close
అమ్మా... వందనం!

అమ్మా... వందనం!

‘అమ్మా...’ ఆ పిలుపు చాలు. మనిషి కదిలిపోతుంది. మనసు కరిగిపోతుంది. ‘నేనున్నా కన్నా...’ అంటూ అక్కున చేర్చుకుంటుంది. ప్రేమ కురిపిస్తుంది. పిలిచింది కన్నబిడ్డే కానక్కరలేదు. అమ్మ అవసరం ఉన్న ఏ బిడ్డయినా సరే ఆమెకు కన్నబిడ్డతో సమానమే! అలాంటి వారిని చూసే రాసి ఉంటారు సినారె ‘కంటేనే అమ్మ అనీ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ అని. సొంతబిడ్డలతో సమానంగా అనాథల్నీ సాకే అమ్మలు దేవతలు కారా మరి!

వైకల్యాన్ని మరిపిస్తుంది!

న్నబిడ్డలిద్దరూ తనని నోరారా అమ్మా అని పిలిచినా ఆమెకు తృప్తి కలగలేదు. అందుకే ఏకంగా మరో 70 మందిని సాకుతోంది. వారెవరూ మామూలు పిల్లలు కూడా కాదు, రకరకాల వైకల్యాలతో బాధపడుతున్నవారు. కొందరు అనాథలూ, మరికొందరు నిరుపేదలూ. ‘అమ్మా...’ అని వారు పిలిచే పిలుపుకోసం ఆమె యావదాస్తినీ ఖర్చుచేసేసింది. ఓ దశలో తాళిబొట్టునీ కుదువబెట్టింది. రాయవరపు సత్య తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ‘శాంతివర్ధన’ పేరుతో ఓ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. సత్య ప్రేమించి పెళ్ళిచేసుకుంది. భర్తకి పుట్టుకతోనే వైకల్యం ఉంది. వారి ప్రేమకు అదేమీ అడ్డురాలేదు. పెద్దల అభ్యంతరాలనూ వారు పట్టించుకోలేదు. వైకల్యం ఉన్నవారితో సమాజం ఎలా వ్యవహరిస్తుందో వారికి అనుభవమైంది. అందుకే ఆ భార్యాభర్తలు అలాంటి పిల్లలకోసం ఏమన్నా చేయాలనుకున్నారు. అతడిది ప్రైవేటు ఉద్యోగమే. వెనకాల పెద్దగా ఆస్తులేమీ లేవు. అయినా ధైర్యం చేశారు. ఐదుగురితో కేంద్రాన్ని మొదలెట్టారు. అయితే ఆ ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదు. పిల్లలను ఉంచడానికి ఎవరూ ఇల్లు అద్దెకివ్వకపోవడంతో కొన్నాళ్లు పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. అయినా సత్య రేయింబగళ్లు కంటికి రెప్పలా పిల్లల్ని కాచుకునేది. ఎంత మంది సిబ్బంది ఉన్నా ఇప్పటికీ చిన్నపిల్లలకి సత్యే గోరుముద్దలు తినిపిస్తుంది. స్నానాలు చేయిస్తుంది. చదువు నేర్పుతుంది. పిల్లల కోసమే ఆమె ఎం.ఎ.చదివింది. తమ పనులు తాము చేసుకోవడం రాని పిల్లల్ని అంతమందిని చూసుకోవడం కష్టం కాదా అంటే... అమ్మకి ఏదీ కష్టం కాదనే సత్య, వారి పిలుపు తమ కష్టాల్ని మరిపిస్తుందంటుంది. నాలుగేళ్ల నుంచి ముప్పయ్యేళ్లవారి వరకూ ఉన్న ఆ పిల్లల్లో చాలామంది మానసిక వికలాంగులే. ఎవరూ రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. ఒక్కొక్కరూ ఒక్కో సమయంలో నిద్రలేస్తారు. వారికేం కావాలో వారికే తెలియదు. ఎందుకు కోపం వస్తుందో తెలియదు. కోపం వస్తే చేతిలో ఉన్నది విసిరేస్తారు. వారిని కోప్పడీ ప్రయోజనం ఉండదు కాబట్టి నెమ్మదిగా నచ్చజెప్పాలి. అలాంటి వారందరినీ కనిపెట్టుకుని ఉండడం మాటలు కాదు. ఎదిగిన ఆడపిల్లలూ ఉన్నారు. వారికీ ఎన్నో విషయాలను ఓపిగ్గా నేర్పించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలన్నీ ఎంతో సహనంతో చేస్తుంది సత్య. అన్ని ఖర్చులూ కలిసి నెల తిరిగేసరికి లక్షదాటేది. నానా అవస్థా పడేవారు కానీ పిల్లలకు ఏ లోటూ చేసేవారు కాదు. వృత్తి విద్యలు నేర్చుకున్న పెద్ద పిల్లలు ఇప్పుడిప్పుడే కొద్దిగా సంపాదించగలుగుతున్నారు. సత్య దంపతుల సేవాభావం చూసి నమ్మకం ఏర్పడడంతో కొందరు దాతలు ముందుకొచ్చి చేయూతనిస్తున్నారు. కేంద్రంలో పిల్లలందరికీ వారి వారి అవసరాలను బట్టి చికిత్సలు చేయిస్తారు. శిక్షణ ఇస్తారు. అందుకుగాను శిక్షణ పొందిన టీచర్లనూ పెట్టారు. అంతటితో తమ పని అయిపోయిందనుకోలేదు సత్య. అసలు పిల్లలు వైకల్యంతో పుట్టకూడదన్నది ఆ తల్లి కోరిక. మేనరిక వివాహాలూ అందుకు ఒక కారణమని గుర్తించి ఆ దిశగా గ్రామాల్లో చైతన్యం తెస్తోంది.

హెచ్‌ఐవీ అయితేనేం...

నందలక్ష్మికి ముగ్గురు పిల్లలు. ఇంటిని చక్కదిద్దుకుంటూ ఓ ప్రైవేటు స్కూలునూ నడిపేది. ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఏకంగా 35 మంది పిల్లలకు అమ్మయింది. కన్న తల్లిదండ్రులు లేని, భవిష్యత్తు మీద ఆశ లేని అభాగ్యులు వారు. అలాంటివారికి అన్నీ తానై కొత్త జీవితాన్ని అందిస్తున్న ఆనందలక్ష్మికి ఇప్పుడు బంధువులు ఎవరూ లేరు. ఓ పెళ్లీ పేరంటం లేదు. ఇరవై నాలుగ్గంటలూ హెచ్‌ఐవీ పాజిటివ్‌ పిల్లల ఆలనాపాలనలో గడుపుతున్నందుకు ఫలితమది. అందుకామె బాధపడడం లేదు. కల్లాకపటం ఎరుగని ఆ చిన్నారుల సంతోషంలోనే తన సంతోషాన్ని వెదుక్కుంటోంది. ఆమె భర్త ఎయిడ్స్‌ నిర్మూలన కార్యక్రమంలో పనిచేసేవారు. ఆ పని మీద వెళ్లివచ్చినప్పుడల్లా బాధితుల పరిస్థితి గురించి ఆయన చెప్తోంటే ఆమె గుండె చెరువయ్యేది. తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లల్ని చూసుకునే సంస్థలేవీ లేవనీ అలాంటి పిల్లలను ఒకరిద్దరినైనా తాము పోషించగలిగితే బాగుంటుందనీ భర్త అనగానే ఆమె వెంటనే అంగీకరించింది. అలా నలుగురు పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నారు. క్రమంగా ఆ సంఖ్య పదికి పెరిగింది. వారిని పోషించడమే కాక తనతోపాటు బడికీ తీసుకెళ్లేది. అది తెలిసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆమె బడికి పంపడం మానేశారు. స్కూలే మూసేయాల్సి వచ్చింది. ఆ పిల్లలతో కలిసి ఉంటామంటే ఎవరూ వారికి ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు. పైగా చీదరించుకునేవారు. హెచ్‌ఐవీ అంటువ్యాధికాదనీ పిల్లల్ని దగ్గరికి తీస్తే ఆ వ్యాధి సోకదనీ ఎంత చెప్పినా వినేవారు కాదు. చివరికి ఎమ్మెల్యే సహాయంతో కాస్త ప్రభుత్వ స్థలం వచ్చింది. సొంతడబ్బూ విరాళాలూ కలిపి రవితేజా చిల్డ్రన్స్‌ హోమ్‌ పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు. ఏలూరులోని ఆ హోమ్‌లో ఇప్పుడు 35 మంది చిన్నారులు ఉన్నారు. వారి బాధ్యత పూర్తిగా ఆనందలక్ష్మిదే. తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న మరో యాభై మంది పిల్లలకి మందులూ పోషకాహారం ఆమే ఇస్తుంది. ఇప్పుడు ఆనందలక్ష్మి ఆనందానికి చిరునామా ఆ పిల్లలే. తనే వంట చేస్తుంది. పిల్లలకు చదువూ వృత్తి విద్యలూ నేర్పిస్తుంది.

తమ్ముడికి అమ్మయింది!

ఇందిర పాతికేళ్ల క్రితం అందరిలాంటి అమ్మాయే. కళ్లనిండా కలలు కనేది. ఒక్కరోజులో అవన్నీ కల్లలయ్యాయి. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. తమ్ముడికి తానే తల్లి అవతారమెత్తింది. నిజామాబాద్‌ జిల్లా అర్గుల్‌కి చెందిన రైతుకుటుంబం ఇందిరది. తమ్ముడు రమేశ్‌ ఇంటర్‌ చదివి తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది ఓ ప్రమాదం. పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుత్‌ స్తంభం మీద మరమ్మతు చేయబోయిన రమేశ్‌కి కరెంట్‌ షాక్‌ కొట్టింది. ఒక్క ఉదుటున స్తంభం మీదినుంచి పడిపోయాడు. వెన్నెముక విరిగింది. వెంటనే పట్టణానికి తీసుకెళ్లారు. పెద్ద ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. పొలం అమ్మేశారు. అప్పులూ చేశారు. డబ్బంతా అయిపోయింది కానీ రమేష్‌ లేచి నిలబడలేదు. నడుం కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఒక్కగానొక్క కొడుకు మంచం పట్టడంతో దిగులుపడిన తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని వదిలారు. అక్కాతమ్ముళ్లిద్దరే మిగిలారు. తానూ పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తమ్ముడిని ఎవరు చూస్తారనుకున్న ఇందిర ఆ ఆలోచనను మనసులోకే రానివ్వలేదు. కన్నతల్లిలా అతనికి సేవలు చేస్తోంది. ఒంటిమీద పుండ్లు పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉండడానికి చిన్న పెంకుటిల్లుంది. రమేశ్‌కి వచ్చే రూ.1500 పింఛనూ, బీడీలు చేసి ఇందిర సంపాదించే ఐదారువందలూ... అదే వారి ఆదాయం. కానీ రమేశ్‌ మందులకే నెలకు నాలుగైదు వేలు కావాలి. దయగలవారు చేసే సాయంతోనూ, అప్పులతోనూ రోజులు గడుపుతున్నారు ఈ అక్కాతమ్ముళ్లు. ‘అక్క కాదు, మా అమ్మ’ అంటాడు రమేశ్‌. ‘నేను కనలేదనేగానీ వాడు నా బిడ్డే. నా బిడ్డ బాగోగులు నేను కాకపోతే ఎవరు చూస్తారు’ అంటుంది ఇందిర.

పుత్రోత్సాహం!

పెళ్లై పదిహేనేళ్లయినా కడుపు పండకపోతే ఛాతరాజు సుమతి ఎవరినైనా పెంచుకోవాలనుకుంది. భర్తతో కలిసి ఓ అనాథాశ్రమానికి వెళ్లింది. మరొకరెవరన్నా అయితే అక్కడున్న పిల్లల్లో అందంగా చురుగ్గా ఉన్న పిల్లవాడిని ఎంపిక చేసుకునేవారు. కానీ సుమతిలోని అమ్మ కంటికి మాత్రం అందుకు భిన్నంగా ఉన్న ఓ బిడ్డ బాగా నచ్చాడు. అతడి కళ్లు ఆమెను కట్టిపడేశాయి. అతడి మానసిక వైకల్యం గురించి ఆశ్రమం వాళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా, అయినవారే ఆ చిన్నిప్రాణాన్ని హరించివేసే ప్రయత్నాలు చేశారని వివరించినా సుమతి విన్పించుకోలేదు. అన్ని కష్టాలు పడ్డ ఆ బిడ్డ తనకోసమే బతికాడనుకుంది. అతనికే తన అవసరం ఉందని పొత్తిళ్లకెత్తుకుని తెచ్చుకుంది. సాయికృష్ణ అని పేరు పెట్టుకుంది. చుట్టుపక్కలవారి ఈసడింపులను భరిస్తూనే ఆ పిల్లవాడిని పెంచింది కానీ బడిలో చేర్పించాల్సివచ్చేసరికి సమస్య ఎదురైంది. గోదావరిఖనిలో ఎవరూ చేర్చుకోకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ సంస్థలో చేర్పించింది. చేర్పించిన రెండు రోజులకే బిడ్డ అపహరణకు గురయ్యాడు. పోలీసు కేసు పెట్టి పెద్ద ఎత్తున పోరాటమే చేసింది. చివరికి కిడ్నీలు అమ్ముకునే ముఠా నుంచి తన బిడ్డను కాపాడుకుంది. ఇక ఎక్కడికీ పంపించకూడదని తానే టీచరు అవతారమెత్తింది. అతడి పనులు అతడు చేసుకోవడంతో మొదలుపెట్టి వృత్తి విద్యల వరకూ ఓపికగా నేర్పించింది. పేపరు ప్లేట్ల తయారీ శిక్షణతో ఏకాగ్రత వస్తుందని ఎవరో చెబితే అదీ నేర్పించి సొంతంగా యూనిట్‌ పెట్టించి అలాంటి మరి కొందరికీ శిక్షణ ఇస్తోంది. ఇప్పుడతడికి 23 ఏళ్లు. చిన్నప్పుడు అతడి పరిస్థితి గురించి చెప్పినా ఎవరూ నమ్మరిప్పుడు. అలా తీర్చిదిద్దుకున్న తల్లి ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతోంది.

పాప కోసం...

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ఏదో పని మీద సుజాత తన ఏడాదిన్నర బిడ్డను తీసుకుని హైదరాబాద్‌ వచ్చింది. రైల్వేస్టేషన్‌ రద్దీలో ఎవరో ఆ బిడ్డను లాక్కుని పారిపోయారు. ఎంత ప్రయత్నించినా వాళ్లను పట్టుకోలేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసి, కాళ్లరిగేలా తిరిగినా పాప జాడ తెలియలేదు. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలున్నా అదృశ్యమైన పాపను మరవలేకపోయేది తల్లి మనసు. తన బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ప్రార్థించేది. ఎందుకోగానీ అమాయకంగా, అకారణంగా నవ్వులు చిందించే మానసిక వైకల్యం గల పిల్లలు ఆమె కళ్లముందు కదలాడేవారు. అలాంటి పిల్లల్ని ఇళ్లల్లో చాలామంది సరిగా చూడకపోవడం గమనించిన సుజాత అదే తన కర్తవ్యం అనుకుంది. పదేళ్ల క్రితం హన్మకొండలో అతిథి మానసిక వికలాంగుల కేంద్రాన్ని ప్రారంభించింది. ఐదుగురితో మొదలైన ఆశ్రమంలో ఇప్పుడు 40 మంది ఉన్నారు. చేరినప్పుడు వారెవరికీ తమ పనులు తాము చేసుకోవడం రాదు. అలాంటివారికి అన్నీ చేస్తూనే తమ పనులు తాము చేసుకునేలా శిక్షణ ఇచ్చింది సుజాత. ఇప్పుడు అక్కడి పిల్లలంతా ఎంతో క్రమశిక్షణగా పనులు చేసుకుంటారు. చైల్డ్‌ లైన్‌ ద్వారా తమ వద్ద చేరిన పిల్లల్ని కూడా పోలీసులు సుజాత నిర్వహిస్తున్న కేంద్రానికి పంపిస్తారు. తన దుఃఖాన్ని మర్చిపోవడానికి సుజాత చేస్తున్న ఈ సేవకి ఆమె భర్తా పిల్లలు కూడా సహకరిస్తున్నారు.

అందుకే ఆమె ‘విశ్వజనని’

కన్నబిడ్డల్నీ అనాథల్నీ ఒకేలా చూడగల గుండెబలం ఈ శ్రీలక్ష్మి సొంతం. పాతిక మంది పిల్లలు ఒకే ఇంట్లో ఉంటూ ఆ జంటను అమ్మానాన్నా అని పిలుస్తుంటే చూసేవారు ఆశ్చర్యపోతుంటారు. అనాథాశ్రమం అంటూ ఆమె విడిగా పెట్టలేదు. తన ఇంటినే ఆశ్రమంగా మార్చేసింది. అనాథల్ని చూసుకోవడం అంటే తిండీ బట్టా ఇవ్వడం కాదు, వారికి తల్లి లేని లోటు తీర్చాలి, అందుకే ఈ ఏర్పాటు... అనే శ్రీలక్ష్మి తన ఇద్దరు కొడుకుల్నీ మిగతా పిల్లల్నీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తోంది. బట్టలు కొన్నా, సినిమాలకు తీసుకెళ్లినా... అందరికీ సమానమే. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన శ్రీలక్ష్మిని తల్లి ఎంతో కష్టపడి బీఈడీ చదివించింది. అప్పటివరకూ పుస్తకాలే లోకంగా బతికిన ఆమెలో సమాజంకోసం ఏదైనా చేయాలన్న తపన మొదలైంది. చదువుకుంటున్నప్పుడు పరిచయమైన ప్రేమ్‌సాగర్‌ ఆలోచనలు శ్రీలక్ష్మికి ఎంతో నచ్చేవి. అతడి ఆదర్శాలూ ఆశయాలతో మమేకమై తన ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకుంది. చదువుకుని వ్యవసాయం చేస్తున్న అతడిని కులాంతర వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి ఆశయాలను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టారు. బయటకు వెళ్లినప్పుడు అనాథ పిల్లలు కన్పిస్తే ఇంటికి తీసుకొచ్చేవారు. అలా ఒక్కరొక్కరుగా కుటుంబంలో సభ్యులు పెరుగుతూ పోయారు. ఖర్చులూ పెరిగాయి. అప్పుడామె ఊళ్లో ఇంటింటికీ తిరిగి తాను చేస్తున్న పని గురించి చెప్పి సాయం అర్థించేది. ఒక్కో కుటుంబం నుంచి నెలకు పది రూపాయలూ రైతు కుటుంబమైతే కిలో బియ్యమూ తీసుకునేది. నెల్లూరులోని నార్త్‌ రాజుపాలెంలో ఆ ఇంటికి వాళ్లు పెట్టుకున్న పేరు ‘విశ్వజననీ బాలల ఆశ్రమం’. ఇంటర్మీడియట్‌ వరకూ చదువుతున్న పిల్లలు అక్కడున్నారు. వారందరికీ వండిపెట్టడమే కాదు చదువుల పర్యవేక్షణా శ్రీలక్ష్మే చూసుకుంటుంది. వారికి విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నది శ్రీలక్ష్మి ఆశయం.

ఇదీ ‘అమ్మ’ గుండెబలం!

కష్టాలు కొందరిని కుంగదీస్తాయి. మరికొందరిని మరింత దృఢంగా నిలదొక్కుకునేలా చేస్తాయి. పాతిన హైమావతి రెండో తరహాకి చెందుతుంది. గుండెజబ్బు బాధితురాలైన ఆమెకు మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. అలాంటి ఆమె పెళ్లైన ఏడాదికే తల్లయింది. అనారోగ్యం వల్ల అసలు తల్లిని కాలేననుకున్న ఆమెకు ఆ అనుభవం అపురూపమనిపించింది. ఆమె ఆలోచనాధోరణినే మార్చేసింది. మామగారి స్ఫూర్తి కూడా అందుకు తోడ్పడింది. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మానసిక వికలాంగుల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్వహించేవారాయన. ఓ ప్రమాదంలో కాళ్లు పోవడంతో ఆ ఆశ్రమాన్ని మూసేయాల్సి వచ్చింది. ఆ పరిణామాలన్నీ హైమను ఆలోచింపజేశాయి. తానే ఆశ్రమాన్ని నడపాలని నిర్ణయించుకుంది. ఓ పక్క పసిబిడ్డను చూసుకుంటూనే నాలుగేళ్ల క్రితం విశాఖలో ‘కేర్‌ అండ్‌ లవ్‌’ పేరుతో అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. బధిరులు, మానసిక వికలాంగులు, అనాథలు... పాతిక మందికి పైగా అక్కడ ఉన్నారు. చుట్టుపక్కల పల్లెల్లో తిరిగి వైకల్యం గల చిన్నారుల్ని గుర్తించి తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చుకుంది. ఆశ్రమ నిర్వహణకు చాలానే ఖర్చవుతోంది. భర్త విదేశంలో ఉద్యోగం చేసి సంపాదించి పంపిస్తుంటే ఆ డబ్బునీ, తెలిసినవారు ఇచ్చే విరాళాలనూ కలిపి ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. అమ్మగా అంతమంది జీవితాల్ని తీర్చిదిద్దే అవకాశాన్ని పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానంటుంది హైమ.

ప్రపంచంలో ఉన్న సర్వసుఖాలూ తన బిడ్డకే దక్కాలనుకునే స్వార్థం తల్లికి సహజం.
దాన్ని వదిలించుకుని కమ్మనైన అమ్మ ప్రేమను పదిమందికీ పంచుతున్న కరుణామూర్తులు వీరంతా.
ఏదో చేయమని ఎవరూ వారికి చెప్పలేదు. ఒంటరిగా ఏం చేయగలమని వారూ అనుకోలేదు.
అనాథ బాలల అగచాట్లను చూశారు. అమ్మ ప్రేమ అవసరాన్ని గుర్తించారు. ఆసరాగా నిలిచారు. ఆత్మీయతను పంచుతున్నారు.
కష్టాలూ కన్నీళ్లూ వారి దరిదాపుల్లోకి రాకుండా కంటిరెప్పలై కాపలా కాస్తున్నారు.
ఇలాంటి అమ్మ కాని అమ్మలు ఇంకా ఎందరో మనచుట్టూ ఉన్నారు!
మాతృదినోత్సవం సందర్భంగా వారందరికీ జోహార్లు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.