close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఊరు కరువును జయించింది!

ఆ ఊరు కరువును జయించింది!

మందోళ్లగూడెం... 2012 వరకూ ఆ గ్రామంలో కరవు తాండవించేది. నీటి చుక్క కోసం ఆ పల్లె  మేఘం వైపే చూసేది. సాగునీరు దేవుడెరుగు తాగునీటికీ హాహాకారాలు చేయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఎన్‌.జి.ఆర్‌.ఐ. శాస్త్రవేత్తల సాయంతో వర్షపునీటిని ఒడిసిపట్టడంతో... ఆ ఊరు కరవును జయించింది. అక్కడ ఇప్పుడు ఏడాది పొడుగునా తాగు, సాగు నీరు ఉంటోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మందోళ్లగూడెంలో సాగుభూమి రెండువేల ఎకరాలకు పైనే ఉంటుంది. కానీ మూడేళ్ల కిందటి వరకూ ఇందులో వంద ఎకరాలు కూడా పూర్తిస్థాయిలో సాగైంది లేదు. దశాబ్దాలుగా గ్రామంలో వ్యవసాయ బోర్లు ఎక్కువై నిరంతరం నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చివరకు ‘చినుకుపడితేనే సాగు’ అనే పరిస్థితి ఏర్పడింది. క్రమంగా తాగునీటికీ ఇబ్బందులు ఎదురై పక్క గ్రామాల నుంచి ట్యాంకర్లతో నీటిని తెప్పించుకునేవారు. ఏటికేడూ కరవు ఛాయలు పెరుగుతూ వచ్చాయి.శాస్త్రవేత్తల సహకారంతో
1970 ప్రాంతంలో ఈ గ్రామ పరిధిలోనే ఎన్‌.జి.ఆర్‌.ఐ(జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం) ఏర్పాటైంది. ఆ సంస్థ గురించి గ్రామస్థులకు పెద్దగా అవగాహన లేదు. కానీ చదువుకున్న యువతకు ఎన్‌.జి.ఆర్‌.ఐ. గురించి తెలిసి తమ నీటి కష్టాలను అక్కడి శాస్త్రవేత్తలే తీర్చగలరని గ్రామ పెద్దలకు చెప్పడంతో ఊరంతా కలిసి 2012లో శాస్త్రవేత్తల్ని ఆశ్రయించారు. ఆ ఊరు కూడా తమదేనని భావించిన శాస్త్రవేత్తలు నీటి వేట మొదలుపెట్టారు. వాస్తవానికి ఎన్‌.జి.ఆర్‌.ఐ.లో 1985లోనే హైడ్రో జియాలాజికల్‌ పార్కు ఏర్పాటుచేశారు. భూగర్భంలో నీటి వనరుల గురించి తెలుసుకోవడం ఈ విభాగ శాస్త్రవేత్తల లక్ష్యం. ఇందుకోసం సంస్థ ప్రాంగణంలో 24 గొట్టపు బావులు తవ్వించి భూగర్భంలోకి ప్రత్యేక యంత్రాల్ని పంపించి పరిశోధనలు చేస్తున్నారు. ఆ ఫలితాలు మందోళ్లగూడెం నీటి సమస్యని పరిష్కరించడంలో శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడ్డాయి. వాటికితోడు అత్యాధునిక పరికరాలతో ఊరు నలువైపులా తిరిగి భూగర్భ జలాల్ని శోధించారు. అది ఫలించి కొన్నిచోట్ల నీటి జాడలు కనిపించాయి. అక్కడ 2013లో ప్రభుత్వం బోర్లు తవ్వించి ఆ నీటిని గ్రామంలోని తాగునీటి ట్యాంకుకు అనుసంధానించింది. దాంతో తాగునీటి కష్టాలు తీరాయి. కానీ భూగర్భజలాల్ని వాడేస్తుంటే కొన్నాళ్లకి నీటి జాడలు లేకుండాపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలకి తెలుసు. ఆ విషయమే గ్రామస్థులకు చెప్పారు. శాశ్వత పరిష్కారంగా గ్రామానికి ఎగువ ప్రాంతంలో వర్షపు నీటిని ఇంకించేందుకు పెద్ద కుంట తవ్వాలనీ, అక్కణ్నుంచి నీరు ఇంకి రాతి పొరలద్వారా గ్రామంలో దిగువకు వస్తుందనీ సూచించారు. గ్రామానికి ఎగువనే ఉన్న ఎన్‌.జి.ఆర్‌.ఐ. ప్రాంగణంలోనే ఈ కుంటను తవ్వాలని గ్రామస్థులు కోరగా అందుకు సంస్థ అంగీకరించింది. ఉపాధి హామీ, మిషన్‌ కాకతీయ నిధులు వెచ్చించి ఆరెకరాల విస్తీర్ణంలో కుంటని తవ్వారు. వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎన్‌.జి.ఆర్‌.ఐ. ప్రాంగణంలో పడిన నీరంతా ఈ కుంటలోకి చేరుతుంది. 2015లో ఈ కుంట నిర్మాణం పూర్తయింది. ఆ ఏడాది వర్షాకాలంలో వాననీరు ఇక్కడికి చేరింది. అనుకున్నట్లే ఇక్కడ నీరు నేలలోకి ఇంకి రాతి పొరలద్వారా భూగర్భంలోకి చేరిపోవడంతో భూగర్భజలాలతో అనుసంధానం ఏర్పడి బోర్లలో నీరు పడింది.వరి మళ్లీ వచ్చింది
2016లో మంచి వర్షాలు కురిసి కుంట పూర్తిగా నిండటంతో భూగర్భ జల మట్టం ఒక్కసారిగా 20మీటర్లకు పైనే పెరిగింది. కిందటేడూ వర్షాలు బాగున్నాయి. ఇప్పుడు గ్రామంలో ఎక్కడ బోరు వేసినా నీరు ధారగా వస్తోంది. 20-30 అడుగుల లోతుకే నీరు పడుతోంది. ఒకప్పుడు అయిదారు బోర్లు వేసి అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క బోరుతోనే నాలుగైదు ఎకరాల్లో వరి పండిస్తున్నారు. తర్వాత కాలంలో మూసీ నుంచి ఒక కాలువను ఈ ఇంకుడు కుంటకు అనుసంధానించారు. గ్రామంలో ఒకప్పుడు నీరు సరిపడాలేక పత్తి, కంది లాంటి పంటల్ని పండించేవారు. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు గ్రామంలో వరి పండిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 800 ఎకరాల్లో వరి సాగవుతోంది.
ఈ మార్పుని చూసిన చౌటుప్పల్‌ మండలంలోని మరికొన్ని గ్రామాల పెద్దలు సైతం ఎన్‌.జి.ఆర్‌.ఐ.(ఫోన్‌:040-23434622)ని సంప్రదించారు. అక్కడ అధ్యయనం చేసిన ఈ సంస్థ వీరికి కూడా నీటికుంటలు నిర్మించుకోవాలని సలహా ఇచ్చింది. దేశవ్యాప్తంగానూ ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎన్‌.జి.ఆర్‌.ఐ.కి సూచించింది. ఏ గ్రామంవారైనా తాముగా వచ్చి నీటి సమస్యను పరిష్కరించాలని కోరితే సహకరిస్తామంటున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు.

- ఇల్లెందుల జయప్రకాశ్‌, ఈటీవీ న్యూస్‌, నల్గొండ
ఫొటోలు: రఘుపతి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.