close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదర్శం వెనుక

ఆదర్శం వెనుక
 హోతా పద్మినీదేవి

నేను డ్రైవ్‌ చేస్తున్న ఆడి కారు బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు సెవెన్‌లో ఉన్న నా బంగ్లాని సమీపించగానే గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డు గేటు బార్లా తెరిచి వంగి, చిరునవ్వుతో నాకు సెల్యూట్‌ చేశాడు. కారు పోర్టికోలో ఆపాను. అక్కడున్న బిఎమ్‌డబ్ల్యూ కారుని తళతళలాడేలా తుడుస్తున్న డ్రైవర్‌ నా దగ్గరకి వచ్చి నా చేతిలోని బ్రీఫ్‌కేసుని అందుకున్నాడు.
నేను హాల్లోకి ప్రవేశించేసరికి ట్రేలో చల్లటి మంచినీళ్ళ గ్లాసుతో ఎదురొచ్చింది నా భార్య. మంచినీళ్ళు తాగి గ్లాసు ట్రేలో ఉంచి, ఆమె అందాన్నీ, అంత అందమైన భార్యని పొందిన నా అదృష్టాన్నీ మనసులోనే అభినందించుకుంటూ స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి నడిచాను.
చెవి దగ్గర అలారం మోత, వంటింట్లోంచి కుక్కర్‌ విజిల్‌ ఏకకాలంలో నాకు నిద్రాభంగం కలిగించాయి. కమ్మని కల చెదిరిపోయింది. విసుగ్గా కళ్ళు విప్పి అలారం టైమ్‌పీసు పీక నొక్కాను. ఆఫీసుకి వెళ్ళాలని గుర్తొచ్చి ఆదరాబాదరా లేచి బాత్‌రూమ్‌లోకి పరిగెట్టాను. స్నానం చేస్తున్నంతసేపూ ఆ కల గుర్తొచ్చి నా మనసు నిరాశగా మూలిగింది.
దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటి నుంచీ పేదరికాన్నే చవిచూశాను. మా నాన్న చనిపోయేసరికి నేను సీనియర్‌ ఇంటర్‌, మా చెల్లెలు తొమ్మిదో తరగతీ చదువుతున్నాం. అష్టకష్టాలూపడి మా అమ్మ నన్ను ఇంజినీరింగ్‌ చదివించింది. బస్సులో కాలేజీకి వెళ్తూ బైక్‌లమీదా, కార్లలో కాలేజీకి వచ్చే నా క్లాస్‌మేట్స్‌ని చూసి వాళ్ళ స్థానంలో నన్ను నేను ఊహించుకుని కలలు కనేవాడిని. క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్‌ పూర్తయి ఉద్యోగం పర్మినెంట్‌ కాగానే హైదరాబాద్‌లో పోస్టింగు వచ్చింది. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని మా అమ్మనీ చెల్లెలినీ హైదరాబాద్‌కి తెచ్చుకున్నాను. నాకొచ్చే జీతంతో ఆ మహానగరంలో మేము ముగ్గురం బతకాలి. చెల్లికి చదువు, పెళ్ళి బాధ్యత నాదే. నేను కలలో నుంచి వాస్తవానికి రాక తప్పలేదు. అయినా ఆ కల నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కల నిజం కావాలంటే ఏ లాటరీయో తగలాలి. లేదా, ఓ కోటీశ్వరుడికి అల్లుడిని కావాలి. అది అసంభవమని నాకు తెలుసు. సినిమాల్లోలాగా ఏ డబ్బున్న అమ్మాయీ నన్ను ప్రేమించదు. నా కల కలగానే మిగిలిపోవలసిందేనా అనే నిరాశా నిస్పృహా నన్ను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. బిల్‌గేట్స్‌, అంబికా రామచంద్రరావు, త్రివేణీ దేసు వెంకట సుబ్బారావు... వీళ్ళలో ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోలేదు. కొన్నేళ్ళ నిర్విరామకృషి వాళ్ళనా స్థానంలో ఉంచింది. కానీ, అంత ఓపికా ఓర్పూ నాకు లేవు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడినెలా కావాలా అనే ఆలోచనే రాత్రీ పగలూ నన్ను తినేస్తోంది.
నేను ఉద్యోగంలో చేరి ఏడాది నిండింది. అమ్మ నా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. నెలకి ముప్ఫైవేలు జీతం. ప్రతి చిన్నదానికీ సర్దుకుంటూ, ప్రతి రూపాయీ లెక్కగా ఖర్చుపెడుతూ రేపటి గురించి భయపడుతూ- ఛ... ఏం బతుకు నాది? అయినా నాలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారు? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా, ఫ్లాటు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా... బ్యాంకు లోను తీసుకోవలసిందే. పిల్లలు పుడితే వాళ్ళకి పాలడబ్బాలూ రోగాలూ రొచ్చులూ చదువులూ... అన్నిటికంటే ముందు మా చెల్లెలి పెళ్ళి... ఆపై ఆలోచించలేకపోయాను. వయసు ఆడతోడు కోసం తపిస్తున్నా రాజీపడి గంతకు తగ్గ బొంతని చేసుకోవాలనే చేదు నిజం నాలోని అసంతృప్తి సెగని మరింత రాజేసింది.
‘నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. చేసుకోవాలనిపించినప్పుడు చెబుతాను. అంతవరకూ నన్ను ఇబ్బందిపెట్టకు’ అని కరాఖండీగా చెప్పాను.

*     *     *     *     *

ఆరు నెలల తరవాత ఆరోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి రాగానే అమ్మ నాకు అన్నంపెట్టి నాకెదురుగా కూర్చుంటూ చెప్పింది- ‘‘నీకో పెళ్ళి సంబంధం వచ్చిందిరా.’’ ‘‘నేను పెళ్ళి చేసుకోనని చెప్పానుగా’’ అసహనంగా అన్నాను.
‘‘సంబంధం మంచిదే. ఎస్‌.ఎస్‌. కన్‌స్ట్రక్షన్స్‌ ఛైర్మన్‌గారి అమ్మాయి. ఆయనకి ఒక్కతే కూతురట. పెళ్ళయిన మూడేళ్ళకే భర్త యాక్సిడెంటులో మరణించాడట. ఏడాదిన్నర వయసున్న పాప ఉందిట ఆమెకి.
అయినా మనకి తగిన పిల్లని చేసుకోవాలి కానీ, వితంతువుని... అదీ ఒక బిడ్డ  తల్లిని పెళ్ళిచేసుకోవలసిన కర్మమేమిటి?’’ అంటోంది అమ్మ.
‘‘వద్దని చెప్పేశావా?’’ నా గుండె గొంతులోకి వచ్చింది.
‘‘ఇంకా ఏమీ చెప్పలేదు. అయినా మనకి నచ్చకపోతే మాత్రం ముఖం మీద చెబుతామా ఏమిటి?’’
‘‘ఎవరి ద్వారా వచ్చిందీ సంబంధం?’’‘‘మనకి దూరపు బంధువు ఒకాయన భీమవరంలో ఉన్నారులే- సూర్యనారాయణరాజు అని. వరసకి నీకు బాబాయి అవుతారు. పిల్ల తండ్రి ఆయనకి మేనత్త కొడుకట.’’
‘‘అవునా!?’’ నాకు అన్నం తినబుద్ధి కాలేదు. తిన్నాననిపించి చెయ్యి కడుక్కుని లేచి ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేశాను. గూగుల్‌లో అమ్మ చెప్పిన ‘ఎస్‌.ఎస్‌. కన్‌స్ట్రక్షన్స్‌’ అనే కంపెనీ కోసం సెర్చ్‌ చెయ్యసాగాను. క్షణాల్లో ఆ కంపెనీ వివరాలన్నీ వచ్చాయి. వైజాగ్‌, విజయవాడల్లో కూడా ఆ కంపెనీ బ్రాంచీలున్నాయి. కొన్ని కోట్ల ఆస్తి, ఒక్కతే కూతురు. మా కులంలో నా బంధువర్గంలో ఎవరికీ రాని గొప్ప సంబంధం నాకు వచ్చింది. కానీ, ఒక్కటే లోటు. ఆమెకి ద్వితీయ వివాహం. అయినా నా పిచ్చిగానీ, ఆమెకి మొదటి పెళ్ళయితే ఈ సంబంధం నన్నెందుకు వెతుక్కుంటూ వస్తుంది? నేను కలలు కన్న జీవితాన్నీ సంఘంలో గౌరవాన్నీ ఈ పెళ్ళితో పొందవచ్చు. నేను ల్యాప్‌టాప్‌ క్లోజ్‌ చేసి ‘‘ఈ పెళ్ళి నాకు ఇష్టమే’’ అని అమ్మతో చెప్పాను.
ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది.‘‘ఒక వితంతువునో విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్ళి చేసుకోవాలన్నది నా ఆదర్శం. అందుకే ఇన్నాళ్ళూ పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను’’ స్థిరంగా చెప్పాను. అమ్మ మరేం మాట్లాడలేకపోయింది.
మరో నెలలో ప్రియాంకతో నా పెళ్ళి గుడిలో సింపుల్‌గా జరిగింది. రిసెప్షన్‌ మాత్రం ఫైవ్‌స్టార్‌ హోటల్లో వైభవంగా జరిగింది. ఆ రిసెప్షన్‌కి రాజకీయ నాయకులతోబాటు సినిమా హీరో హీరోయిన్లూ, ప్రొడ్యూసర్లూ కూడా తరలివచ్చారు. మా మామగారికి ఎంత పలుకుబడి ఉందో తెలిసి, అలాంటి వ్యక్తికి అల్లుడినైన నా అదృష్టానికి నన్ను నేను అభినందించుకున్నాను. అందమైన భార్య, కోట్ల ఆస్తి... నేను కలలుగన్న జీవితం నా అరచేతిలోకి వచ్చింది.
కానీ, నా భార్యని తాకినప్పుడల్లా ఆమె శరీరాన్ని నాకంటే ముందు మరోవ్యక్తి తాకాడనీ ఆమె ఆఘ్రాణిత పుష్పమనీ నా మనసులో అసంతృప్తి. అయితే, డబ్బూ తద్వారా నేననుభవిస్తున్న సుఖాలూ అతి త్వరలోనే ఆ భావాన్ని డామినేట్‌ చేశాయి. నేను ప్రియాంకని అమితంగా ప్రేమిస్తున్నట్టు నటించసాగాను.
‘‘మోడువారిన నా జీవితంలోకి వసంతంలా మీరు వచ్చారు. మీరు సాక్షాత్తు దేముడేనండీ!’’ అందోసారి ప్రియాంక కన్నీళ్ళతో.
నేనామె కన్నీటిని సున్నితంగా తుడిచాను. ‘‘వితంతువునో విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్ళి చేసుకోవాలనేది నా ఆదర్శం. భార్య చనిపోయిన లేదా భార్య నుంచి విడిపోయిన మగవాడు పునర్వివాహం చేసుకోగా లేనిది అదే పరిస్థితిలో ఉన్న అమ్మాయి పెళ్ళి చేసుకుంటే తప్పేమిటి?’’ గంభీరంగా చూస్తూ అన్నాను.అంతే! ప్రియాంక దృష్టిలో నేను ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాను.
మేము హనీమూన్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన మరునాడు మా మామగారు నన్ను తన కారులో ఆఫీసుకి తీసుకెళ్ళారు. ఆఫీసులో స్టాఫ్‌ అంతా తమ సీట్లలో నుంచి లేచి ఆయనతోబాటు నాక్కూడా నమస్కరించారు. నేను చిరునవ్వుతో హుందాగా ఆ నమస్కారాలని స్వీకరిస్తూ ఆయనని అనుసరించాను. ఆయన ఒక రూమ్‌ ముందాగి డోర్‌ తెరిచి లోపలకి వెళ్ళారు. ‘‘రండి’’ అన్నారు నన్ను ఆహ్వానిస్తూ. ఆ గది వాల్‌ టు వాల్‌ కార్పెట్‌తో రిచ్‌గా ఉంది. ఎయిర్‌ కండిషన్డ్‌ గది కావడం వలన చల్లగా ఉంది. ఆయన టేబుల్‌కి వెనుకవైపు ఉన్న రివాల్వింగ్‌ ఛెయిర్‌ చూపిస్తూ ‘‘కూర్చోండి అల్లుడుగారూ, ఇవాళ్టి నుంచి మన కంపెనీ ఎండీ మీరే!’’ అన్నారు.ఆయన చెప్పింది క్షణకాలం నాకు అర్థంకాలేదు. అర్థంకాగానే సంతోషంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది. నేను చప్పున వంగి ఆయన పాదాలని తాకి కళ్ళకద్దుకున్నాను. ఆయన అస్పష్టంగా నన్ను ఆశీర్వదించారు.
నెలకిందట ముప్ఫైవేల జీతగాడిని. ఇప్పుడు పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఎండీని. ఆడి కారులో డ్రైవర్‌ డ్రైవ్‌ చేస్తుంటే దర్జాగా కూర్చుని ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను. మా పెళ్ళయ్యాక మా మామగారూ అత్తగారూ వేరే ఇంటికి మారిపోయారు- పాపని మా దగ్గర వదిలేసి. మా పెళ్ళిలో మా అత్తగారి చంకనున్న పాపని చూశాను. కానీ, ఇంత దగ్గరగా చూస్తున్నది ఇదే మొదటిసారి. పాపలో ప్రియాంక పోలికలు లేవు. బహుశా ‘అతని’ పోలికనుకుంటాను. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ముద్దుగా ఉంది. అయినా పాపని నా బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను. పైగా పాపపైన నాకు అకారణ ద్వేషం కలుగుతోంది. ప్రియాంక మొదటి భర్తతో పంచుకున్న మధుర క్షణాలకి సాక్ష్యం ఈ పాప.
ఒకరోజు... ‘‘నాన్నా!’’ ముద్దుగా పిలుస్తూ నా దగ్గరకొచ్చింది. నన్ను అలా పిలవమని ప్రియాంక చెప్పి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లోకి చూస్తున్న నేను పాపని పట్టించుకోలేదు. ఓరకంటితో చూశాను. కాస్త దూరంలో నిలబడిన ప్రియాంక నన్నే చూస్తోంది. నేను సీరియస్‌గా పనిచేస్తున్నట్టు నటించసాగాను.
ప్రియాంక పాపని ఎత్తుకుని లోపలకి వెళ్ళిపోయింది. నేను పాపని తప్పించుకుని తిరగడం, దాన్ని కనీసం ఎత్తుకోకపోవడం గమనించింది ప్రియాంక. కొన్ని రోజుల తరవాత పాప వాళ్ళమ్మమ్మ దగ్గరకి వెళ్ళిందని ప్రియాంక ఎవరితోనో చెప్పడం విన్నాను.
‘ఆమె మనసు నా ప్రవర్తనతో గాయపడి ఉంటుందా? ఆమె దృష్టిలో నా విలువ తగ్గిపోయిందా?’ నాలో నేను తర్కించుకున్నాను. ఆమె మాత్రం అసలేమీ జరగనట్టు ప్రవర్తిస్తోంది. కానీ, ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తే ఆ అందమైన కళ్ళల్లో కన్నబిడ్డని దూరం చేసుకున్న తల్లి బాధ కనిపించి ఉండేది.
అయినా, ‘నేను పాపకి తండ్రిని కాలేనని ఆమె ముఖం మీద చెప్తే మాత్రం ఆమె ఏం చెయ్యగలదు? నాతో గొడవపడి విడాకులు తీసుకోలేదు కదా! అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న అమ్మాయి...’ నేనామె బలహీనతని ఆసరాగా తీసుకున్నాను.

*     *     *     *     *

ఐశ్వర్యవంతుల అల్లుడినయ్యాక నాలో నిద్రాణంగా ఉన్న కోరికలు పడగ విప్పాయి. అందులో మొదటి కోరిక... సింగపూర్‌ వెళ్ళి అక్కడ మెరీనా బేసాండ్స్‌లో కెసినోలో జూదం ఆడాలనే కోరిక. ఆ కోరిక నాలో కలగడానికి కారకుడు హరీష్‌. వాడు బీటెక్‌లో నా క్లాస్‌మేట్‌. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్‌ మేగ్నెట్‌. ప్రతి సంవత్సరం పరీక్షలు రాయగానే ఫ్యామిలీతో ప్లెజర్‌ ట్రిప్‌కీ విదేశాలకీ వెళ్ళేవాడు. ఆ ఏడాది సింగపూర్‌ వెళ్ళాడు. అక్కడ వాడు చూసిన ప్రదేశాలను వర్ణించి చెబుతుంటే చెవులే కాదు, నోరు కూడా వెళ్ళబెట్టి వినేవాళ్ళం మేమంతా.
హరీష్‌ అక్కడ కెసినోలో వెయ్యి సింగపూర్‌ డాలర్స్‌ని పోగొట్టుకున్నాడట. అయినా వాళ్ళ డాడీ వాడినేమీ అనలేదుట. అప్పటినుంచీ నాలో సింగపూర్‌ వెళ్ళాలనీ, అక్కడ కెసినోలో జూదం ఆడాలనే కోరిక తీవ్రతరమైంది.
కానీ, మా మామగారు నాకు చెక్‌ పవర్‌ ఇవ్వలేదు. జీతమైనా ఎంత ఇస్తారో తెలియదు. అయినా నన్ను కంపెనీకి ఎండీని చేసిన ఆయన ఆ లెవెల్‌కి తగ్గట్టు జీతం ఇవ్వడా? నా భార్య దగ్గర ఆ విషయం ప్రస్తావించడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒకటో తారీఖు రెండు రోజులుందనగా మా అక్కౌంటెంట్‌ నా రూమ్‌కి వచ్చి నా బ్యాంకు అకౌంట్‌ నంబరు అడగడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.మరునాడు ఆదివారం. మా మామగారు మా ఇంటికొచ్చారు. కుశల ప్రశ్నలూ మామూలు కబుర్లూ అయ్యాక ‘‘మీ అమ్మగారికి నేను డబ్బు సాయం చేద్దామంటే కన్నకొడుకువి నువ్వుండగా నానుంచి డబ్బు తీసుకోవడం పరువు తక్కువగా ఆవిడ భావిస్తారేమోనని భయపడ్డాను. మీ చెల్లెలి పెళ్ళి గురించి నువ్వేమాత్రం దిగులుపడకు. ఆ అమ్మాయి పెళ్ళి బాధ్యత నాది’’ అన్నారు.
‘‘అబ్బే, ఎందుకండీ’’ అన్నాను మొహమాటపడుతూ. మా అమ్మకి ఆయన డబ్బు సాయం చేయడం నాకు చిన్నతనమే.
మరునాడు నేను ఆఫీసులో ఉండగా నా మొబైల్‌కి వచ్చిన మెసేజ్‌ నాకు అసంతృప్తినీ నిరాశనీ కలుగచేసింది. నా బ్యాంకు ఖాతాలో మా కంపెనీ నుంచి యాభైవేల రూపాయలు జమ చెయ్యబడ్డాయని దాని సారాంశం.
ఫ్లాటు రెంటూ, మా అమ్మా చెల్లెలి పోషణ ఖర్చూ పోగా నా దగ్గర ఇంకేం మిగులుతుంది? పేరుకి ఈ కంపెనీ ఎండీని. ఈ కోట్ల ఆస్తిలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చుపెట్టలేను. ఏమీ చేయలేని అసహాయతతో, ఉక్రోషంతో పళ్ళు కొరుక్కున్నాను.

*     *     *     *     *

నేనూ ప్రియాంకా గైనకాలజిస్టు శమంత ఎదురుగా కూర్చున్నాం. ఆవిడ ప్రియాంకని ‘‘పెళ్ళయి ఎన్నేళ్ళయింది? పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తున్నాయా?’’ లాంటి రొటీన్‌ ప్రశ్నలడిగి తరవాత తనని కర్టెన్‌ వెనక్కి తీసుకెళ్ళింది. లోపలనుంచి వాళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. ‘తనకి మొదటి భర్త వలన పాప పుట్టిందని చెబుతోందా?’ నేను ముడివడిన భ్రుకుటితో ఎదుటిగోడ మీదున్న ఫొటోలోని బోసినవ్వుల పాపాయిని చూస్తున్నాను.
‘ప్రియాంకకి పాపని మరింత దూరం చేయాలంటే మాకు పిల్లలు పుట్టాలి. అవును, నాకు మగబిడ్డ కావాలి. ఈ ఆస్తికి వారసుడు కావాలి.’
మరో నిమిషం తరవాత డాక్టరూ, ఆ వెనుకనే ప్రియాంకా బయటకొచ్చారు.
డాక్టరు నాతో అంది ‘‘మీ వైఫ్‌కి ఒక పాప ఉందని చెబుతున్నారు. ఆమెకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఉంది. మీలో ఏ లోపమూ లేదని నిర్ధారణ అయితే అప్పుడు చూద్దాం’’ అందావిడ ప్రిస్క్రిప్షన్‌ పాడ్‌ మీద ఏదో రాస్తూ.
ఆమె నాకు అందించిన కాగితాన్ని తీసుకుని చదివాను. నాలో వీర్యకణాల శాతం ఎంత ఉందో తెలిపే పరీక్ష అది. ‘‘థ్యాంక్‌ యూ డాక్టర్‌!’’ అని బయటకి నడిచాను. రెండు రోజుల తరవాత ఆఫీసు నుంచి వస్తూ ల్యాబ్‌ నుంచి రిపోర్టు తీసుకున్నాను. అటునుంచే నేరుగా వెళ్ళి డాక్టర్‌ని కలిశాను. నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డాక్టర్‌ నా ఫ్రెండు భార్య. ఆవిడకి మా మామగారితో కనీసం ముఖ పరిచయం కూడా లేదని నిర్ధారించుకున్నాకే ప్రియాంకని ఆవిడ దగ్గరకి తీసుకెళ్ళాను. ల్యాబ్‌కీ హాస్పిటల్‌కీ మా కారులో కాకుండా క్యాబ్‌లో వెళ్ళడం రెండో జాగ్రత్త.
డాక్టరు శమంత నా రిపోర్టు చూసి పెదవి విరిచారు. ‘‘మీలో సంతానోత్పత్తికి కావలసిన వీర్యకణాలు లేవు. మీరు తండ్రయ్యే అవకాశం లేదు.’’ ‘‘వేరే దారి లేదా డాక్టర్‌!’’ తగ్గు స్వరంతో అడిగాను.‘‘వీర్యదాత వీర్యంతో మీకు సంతానం కలగవచ్చు. ఐవిఎఫ్‌ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అయినా ఎందుకివన్నీ? మీకు పాప ఉందిగా?’’ అందావిడ. నాలో సంఘర్షణ. ప్రియాంక మొదటి భర్తకి పుట్టిన సంతానాన్ని నా బిడ్డగా స్వీకరించలేని నేను... ఇప్పుడు వేరొకరి వీర్యంతో నా భార్యకి సంతానం కలిగినా నా బిడ్డగా అంగీకరించగలనా? నాలోని లోపాన్ని నిజాయతీగా ఒప్పుకునే పెద్ద మనసు నాకు లేదు. నేనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను.
నేను ఇంటికొచ్చేప్పటికి ప్రియాంక యథాప్రకారం మంచినీళ్ళు అందించింది.
నేను తాగాక ‘‘కాఫీ తెస్తాను’’ అని లోపలకి వెళ్ళబోయింది. నేనామె చెయ్యిపట్టి ఆపేశాను. ‘‘నీకు నామీద కోపంగా లేదా?’’ ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాను.
‘‘కోపమా... ఎందుకు?’’ విస్మయంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. ‘‘పాపని నీకు దూరం చేసినందుకు.’’ఆమె ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అంది- ‘‘మీరు దూరం చెయ్యడమేమిటి? నేనే పాపని మా అమ్మ దగ్గరకి పంపేశాను.’’‘‘నేను పని ఒత్తిడి వలన పాపని పట్టించుకోలేదు. అంతేకానీ, పాపంటే ఇష్టంలేక కాదు. పాప నా ప్రాణం. మనకి పిల్లలు పుడితే పాప మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందని భయంవేస్తోంది. అందుకే మనకి పిల్లలు వద్దు. వెంటనే వెళ్ళి పాపని మన దగ్గరకి తెచ్చుకుందాం.’’
ప్రియాంక ఆనందంతో మూగబోయింది.

*     *     *     *     *

మా మామగారు గుండెపోటుతో మరణించారు. ఇల్లంతా శోకసంద్రమయింది. నాకు మాత్రం ఆయన మరణం అంతులేని సంతోషాన్ని కలుగజేసింది.
‘హమ్మయ్య!’ ఆయన అడ్డు తొలగింది. ఇక ప్రియాంకనీ పాపనీ మూడో కంటికి తెలియకుండా అడ్డు తొలగిస్తే, ఈ ఆస్తిపైన సర్వాధికారాలూ నావే. ముసిల్ది- మా అత్తగారు ఎన్నేళ్ళు బతుకుతుందిలే అనుకుంటూంటే నా మనసుకి ఏదో నిశ్చింత, ఊరట. మా మామగారి కర్మకాండలకి హాజరైన ఆయన బంధువర్గం ముందు - ప్రియాంక మీదా, పాపపైనా అవసరమైనదానికంటే ఎక్కువ ప్రేమని ప్రకటించి, వాళ్ళ దృష్టిలో సాక్షాత్తూ భగవంతుడినే అనే మార్కులు కొట్టేశాను. మా మామగారి మరణాన్ని లోలోన ఆనందిస్తూనే పైకి బాధనీ దుఃఖాన్నీ ప్రకటించసాగాను. ఆయన దశదినకర్మలన్నీ వైభవంగా జరిగిపోయాయి.
పదమూడోరోజు మా ఫ్యామిలీ లాయర్‌గారు వచ్చి మా మామగారు స్వదస్తూరీతో రాసి రిజిస్టర్‌ చేసిన విల్లుని చదివి వినిపించారు.
ఆ విల్లు ప్రకారం ఆయన స్థిరచర ఆస్తులలో ఒక వంతు దానధర్మాలకి కేటాయింపబడింది. మిగిలిన ఆస్తి మా అత్తగారికీ ప్రియాంకకీ చెరిసగం చెందుతుంది. మా అత్తగారి తదనంతరం ఆవిడ పేరుమీదున్న ఆస్తి ప్రియాంకకీ పాపకీ చెందుతుంది. కర్మవశాత్తూ ప్రియాంక కానీ, పాప కానీ మరణిస్తే ఆ ఆస్తి మదర్‌ థెరెసా ఛారిటబుల్‌ ట్రస్టుకీ రామకృష్ణ మిషన్‌కీ చెరిసగం చెందుతుంది. అంతేతప్ప, ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నాకు రాదు. నన్ను కంపెనీ ఎండీగా కొనసాగించాలనీ ఏటా పదిశాతం జీతం పెంచాలనీ ఆయన అభీష్టం. ఆ విల్లులోని సారాంశం తెలియగానే నా కాళ్ళకింద భూమి కంపించినట్లయింది. ఆస్తిపైన ఆశతో ఆదర్శం పేరుతో ప్రియాంకని పెళ్ళి చేసుకున్నాను.
నా ఆదర్శం వెనుక ఉన్న కుటిలాలోచన మా మామగారికి తెలిసిపోయిందా... పాపని నేను బాగా చూసుకోకపోవడం గమనించి దూరాలోచనతో ఇంత పకడ్బందీగా విల్లు రాశారా... ఈ విషయాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారా లేక అత్తగారితోనూ ప్రియాంకతోనూ కూడా చర్చించారా... నా తల తిరిగిపోయి స్పృహ తప్పినట్టయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.