close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయన కోసం టెస్టు ఆడతా!

ఆయన కోసం టెస్టు ఆడతా!

హార్దిక్‌ పాండ్య, బుమ్రా, చాహల్‌... ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన భారతీయ క్రికెటర్లు వీరంతా. ఆ కోవకే చెందుతాడు దిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌. ఐపీఎల్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న రిషబ్‌ తన గురించి ఏం చెబుతున్నాడంటే...


రూర్కీ నుంచి వచ్చా

నేను పుట్టింది ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో. ఆరో తరగతిలో ఉండగానే క్రికెటర్‌ని అవుతానని నాన్న రాజేంద్రకి చెప్పాను. ఆయన సరేనన్నారు. అప్పట్నుంచీ క్రికెట్‌ కలలు మరింత ఎక్కువయ్యాయి. ధోనీ నా రోల్‌ మోడల్‌.


గురుద్వారాలో భోజనం...

రూర్కీలోకంటే దిల్లీలో ఉంటే కెరీర్‌కు మంచిదని 16 ఏళ్ల వయసులో దిల్లీ వచ్చి సానెట్‌ క్రికెట్‌ క్లబ్‌లో చేరాను. శిఖర్‌ ధావన్‌ లాంటి క్రికెటర్లు అక్కణ్నుంచే వచ్చారు. మొదట్లో డబ్బుల్లేక దిల్లీలోని మోతీ బాఘ్‌ గురుద్వారాలో అన్నప్రసాదాల్ని తింటూ ఆకలి తీర్చుకునేవాణ్ని. కొన్నిసార్లు అక్కడే నిద్రపోయేవాణ్ని. ఈ విషయం తెలిసి కోచ్‌ తారక్‌ సిన్హా నాకు అకాడమీలో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల తర్వాత నాకు అన్నీ ఆయనే. ఇప్పటికీ ఆ క్లబ్‌కి వెళ్లి ప్రాక్టీసు చేస్తాను.


ఓ ఇల్లు, రెండు కార్లు...

18 ఏళ్లకే దిల్లీ రంజీ జట్టుకి ఎంపికయ్యాను. తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టుకీ ఎంపికయ్యాను. 2016 ఐపీఎల్‌ వేలం సమయంలో మేం అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడుతున్నాం. ‘నువ్వు 50 లక్షలకు అమ్ముడుపోయావ్‌, నువ్వు 60 లక్షలకు అమ్ముడుపోయావ్‌’ అంటూ జట్టు సభ్యులంతా జోకులు వేసుకుంటుండగా... దిల్లీ డేర్‌డెవిల్స్‌ నన్ను రూ.1.9 కోట్లకు చేజిక్కించుకుందని మా మేనేజర్‌ చెబితే మొదట నమ్మలేదు. ఓ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో పొందే మొత్తాన్ని నేను కెరీర్‌ ప్రారంభంలోనే సంపాదించానా అనిపించింది. ఆ డబ్బుతో మొదట నాకో కారు, ఇంటికో కారు కొన్నాను. తర్వాత రూర్కీలో ఇల్లు కట్టించాను.


ఐపీఎల్‌ మార్చేసింది...

దిల్లీ జట్టుకి ఎంపికయ్యాక ప్రాక్టీసులోనూ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ ఓవర్లో 15 పరుగులు రావాలి, 20 పరుగులు రావాలి అని పరీక్ష పెట్టేవారు. అక్కడ సులభంగా కొట్టేవాణ్ని. దాంతో 2016 సీజన్లోనే ఆడే ఛాన్స్‌ వచ్చింది. అక్కడ అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటం, ద్రవిడ్‌ సర్‌ మార్గనిర్దేశం బాగా పనిచేశాయి. 10 మ్యాచుల్లో 198 పరుగులు చేశాను. ఓపెనింగ్‌ నుంచి నంబర్‌ 8 వరకూ అన్ని స్థానాల్లోనూ ఆడాను. గతేడాది ఐపీఎల్‌లో 366 పరుగులు చేశా. ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తున్నాను


ఫార్మాట్‌ ఏదైనా...

దిల్లీలో జరిగే స్థానిక లీగ్‌లలో పోటీ బాగా ఎక్కువగా ఉంటుంది. ధాటిగా ఆడటం అక్కణ్నుంచే అలవాటైంది. ఫార్మాట్‌ ఏదైనా సులభమైన బంతులు దొరికితే షాట్‌ కొట్టడానికే ప్రయత్నిస్తాను. కష్టమైన బంతుల్ని విడిచిపెడతాను. నాకు వన్డే క్రికెట్‌ అంటే ఇష్టం. కానీ మా కోచ్‌ మాత్రం ‘టెస్టు క్రికెట్‌ ఆడేవారే అంతర్జాతీయ క్రికెటర్‌’ అంటారు. ఆయన కోసమైనా ఏదో ఒకరోజు ఇండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడతాను.


టీమ్‌ ఇండియాకి ఎంపిక

నీలం జెర్సీ వేసుకుంటే వచ్చే కిక్కే వేరు! టీమ్‌ ఇండియాకి 2017లోనే ఎంపికై నాలుగు టీ20లు ఆడాను. మళ్లీ ఎంపిక కావడం గురించి ఎక్కువగా ఆందోళన చెందడంలేదు. దేశవాళీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తే కచ్చితంగా పిలుపు వస్తుంది. అందుకే ఏ ఫార్మాట్‌, ఏ జట్టు అని ఆలోచించకుండా ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నా.


రన్స్‌తోనే రికార్డులు...

టీ20 చరిత్రలో గేల్‌ వేగవంతమైన సెంచరీ(30 బంతుల్లో) చేస్తే, ఈ ఏడాది జనవరిలో హిమాచల్‌ప్రదేశ్‌పైన రెండో వేగవంతమైన(32 బంతుల్లో) సెంచరీ చేశాను. 2016లో వేగవంతమైన ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ(48 బంతుల్లో) చేశాను. ఈసారి ఐపీఎల్‌లో హైదరాబాద్‌పైన 63 బంతుల్లో 128 పరుగులు చేశాను. ఐపీఎల్‌లో ఓ భారతీయ బ్యాట్స్‌మన్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇవన్నీ రన్స్‌మీద దృష్టి పెట్టినపుడు వచ్చిన రికార్డులే తప్ప రికార్డుల కోసం చేసినవి కాదు.


ప్లే స్టేషన్‌ ఆడతా...

ఖాళీ దొరికితే ప్లేస్టేషన్‌ ఆడతాను. హిందీ, ఇంగ్లిష్‌ పాటలు వింటుంటాను. ఇంకా మావూరు వెళ్తే ఫ్రెండ్స్‌తో కబుర్లలో మునిగిపోతాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.