close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మాయిలందరూ నన్ను చూసి టీటీ ఆడాలి!

అమ్మాయిలందరూ నన్ను చూసి టీటీ ఆడాలి!

మనికా బత్రా... ఈ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి కామన్వెల్త్‌ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించింది. అందులో రెండు స్వర్ణాలున్నాయి. ఈసారి అత్యధిక పతకాలు తెచ్చిన క్రీడాకారిణి కూడా మనికానే. అర్జున అవార్డు రేసులో ఉన్న ఈ దిల్లీ అమ్మాయి తన గురించి ఏం చెబుతోందంటే..!


అక్కాఅన్నల బాటలో...

క్క ఆంచల్‌, అన్నయ్య సహీల్‌ జాతీయస్థాయిలో టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. వాళ్లతోపాటు నాలుగేళ్లపుడు సరదాగా రాకెట్‌ పట్టాను. టేబుల్‌, రాకెట్‌, బంతికోసం చురుగ్గా కదలడం... ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. ఏడేళ్ల నుంచి కోచ్‌ సందీప్‌ గుప్తా దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను.


నెయిల్‌ పాలిష్‌లో జెండా

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే త్రివర్ణాలను నెయిల్‌ పాలిష్‌గా వేసుకుంటాను. నా గుండెల్లోనూ త్రివర్ణ పతాకం ఉంటుంది. ఆ రంగుల్ని ఇలా వేళ్లమీద చూపిస్తానంతే. బంతి కొట్టిన ప్రతిసారీ వాటిని చూసి స్ఫూర్తి పొందుతాను. ఆటలో వెనకబడితే ఆ మూడు రంగులే ముందుకు నడిపిస్తాయి.


డ్యాన్స్‌ చేసేస్తా

బాగా ప్రాక్టీసు చేసి అలసిపోయినా, ఒత్తిడిలో ఉన్నా డ్యాన్స్‌ చేస్తూ రిలాక్స్‌ అవుతాను. ధ్యానం ఎక్కువగా చేస్తాను. తద్వారా, నాపైన జయాపజయాల ప్రభావం పెద్దగా లేకుండా చూసుకుంటా. ఖాళీ దొరికితే అమ్మతో కలిసి షాపింగ్‌కి వెళ్తాను. ఫ్రెండ్స్‌తో షికారు చేస్తాను. పోటీల సమయంలో సెల్‌ఫోన్‌ వాడను.


ఓటమి నుంచి...

2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్వార్టర్స్‌లో, రియో ఒలింపిక్స్‌లో మొదటి దశలో వెనుదిరిగాను. ఆ  తర్వాత నాలో కసి పెరిగింది. రోజూ ఎనిమిది గంటల చొప్పున సీరియస్‌గా ప్రాక్టీసు చేశాను. ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియమ్‌’... పథకంలో భాగంగా విదేశాల్లో శిక్షణ తీసుకున్నాను. మన దగ్గర ప్రారంభమైన టీటీ లీగ్‌ ‘ద అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌’ కూడా నన్ను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడింది.


మోడలింగ్‌కి నో చెప్పా

చిన్నప్పట్నుంచీ పేరుప్రఖ్యాతులు సంపాదించాలని ఉండేది. కొన్నాళ్లకిందట మోడలింగ్‌ ఆఫర్లు వచ్చాయి. నాకూ మోడలింగ్‌ ఇష్టమే... కానీ దేశం కోసం పతకాలు గెలవడమంటే ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకే మోడలింగ్‌ వద్దనుకున్నాను. ఆట కోసం డిగ్రీ మధ్యలోనే చదువుకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశా!


‘గోల్డ్‌’ కోస్ట్‌

మహిళల టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలిచినపుడు కళ్లు చెమర్చాయి. అన్ని దేశాల క్రీడాకారుల, ప్రేక్షకుల సమక్షంలో మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటే... ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మా అన్నయ్య సింగపూర్‌లో పనిచేస్తాడు. అక్కడ పత్రికలు కూడా మూడు రోజులపాటు నా గురించి రాశాయట. ఆ దేశానికి చెందిన ఆటగాళ్లని ఓడించడమే అందుకు కారణం.


అమ్మ ముద్దులు

గోల్డ్‌కోస్ట్‌ నుంచి నేను దిల్లీలో అడుగుపెట్టేసరికి సమయం ఉదయం అయిదున్నర... అయినా వందల మంది నాకు స్వాగతం పలకడం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను. అమ్మ అయితే దారి పొడుగునా ముద్దులు పెడుతూనే ఉంది. నాకెంతో ఇష్టమైన పన్నీర్‌ పరాఠా, స్ట్రాబెర్రీ షేక్‌ తయారుచేసి సిద్ధంగా ఉంచి ఆశ్చర్యపరిచింది.


ఇటువైపు రావాలి

టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు శరత్‌ కమల్‌, బాక్సర్‌ మేరీ కోమ్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ నాకు స్ఫూర్తి.సైనా, సింధూ వచ్చాక దేశంలో బ్యాడ్మింటన్‌ ఆడేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. నన్ను చూసి టేబుల్‌ టెన్నిస్‌వైపు వస్తారని ఆశిస్తున్నాను.


చైనా గోడను దాటుతా

గస్టులో జరిగే ఆసియా క్రీడలు నా తదుపరి లక్ష్యం. అక్కడ బలమైన చైనా, జపాన్‌ ఆటగాళ్లను ఓడించాలంటే నా ఫిట్‌నెస్‌ను ఇంకా మెరుగుపర్చుకోవాలి. గోల్డ్‌కోస్ట్‌లో నాలుగో ర్యాంకర్‌పైన గెలిచి స్వర్ణం సాధించాక నా ఆత్మవిశ్వాసం పెరిగింది. పోటీలో గెలవాలనుకున్నాను తప్ప అవతలివారి ర్యాంక్‌ గురించి పట్టించుకోలేదు. మున్ముందూ ఇదే ధోరణిలో ఆడతాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.