయి. ఘంగారియాలో టెంట్లూ మట్టి ఇళ్లే ఉన్నాయి. వాటిల్లోనే యాత్రికులకి అవసరమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు. ఈ ఘంగారియా పూలలోయకీ హేమకుండ్‌ సాహెబ్‌కీ కూడలి లాంటిది. గోవింద్‌ఘాట్‌ తరవాత నివాస, భోజన సదుపాయాలు కలిగిన ప్రదేశం ఇదే. ఇక్కడి హోటళ్లు ఆరుగంటలకే మూసేస్తారు. ఆ లోగానే భోజనాన్ని ముగించుకోవాలి. బసలో సామాన్లు ఉంచి టీ, స్నాక్సూ కానిచ్చి పూలలోయకి బయలుదేరాం. మధ్యాహ్నం మూడు తరవాత ఈ లోయలోకి అనుమతించరు. ప్రవేశద్వారం వద్ద టిక్కెట్లు తీసుకుని నడక మొదలెట్టాం. ఒకసారి తీసుకున్న టిక్కెట్టుతో మూడురోజులవరకూ వ్యాలీలోకి వెళ్లవచ్చు.అందాల పూలలోయలో...
ఉత్తరాంఛల్‌లోని చమోలి జిల్లాలోని సుమారు 3,660 మీటర్ల ఎత్తులోని సుందర ప్రదేశమే ఈ పూలలోయ. ఎగుడుదిగుడు కొండలమీద నడుచుకుంటూ వెళ్లాక నందాదేవి నేషనల్‌ పార్కు వచ్చింది. అందులోనుంచే వ్యాలీలోకి ప్రవేశించాలి. ఆ దారి బీభత్సమే. అక్కడ ఎప్పుడు వాన పడుతుందో ఊహించలేం. ఆ వానలకి కొండరాళ్లు దొర్లుకుంటూ వస్తుంటాయి. దాంతో నడవడమే కష్టం. ఏకంగా మూడు కిలోమీటర్లు నడవాలనుకున్న మా అంచనా తప్పింది. సూర్యాస్తమయానికి నందాదేవి నేషనల్‌ పార్కు గేటు దగ్గరకు చేరుకున్నాం. చీకటి రాత్రిలో ఎక్కువసేపు తిరగలేం అన్న కారణంతో వెనుతిరిగాం. మర్నాడు పొద్దున్నే అయిదు గంటలకి డోలీలు కట్టించుకుని బయలుదేరాం. నందాదేవి జాతీయ పార్కుకి వెళ్లడానికి మూడు కిలోమీటర్ల నడక అంటే రానూపోనూ ఆరు కిలోమీటర్లు, అంత నడక అలవాటు ఉండదు కాబట్టి డోలీ కట్టించుకుని బయలుదేరాం. డోలీవాళ్లే మాకు గైడ్స్‌.
లేలేత సూర్యకిరణాలు హిమాలయాలపై పడి అవి తిరిగి పూలలోయలో ప్రతిబింబించే ఆ సుందర దృశ్యాన్ని వర్ణించడం మహాకవులకే సాధ్యం అనిపించింది. లోయంతా పూలముగ్గులేసినట్లే ఉంది. ఒక్కోచోట ఒక్కో రంగు పూలూ... మధ్యమధ్యలో ఇంద్రధనుస్సులా రంగురంగుల పూలూ వాటిమధ్యలో వచ్చే పిల్ల సెలయేళ్లూ దాటుతుంటే చిత్రమైన అనుభూతి. ఒకటి రెండు కిలోమీటర్ల దాటాక రంగురంగుల క్రోటన్లు... పూలమొక్కల మధ్యలో రంగుల ఆకుల మొక్కల్ని చూస్తుంటే, ఎవరో పుష్పగుచ్ఛంలో అమర్చినట్లుగా ఉంది. నిజంగా ఆ అమరిక అద్భుత ప్రకృతి చిత్రమే. దూరం నుంచి చూస్తే రంగురంగు చారల తివాచీ పరిచినట్లుగా కనిపిస్తోంది. ఈ పూలఅమరిక ఏటా మారిపోతుంటుంది. ఎందుకంటే గాలివానలకి విత్తనాలు రకరకాల ప్రదేశాల్లో పడి మొలకెత్తుతాయి.
ఎంత దూరం నడిచినా నలువైపులా కనుచూపు మేరలో రంగురంగుల పూలే... జెరానియం, స్నేక్‌ ఫాయిల్‌, హుక్‌డ్‌ స్టిక్‌ సీడ్‌, హిమాలయన్‌ రోజ్‌, బ్లూ పాపీ, కోబ్రాలిల్లీ, డాగ్‌ ఫ్లవర్‌... ఇలా ఎన్నో రకాలు. వృక్ష నిపుణులకయితే పండగే. సెలయేళ్లు దాటుకుంటూ పూలవనంలో ఎంత దూరం ప్రయాణించామో తెలియలేదు. వెనక్కి రావాలనే అనిపించలేదు. ఒకచోట చిన్న సమాధి కనిపించింది. అది జాన్‌ మార్గరెట్‌ అనే ఆమెదనీ, 1939లో ఇక్కడ దొరికే అరుదైన పుష్పజాతులమీద అధ్యయనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ మరణించిందనీ రాసి ఉంది. తరవాతి కాలంలో ఆమె చెల్లెలు అక్క జ్ఞాపకార్థం సమాధిని నిర్మించిందని డోలీవాళ్లు చెప్పారు. ఆ తరవాతే ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ పూచే ప్రతి పూవూ ఔషధభరితమే. రామాయణంలో హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవని పర్వతం ఈ పూలలోయలోదేనని అంటారు. ఆ పూలమీదుగా వీచే గాలిని పీల్చినా రోగాలన్నీ తగ్గుతాయట. సుమారు 8 కిలోమీటర్ల పొడవూ 2 కిలోమీటర్ల వెడల్పులతో హిమాలయ పర్వతశ్రేణుల మధ్య విస్తరించిన ఈ పూలలోయకి తూర్పున నందాదేవి అభయారణ్యం ఉంది. ట్రెక్కర్లు నందాదేవి అభయారణ్యానికి పొద్దున్నే వెళ్లి, సాయంకాలానికి తిరిగి వస్తుంటారు. ఇక్కడ మంచు పులి, నల్ల ఎలుగుబంట్లు, ఎర్ర నక్కలు, నీలి గొర్రెలు, కస్తూరి మృగాలు ఉంటాయి.
లోయలో అక్కడక్కడా కొంగలూ డేగలతోబాటు రంగురంగుల ఈకలతో ఉండే మోనల్‌ పక్షులు కనువిందు చేశాయి. అంత అందమైన లోయను వదల్లేక వదల్లేక వెనక్కి మళ్లాం. ఘంగారియా చేరాక గానీ మేం అల్పాహారం కూడా చేయలేదని గుర్తు రాలేదు. వేడివేడిగా నూడుల్స్‌ తిని, టీ తాగి హేమకుండ్‌ సాహెబ్‌కి బయలుదేరాం.హేమకుండ్‌ సాహెబ్‌!
గోవింద్‌ఘాట్‌ నుంచి పూలలోయకి 12 కిలోమీటర్ల ప్రయాణం ఒక ఎత్తయితే, ఘంగారియా నుంచి హేమకుండ్‌ వరకూ ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం మరో ఎత్తు. ఈ కిలోమీటర్ల లెక్క ఎప్పుడూ ఒకేలా ఉండదు. తరచూ కురిసే వర్షాల వల్ల ముందు ఉన్న దారి మూసుకుపోతుంటుంది. కొండరాళ్ల మధ్య నుంచి దారి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
హేమకుండ్‌కి వెళ్లడం అంటే 4329 మీటర్ల ఎత్తుకి చేరుకున్నట్లే. కొండలు నిటారుగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఆక్సిజన్‌ సిలిండర్లు వెంట ఉంచుకోవడం మంచిది. సన్నగా వాన పడటంతో వణుకు మొదలైంది. భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగించాం. మరో రెండుకిలోమీటర్ల తరవాత కొండల్లో బ్రహ్మకమలం మొక్కలు పూలతో కనిపించేసరికి మా ఆనందానికి హద్దులేకపోయింది. మేం వెళ్లింది సెప్టెంబరు మాసం కావడం వల్ల బ్రహ్మకమలాల్ని చూడగలిగాం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వీటిని రక్షిత పూసంపదగా ప్రకటించింది. పూలను ఫొటోలు తీసుకున్నాం. మిగిలిన ప్రయాణం కష్టంగా ఉన్నా బ్రహ్మకమలాలు చూసుకుంటూ ప్రయాణం సాగించాం. మొత్తం అయిదు కిలోమీటర్లూ రెండున్నర గంటల్లో చేరుకున్నాం.
గుర్రాలు దిగి, గురుద్వారాకి నడిచి వెళ్లాం. గురుద్వారా బయట లాంగరులో వేడి టీ, కిచిడీ, రోటీ కూర ఇస్తున్నారు యాత్రికులకి.
గురుద్వారాకి పక్కన ఉన్న సరస్సే హేమకుండ్‌. 1960లో ఇక్కడ గురుద్వారా నిర్మించారు. నాటి నుంచీ ఏటా ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ వంటలు చేసి పెట్టే వాళ్ల శ్రద్ధను మెచ్చుకోకుండా ఉండలేం. రాత్రికి హేమకుండ్‌లో ఎవరూ ఉండకూడదనీ దేవతలు ఆ సరస్సులో స్నానం చెయ్యడానికి వస్తారనీ వాళ్లను చూసిన మనుషులు ప్రాణాలతో ఉండరన్నది స్థానికుల నమ్మకం. దాంతో మళ్లీ మధ్యాహ్నం కిందకి వచ్చేస్తారు. అయితే రాత్రిపూట అక్కడ ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి మరణిస్తారనేది సైంటిస్టుల వాదన. సరస్సు చుట్టూ ఏడు కొండలూ(సప్తశృంగపర్వతం) వాటిమీద సిక్కుల మతపరమైన ధ్వజాలూ కనిపిస్తాయి. వీటిని నిశాన్‌ సాహెబ్‌ అంటారు. అక్కడికి సమీపంలో ఓ చిన్నబోర్డు మీద లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అని రాసి ఉంది. ఆ ఎముకలు కొరికే చలిలో సిక్కులు ఆ సరోవరంలో స్నానాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడి హాల్లోని పవిత్ర గంథ్రాన్ని దర్శించి, వేడి టీ తాగి ఘంగారియాకి బయలుదేరాం.