close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్బర్‌ చదరంగం ఆడింది అక్కడేనట

అక్బర్‌ చదరంగం ఆడింది అక్కడేనట

అక్బర్‌ కొలువుదీరింది ఇక్కడే. చదరంగం ఆడింది అక్కడే. జోధాబాయి కృష్ణుణ్ణి పూజించిన చోటు ఇదే.  షాజహాన్‌ను ఔరంగజేబు నిర్బంధించింది  ఈ భవంతిలోనే. తాన్‌సేన్‌ తన సంగీత విభావరిని వినిపించిన ప్రదేశం ఇదే... అంటూ నాటి చరిత్రలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్‌ వాసి నున్నా వేణుగోపాలరావు.హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి ఆగ్రాకు కారులో బయలుదేరాం. ఉదయాన్నే ఆగ్రాకు 37 కిలోమీటర్ల దూరంలోని ఫతేపూర్‌ సిక్రీ కోటను చూడ్డానికి వెళ్లాం. అప్పట్లో ఇక్కడ ఉండే సిక్రీ గ్రామంలో షేక్‌ సలీం చిస్తీ ఉండేవాడు. గుజరాత్‌ దండయాత్ర చేసి విజయానందంతో తిరిగి వస్తున్న అక్బర్‌ ఆ గ్రామంలో మజిలీ చేసి, బాబా ఆశీస్సులు పొందుతాడు. ఆ కారణంగానే జోధాబాయికి పుట్టిన కుమారుడికి సలీం అని పేరు పెట్టాడు. అతనే జహంగీర్‌. ఆ ప్రాంతం అదృష్టం తెచ్చిపెట్టిందనే భావంతో అక్బర్‌ అక్కడ ఫతేబాద్‌(విజయాల నగరం)ని నిర్మించాడు. అదే ఫతేపూర్‌ సిక్రీ. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవూ కిలోమీటరు వెడల్పులతో మూడువైపులా 50 అడుగుల ప్రహరీ, ఒకవైపు కృత్రిమ సరస్సుతో నగరాన్ని అద్భుతంగా నిర్మించారు. నగరం లోపలికి రావడానికి ఏడు అతిపెద్ద దర్వాజాలు ఉన్నాయి. ఆగ్రా గేటు ద్వారా లోపలికి ప్రవేశించగానే నౌబత్‌ ఖానా భవనం నుంచి చక్రవర్తి రాకపోకలకు అనుగుణంగా సంగీతం వినిపించేవారట. దీనికి తూర్పుదిశగా టంకశాల ఉంది. ఇది శిథిలావస్థలో ఉంది.ఫతేపూర్‌ సిక్రీలో...
ఫతేపూర్‌ సిక్రీ రాజభవనాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నదే బులంద్‌ దర్వాజ. దీన్ని దక్షిణ భారతం విజయాలను పురస్కరించుకుని నిర్మించాడట. 176 అడుగుల ఎత్తున్న ఈ ద్వారం ప్రపంచంలోని అతిపెద్ద దర్వాజాల్లో ఒకటిగా పేరొందింది. దీన్నుంచి లోపలకు వెళ్లగానే సూఫీ మతబోధకుడైన సలీం చిస్తీ సమాధి ఉన్న పాలరాతి కట్టడం కనిపిస్తుంది. తరవాత అక్బరు ప్రజాదర్బారు నిర్వహించిన భవనానికి వెళ్లాం. అక్కడ చక్రవర్తి కూర్చోవడానికి ఎత్తైన వేదిక ఉంది. అక్బర్‌కి జ్యోతిషంమీద నమ్మకం ఎక్కువ. హిందూ, ముస్లిం జ్యోతిషులిద్దరినీ సంప్రదించేవాడట. అందుకే వారికోసం చిన్న గోపురం వంటి కట్టడాన్ని నిర్మించాడు. ఆ గోపురం నుంచి కాస్త ముందుకు వస్తే అక్కడి విశాలమైన ప్రదేశంలో అక్బర్‌ చదరంగం ఆడిన చోటు ఉంది. గళ్లలో పావులకు బదులు మనుషులను నిలబెట్టి ఆడేవారట. దివాన్‌-ఎ-ఆమ్‌ వెనక వైపున ఉన్న భవనాలను ఖాస్‌ మహల్‌గా పిలుస్తారు. ఇవన్నీ రాజూ, రాణిలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసినవి. దీనికి మధ్యలో అక్బర్‌కోసం నిర్మించిన పడకగదిలో మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో మంచె నిర్మించి ఉంది. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. నలువైపులా పొడవాటి నీటితొట్టెల ఏర్పాటు ఉంది. అందులో సుగంధద్రవ్యాలను కలిపేవారట. ఇక్కడే రాణుల కోసం విడివిడిగా భవనాలూ వంటగదీ స్నానపుగదులూ ఉన్నాయి. జోధాబాయి భవనం అలంకరణ హిందూ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది.వేసవిలో ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు భవన సముదాయం మధ్యలో నీటి సరస్సులను ఏర్పాటుచేయడం మొఘల్స్‌ ప్రత్యేకత. అందులోభాగంగానే ఖాస్‌మహల్‌ ప్రాంతంలో చార్‌ చమన్‌ పేరిట ఓ నీటి సరస్సును ఏర్పాటుచేశారు. సరస్సు మధ్యలోకి రావడానికి నలువైపుల నుంచీ బాటలు ఉన్నాయి. మధ్యలో ఓ వేదిక ఉంది. తాన్‌సేన్‌ ఈ వేదికమీద కూర్చునే రాజకుటుంబీకులను సంగీత రసాంబుధిలో ఓలలాడించేవాడట. తరవాత హీరామినార్‌ దగ్గరకు వెళ్లాం. తనకు విశ్వాసంతో సేవలందించిన ఏనుగు హీరా మరణానంతరం దాన్ని సమాధి చేసిన ప్రదేశంలో హీరామినార్‌ పేరిట ఓ స్మారక గోపురాన్ని నిర్మించాడు అక్బర్‌. దీని పైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. మినార్‌ మధ్యభాగంలోనూ బయటా ఏనుగు దంతాలను అమర్చారు. బులంద్‌ దర్వాజ సమీపంలో అక్బరుకి అతి సన్నిహితుడైన అబుల్‌ ఫజల్‌ మందిరం ఉంది. ప్రస్తుతం ఫతేపూర్‌ సిక్రీ కోట యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాల జాబితాలో ఉంది. అది చూశాక ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ చూసి, ఆగ్రా కోటకు బయలుదేరాం.
ఆగ్రా కోటలో...
దీన్ని కూడా అక్బరే నిర్మించాడు. ఆగ్రా కోట ఉన్నచోట రాజపుత్‌లకు చెందిన బదాయగఢ్‌ కోట ఉండేది. దాని శిథిలాలమీద 94 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారట. కోట చుట్టూ రెండు ప్రహరీలు ఉన్నాయి. అప్పట్లో రెండు కందకాలు ఉండేవి. వాటిల్లో మొసళ్లూ తాబేళ్లను పెంచేవారట. ప్రస్తుతం లోపలి కందకం మాత్రమే ఉంది. బయటి కందకాన్ని పూడ్చి, దాని స్థానంలో రోడ్డు నిర్మించారు. ఈ కోటను అక్బరు నిర్మించినా తరవాతి వాళ్లంతా తమ అభిరుచుల మేరకు మార్చుకున్నారట. చరిత్రకారుడు అబుల్‌ఫజల్‌ ప్రకారం ఆగ్రాకోటలో 500 భవనాలు ఉండేవట. ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయి.ముందుగా ఈ కోటలో అమర్‌సింగ్‌ గేట్‌ చూసి, జహంగీర్‌ ప్రాసాదం దగ్గరకు వెళ్లాం. ఇది ఎర్రరాతితో నిర్మించిన రెండంతస్తుల భవనం. అక్బరు తన కుమారుడి కోసం కట్టించిన ఈ భవంతి లోపలి గోడలూ, పైకప్పుమీద రాజపుత్‌ శైలి అలంకరణ కనిపిస్తుంది. దీని ఎదురుగానే గ్రానైట్‌తో తయారైన బాత్‌ టబ్‌ ఉంది. దీనికి లోపలా బయటా కూడా మెట్లు ఉన్నాయి. ఇది ఒకచోట స్థిరంగా అమర్చినది కాదు. జహంగీరు ఎక్కడికి వెళ్లినా దీన్ని తీసుకెళ్లేవాడట. అక్బరు రాణివాసపు స్త్రీలకోసం ఖాస్‌మహల్‌ ఎదురుగా ఓ ద్రాక్షతోటను ఏర్పాటుచేశాడు. ఈ తోటకు మట్టిని కశ్మీర్‌ నుంచి తెప్పించాడట. షాజహాన్‌ యమున ఒడ్డువైపున నిర్మించిన దివాన్‌-ఇ-ఖాస్‌ భవనం పైకప్పు ఎంతో అందంగా ఉంది. ఇక్కడే తన నెమలి సింహాసనం మీద కూర్చుని మంత్రులతో ఆంతరంగిక సమాలోచనలు చేసేవాడట. ప్రస్తుతం ఆ సింహాసనం ఇరాన్‌లో ఉంది. అక్కడి నుంచి శీష్‌మహల్‌కు వెళ్లాం. దీన్ని జనానా మహిళలు డ్రెస్సింగ్‌ రూమ్‌గా వాడుకునేవారు. గోడలకు చిన్నచిన్న అద్దాలు తాపడం చేసి ఉండేవట. టర్కిష్‌ స్నానశాల రూపంలో కుటుంబసభ్యులకోసం ఖాస్‌మహల్‌కు ఉత్తరంగా దీన్ని షాజహాన్‌ కట్టించాడు. ఇందులో వేడి, చల్లని నీళ్ల కోసం రెండు ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన ఫౌంటెయిన్ల నుంచి సువాసనలతో నీరు ఎగసిపడేదట. రాణి నూర్జహాన్‌కోసం జహంగీరు జాస్మిన్‌ టవర్‌ను నిర్మిస్తే, షాజహాన్‌ దాన్ని ముంతాజ్‌కోసం కొత్త నమూనాతో పునర్నిర్మించాడట. ఇందులో పాలరాతి ఫిలిగ్రీ అద్భుతం. చివరిరోజుల్లో రాజ్యాధికారం కోసం జరిగిన అంతర్గతపోరులో కుమారుడు ఔరంగజేబు షాజహాన్‌ను ఇక్కడే గృహనిర్బంధం చేశాడు. ఇక్కడి నుంచే షాజహాన్‌ తాజ్‌మహల్‌ను చూస్తూ గడిపేవాడట. మీనామసీదు, మోతీమసీదులను కూడా చూసి మధుర, బృందావనాల్లోని దేవాలయాలను సందర్శించి గ్వాలియర్‌కు బయలుదేరాం.

గ్వాలియర్‌ కోటలో...
ముందుగా నగరంలోని సింధియాల జై విలాస్‌ ప్యాలెస్‌కు వెళ్లాం. దీన్ని 1874లో కోటి రూపాయల ఖర్చుతో కట్టారట. దీని విలువ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇందులో ప్రధానంగా చూడదగ్గది అతిపెద్ద భోజనాల బల్ల. దీనిమీద ఓ చిన్న వెండి రైలు తిరుగుతూ అతిథులకి కావలసిన బ్రాందీ, విస్కీ... వంటి పానీయాలూ సిగరెట్లూ సిగార్లూ అందజేస్తూ ఉంటుంది. తమకు కావలసినవి ఉన్న పెట్టె తమ ముందుకు వచ్చినప్పుడు ఎవరికి వారు తీసుకుంటారట. రెండోది దర్బార్‌ హాలు. ఇందులో 250 బల్బులు ఉన్న రెండు షాండియర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అతిపెద్ద క్రిస్టల్‌ షాండ్లియర్లు. దర్బార్‌ హాల్లో పరిచిన తివాచీ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. గోడలకీ కప్పుకీ వేసిన పూలూ లతల డిజైన్ల తాపడానికీ దాదాపు రెండు క్వింటాళ్ల బంగారం వినియోగించారట. ఇంకా ఈ భవనంలో అప్పట్లో రాజకుటుంబీకుల జీవనవిధానాన్ని తెలియజేసే వస్తువులతో కూడిన ప్రదర్శనశాల ఉంది. అక్కడి నుంచి గ్వాలియర్‌ కోటకు వెళ్లాం.దీన్ని ఎప్పుడు నిర్మించారో తెలియదుకానీ ఆరో శతాబ్దం నాటికి ఇది ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వింధ్య పర్వతశ్రేణుల్లోని ఇసుకరాతితో నిర్మితమైనది. ఈ కోటను చూసి ‘హిందూస్తాన్‌ కోటల హారంలో ఇది మణిపూస వంటిది’ అని బాబర్‌ వ్యాఖ్యానించాడు. ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు భూమ్మీదా ఉన్నాయి. భూగర్భ అంతస్తులోకి గాలీవెలుతురూ దారాళంగా వచ్చేలా నిర్మించారు. అప్పట్లోనే అంతస్తుల మధ్య పరస్పర సమాచార మార్పిడికోసం ఇంటర్‌కమ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. గోడల్లో కనిపించకుండా ఏర్పాటుచేసిన గొట్టాల ద్వారా సంభాషించుకునేవారట. 11వ శతాబ్దం నుంచి ఇది పలువురి దురాక్రమణలకు గురయింది. 1568లో అక్బరు ఈ కోటను స్వాధీనం చేసుకుని రాజకీయ శత్రువులను ఉరితీసే ప్రదేశంగానూ మార్చాడు. తరవాత ఈ కోట గోహాద్‌ రాణాలూ మరాఠాలూ బ్రిటిషర్ల చేతులుమారి చివరకు సింధియాలకు దక్కింది. ఇందులో మాన్‌సింగ్‌ నిర్మించిన మన్‌ మందిర్‌ నిర్మాణశైలి చూడ్డానికి ఎంతో బాగుంది. కోటలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా సంగీతమహల్‌ వస్తుంది. దీనిపక్కనే నృత్యమందిర్‌ ఉంది. అందులో గోడలకు అద్దాలు తాపడం చేసి ఉండేవి. దీపాల వెలుగులో ఆ అద్దాలతోబాటు కళాకారుల దుస్తుల పైన కుట్టిన అద్దాలమీదా ఆ దీపకాంతి ప్రతిబింబించి మందిరమంతా వెలుగులతో నిండిపోయేదట. ఇందులోనే ఓ పక్కన గ్రంథాలయం ఉంది. భూగర్భంలో జలక్రీడలకోసం నీటికొలను ఉంది.ఝాన్సీకోటలో..!
తరవాత ఝాన్సీలక్ష్మీబాయి బ్రిటిష్‌ సేనలతో పోరాడుతూ మరణించిన ప్రదేశంలో కట్టిన సమాధినీ ఝాన్సీకోటనీ చూసి ఓర్చాలోని రామరాజ దేవాలయం, రాధాకృష్ణుల ఆలయం, లక్ష్మీనారాయణ దేవాలయాలు చూసి వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు