close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చదరంగమా... బొమ్మల కొలువా?!

చదరంగమా... బొమ్మల కొలువా?!

అక్బరు సరదాకోసం అప్పుడప్పుడూ గడుల్లో నేరుగా మనుషుల్ని నిల్చోబెట్టి చదరంగం ఆడేవాడట. ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి, బొమ్మలతో చెస్‌ ఆడుతున్నారు. దేశాలూ ప్రాంతాలూ తెగలూ పౌర యుద్ధాలూ కామిక్‌ హారర్‌ చిత్రాల్లోని క్యారెక్టర్లూ జంతువులూ పక్షులూ... ఇలా ఆ బొమ్మల్లోనూ ఎన్నో రకాల థీమ్‌లు. దాంతో ఈ బొమ్మల చదరంగం చెస్‌ ప్రియుల్నే కాదు, ఆ ఆట గురించి అస్సలేమీ తెలీనివాళ్లనీ ఆకర్షిస్తోంది.


‘ఈ జీవితం ఓ చదరంగం. ఎన్నో ఎత్తుపల్లాలూ... ఎత్తులూ పైయెత్తులూ. సరైన ఎత్తు వేస్తే చదరంగంలో విజయం. సరైన అడుగు వేస్తే జీవితంలో గెలుపు...’ అంటూ చదరంగం గురించి కొందరు భాష్యం చెబితే,
‘ఎనిమిదీ ఇంటూ ఎనిమిదీ అరవై నాలుగు గడులు... అరవై నాలుగు కళలకు సంకేతాలు. ఒకదాని తరవాత ఒకటి ఉండే ఆ నలుపు తెలుపు రంగులు జీవితంలోని సుఖదుఃఖాలకి ప్రతిబింబాలు’ అని మరికొందరూ,
‘చూడ్డానికి గడులమీద జరిగే యుద్ధంలానే ఉన్నా అవతలివారి మేధను చిత్తు చేసే ఓ అద్భుత యుద్ధ క్రీడ’ అని ఇంకొందరూ చెప్పుకొచ్చారు.
‘నాకు తెలిసినంతవరకూ చదరంగం ఓ కళ, శాస్త్రం, ఓ క్రీడ, జీవితానికి ప్రతిబింబం...’ అంటాడు ప్రముఖ చెస్‌ క్రీడాకారుడైన అనతోలి కార్పోవ్‌.
ఎవరు ఎలా నిర్వచించినా మొత్తమ్మీద చదరంగం మేధావుల ఆటగానే మనందరికీ తెలుసు. అలాగే చదరంగం బోర్డు అనగానే నలుపూ తెలుపూ గడులూ వాటిమీద అవే రంగుల్లో ఉండే 32 పావులే అందరికీ సుపరిచితం. అవి కూడా కార్డుబోర్డు లేదా చెక్కతో చేసినవే అందరికీ తెలుసు. కానీ ఆ బోర్డునీ పాన్‌లనీ కూడా అద్భుత కళావస్తువులుగానూ, పౌరాణిక, చారిత్రక, సామాజిక అంశాలను ప్రతిబింబించే రకరకాల థీమ్‌లతోనూ రూపొందిస్తున్నారు. అలాగే వాటిని కేవలం చెక్క, కార్డుబోర్డు పదార్థాలే కాకుండా ప్లాస్టిక్‌, వినైల్‌, మార్బుల్‌, గాజు, ఇనుము, వెండి, బంగారం, రత్నాలతోనూ తయారుచేస్తున్నారు. దాంతో అవి అటు చెస్‌ ప్రియుల ఇళ్లలో అందమైన ఆటవస్తువులుగా కొలువుదీరుతున్నాయి.
ఎక్కడ ఎలా పుట్టింది?
ఈ ఆట భారతదేశంలోనే గుప్తులకాలంలో చతురంగంగా పుట్టి చదరంగంగా మారిందనీ అక్కడి నుంచే పర్షియాకీ తద్వారా ఐరోపా దేశాలకూ పాకిందనీ చరిత్రకారులు చెబుతుంటారు.
వెనకటి కాలంలో తమ రాజ్యం మీదకి ఇతరులు దండెత్తకుండా ఉండేందుకు అశ్వ, గజ, రథ, కాల్బలాలను పెంచి పోషించేవారు రాజులు. రకరకాల వ్యూహాలు పన్ని తమ బలగాలతో యుద్ధాలు చేసి రాజ్యాలను కాపాడుకోవడం, గెలుచుకోవడం చేస్తుండేవారు. ఒక రాజు మరో రాజుని ఓడించడానికీ చంపడానికీ ఏ బలగాన్ని ఎప్పుడు రంగంలోకి దించాలో ఎలా ముందుకు కదపాలో ఆలోచిస్తూ, అవతలివారి ఎత్తుకి పై యెత్తు వేస్తూ యుద్ధం చేసేవారు. అందులోంచి పుట్టుకొచ్చిందే చదరంగం. అప్పట్లో చాలామంది రాజులూ ప్రముఖులూ మాత్రమే ఈ ఆట ఆడేవారట. అందుకే దీన్ని రాజుల ఆట(గేమ్‌ ఆఫ్‌ కింగ్స్‌) అనీ పిలుస్తుంటారు. ఈ ఆట ద్వారా తమ బుద్ధిబలాన్ని
పెంచుకునేవారు. ఆ కారణంతోనే అది క్రమంగా మేధావుల ఆటగా పరిణమించింది.
సాధారణంగా ఇద్దరు మాత్రమే ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరికి ఒక రాజూ, ఒక రాణీ/మంత్రీ, రెండు శకటాలూ, రెండు గుర్రాలూ, రెండు ఏనుగులూ, ఎనిమిది భటులతో మొత్తం పదహారు పావులు ఉంటాయి. ఆరు రకాల పావులతో
రసవత్తరంగా సాగే ఈ ఆటకోసం బోర్డునీ పావుల్నీ కూడా ఎక్కువగా చెక్క, ప్లాస్టిక్‌ పదార్థాలతో మాత్రమే చేస్తుంటారు. అయితే ఇటీవల వాటిని విభిన్న పదార్థాలతో కొత్తకొత్తగా చేసేస్తున్నారు.


రతనాల చదరంగం!
చదరంగంలో బొమ్మల పావులు మరీ కొత్తవేం కాదు. మధ్యయుగం నుంచీ నాటి రాజ్యాలని పోలిన పావుల్ని తయారుచేయడం వాడుకలో ఉంది. పావులతోబాటు బోర్డుల్నీ ఎంతో విలువైన రాళ్లతోనూ లోహాలతోనూ చేసేవారు. పైగా వాటికి రత్నాలు పొదిగి, బంగారు నగిషీలు దిద్దేవారు. కొందరయితే బోర్డుని సైతం ఓ కోటలా రూపొందించేవారు. అలాగే పావుల్ని కూడా బోర్డులోపలే పెట్టుకునేలా ఇంకా చెప్పాలంటే ఓ బోషాణంలా చదరంగం బోర్డుని డిజైన్‌ చేసేవారు. అయితే అవన్నీ కేవలం సంపన్న వర్గాల ఇళ్లలో మాత్రమే కనిపించేవి. నాటి చెస్‌బోర్డుల్లో చాలావరకూ యాంటిక్‌లుగా ప్రదర్శనశాలల్లో కొలువుదీరితే, కొన్ని మాత్రం ఆక్షన్‌హౌస్‌ల్లో కోట్ల రూపాయలు ఖరీదు పలుకుతూ
సేకర్తలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా 103 దేశాలకు చెందిన 570 చదరంగం సెట్లు ఉన్న మ్యూజియం టర్కీలోని గోఖ్యాయ్‌ అసోసియేషన్‌ చెస్‌’. వీటిల్లో ఎక్కువగా పాలరాయి, సోప్‌స్టోన్‌, ఫెల్ట్‌, షీట్‌ మెటల్‌, పోతపోసిన ఇనుము... వంటి పదార్థాలతో చేసినవే. అదే స్ఫూర్తితో ఇప్పుడు కొన్ని బ్రాండెడ్‌ జ్యువెలరీ సంస్థలు కూడా వజ్రాలూ రత్నాలూ పొదిగిన చెస్‌ సెట్లను తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి.
రామాయణం నుంచి హాలీవుడ్‌ వరకూ...
మనదగ్గర ఇతిహాసాలనూ పావుల్లో కదుపుతున్నారు. ఆధునికులకోసం అనేక రకాల థీమ్‌లతోనూ చెస్‌ సెట్స్‌ వస్తున్నాయి. జంతువులూ పక్షులూ హారర్‌ చిత్రాలూ కామిక్‌ క్యారెక్టర్లూ... ఇదీ అదీ అన్న తేడా లేకుండా రకరకాలుగా చదరంగం పావుల్ని తయారుచేస్తున్నారు.
పూర్వం కలహారీ ఎడారిలో తొలినాటి ఆఫ్రికన్‌ తెగల మధ్య ఎన్నో పోరాటాలు జరిగేవి. వాటిని సూచించే చదరంగ పావులూ అక్కడ అనేకం. ముఖ్యంగా ఈ చదరంగం పావుల తయారీలో ఆఫ్రికాకి చెందిన కుంబులా ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ తయారయ్యే ప్రతీ చెస్‌ బోర్డూ ఒక్కో కథని చెబుతుంటుంది. ఆఫ్రికాలోని జంతువుల్నీ తెగల్నీ వాళ్ల చరిత్రనీ పోరాటాల్నీ కళల్నీ అది ప్రతిబింబిస్తుంటుంది.
ఈ ఆట మన దగ్గరే పుట్టినా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఫేవరెట్‌ గేమ్‌గా మారింది. అందుకే బోర్డులో రంగుల్ని తప్ప డిజైనుని మార్చకున్నా పావుల్ని మాత్రం ఈజిప్షియన్లూ, చైనీయులూ, ఐరోపావాసులూ... ఇలా ఎవరి నేపథ్యానికి తగ్గట్లుగా వాళ్లు తయారు చేసుకుంటున్నారు. అందుకే చదరంగం నేడు కేవలం ఆట మాత్రమే కాదు, సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప కళా క్రీడ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.