close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పనికిరానివాడు

పనికిరానివాడు
- కొయిబాడ రామ్మోహన్‌రావు

‘‘ఏరా, ఎక్కడున్నావు... ఇంట్లోనేనా?’’ కాజువల్‌గా అడిగాను.
‘‘హాస్పిటల్లో ఉన్నాను’’ అంటున్న భరద్వాజ గొంతులో ఏదో తేడా కనిపించింది.
‘‘హాస్పిటల్లోనా... ఈ టైమ్‌లోనా... రాత్రి పది గంటలకు..?’’ ఆశ్చర్యపోయాను.
అటునుంచి సమాధానం రాలేదు.
అప్పుడు తట్టింది నాకు - భరద్వాజ డాక్టర్‌ కదా... అర్జంటు కేసు ఏదైనా వచ్చి ఉంటుందేమోనని!
ఆ విషయమే అడిగాను. ఊహించని సమాధానం వచ్చింది.
‘‘గౌతమ్‌ సూసైడ్‌ ఎటెమ్ట్‌ చేశాడ్రా’’ అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
‘‘వాట్‌..??’’ అదిరిపడ్డాను.
‘‘ఏమైందిరా? ఎందుకలా జరిగింది?’’ అడిగాను ఆత్రుతగా.
అటునుంచి సమాధానం లేదు.
‘‘హలో... హలో... హలో...’’ అంటున్నాను నేను కంగారుపడుతూ.
‘‘సారీ సర్‌, ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరు. నేను ఆయన ఫ్రెండ్‌ రవికాంత్‌ని’’ అంటూ కొత్త గొంతు వినిపించింది ఫోన్‌లో.
‘‘రవికాంత్‌గారూ, ఏమయింది... కాస్త వివరంగా చెపుతారా?’’ ఆత్రుతగా అడిగాను.
‘‘ఈరోజు సాయంత్రం... ...’’ అంటుండగా హడావిడిగా ఇద్దరు ముగ్గురు మాట్లాడటం వినిపించింది. వాళ్ళ మాటలనుబట్టి అక్కడేదో గడబిడ జరుగుతున్నట్లనిపించింది.
‘‘విష్ణుగారూ... గౌతమ్‌కి సీరియస్‌ అయినట్లుంది. నేను ఐసీయూకి వెళ్తున్నాను. తర్వాత మీకు ఫోన్‌ చేస్తాను’’ అంటూ
ఫోన్‌ కట్‌ చేశాడతను.
ఆ హఠాత్‌ పరిణామానికి నిశ్చేష్టుడినయి పోయాను. గౌతమ్‌ గుర్తుకురాగానే మనసంతా బాధతో నిండిపోయింది. ‘ఎందుకలా చేశాడు? తన జీవితాన్ని మొగ్గలోనే తుంచేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది వాడికి?’
అనుకుంటూ బాధపడ్డాను.

*     *      *      *      *

భరద్వాజ నా చిన్ననాటి స్నేహితుడు. అతని భార్య త్రిలోచన. వాళ్ళిద్దరూ డాక్టర్లే. వాళ్ళకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అనిరుధ్‌. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడం వల్ల వైజాగ్‌లోనే మెడిసిన్‌లో సీటొచ్చింది. చాలా తెలివైనవాడనీ, గొప్ప ప్రయోజకుడవుతాడనీ భరద్వాజకు వాడంటే ఎంతో ఇష్టం. రెండవవాడు గౌతమ్‌. ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. వాడూ తెలివైనవాడేగానీ సరిగ్గా చదవడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బోధ చేసినా ప్రయోజనం లేదు. వాడి మార్కులు చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది... ఏం చేయగలం? ‘మొన్నటిదాకా స్కూలువాళ్ళూ ఇప్పుడు కాలేజీవాళ్ళూ వాళ్ళ సంస్థలకు మమ్మల్ని పిలిపించుకుని, వీడి గురించి కంప్లైంట్‌ చేస్తుంటే తల తీసేసినట్లు అవుతుంది. మాస్టర్లు చెప్పినట్లు చదవడట. చెప్పింది చదవకుండా డౌట్లు తీర్చమంటూ వాళ్ళ టైమూ వీడి టైమూ వేస్ట్‌ చేసుకుంటూ ఉంటాడట. వీడివల్ల నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం’ అంటూ గౌతమ్‌ ముందే విసుక్కుంటున్న భరద్వాజను చూసి, ‘ఇంత చదువుకున్న భరద్వాజేనా ఇలా మాట్లాడుతున్నాడు?’ అనుకున్నాను.
ఆ సమయంలో చిన్నబుచ్చుకున్న గౌతమ్‌ ముఖం చూస్తే జాలేసింది.
‘ఇంటికెవరొచ్చినా ఇలా పెద్దాడిని పొగుడుతూ చిన్నాడిని ఇన్సల్ట్‌ చేస్తూ మాట్లాడతారు. ఈయనకు మీరైనా చెప్పండన్నయ్యగారూ’ అని రిక్వెస్ట్‌
చేసింది త్రిలోచన.
నేను సమాధానం చెప్పేలోపుగానే అందుకున్నాడు భరద్వాజ ‘వాడు నాకు చెప్పడం కాదు. ప్రొఫెసర్‌ కదా... వాడే
ఈ సమస్యకు సొల్యూషన్‌ చెప్పాలి’ అంటూ.
నేను బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. వైజాగ్‌లో ఒక కాన్ఫరెన్స్‌ కోసం నా కూతురు అంకితతో వచ్చాను. అంకిత టెన్త్‌క్లాస్‌ చదువుతోంది. మహా తెలివైన పిల్ల.
‘చెప్పరా... ఏం చేయమంటావు?’ అడిగాను.
‘ఏం లేదురా, వాడికి ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో మంచి మార్కులు రావటం లేదు. ఆ రెండు సబ్జెక్టులలో టెస్టులు పెట్టి, ఆ పేపర్లు దిద్దరా. వాడి లోపం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఎలా చదవాలో, ఎలా రాయాలో గైడ్‌ చేద్దువుగాని’ అన్నాడు.
‘నిన్న నాకు చేసిన ఫ్రీ మెడికల్‌ చెకప్‌కి బదులు రాబట్టే ప్లాన్‌లో ఉన్నావేమిట్రా?’ అంటూ నవ్వేశాను. వాడూ జత కలిపాడు నవ్వుతూ.
ఇంటర్‌ చదివేవాళ్ళకు నేనెప్పుడూ ఫిజిక్స్‌గానీ కెమిస్ట్రీగానీ చెప్పలేదు. ఈ పని నాకు కాస్త ఇబ్బందే. అయినా భరద్వాజ కోసం కాకపోయినా గౌతమ్‌ కోసం చేయాలనిపించి టెక్స్ట్‌బుక్‌లు తీసుకుని స్టడీ చేసి, ఫిజిక్స్‌లో కొన్నీ, కెమిస్ట్రీలో కొన్నీ పాఠాలు చదవమని చెప్పి, మర్నాడు టెస్ట్‌ పెట్టాను. అయితే, ఆ పేపర్లు అక్కడ దిద్దటానికి టైమ్‌ లేకపోవడంతో నాతో బనారస్‌ తెచ్చేశాను. ఇంటికెళ్ళాక అవి దిద్ది, వాటి గురించి ఫోన్లో మాట్లాడతానని చెప్పి, రైలెక్కేశాను.
రైల్లో భరద్వాజ కుటుంబం గురించే మాట్లాడుకున్నాం నేనూ, అంకిత.
అనిరుధ్‌ చిన్నప్పటి నుంచీ చదువులో బ్రైట్‌గా ఉండటంవల్లా, మంచి ర్యాంక్‌తో మెడిసిన్‌లో సీటు తెచ్చుకోవడం వల్లా, పిల్లలిద్దరూ ఇష్టపడితే వాడిని అల్లుడిగా చేసుకోవాలని నేనూ, నా భార్యా అనుకునేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం పెంచడానికే ఈ ట్రిప్‌లో అంకితను నాతో తీసుకొచ్చాను. కానీ, అనిరుధ్‌ అంకితను ఇంప్రెస్‌ చేయలేకపోయాడు. మహా మేధావిలా ఫోజు కొడతాడనీ, అతనికి విపరీతమైన గర్వమనీ అంకితకు స్పష్టమైపోయింది.
‘నా ఉద్దేశ్యంలో అనిరుధ్‌కన్నా గౌతమ్‌ తెలివైనవాడు డాడీ. గౌతమ్‌ నీలా మంచి ప్రొఫెసర్‌ అవుతాడని నాకనిపిస్తుంది’ అంది.
ఆశ్చర్యంగా చూశాను ఆమెవైపు. ‘దేనిగురించి అయినా అతను వివరించే విధానం ఎక్స్‌లెంట్‌. అంతేకాదు, తాను చెప్పే విషయం గురించి ఎంతో లోతుగా పరిశోధన చేసి తెలుసుకుంటాడు. రియల్లీ హి ఈజ్‌ ఎ జీనియస్‌’ అంది మెరుస్తున్న కళ్ళతో.
అంకిత తన వయసు పిల్లలలాగా కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది. తను ఆలోచించే విధానం, ఎదుటి మనిషిని విశ్లేషించి అంచనావేసే విధానం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకే గౌతమ్‌పైన నాకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను. గౌతమ్‌ ఎంత తెలివైనవాడోనన్న విషయాన్ని నాలుగైదు ఉదాహరణలతో చెప్పేసరికి ‘ఎంత బాగా స్టడీ చేసింది’ అనుకుంటూ ఆశ్చర్యపోయాను.
అలా మాట్లాడుకుంటుండగా ‘అన్నట్లు అక్కడున్న నాలుగు రోజుల్లో స్కూటర్‌ డ్రైవింగ్‌ నేర్చుకోమన్నాను. నేర్చుకున్నావా?’ అని అడిగాను కాజువల్‌గా. నవ్వింది అంకిత. ‘డ్రైవింగ్‌ సగమే నేర్చుకున్నాను, కానీ దానివెనకున్న సైన్స్‌ పూర్తిగా నేర్చుకున్నాను’ అంది నవ్వుతూనే. ఏమిటన్నట్లు చూశాను. ‘అనిరుధ్‌ డ్రైవింగ్‌ నేర్పేటప్పుడు ‘ఏక్సిలేటర్‌ రైజ్‌ చేస్తే- స్కూటర్‌ ఎందుకు స్పీడ్‌గా వెళ్తుంది?’ అని అడిగాను. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశాడు. అపుడు అదే ప్రశ్న గౌతమ్‌కి వేస్తే ‘దానికి ఆన్సర్‌ చెప్పాలంటే నీకు ఇంకా చాలా చెప్పాలి’ అంటూ వివరించి చెప్పాడు’ అంది. ‘ఏం చెప్పాడో వినాలని ఉంది బేబీ’ అన్నాను.
‘స్కూటర్‌ నడవడానికి మూలసూత్రం- మనం వేసే పెట్రోల్‌లోని కెమికల్‌ ఎనర్జీ ముందు హీట్‌ ఎనర్జీగా మారడం, ఆ తర్వాత ఆ హీట్‌ ఎనర్జీ మెకానికల్‌ ఎనర్జీగా మారడం. ఏక్సిలేటర్‌ మీద చేయివేసి, ఇగ్నిషన్‌ ఆన్‌ చేయగానే, కార్బొరేటర్‌లో ఉన్న పెట్రోల్‌ జెట్‌ ద్వారా బయటకొచ్చి, స్పార్క్‌ప్లగ్‌ నుంచి వచ్చిన ‘స్పార్క్‌’ వల్ల మండిపోయి హీట్‌ ఎనర్జీగా మారుతుంది. స్పార్క్‌ప్లగ్‌ దగ్గరగా ఉన్న ఇంజిన్‌ కారణంగా ఆ హీట్‌ ఎనర్జీ మెకానికల్‌ ఎనర్జీగా మారుతుంది. ఆ మెకానికల్‌ ఎనర్జీని అందుకున్న స్కూటర్‌ వెనుక చక్రం తిరుగుతుంది. దాంతో ముందు చక్రమూ తిరిగి స్కూటర్‌ పరిగెడుతుంది. ఏక్సిలేటర్‌ రైజ్‌ చేస్తుంటే, పెట్రోల్‌ ఎక్కువగా విడుదలవుతూ, ఎక్కువ ఎనర్జీ అందించబడటంతో స్కూటర్‌ వేగాన్ని అందుకుంటుంది. అంతేనా డాడీ? కరెక్ట్‌గానే చెప్పానా?’ అడిగింది ఎంతో ఉత్సాహంగా. నవ్వుతూ తలూపాను.
పెద్దగా సైన్స్‌ పరిజ్ఞానంలేని టెన్త్‌క్లాస్‌ అమ్మాయి అంత బాగా వివరించేసరికి స్టన్‌ అయిపోయాను. అయితే ఆ గొప్పతనం అంతా గౌతమ్‌దేనని నాకు అర్థమైంది.
‘ఇలాంటివాడినా... ఎందుకూ పనికిరాడని భరద్వాజ తిడుతున్నాడు’ అనుకుంటూ బాధపడ్డాను.అంతవరకూ భరద్వాజ చెప్పే మాటలను బట్టి గౌతమ్‌ మీద నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం తప్పని నాకు అర్థమైంది. గౌతమ్‌ పేపర్లు దిద్దితే వాడి గురించి మరికొన్ని విషయాలు తెలియవచ్చు అనుకున్నాను. ఇంటర్‌ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పే అనుభవం లేకపోవడం వల్లా, ఎప్పుడో వదిలేసిన కెమిస్ట్రీతో టచ్‌ లేకపోవడం వల్లా, గౌతమ్‌ పేపర్లను దిద్దడానికి నేను కుస్తీ పడాల్సి వచ్చింది. ఆ టాపిక్స్‌ని బాగా స్టడీ చేసి పేపర్లను దిద్దేసరికి గౌతమ్‌ గురించి నాకు అవగాహన వచ్చింది. సబ్జెక్ట్‌ కోసమేగానీ మార్కుల కోసం చదివే విద్యార్థి కాదు గౌతమ్‌. వాడికి ఏదయినా టాపిక్‌ నచ్చినా, అందులో ఏదైనా డౌట్‌ వచ్చినా, ఆ టాపిక్‌ గురించి కూలంకషంగా పరిశోధించే తత్వముందని నాకు అర్థమైంది. ఏదైనా ఒక టాపిక్‌లో ఇంట్రెస్ట్‌ లేకపోతే దాని జోలికే వెళ్ళకుండా వదిలేస్తాడనే విషయం కూడా తెలిసింది నాకు. కొన్ని టాపిక్స్‌ అంటీముట్టనట్లు వదిలేశాడు. కొన్ని టాపిక్స్‌ అద్భుతంగా రాశాడు. ఆ టాపిక్‌ మీద బాగా రీసెర్చ్‌ చేసినవాడిలా ఎంతో లోతుకు వెళ్ళి విశ్లేషించి రాసినట్లున్నాయి వాడి సమాధానాలు. అవి చదువుతుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత గౌతమ్‌ గురించి భరద్వాజకు చెప్పి, అతని దురభిప్రాయాన్ని పోగొట్టాలనుకున్నాను.
కానీ, ఇంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు గౌతమ్‌.

*     *      *      *      *

రవికాంత్‌ నుంచి ఏ ఫోనూ రాకపోయేసరికి త్రిలోచనకు ఫోన్‌ చేశాను. లక్కీగా ఆ ఫోన్‌ రింగ్‌ అయింది. గౌతమ్‌ పరిస్థితి మెరుగయిందనీ ప్రమాదం తప్పిందనీ తెలుసుకోగానే ప్రాణం లేచివచ్చినట్లయింది. మర్నాడే ఫ్లైట్‌లో నేనూ, నా భార్య అరవింద, అంకిత వైజాగ్‌ వచ్చేశాం. అప్పటికి గౌతమ్‌ని ఇంటికి తీసుకొచ్చేశారు. నిద్రపోతున్న గౌతమ్‌ని డిస్టర్బ్‌ చేయడం ఇష్టంలేక అందరం డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చున్నాం. త్రిలోచన జరిగినదంతా చెప్పింది.
‘‘వాడు ఈ పని క్షణికావేశంలో చేయలేదన్నయ్యా! ఎప్పటినుంచో వాడు అనుభవిస్తున్న క్షోభ ఇప్పటికి తారాస్థాయికి చేరిందనుకుంటున్నాను. నిన్న కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌ అందరిముందూ బాగా అవమానపరిచాడట. అంతకు గంటముందు వీడి పద్ధతి మార్చుకోమని ప్రిన్సిపాల్‌ అరగంటపాటు క్లాస్‌ పీకాడట. మనసు బాగా గాయపడి ఇంటికొచ్చిన వాడికి ఇదిగో ఈయన దగ్గరా చివాట్లు తినక తప్పలేదు. దాంతో మనసు విరిగి... ....’’ అంటూ భోరున ఏడ్చింది త్రిలోచన.
భరద్వాజ తప్పుచేసినవాడిలా తల వంచుకుని, రెండు చేతుల్తో ముఖం కప్పుకుని హృదయ విదారకంగా ఏడవడం మొదలుపెట్టాడు. నేనూ అరవిందా వాళ్ళిద్దరినీ ఓదార్చే పనిలో పడ్డాం.
కాసేపటికి వాళ్ళిద్దరూ తేరుకున్నారు. గౌతమ్‌ గురించి నేను చెప్పాల్సింది ఇప్పుడు ‘చెప్పనా, వద్దా?’ అనుకుంటూ తర్జనభర్జన పడ్డాను. చెప్పటానికే సిద్ధపడ్డాను.
‘‘గౌతమ్‌ గురించి నేనూ అంకితా స్టడీ చేసిన కొన్ని విషయాలు మీముందు ఉంచాలనుకుంటున్నాను. మీరు నమ్ముతారో లేదో... నాకన్నా ముందుగా అంకితే వాడిలో ఉన్న ‘మేధావి’ని గుర్తించింది.
అలా ఆశ్చర్యంగా చూడకండి. ఎందుకూ పనికిరాడనుకున్న వాడొక జీనియస్‌ అని వాడు రాసిన పేపర్లు చదివేవరకూ నాకు తెలియలేదు. వాడు ఈ అఘాయిత్యం తలపెట్టడానికి నాకు రెండు కారణాలు కన్పిస్తున్నాయి. మీరిద్దరూ బాగా బిజీగా ఉండే డాక్టర్లు కావడంవల్ల ‘వాడి సమస్య ఏమిటో... దానికి పరిష్కారం ఏమిటో’ ఆలోచించే తీరిక మీకు లేకపోవడం మొదటిది. వాడు చదివిన స్కూలూ, కాలేజీలు ఇచ్చిన రిపోర్టునే పూర్తిగా మీరు నమ్మడం రెండవ కారణం. గౌతమ్‌ మేధావి అని నేను నమ్మినప్పటికీ ‘వాడు ఎందుకు షైన్‌ అవలేకపోతున్నాడు?’ అనే ప్రశ్నకు సమాధానం, వాడి పేపర్లు దిద్దినప్పుడు నాకు తెలిసింది.
గౌతమ్‌ సబ్జెక్ట్‌ కోసమేగానీ, మార్కుల కోసం చదివే విద్యార్థి కాదు. వాడికి ఏదైనా ఒక టాపిక్‌ నచ్చినా, అందులో సందేహమేదైనా ఉన్నా, వాటి గురించి కూలంకషంగా పరిశోధించి, ఎంత లోతుకయినా వెళ్ళి తెలుసుకుంటాడు. ఒక టాపిక్‌పైన వాడికి శ్రద్ధ కలగకపోతే దాని జోలికే వెళ్ళడు. అలాంటి టాపిక్స్‌ గురించి అంటీముట్టనట్లు రాస్తాడు పరీక్షల్లో. వాటి గురించి వాడు రాసినది చదివితే, చదువు మీద ఆసక్తిలేని విద్యార్థి రాసిన సమాధానాల్లా ఉంటాయి వాడి రాతలు. వాడికి నచ్చిన టాపిక్స్‌ గురించి ఎంతో అద్భుతంగా రాస్తాడు. వాటిని చదువుతుంటే ఆ పరిజ్ఞానాన్ని పొందడానికి ఎంత లోతుకెళ్ళాడో, ఎంత శ్రమించాడో తెలుస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు వివరంగా చెబితేనే నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు’’ అంటూ ఒక్క క్షణం ఆపాను.
భరద్వాజ, త్రిలోచన, అనిరుధ్‌లే కాకుండా అరవింద, అంకితలు కూడా ఎంతో ఆసక్తితో నేను చెప్పేదానికోసం ఎదురు చూస్తున్నారు.
‘‘ఫిజిక్స్‌లో డిస్పర్షన్‌ (విక్షేపణం) మీద
ఏదో ప్రశ్న ఇచ్చాను. దాని గురించి రాయవలసినదంతా రాశాడు. అందరిలాగే ‘ఇంద్రధనుస్సు’ ఉదాహరణగా ఇచ్చాడు. వర్షంపడి, వెలిసినప్పుడు వాతావరణంలో ఉన్న నీటి బిందువులలోకి చొచ్చుకునిపోయిన తెల్లని సూర్యకాంతి విక్షేపణం చెంది, ఏడు రంగులుగా విడిపోతుందనీ అందుకే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏర్పడుతుందనీ రాస్తూ అదనంగా కొంత వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో ఇంద్రధనుస్సు అర్ధచంద్రాకారంలోనే ఎందుకు ఏర్పడుతుందో వివరించి చెప్పడంతో నేనెంతో ఇంప్రెస్‌ అయ్యాను.
నీటిలో మునిగిన స్కేలు వంగినట్లు ఎలా కనిపిస్తుందో, అలాగే నీటిబిందువులోకి వెళ్ళిన సూర్యకిరణం 40-42 డిగ్రీల కోణంలో వంగుతుందనీ దానివల్లనే ఇంద్రధనుస్సుకు అర్ధచంద్రాకారపు ఆకృతి వస్తుందనీ వాడిచ్చిన వివరణ చూస్తే ‘డిస్పర్షన్‌’ అనే టాపిక్‌ గురించి తెలుసుకోవడానికి ఎంత లోతుకువెళ్ళాడో నాకు అర్థం అయింది.
‘ఆ వయసు కుర్రాడిలో ఇంత జిజ్ఞాసా!!’
అని ఆశ్చర్యపోయాను.
కెమిస్ట్రీలో ‘ఫెర్మంటేషన్‌’ అనే టాపిక్‌ మీద నేనిచ్చిన ప్రశ్నకు వాడిచ్చిన సమాధానం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. నేనిచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం రాసినా ఆ టాపిక్‌ గురించి వాడు ఎంతలా ఆలోచించాడో అది చదివితే నాకు అర్థమైంది. టెక్స్ట్‌బుక్‌లో ఉన్నదంతా యధాతథంగా ఆన్సర్‌ పేపర్లలో ఎవరైనా రాస్తారు. కానీ అదే విషయాన్ని  నిత్య జీవితంలో జరిగేవాటికి అనువర్తింపజేస్తూ, విశ్లేషణ చేస్తూ రాయడం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. నిస్సందేహంగా గౌతమ్‌ అలాంటివాడు.
లేక్టోజ్‌ అనే చక్కెర గల పాలు తియ్యగా ఉంటాయనీ, లేక్టిక్‌ ఏసిడ్‌ గల మజ్జిగా, పెరుగూ పుల్లగా ఉంటాయనీ, పాలలో మజ్జిగను కలిపి తోడు వేసినప్పుడు, మజ్జిగలోని బాక్టీరియా వల్ల ఫెర్మంటేషన్‌ జరుగుతుందనీ, ఆ రియాక్షన్‌లో లేక్టోజ్‌ లేక్టిక్‌ ఆమ్లంగా మారుతుందనీ రాస్తూ కొంత అదనపు వివరణ ఇచ్చాడు. తాజా పెరుగు కమ్మగా ఉండటానికి కారణం... ఫెర్మంటేషన్‌ ప్రోసెస్‌ పూర్తికాలేదనీ, అందువల్ల కొత్తగా ఏర్పడిన లేక్టిక్‌ ఆమ్లపు పులుపూ మిగిలిపోయిన లేక్టోజ్‌ తాలూకు తీపీ- ఈ రెండు రుచుల కలగలుపుగా కమ్మదనం వస్తుందనీ, ఆ పెరుగుని మరికొన్ని గంటలు వదిలేస్తే ఫెర్మంటేషన్‌ దాదాపు పూర్తిగా జరిగిపోయి పుల్లటి రుచి వచ్చేస్తుందనీ, ఫెర్మంటేషన్‌ అనే రియాక్షన్‌ తక్కువ వేగంతో జరిగే చర్య అనీ రాశాడు. దీన్నిబట్టి నాకు అర్థమయిందేమిటంటే ఈ వివరణ అంతా వాడు టెక్స్ట్‌బుక్‌లో చదివినదీ కాదు, క్లాసులో లెక్చరర్‌ చెప్పినదీ కాదు, ఆ టాపిక్‌ మీద వాడికున్న ఇంట్రెస్ట్‌తో తెలుసుకున్నదేనని.
గౌతమ్‌ పేపర్లు నేను అయిదారుసార్లు చదివాను. ఆ తర్వాత నాకు అర్థమయింది... ‘వాడు పనికిరానివాడు కాదు. ఒక విలక్షణమైన విద్యార్థి. మార్కులూ ర్యాంకులూ తెచ్చుకునే విద్యా వ్యవస్థలో వాడు ఇమడలేడు.
విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో. కొత్తగా వచ్చిన కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో పూర్వంలా కాన్‌సెప్ట్స్‌ బోధించే లెక్చరర్లు ఉండరు, మార్కులూ ర్యాంకులూ తెప్పించే యంత్రాల్లాంటి టీచర్లే ఉంటారు. చెప్పేది తక్కువ, చదివించేదీ రాయించేదీ ఎక్కువ. మంచి మార్కులూ ర్యాంకులూ సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ ఉపయోగిస్తారు. విద్యార్థిలో జిజ్ఞాసనూ విజ్ఞానాన్నీ పెంచే విధానాన్ని కాకుండా, ఎంసెట్‌ లాంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు తెప్పించే టెక్నిక్‌నే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవన్నీ మనకూ తెలుసు. అయినా అక్కడే జాయిన్‌ చేస్తాం. మీకో విషయం చెబితే ఆశ్చర్యపోతారు. ఒక కాన్ఫరెన్స్‌లో ఇంజినీరింగ్‌, మెడికల్‌
కాలేజీలలో పనిచేసే ప్రొఫెసర్లని కలిసినప్పుడు, ‘ఈ కార్పొరేట్‌ కాలేజీల నుంచి వచ్చే స్టూడెంట్స్‌లో సగం మందికి అద్భుతమైన ర్యాంకులూ బ్రహ్మాండమైన మార్కులూ ఉన్నా కాన్సెప్ట్‌ల విషయంలో చాలా వీక్‌గా ఉంటున్నారు. వాళ్ళకు పాఠాలు చెప్పలేక చస్తున్నాం’ అని వాళ్ళు అంటుంటే నాకు మతిపోయింది.గౌతమ్‌కి అటువంటి విద్యా వ్యవస్థ పనికిరాదు. విద్యాపరంగా వాడికి స్వేచ్ఛ కావాలి. వాడి సందేహాలన్నీ తీర్చే నిజమైన గురువులు కావాలి. వాడు ఆసక్తి కోల్పోయిన టాపిక్‌లను అద్భుతంగా బోధించగలిగే
టీచర్లు కావాలి. అప్పుడే వాడిలో ఉన్న ప్రతిభ బయటికొస్తుంది.
గౌతమ్‌ గురించి ఆలోచిస్తుంటే నాకు థామస్‌ ఆల్వా ఎడిసన్‌ కథ గుర్తొచ్చింది. మీరూ చదివే ఉంటారు... ఎడిసన్‌ ప్రైమరీ స్కూల్లో చదివే రోజుల్లో స్కూలు ప్రిన్సిపాల్‌ ఇవ్వమన్న ఒక ఉత్తరం తీసుకొచ్చి తల్లికి ఇస్తాడు. ఆ ఉత్తరాన్ని తల్లి పైకి చదువుతుంది... ‘డియర్‌ మేడమ్‌, మీ అబ్బాయి సూపర్‌ జీనియస్‌. అతనికి చదువు చెప్పగలిగే టీచర్లు మా స్కూల్లో లేరు. మీరే అతనికి చదువు చెప్పుకోవడం ఉత్తమం’ అని. అప్పటినుంచీ తల్లి దగ్గరే చదువుకుని పైకొచ్చి గొప్ప సైంటిస్టుగా పేరు పొందుతాడు ఎడిసన్‌. అతని కీర్తిని చూసి మురిసిపోవడానికి తల్లి జీవించిలేదు. ఆమె జ్ఞాపకాల కోసం ఆమె నివసించిన ఇంటికివెళ్ళి కొన్ని రోజులు గడుపుతాడు. ఒకరోజు డ్రాయర్‌ సొరుగులో మడిచిపెట్టి ఉన్న పాత కాగితం ఒకటి అతనికి కనిపిస్తుంది. ఆసక్తితో దాన్ని చదివితే, చిన్నప్పుడు తను స్కూలు నుంచి తెచ్చిన ఉత్తరమేనని తెలుస్తుంది. అందులో ఇలా ఉంది. ‘డియర్‌ మేడమ్‌, మీ అబ్బాయి మానసిక పరిపక్వత లేనివాడు. అటువంటి వేస్ట్‌ఫెలోకి పాఠాలు చెప్పగలిగే టీచర్లు మా స్కూల్లో లేరు. మీరే అతనికి చదువు చెప్పుకోవడం ఉత్తమం’.
అది చదివిన తర్వాత ఎడిసన్‌ భోరున ఏడుస్తాడు. తేరుకున్న తర్వాత తన డైరీలో- ‘ఒకప్పుడు నేను మానసిక పరిపక్వతలేని, పనికిరాని విద్యార్థిని. అలాంటివాడిని ఈ శతాబ్దానికే మేధావిగా తీర్చిదిద్దిన దేవత
నా తల్లి’ అని రాసుకుంటాడు.’’ చెప్పడం ఆపాను. ఆనాటి ఎడిసన్‌నీ, ఈనాటి గౌతమ్‌నీ గుర్తుతెచ్చుకోగానే కన్నీళ్ళు జలజల రాలాయి. నాతోపాటూ అందరి కళ్ళూ ఆర్ద్రమయ్యాయి. ‘వందేళ్ళక్రితం ఎడిసన్‌కి వచ్చిన కష్టమే ఇప్పుడు గౌతమ్‌కి వచ్చింది. ఎడిసన్‌లోని జీనియస్‌ని గుర్తించలేని స్కూలు ప్రిన్సిపాలూ టీచర్లూ ఆ అద్భుతమైన మేధావిని పనికిరానివాడిగా ముద్ర వేశారు. ఎడిసన్‌ని ఆదుకోవడానికి అతని తల్లి ఉంది. గౌతమ్‌కి ఎవరూ లేకుండాపోయారు’ అనుకోగానే నాకు చాలా బాధ కలిగింది.
‘గౌతమ్‌ బాధ్యత నేను తీసుకుంటే...’ అనిపించింది. వాడిని సరైన దారిలోపెట్టి
గొప్ప ప్రయోజకుడిని చేయాలనిపించింది.
ఆ విషయమే భరద్వాజ దంపతులకు చెబితే వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.
‘‘మా తప్పు తెలుసుకున్నాంరా. మళ్ళీ
ఆ పొరపాటు చెయ్యం. నీ గైడెన్స్‌ తప్పకుండా తీసుకుంటాం. ఆంధ్రదేశంలో వాడికి నచ్చిన గురువులను వెదికి పట్టుకుంటాం. చదువు విషయంలో వాడికి పూర్తి స్వేచ్ఛనిస్తాం.
నువ్వే చూస్తావుగా’’ అన్నాడు భరద్వాజ.
అవునన్నట్లు తలూపారు త్రిలోచన, అనిరుధ్‌.
నాకు ఎంతో భారం దింపుకున్నట్లయింది. మనసు దూదిపింజలా తేలికయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.