close
ఎన్నేళ్లయినా ఇంకో సినిమా చూడను!

ఎన్నేళ్లయినా ఇంకో సినిమా చూడను!

సినిమా కలలు అందర్నీ ఊరిస్తాయి. కానీ మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలాంటి సినిమా తీయాలనే కలలు చాలా కొద్దిమందికే నెరవేరతాయి. ఆ జాబితాలో తొలివరసలో ఉంటాడు ఘాజీ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. నిండా ముప్ఫైఏళ్లు కూడా లేని ఈ నవయువకుడు వేసిన తొలి అడుగే జాతీయ స్థాయిలో అవార్డును తెచ్చిపెట్టింది. ఆ విజయం వెనక ఉన్న కృషి ఎంతో, ఆ పయనంలోని మలుపులేంటో అతడి మాటల్లోనే...2006 నాటి ముచ్చట... కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత మా స్నేహితులంతా ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లిపోయారు. కానీ నాకు మాత్రం యూఎస్‌ వీసా ఎప్పుడూ రిజెక్ట్‌ అయ్యేది. దాంతో అమెరికా ఆశల్ని వదిలేసి ఇన్ఫోటెక్‌లో ఉద్యోగిగా చేరా. ఆరు నెలలు గడిచాయో లేదో ఉద్యోగం బోర్‌ అనిపించింది. అప్పుడే వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నా. ఏం చెయ్యాలన్నా ఎంబీఏ పట్టా ఉంటే బాగుంటుందని ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కేశా. ఒక సెమిస్టర్‌ పూర్తయ్యిందో లేదో అది కూడా నచ్చలేదు. దాంతో మధ్యలోనే చదువు ఆపేసి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఫిల్మ్‌ స్కూల్లో చేరిపోయా. ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసి 2009లో హైదరాబాద్‌ తిరిగొచ్చా. విషయం తెలియగానే ఇంట్లో అందరూ షాకయ్యారు. తర్వాత నేనే మెల్లగా వాళ్లను కన్విన్స్‌ చేశా.జీతాలు ఇవ్వలేకపోయా...
ఇక్కడికి వచ్చాకే తెలిసింది సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో. అసలే సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు, అందులోనూ అంతా కొత్త. దాంతో కేవలం సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకోవడం కోసమే 2010లో సీజీ స్టూడియో పెట్టాలని నిర్ణయించుకున్నా. దీని వల్ల ఒకవైపు పరిశ్రమలో పరిచయాలు పెరుగుతాయి మరోవైపు వ్యాపారం కూడా సాగుతుందని ఆలోచించా. వెంటనే లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ దగ్గర్లో ఒక స్టూడియో పెట్టేశా. ఇక సినిమా వాళ్లందరూ నా స్టూడియో ముందు క్యూలు కడతారనుకున్నా. కానీ, అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. పరిచయాల మాట దేవుడెరుగు కనీసం సిబ్బందికి జీతాలివ్వడమే చాలా కష్టమైపోయింది. ఇక లాభంలేదనుకుని స్టూడియోకి తాళం వేసేశా.
మొదలు నీతోనే...
ఎప్పుడూ సినిమా తియ్యాలన్న ఆశ వెంటాడుతూ ఉండేది. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవి. పోనీ ఏదైనా మరో పని చేసుకుందామంటే మనసంతా సినిమాలమీదే ఉండేది. ఆ సమయంలో నాకు బాధనిపించిన ప్రతిసారీ మా ప్రొఫెసర్‌ చెప్పిన ‘బీ ద ఫస్ట్‌ ఆర్‌ బీ ద బెస్ట్‌’ అన్న మాటలు మనసులో మెదులుతూ ఉండేవి. వాటి స్ఫూర్తితోనే ఇప్పటివరకూ ఎవరూ చేయని కథాంశంతో సినిమా తీద్దామనుకున్నా. ఈ దశలోనే అనుకోకుండా చేసిన ఒక ప్రయాణం నన్ను జాతీయస్థాయిలో అవార్డు పొందిన సినిమాకి దర్శకుడిని చేసింది.
2012లో పెళ్లయిన తర్వాత నా భార్యతో కలిసి అన్నవరం వెళ్లాల్సి వచ్చింది. తిరుగుప్రయాణంలో ట్రైన్‌ మిస్సయ్యింది. విశాఖపట్నం నుంచి అయితే ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉంటాయిని అక్కడకు వెళ్లాం. ట్రైన్‌ బయలుదేరడానికి ఇంకా రెండు గంటలు సమయం ఉండటంతో బీచ్‌ రోడ్డుకి ఒక ట్రిప్‌ వేశాం. ఆ సందర్భంలోనే సబ్‌మెరైన్‌ కంటపడింది. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకూ 150 సబ్‌మెరైన్‌ సినిమాలు వచ్చాయి అయితే వాటిలో ఒక్కటీ భారతీయ సినిమాలేదు. అందుకే ఈ కథాంశంతో ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకున్నా.
కుదరకపోతే యూట్యూబ్‌...
సబ్‌మెరైన్‌ మీద వర్క్‌ చేయడం మొదలు పెట్టా. చాలా రిసెర్చ్‌ చేశా. వివిధ దేశాల సబ్‌మెరైన్‌ల గురించి తెలుసుకున్నా. అప్పుడే 1971 భారత్‌, పాక్‌ యుద్ధంలో విశాఖలో జరిగిన సమ్‌మెరైన్‌ యుద్ధ నేపథ్యాన్ని గురించి తెలుసుకున్నా. దానికి కొంత ఊహను జోడించి కథను సిద్ధం చేశా. అసలే కొత్త అంశం, నేనూ కొత్తవాణ్ణి దాంతో నిర్మాతలకు కథ చెప్పినా ఒప్పుకోరని తెలుసు అందుకే నేనే సొంతంగా ఈ సినిమా తియ్యాలనుకున్నా. ముందుగా ఒక గంటన్నర నిడివి ఉండే సినిమాను తీసి, అన్నీ కలిసొస్తే వెండితెరమీద లేదంటే యూట్యూబ్‌లో రిలీజ్‌ చేద్దామని షూటింగ్‌ ప్రారంభించా.
పిల్లల డబ్బులూ...
నా దగ్గరున్న అయిదు లక్షల రూపాయలతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను దాదాపు పూర్తిచేశా. సబ్‌మెరైన్‌ సెట్‌ ఒక్కటి వేసేసి అక్కడే మొత్తం సినిమాను పూర్తి చేయాలనుకున్నా. అయితే ఆ సెట్‌ పూర్తవకముందే నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. కొంతమంది స్నేహితులను అడిగా... పెద్దగా వర్కవుట్‌ అవలేదు. నా కష్టాన్ని చూసి నాన్న కొంతిచ్చారు. సెట్‌ వెయ్యడం పూర్తయ్యి, షూటింగ్‌ కొంత జరిగాక అవి కూడా అయిపోయాయి. దీంతో చేసేదేమీలేక సినిమా ఆపేశా. విషయం తెలిసి అమ్మ ఫిక్సిడ్‌ డిపాజిట్‌ డబ్బులు నాకిచ్చింది. అవి కూడా ఏమూలకీ సరిపోలేదు. షరా మామూలే. చివరికి పిల్లల పుట్టినరోజులకు బహుమతులుగా వచ్చిన డబ్బులు కూడా సినిమాకోసం తీసేయాలనుకున్నా. ఎందుకో తెలియదు ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడు మాత్రం నన్ను నేను కంట్రోల్‌ చేసుకోలేక ఏడ్చేశా. ఇప్పటికీ అది తలచుకున్నప్పుడల్లా నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
కథలు చెప్పలేను...
సినిమాల్లోకి రావాలంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నా. దానికి సబ్‌మెరైన్‌ సినిమా ఒక మంచి అవకాశంగా భావించా. పైగా ఇది ఒక యునిక్‌ సబ్జెక్ట్‌ కాబట్టి కచ్చితంగా అవకాశాలు రావడానికి కారణమవుతుందనుకున్నా. అందుకే కేవలం యూట్యూబ్‌లో పెట్టాలనుకున్న సినిమా కోసం పాతిక లక్షలు ఖర్చుపెట్టా. కానీ సినిమా పూర్తిచేయాలంటే నాకు మరికొంత డబ్బు కావాలి. ఇక లాభం లేదనుకుని నిర్మాతల చుట్టూ తిరగడం మొదలు పెట్టా. సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే కథనేసరికి చాలా మంది ఆసక్తి చూపించలేదు. ఇక్కడ ఎదురైన ఇంకో సమస్య - ఎదుటివారికి అర్థమయ్యేలా నేను కథ చెప్పలేకపోవడం. దీంతో నిర్మాతలను పెద్దగా మెప్పించలేకపోయా. అప్పుడే మనసులో మరో ఆలోచన వచ్చింది. అసలు కథ చెప్పడం కంటే ఇప్పటివరకూ చేసిన సీజీ వర్కుతోపాటు మిగిలిన కథను కూడా యానిమేషన్‌ రూపంలో తీసి చూపిస్తే సరిపోతుంది కదా అనిపించింది. అనుకున్నదే తడవుగా ప్రతి షాట్‌ని యానిమేషన్‌ రూపంలోకి మార్చి నిర్మాతలకు చూపించడం మొదలు పెట్టా. చివరికి నా కృషి ఫలించి మ్యాట్నీ సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ నిరంజన్‌ గారికి కథ నచ్చింది.రానా రాకతో...
సినిమాల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు హీరో వచ్చి వారిని గట్టెక్కించినట్టు ఈ సినిమాలోకి రానా వచ్చి ఈ కథను మరో మలుపు తిప్పాడు. ఆయనెలా వచ్చారంటే... నిరంజన్‌గారికి నేను చెప్పిన కథని ఆయన పెద్ద నిర్మాతల్లో ఒక్కరైన పీవీపీ గారికి చెప్పారు. స్టోరీ లైన్‌కి ఫిదా అయిన పీవీపీగారు ఒక పార్టీలో రానాని కలిసినప్పుడు అతడికి కథ వినిపించారట. రానా వెంటనే ఓకే చెప్పేయడంతో నా కష్టాలు తీరిపోయాయి. దాంతో యూట్యూబ్‌ స్టోరీ కాస్తా వెండితెర మీదకు వెళ్లింది. అంతకు ముందు వేసిన సెట్‌ రానా హైట్‌కి సరిపోకపోవడంతో ఏడాది శ్రమించి మళ్లీ సెట్‌ వేయాల్సి వచ్చింది. 2016 నాటికి సెట్‌ వర్క్‌ పూర్తవడంతో వెంటనే షూటింగ్‌ మొదలు పెట్టాం. కేవలం అరవై రోజుల్లోనే హిందీ, తెలుగు భాషల్లో ఘాజీ సినిమా షూటింగ్‌ పూర్తిచేశా. తమిళంలో మాత్రం డబ్‌చేసి విడుదల చేశాం. షూటింగ్‌ మొత్తం సబ్‌మెరైన్‌ సెట్‌లోనే జరిగింది. నాకైతే స్క్రిప్ట్‌ వర్క్‌ నుంచీ అక్కడే పనిచేయడంతో ఆ వాతావరణం అలవాటైపోయింది. కానీ అందులోకి కొత్తగా వచ్చిన రానా, తాప్సీ, ఓంపురీ, అతుల్‌ కులకర్ణి అక్కడి వాతావరణంతో కాస్త ఇబ్బంది పడ్డారు. పైగా రోజులో 16 నుంచి 18 గంటలు షూటింగ్‌ చేసేవాళ్లం. అలా చాలా రోజుల పాటు ఎండ తగలకపోవడం వల్ల విటమిన్‌ డి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చింది.
ఘాజీ సినిమా షూటింగ్‌ సమయంలోనే అందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి అవార్డు తప్పక వస్తుందనేవారు. అయితే కమర్షియల్‌గా వర్కవుట్‌ కాదన్నారు. కానీ అదృష్టవశాత్తూ కమర్షియల్‌గా కూడా పెద్ద హిట్‌ అవడంతోపాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డునూ తెచ్చిపెట్టింది. అవార్డు వచ్చిన విషయం ముందుగా నాకు మా నాన్న ఫోన్‌ చేసి చెప్పారు. తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడంతో నా బాధ్యత రెట్టింపు అయిందనుకుంటున్నా.అంతరిక్షంలో...
నా ఆలోచనలన్నీ కొత్తగా ఉండాలని కోరుకుంటా. అందుకే నా రెండో సినిమాకు అంతరిక్షాన్ని కథాంశంగా ఎంచుకున్నా. ఇందులో వరుణ్‌తేజ్‌ హీరోగా, లావణ్య త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. సినిమా కోసం స్పేస్‌ షిప్‌కి సంబంధించిన భారీ సెట్‌ వేశాం. ఘాజీలో సబ్‌మెరైన్‌కి ఎంత పేరొచ్చిందో దీనికీ అంతే పేరొస్తుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఎవరూ చేయని కథలతోనే నా సినిమాలన్నీ ఉండాలనేదే నా కోరిక.


మరికొంత...

దుటివారికి అర్థమయ్యేలా చెప్పేందుకే నేను రాసుకున్న కథను ముందుగా యానిమేషన్‌ మూవీగా రూపొందిస్తున్నా. కానీ భవిష్యత్తులో హాలీవుడ్‌ స్థాయిలో ఒక యానిమేషన్‌ సినిమా తియ్యాలన్నదే నా కోరిక.
* పవన్‌ కళ్యాణ్‌ సినిమాలంటే పిచ్చి. ఆ తర్వాత మహేష్‌ బాబు సినిమాలు నచ్చుతాయి.
* డైరెక్టర్‌ క్రిష్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘గమ్యం’ సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు.
* బాలీవుడ్‌ నటీనటుల్లో ఆమీర్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యరాయ్‌ల నటన నచ్చుతుంది.
* నేను ఏదైనా సినిమా చేసేటప్పుడు అది పూర్తయ్యేవరకూ - ఏడాదైనా రెండేళ్లయినా- ఇంకో సినిమా చూడను. ఆ ప్రభావం నా సినిమా మీద ఎక్కడ పడుతుందోనన్న భయమే అందుకు కారణం.
* అమ్మ వనితారెడ్డి గృహిణి, నాన్న సదయవీర్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. నా భార్య కీర్తి ఫ్యాషన్‌ డిజైనర్‌. ఘాజీ సినిమా కోసం నేను కష్టపడుతున్నప్పుడు తనిచ్చిన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేను. నాకు ఇద్దరు పిల్లలు. ఒకవేళ ఈ ఫీల్డులోకి రాకపోయుంటే కచ్చితంగా వీడియోగేమ్స్‌ను రూపొందించేవాడిని.
* నేను చదివిన సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ యాజమాన్యం ‘ఘాజీ’ సినిమా విడుదలైన తర్వాత ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను.
* ఘాజీ సినిమాకి ముందు హిందీ స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నా. కానీ రానా రావడంతో సినిమాను తెలుగులో కూడా షూట్‌ చేశాం. ఘాజీ ట్రైలర్‌ చూసిన వెంటనే బిగ్‌బి అమితాబ్‌, మెగాస్టార్‌ చిరంజీవీ వాయిస్‌ ఓవర్‌ చెప్పేందుకు ఒప్పుకున్నప్పుడు కొంచెం గర్వంగా అనిపించింది.
* సినిమా పరిశ్రమలోకి రాకముందు నాలుగైదు లఘుచిత్రాలు తీశా. కానీ అవి పెద్దగా హిట్‌ కాలేదు.
* ఘాజీ సినిమా విడుదలైన తర్వాత చాలా రోజుల వరకూ నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ‘నువ్వా ఘాజీ డైరక్టర్‌’ అంటూ ఆశ్చర్యపోయేవారు.


- దంతుర్తి లక్ష్మీప్రసన్న

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.