close
వానప్రస్థం

వానప్రస్థం
- సింహప్రసాద్‌

‘‘అంకుల్‌, నేను రమేష్‌ని... శ్రీపతి గారబ్బాయిని... కెనడా నుంచి మాట్లాడుతున్నాను...’’
‘‘నువ్వటోయ్‌... ఎలా ఉన్నారు? నీ భార్యా పిల్లలూ అంతా బావున్నారా?’’ అతడు ఇంత సడన్‌గా నాకెందుకు ఫోన్‌ చేసి ఉంటాడా అని ఒక పక్క ఆలోచిస్తూనే అడిగాను.
‘‘బావున్నాను అంకుల్‌. మా డాడీ వరసేం బావోలేదు. మీరు కొంచెం మందలించాలి అంకుల్‌...’’
‘‘ఏం చేశాడు?’’
ఈమధ్య అయిదారు నెలల్నుంచి ఊళ్ళో లేను. మా అమ్మాయి డెలివరీ- వాళ్ళుంటోన్న బెంగళూర్లోనే జరగాలని పట్టుబడితే, నేనూ మా ఆవిడా అక్కడే ఉండి ఆ పని పూర్తిచేసి నిన్ననే వచ్చాం.
‘‘మీకు తెలీదా?’’ అతడి స్వరం నిండా ఆశ్చర్యం పరచుకుంది.
‘‘మేం ఊళ్ళో లేంలే... అసలేం జరిగిందీ?’’
‘‘మా మమ్మీ డాడీ సిటీలోని ఇల్లు అమ్మేసి సిటీ అవుట్‌స్కర్ట్స్‌లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు.’’
‘‘అరెరె... నిజమా! అంత కర్మేం వచ్చిందయ్యా వాళ్ళకీ. చెట్టంత కొడుకువి నువ్వున్నావుగా. మరీ ఒంటరితనం అనిపిస్తే నీ దగ్గరికొచ్చి ఉండొచ్చు.’’
‘‘ఆ మాట ఎప్పట్నుంచో చెబుతున్నాం. క్రితంసారి కెనడా వచ్చినప్పుడు ఇక్కడి చలికి తట్టుకోలేకపోయారు. కాళ్ళూ చేతులూ వంకర్లు పోతున్నాయని గొడవపెట్టారు. ఎంత హీటర్లు ఉన్నా కొంచెం చలి ఉంటుందనుకోండీ...’’
‘‘అయితే మాత్రం... వార్ధక్యంలో కొడుకు దగ్గర కాలక్షేపం చేయాలి లేదా ఏదోలా సర్దుకుపోవాలి తప్ప ఎవరూ లేనట్టు ఇలా శరణాలయానికెళ్తారా? ఎంత సిగ్గు!’’
‘‘మీరంటే అర్థంచేసుకుంటారు. నలుగురూ అలా అనుకోరు కదా అంకుల్‌. కొడుకు చూడలేదంటూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరే ఏదో రకంగా డాడీకి నచ్చచెప్పి అక్కడ్నుంచి వచ్చేసేలా చూడండి. డాడీ మీమాట కాదనరు.’’
‘‘చెప్పి చూస్తాన్లేగానీ, మనలో మనమాట... సిటీలోని ఇల్లు అమ్మేసి డబ్బు ఇమ్మని నువ్వేమీ ఒత్తిడి తేలేదు కదా. అసలే వాడికి అభిమానం ఎక్కువ...’’ ఏదో సందేహం పీకుతోంటే అన్నాను. అలాంటిదేదో బలమైన కారణం లేకపోతే శ్రీపతి ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని ఉన్న పళాన ఎందుకు అమ్మేస్తాడు?
ఏదో పని చేసుకుంటున్న నా భార్య చటుక్కున వచ్చి చెవులిటు అప్పగించింది.
‘‘ఛా ఛా... డబ్బు అవసరం నాకెందుకుంటుంది అంకుల్‌...’’
‘‘అవసరం అని కాదు. ఎంత ఉన్నా కొందరికి ఆ దాహం తీరదు. అందుకని అడిగాను. ఏమీ అనుకోకు. ఏదైనా డబ్బు అవసరమొచ్చి ఇల్లు అమ్మేడంటావా?’’
‘‘అదే నిజమైతే ఆ ముక్క నాకు చెప్పొచ్చుగా. నేనేం పరాయివాణ్ణా. అవసరమైనంత డబ్బు నేనే పంపుతానుగా అంకుల్‌’’ బాధగా అన్నాడు.
‘‘సరి సరే. ఇవాళే వెళ్ళి సంగతేంటో కనుక్కుంటాన్లే.’’
‘‘కనుక్కోవడం కాదంకుల్‌... ఎలాగైనా ఒప్పించి వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చేయండి. మీ దగ్గర్లో అద్దెకు ఓ ఫ్లాట్‌ చూసి అందులో ఉంచండి. మీరంతా దగ్గర్లో ఉంటారు గనుక ఒంటరితనం, అభద్రతా ఫీలవరు.’’
‘‘మంచిమాట చెప్పావు. అలాగే చేస్తాన్లే.’’
సెల్‌ ఆఫ్‌ చేశానో లేదో శ్రీమతి నోరు విప్పింది. ‘‘ఏవిటేవిటీ... అన్నయ్యగారు ఆశ్రమంలో ఉంటున్నారా?’’
‘‘అవునట. సిటీలోని ఇల్లు అమ్మేశాట్ట!’’
‘‘మీరిద్దరూ చిన్ననాటి మిత్రులు కదా... మీకు మాటమాత్రమైనా చెప్పకుండా అంత పెద్ద పనెలా చేశారంటారు? ఊహు, దీని వెనుకేదో కుట్ర ఉండి ఉంటుంది. రమేష్‌ ఏదో పెద్ద వ్యూహం పన్నే ఉంటాడు. అవ్వ! కన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రమానికి తరిమేసినవాడు ఏం బాగుపడతాడండీ!’’
‘‘నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట తూలకూడదే.’’
‘‘కంటికెదురుగా నిలువెత్తు నిజం కన్పిస్తోంటే ఇంకా సాక్ష్యాలూ ఆధారాలూ ఏం కావాలండీ! పాతికేళ్ళనుంచీ ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరవతలి ఆశ్రమానికి వెళ్ళిపోయారంటే సంగతేంటో అర్థం కావటం లేదూ. వారింటి ప్రాంతం బాగా డెవలప్‌ అయింది కదా, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టెయ్యాలని ప్లాన్‌ వేసుంటాడు. ఈనాటి కొడుకులు ఎంతకైనా తెగిస్తారండీ. వాళ్ళకి వాళ్ళ బాగు, వాళ్ళ సుఖమే ముఖ్యం. కన్నవాళ్ళు ఎలా అఘోరిస్తున్నా ఫర్లేదు.’’
‘‘కాంతం..!’’ వారించబోయానుగానీ తన వాక్ప్రవాహం ఎక్కడా ఆగలేదు.
‘‘ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వారి కర్మకి వాళ్ళని వదిలేసి దేశం కాని దేశంలో కులుకుతున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? కన్నవాళ్ళని కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత అతగాడి మీద లేదూ!?’’
‘‘ఉందనుకో...’’ నీళ్ళు నమిలాను.
‘‘మరెందుకా దేశాన్ని పట్టుకు వేళ్ళాడుతున్నాడు చెప్పండి... డాలర్ల కోసమే కదా? జన్మనిచ్చిన వారి సంతోషంకన్నా ఆ డబ్బు ఎక్కువైనట్టే కదా? లేకపోతే కెనడాలో ఎందుకుంటాడు?’’
కాంతం నిలదీసి ప్రశ్నిస్తోంటే గతుక్కుమని ఇబ్బందిగా చూశాను.
రమేష్‌ కెనడా వెళ్ళేసరికి మా అబ్బాయిని అమెరికా పంపాలని చాలా ప్రయత్నించాం. కన్సల్టెంటుకి లక్ష రూపాయలిచ్చాం కూడా. కానీ వీసా రాలేదు. లాటరీలో పోయింది. అలా మా అమెరికా డ్రీమ్‌ చెదిరిపోయింది.
మా అబ్బాయి పెళ్ళయ్యేనాటికి సిటీలోనే ఉండేవాడు. పెళ్ళయ్యాక బెంగళూరుకి మారాడు. అదంతా మా కోడలి ఎత్తుగడ అని మా కాంతం అభియోగం!
‘‘బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేవండీ.’’
‘‘చూడు కాంతం, అందరూ డబ్బు కోసమే విదేశాలకి వెళ్ళరు. చక్కని అవకాశాల కోసం, సామర్థ్య నిరూపణ కోసం, కెరీర్లో ఎదుగుదల కోసమూ వెళ్తుంటారు. అలా వెళ్ళారని కన్నవారి
మీద ప్రేమ లేదనుకోవటం సరికాదు. ఇవాళ రేపు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఇక్కడికి దూరం ఇరవై గంటల ప్రయాణమే!’’
‘‘ఇక సరిపెట్టండి మీ నసా, మీ చాదస్తపు మాటలూ. నేను ఇంటికప్పు కింద నిలబడి చెబుతున్నాను వినండి.
ఆ రమేష్‌ వట్టి స్వార్థపరుడు. అతగాడి నిర్వాకం వల్లే కొంపా గోడూ అమ్ముకుని అనాథల్లా ఊరవతలకి వలసబోయారు.
ఇదే పచ్చి నిజమని మీరు అన్నయ్యగారిని కలిసొచ్చాక చెప్పకపోతే చూడండి.’’
కాంతం మాటల్లోనూ నిజం లేకపోలేదన్పించింది.
వెంటనే శ్రీపతికి ఫోన్‌ చేశాను.
‘‘ఎప్పుడొచ్చావురా, అమ్మాయీ మనవరాలూ బావున్నారా?’’ ఆరా తీశాడు.
‘‘అంతా బాగానే ఉన్నారుగానీ... నువ్వేంటి అనాథాశ్రమానికెళ్ళావంట. అంత కర్మేంపట్టిందిరా!’’
‘‘అనాధాశ్రమం కాదు, వృద్ధాశ్రమం.’’
‘‘ఏ రాయి అయినా ఒకటే పళ్ళూడగొట్టుకోడానికి!’’
‘‘ఒకసారి రారా, అన్నీ మాట్లాడుకుందాం.’’
‘‘ఎప్పుడో కాదు, ఇవాళే వస్తున్నాను. అడ్రసు చెప్పు...’’
రెండు బస్సులు మారి ఆటో ఎక్కి వెళ్ళాను. ‘వానప్రస్థం’ అని రాసి ఉన్న ఆర్చి వంకా, సెక్యూరిటీ వంకా కించిత్తు ఆశ్చర్యంగా చూశాను. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఉందనుకుంటూ విజిటర్స్‌ రిజిస్టర్లో సంతకం పెట్టాను.
శ్రీపతి ఇంటిగుర్తులు చెప్పి వెళ్ళమన్నాడు.


 

అందరూ డబ్బు కోసమే విదేశాలకి వెళ్ళరు. చక్కని అవకాశాల కోసం, సామర్థ్య నిరూపణ కోసం, కెరీర్లో ఎదుగుదల కోసమూ వెళ్తుంటారు. అలా వెళ్ళారని కన్నవారి మీద ప్రేమ లేదనుకోవటం సరికాదు.


 

లోపల రకరకాల డాబాలున్నాయి. కొన్నింటికి ఒకటి రెండు అంతస్తులూ వేశారు. దూరాన అపార్ట్‌మెంట్లూ కన్పిస్తున్నాయి. రోడ్డునీ, రోడ్డుకి ఇరుపక్కలా కాంపౌండ్‌వాల్‌ పక్కనా మధ్యమధ్యలోనూ గల పచ్చని చెట్లనీ, సిమెంటు బెంచీలనీ చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా పార్కుని తలపిస్తూ ఉంది వాతావరణం.
ఎండవేడి తగ్గడంతో వృద్ధులు ఇళ్ళల్లోంచి బయటికొచ్చి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్‌ చేస్తున్నారు. నడవలేకపోతున్నవారికి మిగతావారు చేయందించి నడిపిస్తున్నారు. అంతా జంటలుగా గుంపులుగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు. సెంచరీ కొట్టి తీరుతామన్నంత ధీమాగా ఉన్నారు. ఇదో కొత్తలోకంలా అన్పిస్తోంటే అబ్బురపడకుండా ఉండలేకపోయాను.
అల్లంత దూరాన నన్ను చూస్తూనే పిలుస్తూ వచ్చాడు శ్రీపతి. నన్ను హత్తుకుని పొంగిపోయాడు.
‘‘ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? మా మరదల్ని కూడా తీసుకురావాల్సింది.’’
‘‘అద్సరే. నువ్వింత హఠాత్తుగా సిటీ మధ్యలోని ఇల్లు అమ్మేసి ఇక్కడికెందు కొచ్చావు?’’
నవ్వాడు. ‘‘వస్తూనే ఈ దాడి ఏవిట్రా. పద ఇల్లు చూద్దువుగాని.’’
శ్రీపతి ఇల్లు చిన్నగానే అయినా ముచ్చటగా ఉంది. చుట్టూ కాయగూరల మొక్కలున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెండు పడక గదులూ హాలూ ఉన్నాయి. ఫస్ట్‌ ఫ్లోర్లోనూ అలాగే ఉన్నాయనీ దాన్ని అద్దెకు ఇచ్చాననీ చెప్పాడు.
‘‘ఇది అమ్మకానికి రావడంతో హడావుడిగా సిటీలోని ఇల్లు అమ్మేసి దీన్ని కొన్నాను.’’
‘‘అదెంత తెలివితక్కువ పనో తెలుసా..? బిజీ ఏరియాలోని ఇల్లు... రోజురోజుకీ కాదు... గంటగంటకీ విలువ పెరుగుతుంది. అది అమ్మేసి రింగ్‌రోడ్‌ అవతల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవడం తెలివైన పని అంటావ్‌?’’
నా స్వరంలో హేళన ఉన్నా పట్టించుకోకుండా నవ్వేశాడు శ్రీపతి. అయోమయంగా చూశాను.
‘‘మా వానప్రస్థం చూద్దువుగాని రారా...’’ ఇంటిలోంచి బయటికి దారితీస్తూ అన్నాడు. ‘‘ఇవన్నీ రిటైర్మెంట్‌ హోమ్సే. సొంతవీ ఉన్నాయి, అద్దెవీ ఉన్నాయి. కానీ అంతా కలిసే ఉంటాం. కలిసికట్టుగా ఉంటాం.
ఒక మహా కుటుంబంలా ఉంటాం. వైద్య సదుపాయాలూ ఆధ్యాత్మిక కార్యక్రమాలూ సామాజిక సేవ చేసే అవకాశం- అన్నీ పుష్కలంగా ఉన్నాయి.’’
‘‘డబ్బు గుంజటానికిదో తరీకా! అద్సరే, వదినగారు కనిపించటం లేదు... ఇంట్లో లేరా?’’
‘‘అక్కడికే వెళ్తున్నాం, పద.’’
‘‘అక్కడికంటే ఎక్కడికి?’’
నా మాటలు పట్టించుకోలేదు.
‘‘మా కమ్యూనిటీలో ఇళ్ళూ అపార్ట్‌మెంట్లూ కలిపి మొత్తం 70 ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళంతా వృద్ధులే, రిటైరైనవాళ్ళే.’’
‘‘అంతా కొడుకులచేత అశ్రద్ధ చేయబడిన వారేనేమో- నీలాగా!’’ కావాలనే వ్యంగ్యంగా అన్నాను.
‘‘అందరివీ ఒకేరకం పరిస్థితులు కాకపోయినా అందరం ఒకేరకం పక్షులం. అందుకనే ఒకేచోటుకి చేరాం. ఈ వెంచర్‌ వేసినవాళ్ళే గుడి, ప్రేయర్‌ హాలు, కమ్యూనిటీ కిచెన్‌, క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఖర్చుని అంతా షేర్‌ చేసుకుంటున్నాం. ఒక పెద్ద కుటుంబంలా కలిసి ఉంటున్నాం. కలిసి పనిచేసుకుంటున్నాం. ఒకరికొకరం చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉంటున్నాం. ఒంటరితనం, అభద్రత, నిరుత్సాహం, నిర్లక్ష్య భావన మా దరికి చేరలేవంటే నమ్ము.’’
‘‘కలిసి ఉండకేంజేస్తారు? అరచి గీపెట్టినా బదులు పలికేవారు ఒక్కరైనా చుట్టుపక్కల ఉంటేగా!’’
ఆగి నావంక అదోలా చూసి ముందడుగు వేస్తూ చెప్పుకుపోయాడు. ‘‘ఉదయమే వాకింగ్‌కి వెళ్తాం. వస్తూ వస్తూ ఎవరికైనా మందులూ బ్రెడ్లూ పండ్లూ లాంటివి కావలిస్తే కొని తెచ్చిస్తాం. నడవలేనివాళ్ళకి సాయపడతాం. రోగులకి సేవ చేస్తాం. గుడిలో పూజలు చేస్తాం. పురాణాల విశేషాలు తిరగేసుకుంటాం. బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌దాకా అంతా కమ్యూనిటీ కిచెన్లోనే చేస్తాం. ఓపికా శక్తీ రెండూ ఉన్న నాలాంటి కొందరం ఈ దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకెళ్ళి క్లాసులు తీసుకుంటాం. చుట్టుపక్కల పల్లె ప్రజలకి ప్రభుత్వ పింఛనూ రేషనూ వగైరాలు వచ్చేందుకు సలహాలూ సహకారమూ ఇస్తాం. వారి జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడతాం. కాలం మాకే తెలియనంత వేగంగా, ఉత్సాహంగా పరిగెడుతోందిరా’’ కళ్ళల్లోంచి ఆనందం జాలువారుతోంటే అన్నాడు.
దిమ్మెరబోయి చూశాను. ‘‘నీకిక్కడే బావుందా?’’
‘‘అవును. అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరం.
రోజూ అబ్బాయి ఫోను కోసం ఎదురు చూడటం, ఫోన్‌ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం... అంతే! జీవితం నిస్సారం, నిస్తేజం అయిపోయింది.
నిజం చెప్పాలంటే చావుకోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉండేది.’’
‘‘ఇక్కడెంతో బావుందంటావ్‌.’’
‘‘కచ్చితంగా. ఇక్కడ సమాజం ఉంది. చేదోడు వాదోడు ఉంది. సాయమూ నిజాయితీ ఉంది. ఆధ్యాత్మికత ఉంది.
ఈ నేలలోంచీ గాలిలోంచీ మనుషుల్లోంచీ ఎంతో పాజిటివ్‌ ఎనర్జీ వచ్చి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మమ్మల్ని
మేం కొత్తగా ఆవిష్కరించుకున్నట్టూ కొత్త సమాజంలో ఉన్నట్టుగా ఉంటోంది.’’
శ్రీపతి కళ్ళల్లోని మెరుపుల్ని వెర్రిగా చూశాను.
ఆ కమ్యూనిటీలో ఉంటోన్న కొందర్ని పరిచయం చేశాడు శ్రీపతి.
‘‘మీకిక్కడ ఎలా ఉంది?’’ ఒకర్నడిగాను.
‘‘చాలా బాగుంది. చిన్నప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే ఉంది. ముసలి వయసులో మనకేం కావాలో అవన్నీ
ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడటానికీ, ఆనందం విచారం పంచుకోడానికీ... మేమున్నామని అండగా నిలబడే వాళ్ళున్నారు. బంధుమిత్రుల ఇళ్ళల్లోని శుభకార్యాలకి మేం వెళ్ళినా
ఒకటి రెండ్రోజులు మించి అక్కడ ఉండలేమంటే నమ్మండి. మా బతుకూ భవిష్యత్తూ ఇక్కడే ఉంది.’’


అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరం. రోజూ అబ్బాయి ఫోను కోసం ఎదురుచూడటం, ఫోన్‌ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం... అంతే! జీవితం నిస్సారం, నిస్తేజం అయిపోయింది.


 

 

 

పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాను.
ఒక్కొక్కటీ చూపిస్తూ కమ్యూనిటీ కిచెన్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ శ్రీపతి భార్య వంటల్లో సాయపడటం చూసి విస్తుబోయాను.
‘‘ఈ వంటలక్క వేషమేంటి వదినా? మీకు బోలెడు ఉంది. కొడుకూ బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. మీకీ కర్మ ఏంటి?’’ నొచ్చుకున్నాను.
‘‘అదేంటయ్యా, మాకోసం మేం వండుకోవడం నీకు తప్పుగా కన్పిస్తోందా?’’
గుటకలు మింగాను.
‘‘ఇన్నాళ్ళూ ఒడ్డునపడ్డ చేపల్లా కొట్టుకున్నాం. ఇప్పుడేమో నీటి ప్రవాహంలోకొచ్చి పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి!’’
‘‘అయితే, మీరు కావాలనే ఇక్కడికొచ్చారన్నమాట. ఇందులో మీ అబ్బాయి నిర్వాకం ఏమీ లేదన్నమాట’’ అపనమ్మకంగా చూస్తూ అన్నాను.
‘‘అనవసరంగా వాడినెందుకు ఆడిపోసుకుంటావయ్యా. ఆ దేశంలో మేం ఉండలేం. వాణ్ణి ఇక్కడికొచ్చి ఉండమనలేం. వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు, మేమిక్కడ హ్యాపీగా ఉన్నాం. రోజూ ఐపాడ్‌లో మనవడూ మనవరాలూ పలకరిస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ ఎవరింటికి కొడుకులూ కూతుళ్ళూ వచ్చినా మావాళ్ళు వచ్చినట్టే పొంగిపోవడం, పండుగలూ పుట్టినరోజులూ కలిసి జరుపుకోవడం అలవాటైపోయింది’’ శ్రీపతి భార్య సంబరంగా చెబుతుంటే మ్రాన్పడిపోయాను.
నా భుజం మీద చేయి వేసి అన్నాడు శ్రీపతి ‘‘ఒకప్పుడు మనం తల్లిదండ్రుల్ని వదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాం. ఇప్పుడు మన పిల్లలు అదే ఉద్యోగాల కోసం వేరే దేశాలకెళ్తున్నారు. రాకపోకలకి ఆ కాలంలో ఎంత టైము పట్టేదో ఇప్పుడూ అంతే పడుతోంది. అది గ్రహించకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోవడం అర్ధరహితం. మనమూ మన ధోరణినీ జీవనశైలినీ మార్చుకోక తప్పదు. మున్ముందు ఇలాంటి రిటైర్మెంట్‌ హోమ్స్‌ పెరుగుతూనే ఉంటాయి, పెరగాలి కూడా. వానప్రస్థమంటే బంధుప్రేమలూ స్వార్థాలూ తగ్గించుకుని, సమాజ
ప్రేమలూ సేవలూ పెంపొందించుకోవడమే!
అప్పుడే కదా మానవజన్మ చరితార్థమయ్యేదీ... ఏమంటావ్‌?’’
శ్రీపతిని చూస్తుంటే వాడి మాటలను వింటుంటే... నాలోనూ ఏవో ఆలోచనలు... కొత్త ఉత్సాహం, ఉద్వేగం. కాసేపయ్యాక-
‘‘నాకూ మాకోసం మేం ఈసురోమంటూ ఒంటరిబతుకు బతకడంగాక పదిమందితో కలిసి పదిమంది కోసం బతకాలనిపిస్తోంది. మాకూ ఇలాంటి ప్రశాంత జీవనం కావాలనిపిస్తోంది. ఇక్కడేమైనా ఇల్లు అద్దెకు ఉంటే చెప్పరా శ్రీపతీ’’ మనసులోంచి అపోహల్నీ అపార్థాల్నీ తుడిచేస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను.
సరిగ్గా అప్పుడే కెనడా నుంచి రమేష్‌ ఫోన్‌ చేశాడు.
‘‘మీ డాడీ పక్కనే ఉన్నాను. మీ డాడీని సిటీకి తీసుకెళ్ళడం కాదు, రేపే నేనూ మీ ఆంటీతో కలిసి ఇక్కడికి వచ్చేస్తాను. ఇక మా గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. నిశ్చింతగా ఉండండి చాలు. మీ అమ్మా నాన్నలే కాదు, ఇకపైన మేమూ ఒంటరులం కాదు, ఒక చైతన్య సమూహంలో భాగస్తులం’’ చెప్పాను ఉత్సాహంగా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.