close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్పట్లో... ఆటలో ఓడితే శిరచ్ఛేదనమేనట!

అప్పట్లో... ఆటలో ఓడితే శిరచ్ఛేదనమేనట!

మాయన్లు... ఎవరు వీళ్లు... ఎక్కడివాళ్లు... అని చరిత్ర చదవని వాళ్లు అనుకోవచ్చు. కానీ కాస్తో కూస్తో చరిత్రతో పరిచయం ఉన్నవాళ్లకి మాయా నాగరికత గురించీ మాయన్ల గురించీ కొంతైనా తెలిసే ఉంటుంది. వ్యవసాయం, ఖగోళశాస్త్రం, గణితం, క్యాలెండర్‌ తయారీ, వాస్తుశాస్త్రంలో వీళ్లు కనబరిచిన ప్రతిభ అసామాన్యం. అలాంటి నాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటైన మెక్సికో దేశం గురించిన కొన్ని విశేషాలు హైదరాబాద్‌కి చెందిన డా।। గాయత్రీదేవి మాటల్లో...మెక్సికో గురించీ మాయా నాగరికత గురించీ ఏవేవో వింటుంటాం, అవన్నీ స్వయంగా చూడాలని బయలుదేరాం. కరీబియన్‌ సముద్ర అందాలకీ ఆహ్లాదకరమైన బీచ్‌లకీ మెక్సికో పెట్టింది పేరు. అయితే మేం మాయా నాగరికత శిథిలాలని చూడ్డానికే వెళ్లాం. అందుకోసం అమెరికా నుంచి ముందుగా కాన్‌కూన్‌కి వెళ్లాం. యుకటాన్‌ పెనిన్సులాలోని కరీబియన్‌ సముద్రతీరాన ఉంది కాన్‌కూన్‌. వాళ్ల భాషలో కాన్‌కూన్‌ అంటే పాములగూడు అని అర్థమట. ఆ సాయంత్రం హోటల్‌ పరిసరాల్లో కాసేపు తిరిగి విశ్రాంతి తీసుకున్నాం. ముందుగా కాన్‌కూన్‌లో మ్యూజియో మాయా డె కాన్‌కూన్‌ అనే స్పానిష్‌ పేరున్న మ్యూజియానికి వెళ్లాం. ఆ ప్రదర్శనశాలలో కొంతభాగం ఆరుబయట ఉంది. అక్కడ కొన్ని శిథిలాలు ఉన్నాయి. కొంత భాగం భవనం లోపల ఉంది. కొన్ని ప్రాచీన శిలలూ, శిల్పాలూ ఉన్నాయి. మ్యూజియానికి దగ్గరలోనే పయ డెల్ఫీనెస్‌ అనే బీచ్‌కి వెళ్లాం. పయ అంటే స్పానిష్‌లో బీచ్‌. స్ఫటికంలా మెరుస్తోన్న నీలి సాగరం దాని తలలో విరిసిన నందివర్ధనంలా తెల్లని ఇసుక బీచ్‌... అది చూడగానే మనసు ఆనందసాగరమే అయింది. బీచ్‌ మొత్తం పర్యటకులతో నిండినా ఎక్కడా పిసరంత చెత్త కూడా కనిపించలేదు. దాన్నిబట్టి వాళ్లు పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇస్తారని అర్థమైంది. ఆ సాయంత్రం డౌన్‌టౌన్‌లో ఉన్న మార్కెట్‌ ప్రదేశానికి వెళ్లి మెక్సికో సావనీర్లు(జ్ఞాపికలు) కొన్నాం. నాటి మెక్సికన్లు తేళ్లనీ పాముల్నీ బల్లుల్నీ పూజించేవారట. అందుకే ఆయా పేర్లతోనూ ఆలయాలు ఉన్నాయి.ఎత్తైన ప్రదేశాల్లో దేవుడు ఉంటాడా?
తరవాత మాయా నాగరికతకు సంబంధించిన టులుం, కోబా ప్రదేశాలు చూడ్డానికి బుక్‌ చేసుకున్నాం. ఉదయం ఏడు గంటలకి మా హోటల్‌ నుంచి బస్సు బయలుదేరింది. స్పానిష్‌ గైడుతో పాటుగా ఇంగ్లిష్‌ గైడు కూడా ఉన్నాడు. మా బస్సులో అమెరికా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, చిలీ దేశాల నుంచి పర్యటకులు ఉన్నారు. రెండు గంటల ప్రయాణం తరవాత బస్సు టులుం శిథిలాలున్న ప్రదేశానికి వెళ్లింది. గైడ్‌ అక్కడి నాగరికత గురించీ వాళ్ల నమ్మకాల గురించీ వివరించాడు. అక్కడి ప్రజలు భగవంతుడు ఆకాశంలో ఉంటాడనీ ఎత్తైన కట్టడాలు కట్టి పైకి ఎక్కితే భగవంతుడి దగ్గరకు తేలికగా వెళ్లవచ్చనీ నమ్మి, పిరమిడ్లలాంటి కట్టడాలు కట్టారని వివరించాడు. ఎత్తైన గుట్టల మీద కట్టిన ఈ కట్టడాలు 13-15 శతాబ్దాల మధ్య కాలంలోనివి. మనదగ్గరా గుడులన్నీ ఎత్తైన కొండలమీద కట్టడానికి ఇదే కారణం కావచ్చు.పిరమిడ్‌ ఎక్కొచ్చు
టులుం నుంచి కోబాకి వెళ్లేదారిలో రెస్టరెంట్లో భోజనాలు చేశాం. శాకాహారులమైన మాకు పచ్చి కూరలు, రాజ్మా కూర, అన్నం ఉండటంతో ఇబ్బంది కలగలేదు. మరో గంట ప్రయాణం తరవాత కోబాకి చేరుకున్నాం. రోడ్డుమీద బస్సు దిగి దాదాపు రెండు కిలోమీటర్లు నడిస్తే అక్కడ ఉన్న అతి పెద్ద పిరమిడ్‌ ఇక్స్‌ మోహాకి చేరుకోవచ్చు. నడవలేకపోతే అద్దెకి సైకిళ్లూ, రిక్షాలూ ఉన్నాయి. మోటారు వాహనాలకు అక్కడ ప్రవేశం లేదు. పైకి ఎక్కడానికి అనుమతి ఉన్న ఏకైక పిరమిడ్‌ ఇది. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పిరమిడ్‌ మీదకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి కానీ అవి చాలా సన్నగా నిటారుగా జారేలా ఉన్నాయి. కష్టపడి ఎక్కినా దిగడం ఇంకా కష్టం. మెట్లమీద కూర్చుని ఒక్కొక్క మెట్టే దిగాల్సి ఉంటుంది. ఈ పిరమిడ్‌ చాలా భాగం శిథిలం అయిపోయింది. అయినా అందరూ అలాగే ఎక్కుతున్నారు.
ఆ ప్రాంగణంలోనే ఉన్న మరికొన్ని చిన్న కట్టడాలను కూడా చూసి, మా బస్సులో పయ డెల్‌ కామెన్‌ అనే బీచ్‌కి వెళ్లాం. అక్కడ సాగరజలాలన్నీ నీలి రంగులో స్వచ్ఛమైన స్ఫటికాల్లా మెరుస్తున్నాయి. ఈ యాత్రలో మేము మెక్సికోలోని అన్ని రకాల వాహనాల్లోనూ ప్రయాణించాలి అనుకున్నాం. ఇటీవల ప్రపంచ ఏడో వింతగా ఓట్లు పొందిన చిచెన్‌ ఇట్జాకి టూర్‌ ఆపరేటర్లతో హడావుడిగా లేకుండా విడిగా అక్కడి అడయో బస్సులో ముందుగానే రిజర్వ్‌ చేసుకుని కాన్‌కూన్‌ నుంచి బయలుదేరాం. అడయో బస్సులంటే మన వోల్వో బస్సులే. అయితే వాటిల్లో టాయిలెట్లు కూడా ఉన్నాయి. మూడు గంటల ప్రయాణం హాయిగా సాగింది. దారిలో కనబడే ఊళ్లూ ఇళ్లూ పరిశీలించాం. ఊళ్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఇళ్లు సాదాసీదాగా ఉన్నాయి. ఏ ఇంటి ముందుగానీ రోడ్డు మీదగానీ చెత్త అన్నదే లేదు. మెక్సికో అభివృద్ధి పరంగా మనకన్నా వెనకబడి ఉంది. అయినా పరిశుభ్రతలో ఎంతో ముందుంది అనిపించింది.అదో అద్భుత ప్రదేశం!
మూడు గంటల తరవాత చిచెన్‌ ఇట్జాకి చేరుకున్నాం. పూర్వం మాయా నాగరికత, తరవాత టోల్‌టెక్‌ నాగరికత ప్రభావంతో విలసిల్లిన నగరాల్లో ఇదీ ఒకటి. దీని ప్రవేశ రుసుం 285 పెసోలు. అంటే దాదాపు 1100 రూపాయలు. టికెట్లకోసం అందరూ వరసలు కట్టారు. లోపలకు వెళితే అది దాదాపు ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంగణం. మధ్యలో ఏడో అద్భుతంగా పేరుపొందిన పిరమిడ్‌. దీన్ని వాళ్లు కుకుల్కన్‌ అనీ యెల్‌కాస్టియో అనీ అంటారు. మాయన్లు దీన్ని క్రీ.శ. 600-900 మధ్య కాలంలో నిర్మించారు. దీని ఎత్తు 98 అడుగులు. పీఠం దగ్గర 181 అడుగులు ఉంటుంది. దీని పైకి ఎక్కడానికి మూడుదిక్కులా 91 మెట్లూ ఉత్తరం వైపున మాత్రం 92 మెట్లూ ఉన్నాయి. మొత్తం సంవత్సరంలోని 365 రోజులకి సమంగా వచ్చేలా కట్టారు. నాటి మాయన్లు దీన్ని దేవాలయంలా భావించేవారట. ఇక్కడ సంప్రదాయ వేడుకలు నిర్వహించేవారట. పైభాగాన్ని ఆత్మాహుతికోసం వాడేవారట. అయితే అది ఎక్కడానికి ఇప్పుడు అనుమతి లేదు. దీనిలోపల మరో చిన్న పిరమిడ్‌ ఉంది. బహుశా అది అప్పటి టోల్‌టెక్‌ రాజుది అయి ఉండవచ్చు.
బంతాటలో ఓడితే...
ఈ ప్రాంగణంలో చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి బాల్‌ కోర్టు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. 225 అడుగుల వెడల్పూ 545 అడుగుల పొడవూ ఉన్న ప్రాంగణాన్ని నాటి ప్రజలు బంతి ఆట ఆడ్డానికే కట్టుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. రాజకీయ, సామాజిక విబేధాలను పరిష్కరించుకునేందుకు పట్టణాల్లోని రెండు వర్గాలు లేదా పార్టీలు ఈ ఆట ద్వారా సమస్యను పరిష్కరించుకునేవారట. అందుకోసం రెండు జట్లను ఎంపిక చేసి పోటీ పెట్టేవారట. గెలిచిన జట్టు నాయకుడు, ఓడిన జట్టు నాయకుడికి శిరచ్ఛేదం చేసేవాడట. ఆటలో ఓడినవాళ్లు నేరుగా భగవంతుడిని చేరే అవకాశం ఉన్నట్లు భావించేవారట. ఆటలో వాడే రబ్బరు బంతి సుమారు 9 కిలోల బరువు ఉండేదట. ఈ ప్రాంగణంలో మరో రెండు భూగర్భ జలాశయాలనీ, అబ్జర్వేటరీనీ, లాస్‌ మొంహాస్‌ అనే కట్టడాన్నీ చూశాం. మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన వేయి స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. ప్రాంగణం లోపల కొన్ని వందల చిన్న దుకాణాలు ఉన్నాయి- సావనీర్లు అమ్మడానికి. ఈ జ్ఞాపికల్లో చాలావరకూ చైనాలో తయారై వచ్చినవే. ఇంతవరకూ నేను చూసిన అనేక దేశాలలోనూ సావనీర్లు చైనాలో తయారవడాన్ని గమనించాను. అంటే చైనా మార్కెట్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరించిందో అర్థమవుతోంది. చిచెన్‌ ఇట్జా చూడటం పూర్తయ్యేసరికి 3.30 అయింది. గూగుల్‌ వాతావరణ సూచికలో 3.30కి వాన పడే అవకాశం ఉంది అని ముందుగానే చూశాం. కచ్చితంగా మూడున్నరకి పెద్దవాన. మేం తిరిగి కాన్‌కూన్‌ చేరుకున్నాం.ఇది స్త్రీల ద్వీపం!
ఇస్లా మూహేరిస్‌(స్త్రీల ద్వీపం అని అర్థం). కానీ ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నది స్పష్టంగా తెలియదట. హోటల్‌ నుంచి టాక్సీలో పడవ ఎక్కడానికి వెళ్లాం. టాక్సీల ధరలు ఫిక్స్‌డ్‌. కాబట్టి బేరం అడిగే బాధ తప్పింది. పడవలో సముద్ర ప్రయాణం చాలా హాయిగా అనిపించింది. నీలిరంగు నీటిలో సూర్యకిరణాలు ప్రతిఫలిస్తుంటే విశాల సాగరాన్ని కళ్లనిండుగా చూస్తూ ఆనందిస్తూ ఆ గాలిని గుండెలనిండుగా ఆస్వాదిస్తూ ద్వీపానికి చేరాం. ఇది ఐదారు చ.కి.మీ. ఉన్న చిన్న ద్వీపం. దీనికి పూర్తిగా టూరిజమే ఆధారం. ద్వీపానికి ఓ చివర భాగంలో పురాతన శిథిలాలు, వివిధ జాతుల తాబేళ్లు ఉన్న శాంక్చ్యురీ ఉన్నాయి. అక్కడి బీచ్‌ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ ద్వీపం మీద తిరగడానికి గోల్ఫ్‌కార్ట్‌లూ మోటారు సైకిళ్లూ అద్దెకిస్తారు. టాక్సీలూ దొరుకుతాయి. సాయంత్రం వరకూ అక్కడే గడిపి మళ్లీ పడవలో సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ కాన్‌కూన్‌ చేరుకుని మర్నాడు ఉదయమే శాన్‌ఫ్రాన్సిస్కోకి తిరుగుప్రయాణం అయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.