close
ఇది తెలుగింటి పండరీపురం!

ఇది తెలుగింటి పండరీపురం!

శ్రీమహావిష్ణువు అవతారమైన విఠలేశ్వరుడిని తలచినంతనే పండరీపురం గుర్తుకు వస్తుంది. ఆ పాండురంగడి దివ్యమనోహర రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అచ్చం ఆ క్షేత్రంలో మాదిరిగానే పూజలు అందుకుంటూ, ఏడాది పొడవునా వివిధ వేడుకలతో కళకళలాడుతూ ఉండే విఠలేశ్వరుడు రుక్మిణీ సమేతుడై నిర్మల్‌ జిల్లా కుభీరులో కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి కుభీరువాసుల కుబేరుడిగా వెలుగొందుతున్నాడు. ఈ ఆలయం తెలుగింటి పండరీపురంగా విరాజిల్లుతోంది.కృష్ణుడి అంశగా, భక్తజన వరదుడిగా, ఆపన్నులకు అభయ ప్రదాతగా పాండురంగడిని కొలుస్తారు. అందుకే కుభీరు ప్రాంత వాసులకు విఠలేశ్వరుడు అంటే ఎనలేని భక్తి, అంతకుమించిన విశ్వాసం. పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా... ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా విఠల్‌ - రుక్మిణీబాయిలను దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. విఠలేశ్వరుడిగా, విఠోబాగా, విఠలుడిగా ప్రసిద్ధి చెందిన కృష్ణపరమాత్మ ఇక్కడ భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.ఆలయ చరిత్ర...
తమ జీవితాల్లో భాగంగా మారిన విఠలేశ్వరుడిని నిత్యం దర్శించుకోవడానికి వీలుగా కుభీరులో కూడా ఒక ఆలయాన్ని నిర్మిస్తే బావుంటుదని నిజాం సర్కారులో పనిచేసే జాగీర్దార్‌ యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్‌, త్రయంబక్‌రావులు భావించారట. అనుకున్నదే తడవుగా పండరీపుర ఆలయ నమూనాలో గర్భగుడిని రాత్రికి రాత్రే నిర్మించి, తర్వాత మెల్లగా ఆలయానికి ఒక రూపు తీసుకొచ్చారని స్థలపురాణం తెలియజేస్తోంది. అంతేకాదు మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరీపూర్‌ నుంచి విఠల్‌ - రుక్మిణీబాయిల ప్రతిమలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రంలో విఠలేశ్వరుడికి ఏ విధంగా నిత్యపూజాది క్రతువులు నిర్వహిస్తారో కుభీరులో కూడా అదేవిధంగా జరపడం పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ. అందుకే ఇక్కడి స్వామిని దర్శించుకుంటే అచ్చం పండరీపురం వెళ్లివచ్చిన అనుభూతి కలుగుతుందంటారు భక్తులు. ఈ ప్రాంతవాసుల మధ్య నెలకొన్న విద్వేషాలను రూపుమాపి అందర్నీ ఒక్క తాటిపై నడిపించేందుకు ఆలయ వ్యవస్థాపకుల్లో ఒకరైన యశ్వంతరావు దేశ్‌ముఖ్‌ 1935లో లోక్‌మాన్య బాలగంగాధర్‌ తిలక్‌, గాడ్గే మహారాజ్‌లను ఇక్కడికి ఆహ్వానించి, వారి చేతులమీదుగానే ఆలయంలో వినాయక ఉత్సవాలను ప్రారంభించారని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి విఘ్నాలూ లేకుండా వినాయకచవితి ఉత్సవాలను నిర్వహిస్తుండటం విశేషం.ఏడాది పొడవునా...
విఠలేశ్వరుడికి నిత్యపూజలూ, ఏకాదశి వ్రతాలూ, సప్తమి వేడుకలూ, కాగడ హారతులూ... ఇలా వివిధ రకాల వేడుకలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పక్షం రోజులకు ఒకసారి చేసే ఏకాదశి వ్రతాలను తొలి ఏకాదశి పర్వదినం నుంచీ ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచే ఉపవాస దీక్షలు కూడా మొదలుపెడతారు. ఈ వ్రతంలో గ్రామం మొత్తం పాల్గొనడం విశేషం. తొలి ఏకాదశి రోజు భజనలతో తెల్లవార్లూ విఠలేశ్వరుడి కీర్తనలు ఆలపిస్తారు. మరుసటిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏటా కార్తిక పౌర్ణమి తర్వాత వచ్చే సప్తమి రోజున ఆలయంలో భాగవత సప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు వారంరోజుల పాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగా వేకువజామున ఆలయంలో కాగడ హారతిని నిర్వహిస్తారు. ఆ తర్వాత యథాప్రకారం విఠలేశ్వరుడికి అభిషేకాలూ, నిత్య పూజలూ జరుగుతాయి. అనంతరం ప్రత్యేకంగా ముస్తాబు చేసిన రథ]ంపైన దేవతామూర్తుల శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఈ యాత్రలో బాజాభజంత్రీలూ, భజనకారుల భక్తిపాటలూ, యువకుల నృత్యాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. రథం పురవీధుల్లో ఊరేగుతుంటే విఠల్‌ - రుక్మిణీబాయిలను దర్శించుకోవడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులుతీరతారు. ఆషాఢ మాసం నెలరోజులూ ఇక్కడ స్వామికి కాగడ హారతి ఇస్తారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఉట్ల పండగకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు చిన్నారులందరూ చిన్ని కృష్ణుడి వేషధారణలో రావడంతో ఈ ప్రాంతమంతా రేపల్లెను తలపిస్తుంది. ఇక్కడి ఆలయంలో శనిదేవుడి మందిరం, బొర్ర గణేశుడు, నవగ్రహ విగ్రహాలు, నాగదేవ ప్రతిమలు కొలువుదీరి ఉన్నాయి.
ఇలా చేరుకోవచ్చు...
కుభీరు విఠలేశ్వరుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్‌కి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు నిజామాబాద్‌, భైంసా బస్టాండుల నుంచి బస్సు సౌకర్యం ఉంది. భైంసా నుంచి అయితే ఆటోరిక్షాలో ప్రయాణించి ఈ క్షేత్రానికి వెళ్లొచ్చు. రైలు మార్గంలో వచ్చే భక్తులు నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కుభీరు చేరుకోవచ్చు.

- దూస సంజీవ్‌కుమార్‌, ఈనాడు, ఆదిలాబాద్‌
చిత్రాలు: సాయన్న

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.