close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవిసె తెచ్చిన అందమిది..!

అవిసె తెచ్చిన అందమిది..!

విసెగింజలు... ఆరోగ్యప్రేమికుల నోట్లోంచి తరచూ వినిపిస్తున్న మాట ఇది. వీటిని పొడిచేసి రోజూ టీస్పూను చొప్పున నీళ్లలో కలిపిగానీ అన్నంలో కలుపుకునిగానీ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగుండటమే కాదు, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లోని ఆల్ఫాలినోలిక్‌ ఆమ్లాలు ఆర్థ్రయిటిస్‌, డయాబెటిస్‌, క్యాన్సర్‌లను సైతం తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యానికీ తోడ్పడతాయి. ఈ గింజల పొడిని క్రమం తప్పక తీసుకోవడంవల్ల ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాల కారణంగా చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. వయసుతోపాటు వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. వీటితో వేసే ప్యాక్‌ల వల్ల కూడా ఫలితం ఉంటుంది. టేబుల్‌స్పూను అవిసెగింజల్లో ముప్పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. దీన్ని మొహంతోబాటు మెడకి కూడా పూతలా పూయాలి. అది ఆరాక మళ్లీ పూయాలి. ఇలా నాలుగుసార్లు వేసి, అది పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు... మొహం కాంతిమంతంగా మెరుస్తుంది.
* టేబుల్‌స్పూను అవిసెగింజల్ని పొడిలా చేసి అందులో 2 టీస్పూన్ల నిమ్మరసం, టేబుల్‌స్పూను తేనె కలిపి మొహానికీ చేతులకీ పట్టించి పూతలా పూసి ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలన్నీ పోయి,
చర్మం మృదువుగా మెరుస్తుంది.
* టేబుల్‌స్పూను అవిసెగింజల పొడిలో టేబుల్‌స్పూను పెరుగు, అరటీస్పూను దాల్చిన చెక్కపొడి కలిపి ఈ పేస్టుని వారానికి రెండుసార్లు మాస్క్‌లా వేసినా ముఖం అద్దంలా మెరుస్తుంది.


చేతిలో చెయ్యేసి...

మీ భార్య లేదా భర్త పోనీ బాయ్‌ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరైనా గానీ మానసికంగా బాధపడుతుంటే రెండో వ్యక్తి ఏం చేస్తారు..? సాధారణంగా వాళ్లను దగ్గరకు తీసుకునో భుజంమీద చెయ్యి వేసో ఓదార్చే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వాళ్లకు స్వాంతన చేకూరుతుందన్నది తెలిసిందే. అలాగే వాళ్లు శారీరకంగా కూడా ఏదైనా నొప్పిని ఫీలవుతున్నప్పుడు వాళ్ల చేతిలో చెయ్యేసి లేదా వాళ్ల చేతిని గట్టిగా పట్టుకున్నా కూడా ఆ నొప్పి తగ్గుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ హైఫా, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోకి చెందిన పరిశోధకులు ప్రయోగపూర్వకంగా పరిశీలించి మరీ చెబుతున్నారు. ఆధునిక ప్రపంచంలో సమాచార వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. కానీ స్పర్శ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకోవడం తగ్గిపోతోంది. నోటిమాటలూ ఎస్సెమ్మెలతో పోలిస్తే స్పర్శవల్ల మెదడు వేగంగా స్పందించి నొప్పిని తగ్గిస్తుంది. ప్రసవవేదన పడుతున్న భార్య చేతిని భర్త గట్టిగా పట్టుకున్నా చాలు, ఆమె నొప్పి చాలావరకూ తగ్గుతుందని సదరు పరిశోధకులు తెలుసుకున్నారు. అంటే- అవతలి వ్యక్తులు నొప్పితో బాధపడుతున్నప్పుడు పక్కన కూర్చుని మాటలతో ఓదార్చడం కన్నా చేతిలో చెయ్యి వేసి గట్టిగా నొక్కి పట్టుకుంటే ఆ నొప్పి త్వరగా తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్పర్శని అర్థం చేసుకున్న మెదడు, ప్రతిగా నొప్పిని తగ్గించే హార్మోన్లను వేగంగా విడుదల చేస్తుంది. అయితే ఇతర సంబంధీకుల కన్నా ప్రేమించే వ్యక్తుల స్పర్శకే మెదడు ఎక్కువగా స్పందిస్తుంది. కాబట్టి మీ ప్రియతములెవరైనా నొప్పితో బాధ పడుతుంటే మీ ఆత్మీయ స్పర్శని అందించడం మర్చిపోకండి...!


ఉప్పు ఎక్కువ తింటున్నారా..?

చిన్న వయసు నుంచే ఉప్పు వాడకాన్ని తగ్గించేయండి అంటున్నారు ముంబై వైద్యులు. ఎందుకంటే దీనివల్ల బీపీ పెరగడమే కాదు, మూత్రపిండాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. అందుకే రోజువారీ ఆహారంలో కొంచెంకొంచెంగా ఉప్పు తగ్గించి తినడం వల్ల మూత్రపిండ వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు అంటున్నారు. గతంలో పెద్దవయసులో మాత్రమే ఈ సమస్య వచ్చేది. కానీ ఇటీవల 25-30 ఏళ్ల మధ్యలో వాళ్లకీ డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. దీనికి కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. కాబట్టి అది నియంత్రణలో ఉంటే మూత్రపిండ సమస్యలూ తగ్గుముఖం పడతాయి. ఈ సమస్యలన్నింటికీ మూలం ఉప్పే. కాబట్టి ఉప్పు వాడకాన్ని చిన్న వయసు నుంచీ కొంచెంకొంచెంగా తగ్గించుకోవడం మంచిది. ఊబకాయం, మధుమేహం కూడా మూత్రపిండ సమస్యల్ని పెంచి పోషిస్తాయి. కాబట్టి ఉప్పుతోబాటే పంచదార, నూనె వాడకం తగ్గిస్తే మరీ మంచిది అంటున్నారు సదరు వైద్యులు.


బరువు తగ్గాలంటే...

రువు తగ్గడానికి వ్యాయామం మంచిదా లేదా ఆహారం తక్కువ తీసుకోవడమా అంటే రెండోదే అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే వ్యాయామం కారణంగా 20 శాతం బరువు తగ్గితే ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల 80 శాతం తగ్గుతారట. అయితే వ్యాయామంలోనూ బరువులు ఎత్తే వ్యాయామం కారణంగా జీవక్రియావేగం పెరిగి, బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కటి... రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎంత
తగ్గారన్న విషయం అలా ఉంచండి. దానివల్ల ఐదు శాతం బరువే తగ్గవచ్చుగాక, కానీ మధుమేహం వచ్చే ప్రమాదం మాత్రం యాభై శాతం తగ్గుతుందన్నది అమెరికన్‌ నిపుణుల పరిశోధన.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.