close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొటిమల మచ్చలు పోవాలంటే...

మొటిమల మచ్చలు పోవాలంటే...

చాలామందికి మొహంమీద మొటిమ రావడం ఆలస్యం... దాన్ని ఒకటే గిల్లుతుంటారు. ఫలితంగా నల్లమచ్చ ఖాయం. ఆ తరవాత అదెలా పోతుందా అని తెగ సతమతమైపోతుంటారు. అందుకే ఆ మచ్చలు పోవడానికి ఇలా చేసి చూడండి...
* టేబుల్‌స్పూను సెనగపిండిలో రోజ్‌వాటర్‌ లేదా నిమ్మరసం కలిపి పేస్టులా చేసి మొహానికి పట్టించాలి. మచ్చలమీద కాస్త మందంగా పెట్టి బాగా ఆరాక నీటితో కడిగేయాలి. ఇలా రోజువిడిచి రోజు చేస్తే క్రమంగా మొటిమల మచ్చలు తగ్గుతాయి.
* టేబుల్‌స్పూను ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె, కాసిని నీళ్లు కలిపి మొహానికి పట్టించి ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి.
* రెండు టేబుల్‌స్పూన్ల బేకింగ్‌ సోడాలో టేబుల్‌స్పూను నీళ్లు పోసి మొహానికి పట్టించాలి. ఇలా రోజుకోసారి తగ్గేవరకూ చేయాలి. బేకింగ్‌ సోడా మృతకణాలను తొలగించడంతోబాటు మొటిమల మచ్చల్నీ పోగొడుతుంది.
* కొబ్బరినూనె రాసినా మంచిదే. లేదంటే టీస్పూను కమలాతొక్కల పొడిలో టీస్పూను తేనె వేసి వాటిమీద రాసి ఆరాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మచ్చలు త్వరగా తగ్గుతాయి.


కిస్‌మిస్‌ తింటున్నారా?

వేసవిలో ఎండుద్రాక్ష, ఎండుఖర్జూరం తింటే మంచిదన్నది తెలిసిందే. ఆయుర్వేద వైద్యులతోబాటు అల్లోపతీ నిపుణులూ ఇవి ఆరోగ్యానికి మంచివే అంటున్నారు.
* ఎండుద్రాక్షలోని పీచు కారణంగా జీర్ణశక్తికి అవి చాలా మంచివి. మలబద్ధకం, డయేరియానీ నివారిస్తాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకీ తోడ్పడతాయి.
* వీటిల్లో పొటాషియం, కెటెచిన్లు, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవాళ్లకి ఎంతో మేలు.
అలాగే ఇందులోని ఫినాలిక్‌ పదార్థాలు క్యాన్సర్లు రాకుండానూ అడ్డుకుంటాయి. బీపీ నియంత్రణకీ మంచివే. మధుమేహంతో బాధపడేవాళ్లకి ఇతరత్రా స్నాక్స్‌ తినడం కన్నా ఇవే మేలు.
* ఎండుద్రాక్షలో ఐరన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
* వీటిని తినడం వల్ల దంత సమస్యలూ చిగుళ్ల వ్యాధులూ కూడా తగ్గుతాయి. కాలేయ ఆరోగ్యానికీ దోహదపడతాయి.
* ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలున్నవాళ్లకి ఇవి ఎంతో ఉపయోగపడతాయట. ముఖ్యంగా మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి ఇవి చాలా మంచివి. ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేనివాళ్లకి ఎండుద్రాక్ష తింటే ఆరోగ్యం మెరుగవుతుంది.
* ఇవి మెదడుకీ మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిశిత దృష్టి, సమన్వయం వంటివి పెరుగుతాయి.
* ఆయుర్వేదం ప్రకారం వీటివల్ల సంతాన సాఫల్యత కూడా పెరుగుతుంది.


బొజ్జ పెరిగిందా... గుండె గోవిందా..!

పొట్ట పెరిగితే వచ్చే సమస్యల గురించి మనకు తెలియంది కాదు. లావుగానే ఉన్నా పొట్టలేని వాళ్లతో పోల్చితే, సన్నగానే ఉన్నా పొట్ట ఉన్నవాళ్లకి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ పేర్కొంటోంది. ఇందుకోసం వాళ్లు 45 ఏళ్లు దాటిన 1500 మందిని సుమారు 16 సంవత్సరాలపాటు పరిశీలించగా- వాళ్లలో ఊబకాయులకన్నా కూడా పొట్ట ఉన్నవాళ్లకే హృద్రోగాలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. దీన్నిబట్టి పిరుదుల భాగం కన్నా పొట్ట పరిమాణం ఎక్కువగా ఉంటే వ్యాయామం మీద దృష్టి పెట్టడం తప్పనిసరి అంటున్నారు. ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం, మెట్లు ఎక్కి దిగడం, పిండిపదార్థాలు తగ్గించడం వంటి జాగ్రత్తలు పాటించాలి. బరువు తగ్గడం కన్నా పొట్ట తగ్గడం ముఖ్యం అన్నది గుర్తించాలి.


సంగీతం... మర్చిపోనివ్వదు!

మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆల్జీమర్స్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడమే కాదు, ఆలోచనాశక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంటుంది. అయితే అందుకు కారణమైన భాగాలకు సంగీతం మందులా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా హెల్త్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. సంగీతం కారణంగా మెదడులోని ఆయా భాగాలు చురుకుగా మారతాయట. ఇందుకోసం వీళ్లు కొందరు ఆల్జీమర్స్‌ రోగుల్ని ఎంపిక చేసి వాళ్లలో జ్ఞాపకశక్తిని తిరిగి తెప్పించేందుకు పాత పాటల్ని వినిపించారట. అవి వింటూ వాళ్లు క్రమంగా హమ్‌ చేయడాన్నీ ఆయా భాగాల్లోని మెదడు కణాలు చురుకుగా మారడాన్నీ గమనించారట. అంతేకాదు, క్రమం తప్పకుండా ఆ పాటల్ని వినడం వల్ల వాళ్లలో మతిమరపు క్రమంగా తగ్గి, కాస్త ఆలస్యంగానైనా విషయాల్ని గుర్తుతెచ్చుకోవడం ప్రారంభించారట. అందుకే పెద్దవాళ్లకి వాళ్ల మనసుకి నచ్చిన పాత పాటల్ని రోజూ కాసేపు వినిపించడం వల్ల మతిమరపుని నియంత్రించవచ్చని చెబుతున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.