close
కడదాకా కలిసి...

కడదాకా కలిసి...
- డా।। మద్దాళి ఉషాగాయత్రి

‘‘అమ్మలూ...’’
ఆ గొంతు అన్నయ్యది. కానీ ఎప్పటిలాగా హుషారుగా లేదు, బరువుగా ధ్వనిస్తోంది. ఫోను రిసీవరెత్తిన ప్రభావతి కొద్దిగా కంగారుపడింది.
‘‘అన్నయ్యా? ఏంటి నీ గొంతు అలా ఉంది, ఏమయింది?’’ గబగబా ప్రశ్నలు సంధించింది.
‘‘ఏంలేదే! నిన్నట్నుంచీ మీ వదిన అసలు లేవడం లేదు. నాకు గాభరాగా ఉంది’’ అన్నాడు ప్రకాశరావు.
‘‘ఏంటన్నయ్యా, నిన్నట్నుంచీ బాగోకపోతే ఇప్పుడా చెప్పడం? ముందు నువ్వు ఫోను పెట్టేయ్‌, నేనూ బావగారూ వెంటనే బయలుదేరి వస్తున్నాం’’ సమాధానం కోసం ఎదురుచూడకుండా ఫోను పెట్టేసి...
‘‘ఏమండోయ్‌ అర్జెంట్‌గా అన్నయ్య వాళ్ళింటికి వెళ్దాం పదండి’’ అంటూ గబగబా గుమ్మం దగ్గరకొచ్చింది.
అప్పటికే కారు సిద్ధం చేసి ఉంచాడు ప్రభావతి భర్త ఆనందరావు- ఫోనులో సంభాషణ విని.

                        *

ప్రభావతి వాళ్ళింటికీ, వాళ్ళ అన్నయ్య ఇంటికీ ఓ గంట ప్రయాణం. ప్రకాశరావు ప్రభావతికన్నా పదేళ్ళు పెద్ద. వాళ్ళు మొత్తం అయిదుగురు సంతానం. ఇద్దరన్నయ్యలు, ఇద్దరక్కయ్యలు, ఆఖర్న ప్రభావతి. అందరికీ ప్రభావతంటే అమిత ముద్దు. చిన్నప్పుడు ఎర్రగా, బాగా బొద్దుగా ఉండేది. ప్రకాశరావు అందరిలోకి పెద్ద. ప్రభావతికి పెద్దన్నయ్యంటే ఎంతో ప్రేమా అభిమానం.

అన్నయ్య ఇల్లు దగ్గరపడేకొద్దీ ఆతృత హెచ్చింది. ‘పాపం వదినకేమైందో? అన్నయ్య అన్నిటికీ వదిన మీద ఆధారపడతాడు. సొంతంగా ఏ పనీ చేసుకోలేడు. ఉన్న ఒక్క కొడుకూ పైచదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఫోన్లు మీద పలకరింపులు తప్ప ఓ పట్టాన ఇండియాకి రాడు.
కారు ఆగీ ఆగకుండానే గబుక్కున కిందకి దిగేసింది.
‘‘అరెరె జాగ్రత్త’’ అంటూ ఆనందరావు హెచ్చరిస్తూనే ఉన్నా అప్పటికే ‘‘పెద్దన్నయ్యా’’ అంటూ లోపలకు దూసుకెళ్ళిపోయింది ప్రభావతి.
వదిన మంచం పక్కనే కుర్చీలో దిగాలుగా కూర్చుని ఉన్న ప్రకాశరావుకి చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది.
‘‘వచ్చావుటే అమ్మలూ, నిన్నట్నుంచీ మీ వదిన మాటా పలుకూ లేకుండా అలానే పడుకోనుంది.’’
‘‘వదినా... చూడు! నేను అమ్మల్ని వచ్చాను’’ అంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది ప్రభావతి.
ప్రభావతి గొంతు వింటూనే కళ్ళు తెరిచి, సత్తువ తెచ్చుకుని లేవడానికి ప్రయత్నించింది భారతమ్మ. కానీ ఓపికలేక సన్నగా ఓ మూలుగు మూలిగింది.
‘‘లేవకు, లేవకు! ఒక్కమాటు నాకు నిన్నే ఫోను చేసివుంటే, వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేదాన్నిగా. అయినా నా దగ్గర అంత మొహమాటమేమిటి వదినా?’’ నొచ్చుకుంది ప్రభావతి.
‘‘చిన్నపిల్లవి... నీతో చేయించుకోవడమేమిటే’’ హీనస్వరంతో సంజాయిషీ ఇచ్చుకుంది భారతమ్మ. భార్యలో ఆ మాత్రం చైతన్యం చూసి చాలా సంతోషపడ్డాడు ప్రకాశరావు.
‘‘ఇంకా ఏం చిన్నపిల్లని వదినా... నాకూ మనవడు వచ్చాడు’’ అంది నవ్వుతూ ప్రభావతి. ప్రభావతికి ఒక్కడే కొడుకు. అతను డాక్టరు. కోడలు కూడా డాక్టరే. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకే కాలేజీలో చదువుకున్నారు. హౌస్‌ సర్జన్సీ కూడా కలిసే పూర్తిచేశారు.
కొడుకు తల్లితో, తండ్రితో తన ప్రేమ విషయం చెప్పాడు. ఇద్దరూ ఆనందంగా అంగీకరించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు.
ఇద్దరూ డాక్టర్లు కావడం మూలాన సిటీలో మంచి సెంటర్లో నర్సింగ్‌హోమ్‌ పెట్టారు. బాగా సంపాదిస్తున్నారు.
ప్రశాంతంగా ఉండాలని జూబ్లీహిల్స్‌లో రాజభవనంలాంటి రెండంతస్తుల ఇల్లు కట్టారు. పైనా కిందా కలిపి పది బెడ్‌రూములదాకా ఉంటాయి. నిజానికి వాళ్ళ నలుగురికి అంత ఇల్లు అనవసరం. అయినా డబ్బుంది కనుక హోదాకి తగ్గట్టుగా కట్టుకున్నారు.
కొడుకూ కోడలూ ఎంతో పేరున్న డాక్టర్లు కావడంతో బాగా బిజీగా ఉంటారు. అసలు తీరిక ఉండదు. ప్రభావతి, ఆనందరావు ఇద్దరూ అందరికీ తల్లో నాలికలా వ్యవహరిస్తుంటారు. బంధువుల్లోగానీ స్నేహితుల్లోగానీ ఎవరికి
ఏ అవసరం వచ్చినా ఇద్దరూ వచ్చి నిలబడతారు.
‘‘అవునుగానీ అన్నయ్యా, ఈమధ్య పెద్ది ఏమైనా ఫోను చేసిందా, నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది.’’
‘‘లేదురా, నాకు కూడా మాట్లాడటానికి కుదరలేదు.’’
‘‘పెద్దివాళ్ళ కోడలు ఆస్తి గురించి చాలా గొడవ చేసిందట. నాతో చెప్పుకుని ఏడ్చేసిందిరా అన్నయ్యా.’’
ప్రభావతికి చిన్నప్పట్నుంచీ పెద్దక్కను పెద్ది అనీ, చిన్నక్కయ్యను చిన్ని అనీ పిలవడం అలవాటు.
‘‘ఏమిటోనే డబ్బు ఉంటే ఒక బాధ లేకపోతే ఇంకో బాధ’’ కించిత్తు ఆవేదన ధ్వనించింది ప్రకాశరావు గొంతులో.
ప్రభావతి పెద్దక్కయ్యను మంచి ఆస్తిపరులకిచ్చి చేశారు. గోదావరి జిల్లాలో మంచి మాగాణి, పాతిక ఎకరాలలో కొబ్బరిచెట్లు, మామిడితోపు, పంట దిగుబడి బాగా ఉంటుంది. పెద్దక్కయ్య భర్త చిన్నవయసులోనే పోయినా, ఆస్తిని బాగా నిలబెట్టుకుంది. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరాడపిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది.
తనుమాత్రం కొడుకు దగ్గర ఉంటోందన్న మాటేగానీ ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బతుకుతోంది. కోడలు మహా తెలివిగలది. అన్నీ భర్తతో చెప్పిస్తుంది. ఈ వెర్రి వెంగళప్ప పెళ్ళాం ఏం చెప్పమంటే అది చెబుతాడు. ఏం చెయ్యమంటే అది తూచా తప్పక చేస్తాడు. సొంత బుర్రను అస్సలు ఉపయోగించడు. ఒకే విషయం కోసం ఇద్దరు ఆలోచించడం శుద్ధ వేస్టని అతని అభిప్రాయం. అదీగాక భార్య నిర్ణయాలపై గొప్ప నమ్మకం.
ఇకపోతే ప్రభావతి చిన్నక్కయ్యది ఇంకో రకమైన పరిస్థితి. ఇద్దరు మగపిల్లలు. తల్లీతండ్రి మాట చచ్చినా వినరు. ఎవరి మాటనూ చెవినేసుకోరు. చిన్న బావగారు బిజినెస్‌ చేసి బాగానే ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు. కానీ వాళ్ళవి స్వతంత్రం లేని జీవితాలు.
ప్రభావతి చిన్నన్నయ్య బ్యాంకులో మేనేజరుగా రిటైర్‌ అయ్యాడు. ఇద్దరమ్మాయిలు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. వీళ్ళకి అమెరికా వెళ్ళడం ఇష్టంలేదు. వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం ఉన్నా వాళ్ళ పిల్లలు ‘‘ఇండియానా!
నో, బోర్‌’’ అంటూ మొండికేస్తారు.
క్లుప్తంగా ప్రభావతి కుటుంబం వివరాలు ఇవి. అన్నావదినలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ప్రభావతి, ఆనందరావులు ఇంటికి బయల్దేరారు.

                        *

ఇంటికెళ్ళేసరికి చాలా ఆలస్యం అయింది. భోజనం చేసి పడుకున్నారన్నమాటేగానీ ఇద్దరికీ నిద్రపట్టలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. మరునాడు ఉదయమే పెద్దక్కయ్య నుంచి ఫోను.
‘‘అమ్మలూ, నావల్ల కావడంలేదే. ఇంత వయసొచ్చినా ఈ బాధలేమిటే చెప్పు నాకు? నన్ను ఏదన్నా వృద్ధాశ్రమంలో చేర్పించేద్దూ, నీకు పుణ్యం ఉంటుంది’’ ఏడుపునాపుకుంటున్న ప్రయత్నం వినిపిస్తోంది.
‘‘పెద్దీ, ఏంటా మాటలు నేనున్నా కదా. అలా ఆలోచించకు, కొంచెం ఓర్పు తెచ్చుకో.’’
‘‘ఏం ఓర్పే, చిన్నతనాన పెళ్ళి చేశారు. అప్పట్నుంచీ ఓర్చుకుంటూనే ఉన్నాను. సహనానికైనా ఓ హద్దు ఉంటుంది కదా. నువ్వింకేం మాట్లాడకు, నేను ఓ నిర్ణయాని
కొచ్చేశాను’’ అని పెద్ది ఫోను పెట్టేసింది.
‘‘అయ్యో దేవుడా ఏం చెయ్యాలి?
ఏం నిర్ణయమో ఎలాంటి నిర్ణయమో!’’ ప్రభావతికి ఏం పాలుపోలేదు. వెంటనే చిన్నక్కయ్య సెల్‌కి ఫోను చేసింది.
‘‘చిన్నీ, నేను అమ్మల్ని. నువ్వొకసారి రేపు పెద్దక్క ఇంటికి రాగలవా?’’ కొంచెంసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత సరే అని అంగీకారం.
‘అమ్మయ్య! ఈరోజుకి గండం గడిచిందిలే’ అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రభావతి. ఎవరికైనా ఎలాంటి సమస్యలొచ్చినా ప్రభావతి వాటిని ఇట్టే పరిష్కరిస్తుంది. ఆ నేర్పూ, చాకచక్యం చాలా ఉంది ఆమెలో.

                        *

పొద్దునే లేచి స్నానంచేసి, పూజా పునస్కారం ముగించుకుని, గబగబా టిఫిన్‌ తినేసి తొమ్మిదిన్నరకల్లా పెద్దక్కయ్య ఇంటికి చేరుకుంది. భర్త ఆనందరావుని భోజనం వేళకు రమ్మంది.
ప్రభావతి వెళ్ళేసరికే చిన్నక్కయ్య అక్కడికి చేరుకుంది. ముగ్గురూ కలిసి పెద్దక్కయ్య బెడ్‌రూమ్‌లో చేరారు.
‘‘పెద్దీ, బుజ్జిగాడు లేడా, కనిపించడం లేదే?’’ హాల్లోకి తొంగిచూస్తూ అడిగింది ప్రభావతి.
‘‘వాడూ, వాడి పెళ్ళాం ఏదో పని ఉందని పొద్దునే వెళ్ళారు. భోజనానికి కూడా రామని చెప్పారు’’ కించిత్తు కోపం ధ్వనిస్తోంది పెద్దక్కయ్య గొంతులో. ఇక ఏమీ పొడిగించకుండా వేరే మాట మార్చింది ప్రభావతి. చిన్నక్కయ్య వచ్చిన దగ్గర్నుంచీ ముభావంగానే ఉంది.
‘‘చిన్నీ, ఏంటి ఒంట్లో బాగోలేదా? ఇందాకట్నుంచీ చూస్తున్నా, ఏమీ మాట్లాడటం లేదు?’’ ప్రభావతి చిన్నక్కయ్యని కదిపింది.
‘‘ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లోనే పరమ చికాగ్గా ఉంది’’ ఎట్టకేలకు నోరు మెదిపింది.
‘‘అదేమిటే బాబూ అలా అనేశావు?’’ ఆశ్చర్యంగా అంది ప్రభావతి. చిన్నక్కయ్య ఒక్కసారిగా భోరుమంది. ప్రభావతికి కంగారేసి పెద్దక్కయ్య వైపు చూసింది.‘‘ఏముందే చెప్పడానికి? ఎక్కడ ఏ కొంపలో చూసినా ఏముంది గర్వకారణమన్నట్టు, అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది దాని పరిస్థితి. మగ వెధవలిద్దరూ దీన్ని లెక్కచేయరు. ఇదేమో ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఇంటెడు చాకిరీ చేస్తుంది. కోడళ్ళిద్దరికీ పడిచావదు. అన్నిటికీ వంతులేసుకుని కొట్లాడుకుంటారు.’’
చిన్ని పరిస్థితిని అర్థంచేసుకున్న పెద్దక్కయ్య ఎంతో బాధపడుతూనే చెప్పింది. ప్రభావతికి అంతా అగమ్యగోచరంగా ఉంది.
‘‘దాని సంగతి సరే అలా ఉంచు. మరి నువ్వేమిటి నిన్న నాతో అలా మాట్లాడేవు?’’ పెద్దక్కయ్యని సూటిగా నిలదీసింది.
‘‘బాధ అన్న పదానికి అర్థం ఒకటే అయినా, అందరి బాధలూ ఒక్కలా ఉండవు. ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. ఇంతకాలం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీ పడుతూనే బతికేశాను. కానీ, ఇక నా ఓర్పు నశించింది. అందుకే నీకు నా నిర్ణయం చెప్పాను. ఇంత పెద్దదాన్ని, మీ అందరికంటే ముందు పుట్టినదాన్ని, అనుభవం ఉన్నదాన్ని, నేను తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటాను చెప్పు అమ్మలూ. నీకు తల్లి తర్వాత తల్లి అంతటిదాన్ని, ఔనా కాదా.’’
ప్రభావతికి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. నిజమే. తనకు తల్లి దగ్గరకన్నా పెద్దక్కయ్య దగ్గరే చేరిక ఎక్కువ చిన్నప్పట్నుంచీ. ఓదార్చే వయసు లేదు, వద్దని ఒప్పించే అనుభవం లేదు తనకి. కానీ ఏదో ఒకటి గట్టి ఆలోచనే చేయాలి.
‘‘సరే మీరు మాట్లాడుతూ ఉండండి, అందరికీ అన్నం పడేసి వస్తాను’’ అని లేచింది. ముందుగానే ఆలోచించి తను వచ్చేప్పుడే దొండకాయ వేపుడూ దోసకాయ పప్పూ సాంబారూ కొబ్బరి పచ్చడి చేయించి పట్టుకొచ్చేసింది... అన్నం ఒక్కటీ అక్కడ వేడిగా వండచ్చు కదాని.
ఇంతలో కాలింగ్‌బెల్‌ మోగింది. ప్రభావతి వెళ్ళి తలుపు తీసి ఆనందంతో గట్టిగా అరిచింది ‘‘పెద్దన్నయ్య వచ్చాడు’’ అంటూ, ఆ వెనుకే ఉన్న భర్తను చూసి అర్థం చేసుకుంది.
వెంటనే తమాయించుకుని ‘‘వదినకి ఇప్పుడు ఫర్వాలేదా అన్నయ్యా?’’ అని వాకబు చేసింది.
‘‘మొన్నటిమీద చాలా మెరుగ్గా ఉంది. కొద్దిగా లేవగలుగుతోంది.’’
‘‘పోనీలే అన్నయ్యా, మంచి సంగతే చెప్పావు. మీరు అలా కూర్చోండి. ఇప్పుడే రైస్‌ కుక్కర్‌ పెట్టి ఇట్టే వచ్చేస్తా’’నంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళొచ్చారని తెలియగానే అక్కాచెల్లెళ్ళిద్దరూ డ్రాయింగ్‌ రూమ్‌లోకి వచ్చారు.
ప్రకాశరావు చెల్లెళ్ళిద్దరి వాలకం చూసి నొచ్చుకున్నాడు. ఇద్దరి మొహాల్లో కాళాకాంతులు లేవు. పెద్ద వయసొచ్చేకొద్దీ బాధ్యతలు తగ్గకపోగా బాధలు వచ్చి చేరాయి.
‘‘ఏమిటర్రా అలా ఉన్నారేం. అన్నీ వదిలించుకోండి లేదా వదిలేసుకోండి. అన్నీ మనసుకు పట్టించుకుంటే మరింత కుంగిపోతారు. మనసులోని బాధ శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది’’ అనునయంగా అన్నాడు.
ప్రకాశరావు ఓదార్పుగా చెప్పిన మాటలు అక్కడివారిని మళ్ళీ కంటతడి పెట్టించాయి.
ప్రభావతి భర్త ఆనందరావు కొద్దిగా ఇబ్బందిగా ఫీలయి ‘‘ప్రభా, ఏమన్నా సాయం చేయనా?’’ అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ప్రభావతి, భర్తతో చాలాసేపు వంటింట్లోనే సంప్రదించింది. ఆమెకు మనసులో ఒక ఆలోచన కలిగింది. దానినే సూచనప్రాయంగా భర్త చెవిన వేసింది. ఆనందరావుకు అది సమంజసంగానే తోచింది.
గబగబా డైనింగ్‌ టేబుల్‌ మీద ఇంటి నుంచి తెచ్చినవన్నీ సర్దేసింది ప్రభావతి. అందరికీ కంచాలూ మంచినీళ్ళూ పెట్టేసింది.
అక్కడ హాల్లో చెల్లెళ్ళిద్దరినీ సమాధానపరచే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాశరావు.
‘‘అంతా రెడీ, భోజనానికి రండి’’ అంటూ కేకేసింది ప్రభావతి. అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు చేరుకున్నారు. ప్రభావతి, ఆనందరావు గబగబా అన్నీ వడ్డించేశారు. అందర్నీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భోజనం దగ్గర ఇంకే విషయాలూ చర్చించకుండా, దగ్గరుండి ఏం కావాలో చూసుకున్నారు.
మొత్తానికి అందరూ భోజనాలయ్యాయని పించి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రభావతి బల్లమీదవన్నీ సర్దేసి, తనూ వచ్చి కూర్చుంది. అక్కలిద్దరూ మళ్ళీ మళ్ళీ జరిగిన విషయాలే తలచుకుని కుమిలిపోతుంటే, ప్రభావతి భర్తకేసి ఏం చేద్దామన్నట్టుగా చూసింది.
ఇంతలో వాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించి పెద్దక్కయ్య ఉలిక్కిపడింది. ‘కొంపదీసి కొడుకూ కోడలు తిరిగొచ్చేశారా ఏమిటి చెప్మా. వీళ్ళందరినీ చూసి ఇంకేం గొడవచేస్తారో ఏమో’నని లోలోపల భయంగానే ఉంది.
ప్రభావతికి కూడా కొద్దిగా జంకుగానే ఉంది. ఏమైతే ఏం అనుకుని వెళ్ళి తలుపు తీసింది. మళ్ళీ ఒక కేక... ‘‘చిన్నన్నయ్యా’’ అంటూ.
ఇది అసలు అనుకోకుండా జరిగిన విశేషం. చిన్నన్నయ్య పెద్దక్కయ్యని ఊరికే చూద్దామని వచ్చాడు. కానీ అక్కడ అందర్నీ చూసి ఆశ్చర్యపోయాడు.
‘‘రారా, వచ్చి కూర్చో’’ అంటూ ప్రకాశరావు తమ్ముడికి ఎదురెళ్ళాడు.
‘‘మంచి సమయానికే వచ్చావు’’ అని తమ్ముడి వైపు ఆపేక్షగా చూసింది పెద్దక్కయ్య. ప్రభావతికైతే ఈ కలయిక చాలా శుభసూచకంగా తోచింది. తన ఆలోచన అందరిముందు ఉంచటానికి ఇదే సరైన సమయం అనుకుంది.
మొత్తానికి అందరి పరిస్థితీ ఇంచుమించుగా ఒకటేలా ఉంది. కారణాలు ఏవైనా, కొద్దికాలంగా అందరూ ఏదో ఒక విధమైన మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు.
అందరిలోనూ ఏదో అభద్రతాభావం, ఏదో పోగొట్టుకున్న బాధ. ఆలోచిస్తే పరిష్కారంలేని సమస్య కాదు. కానీ సమష్టిగా పరిష్కరించుకుంటే అందరికీ సానుకూలంగా మారే ఆస్కారం ఉందనిపించింది ప్రభావతికి. అందుకే ముందుగా చొరవ తీసుకుని ‘‘పెద్దన్నయ్యా, చిన్నదాన్నని అనుకోకపోతే నేనొకటి చెబుతాను వింటావా..?’’
‘‘చెప్పరా తల్లీ, నీ మాట కాదంటానా చెప్పు. మంచిచెడ్డలు మాట్లాడుకోటానికేగా తోడబుట్టిన వాళ్ళుండేది.’’
‘‘అందుకే అన్నయ్యా, ఆ బంధంతోనే ఆ బాధ్యతతోనే ధైర్యంచేసి నేనూ బావగారూ మీ ముందు ఓ పరిష్కారమార్గాన్ని ఉంచబోతున్నాం.’’ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభావతి తను సూచించేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ... తన సంభాషణ పొడిగించింది.
‘‘పెద్దక్కయ్య పరిస్థితి నాకు పూర్తిగా అర్థం అయింది. ఈ వయసులో ఇంత అసంతృప్తి, అనారోగ్యానికి దారితీస్తుంది. బలవంతాన ఉండమని చెప్పలేం, అలా అని వృద్ధాశ్రమంలో ఉండాలన్న నిర్ణయాన్ని హర్షించలేం. పెద్దక్క నాకు తల్లితో సమానం. అమ్మని అలా వదిలేయలేం కదా! ఇక చిన్నక్కయ్య అందరితో ఉంటూ అందరి మధ్యా నలిగిపోతోంది. తను అసలే చాలా మెతక. బావగారు ఇటు చెప్పలేరు అటూ చెప్పలేరు. అదీ దాని పరిస్థితి.
పెద్దన్నయ్యా, వదినా మనందరికీ తల్లితండ్రిలాంటి వారు. వదినకి ఆరోగ్యం సరిగా ఉండటంలేదు. రోజురోజుకీ నీరసించిపోతోంది. పెద్దన్నయ్య ఒక్కడు ఏం చేసుకోగలడు, ఏం చేయగలడు చెప్పండి.చిన్నన్నయ్య విషయానికొస్తే సమస్యలేం లేకపోవచ్చుగానీ పిల్లలు రారు, వీళ్ళు వెళ్ళరు. ఒక జంట అనుభవిస్తున్న ఒకలాంటి ఒంటరితనం. వాళ్ళకీ ఏ వ్యాపకం లేకపోవడంతో ఏమీ తోచుబాటు కాదు.
ఇక నా విషయానికొస్తే... నా కొడుకూ కోడలు మనసుల్లో ఏముందో, ముందుముందు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలీదుగానీ, ప్రస్తుతానికి నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకమే. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాం’’ తటపటాయింపుగా కాస్త ఆగింది ప్రభావతి. అందరూ ఉత్కంఠతో తననే చూస్తున్నారు.
‘‘చెప్పు, ధైర్యంగా చెప్పు. అందరం కలిసి ఆలోచిద్దాం’’ అన్నాడు ప్రకాశరావు- చెల్లెలి వైపు సాభిప్రాయంగా చూస్తూ.
‘‘చిన్నప్పుడు మనం అందరం అమ్మా నాన్నలతో పల్లెటూళ్ళో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం! ఉన్నంతలో అమ్మానాన్న మనల్ని ఏ లోటూ లేకుండా పెంచారు. ఆ రోజుల్నీ ఆ ఆప్యాయతల్నీ ఆ అనుబంధాల్నీ నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఒక్కొక్కరూ ఒక్కో వృద్ధాశ్రమంలో అనాథల్లాగా చేరే దుస్థితి రాకూడదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను.
ఒక తల్లి కడుపున పుట్టిన మనం చివరి వరకూ ఒకేచోట కలిసి ఉందామని నా ఆశ. మా ఇల్లు చాలా పెద్దది. కింద ఐదూ, పై అంతస్తులో ఐదు బెడ్‌రూములతో అన్ని వసతులతో ఎంతో విశాలంగా కట్టాం.
మనం ఎవరం డబ్బుకిబ్బంది పడటంలేదు.
ఎవరికీ ఎలాంటి ఇబ్బందిలేకుండా ఎలాంటి మొహమాటాలూ లేకుండా ఉండటానికి ఈ పద్ధతి. అందరం కలిసే ఉందాం. నా కొడుకూ కోడలూ పై అంతస్తులో ఉంటారు. పైన కూడా అయిదు బెడ్‌రూములున్నాయి కనుక రేపు వాళ్ళకు పిల్లలు పుట్టినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరందరూ అక్కడ ఉండటానికి వాళ్ళు అడ్డుచెప్పరు. మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుని మీకే ఇబ్బందీ కలగకుండా చూసుకునే పూచీ నాది.
అందరం కలిసి ఒక వంట మనిషిని పెట్టుకుందాం. మన పనులను చూడ్డానికి ఒక పనిమనిషినీ బయట పనులకు ఇంకో కుర్రాడినీ పెట్టుకుందాం. దీనికయ్యే ఖర్చు అందరం పంచుకుందాం. మన పిల్లలు వాళ్ళ బాధ్యతలను తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నా వాళ్ళందరికీ ఇది పుట్టిల్లులాగా రావచ్చు పోవచ్చు. అందరినీ ఒకేసారి ఒకేచోట చూడొచ్చు. పిల్లలు మనకు దూరమవకుండా, మనమే వాళ్ళ జీవితాల నుంచి తాత్కాలికంగా దూరంగా ఉందాం. అలా అయితే వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం వాళ్ళకుంటుంది. మనకి కావాల్సిన స్వేచ్ఛ మనకుంటుంది. కలిసినప్పుడల్లా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది.
మీకు సేవ చేసే శక్తిని నాకు ఆ భగవంతుడిచ్చాడు. నా నిర్ణయాన్ని ఆమోదించి సంపూర్ణ సహకారాన్నందించే మంచి హృదయాన్ని మీ బావగారికిచ్చాడు. మీరు బయటకెళ్ళకుండా మీకు ఏ అవసరం వచ్చినా- అంటే బ్యాంకు పనులూ వగైరా అన్నీ ఆయన చేస్తానన్నారు. మనం అందరం ఒకే రక్తం పంచుకు పుట్టినవాళ్ళం. మనమధ్య ఎలాంటి బేధభావాలూలేవు. ఉన్నది ఒక్క రక్త సంబంధం మాత్రమే. దీనికి నా కొడుకూ కోడలు పూర్తి మద్దతు ఇస్తారని నా నమ్మకం.
మీరంతా నాకు ఈ చిన్ని అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్థక్యంలో, మళ్ళీ మన బాల్యాన్నీ అందమైన జ్ఞాపకాలనీ గుర్తుచేసుకుందాం. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుందాం. కడదాకా ఒకరికొకరం తోడుగా, ఆనందంగా బతికేద్దాం.’’
తన ప్రేమపూర్వక పలుకులతో సున్నితంగా అందరినీ కట్టిపడేసింది ప్రభావతి. అందరి కళ్ళూ చెమర్చాయి. ఒక్కసారిగా నలుగురూ వచ్చి ప్రభావతిని చుట్టేశారు. అప్పటిదాకా వాళ్ళ మనసుల్ని కలిచివేసిన బాధ అంతా దూదిపింజంలా తేలిపోయింది. ఇంత మంచి ఆలోచన తమలాంటి ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఉత్సాహంగా ఇళ్ళకు మళ్ళారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.