close
నవ్వవయ్య బాబూ...

నవ్వవయ్య బాబూ...

నోరారా నవ్వు... ముసి ముసిగా నవ్వు... పగలబడి నవ్వు... కిలకిలా నవ్వు... ఎలా అయినా పర్లేదు, రోజుకి కాసేపు నవ్వితే చాలు, ఆనందంతో పాటు ఆరోగ్యం బోనస్‌గా రావడం ఖాయం. అంతేకాదు, నవ్వుతూ కబుర్లు చెప్పుకునే భార్యాభర్తల బంధం పదికాలాలు పచ్చగా ఉంటుంది. ఇలా నవ్వు వెనుక ఉన్న లాభాలన్నీ చెప్పాలే కానీ ఇకమీదట రోజూ నవ్వడమే పనిగా పెట్టుకుంటామన్నా ఆశ్చర్యం లేదు. (ఈరోజు నవ్వుల దినోత్సవం)ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన భాష నవ్వే. మాటలు రాని పసివాళ్లు కూడా తమ నవ్వుతో చుట్టూ ఉన్నవారిని నవ్వించగలరూ పలకరించగలరంటేనే దాని గొప్పతనం ఎంతో అర్థం చేసుకోవచ్చు.హాయిగా నవ్వే ఓ నవ్వు... మనసు పొరల్లోని బాధను మటుమాయం చేస్తుంది. మానసిక ఒత్తిళ్లకు మందుగా పనిచేస్తుంది. మనసారా నవ్వే నవ్వు హృదయసంబంధ వ్యాధుల్నీ దరిచేరనీయదు. చాలామందికి తెలీదు కానీ ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతిలా నవ్వు కూడా ఓ రకం వైద్యమే. పైగా ఇది మనకు మనమే సులభంగా సంతోషంగా చేసుకోగల వైద్యం. అందుకే, ఆ నవ్వుల ఔషధానికి మరింత ప్రాచుర్యం కల్పించాలనుకున్నాడు ముంబైకి చెందిన వైద్యుడు మదన్‌ కటారియా. అనుకున్నదే తడవుగా 1998లో నవ్వుల దినోత్సవానికి శ్రీకారం చుట్టేశాడు. అప్పట్నుంచే ఏటా మే మొదటి ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. లాఫింగ్‌ యోగాకి కూడా ఆద్యుడు మదన్‌ కటారియానే.

ఆనందాన్నిచ్చే అంటువ్యాధి

ఒంటరిగా కూర్చుని కామెడీ సినిమా చూసినప్పటికన్నా నలుగురి మధ్యలో కూర్చుని చూసినపుడు మనం 30శాతం ఎక్కువగా నవ్వుతామట. ఎదుటి వాళ్లు నవ్వుతున్నపుడు మనకూ నవ్వొచ్చేస్తుంది. అందుకే, నవ్వు కూడా అంటువ్యాధే. కాకపోతే ఇది ఆనందాన్నిచ్చే వ్యాధి.
* సినిమాల్లో బ్రహ్మానందాన్ని చూశామంటే చాలు, అక్కడ హాస్యం మొదలవకుండానే నవ్వేస్తాం. తెలిసినవారు హాస్యాన్ని పండిస్తే మనకు తెలియకుండానే ఎక్కువ నవ్వేస్తాం మరి.
* ఎదుటివాళ్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా... కావాలని నవ్వుతున్నారా అన్న విషయాన్ని మన మెదడు గుర్తించగలదు.
* అమ్మాయిలు అమ్మాయిలతో కబుర్లు చెప్పేటప్పటికన్నా అబ్బాయిలతో కబుర్లలో పడినపుడు 126శాతం ఎక్కువగా నవ్వుతారట. మామూలుగా కూడా అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువ నవ్వుతారట.
* గొరిల్లాలూ కుక్కలూ పిల్లుల్లాంటి జంతువులూ నవ్వుతాయట. చక్కిలిగింతలు పెడితే ఎలుకలు కూడా నవ్వుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
* మీరెప్పుడు ఎక్కువగా నవ్వుతారూ... అంటే చాలామంది ‘మంచి జోకు విన్నపుడు...’ అని చెప్పేస్తుంటారు. కానీ నిజానికి మనం సన్నిహితులతో మాట్లాడేటపుడే ఎక్కువ నవ్వుతామట.
* చాలారకాల ఫోబియాల్లానే నవ్వు ఫోబియా కూడా ఉందట. కొంతమంది - ఎవరు నవ్వినా తమను చూసే నవ్వుతున్నారని తెగ బాధపడిపోతుంటారట. దీన్నే జెలటోఫోబియా అని కూడా అంటారు. ఇక, నవ్వాలని ఉన్నా నవ్వలేకపోవడాన్ని ఎఫ్నొజిలియాగా పిలుస్తారు.
* నవ్వు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయీ, ఎందుకు నవ్వాలీ... లాంటి విషయాలు తెలుసుకోవాలంటే జెలటోలజీ... అదేనండీ నవ్వుశాస్త్రాన్ని చదవాల్సిందే.
* మీకో విషయం తెలుసా... మనం నవ్వినపుడు ఊపిరి తీసుకోలేమట. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా హహహ... హొహొహొ... హిహిహి... అనే నవ్వుతారట.
* ఎవరైనా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వేస్తాం. కానీ మనకు మనం చక్కిలిగింతలు పెట్టుకుంటే నవ్వురాదు. తెలుసా...
* ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయిలు అబ్బాయిలకు మరింత అందంగా కనిపిస్తారనేది ఓ అధ్యయనం.
* నవ్వుతూ కబుర్లు చెప్పేవాళ్లకు స్నేహితులూ ఎక్కువే.
* ముఖం మీద చిరునవ్వు చెరగని ఉద్యోగులపైన పై అధికారులకు సదభిప్రాయం కలుగుతుందట.
* చంటి పిల్లలు రోజుకి సగటున 300 సార్లు నవ్వుతారట. పెద్దయ్యేసరికి అదికాస్తా 13సార్లకి తగ్గిపోతుంది.

మంచి ఔషధం

 వ్వినపుడు శరీరంలో విడుదలయ్యే హెచ్‌జీహెచ్‌ అనే హార్మోను వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే, తరచూ హాయిగా నవ్వేవాళ్లు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటారట. శరీరంలో కార్టిసోల్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచి, ఒత్తిడిని తగ్గించడానికీ నవ్వు తోడ్పడుతుంది. బాగా నవ్వడంవల్ల పొట్ట కూడా తగ్గుతుంది. పదిహేను నిమిషాలపాటు గట్టిగా నవ్వితే నలభై క్యాలరీలు కరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది కూడా. నవ్వేటపుడు మెదడు ఆనందాన్నిచ్చే ఎండార్ఫిన్లను విడుదలచేస్తుంది. మనసారా నవ్వే నవ్వు హృదయసంబంధ వ్యాధుల్నీ దరిచేరనీయదు.
* ఓ పరిశోధనలో భాగంగా ఇరవై మందిని ఎంపికచేసి అందులో సగం మందికి ఇరవై నిమిషాలసేపు ఫన్నీవీడియోలను చూపించారట. ఆ తర్వాత జ్ఞాపకశక్తికి
సంబంధించి పెట్టిన పరీక్షలో వీడియోలను చూసి నవ్విన బృందం మెరుగ్గా ఉందట. అంటే... నవ్వు స్వల్పకాలిక జ్ఞాపకశక్తినీ పెంచుతుందన్నమాట. కామెడీ సినిమాలు ఎక్కువ చూసే వృద్ధుల్లోనూ జ్ఞాపకశక్తి బాగా ఉందని తేలింది.
* నవ్వు రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. బాగా నవ్వేవాళ్లలో నిద్రలేమి సమస్యలు కూడా తక్కువే. గట్టిగా నవ్వడం వల్ల మన ముఖం, పొట్ట, డయాఫ్రంలోని కండరాలు బలపడతాయి.
* ఓ కప్పు కాఫీ తాగందే ఉదయం ఉత్సాహంగా గడవదు బాసూ... అని బాధపడిపోతుంటారు చాలామంది. కానీ లేవగానే కాసేపు నవ్వుకున్నా కాఫీ తాగినంత ఉత్సాహం వచ్చేస్తుందట.
* నవ్వు భార్యాభర్తల అనుబంధాన్ని మరింత దృఢంగా చేస్తుందట. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకునే ఆలుమగల మధ్య ప్రేమ మిగిలినవారికన్నా ఎక్కువ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది మరి.
* నవ్వడం వల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా గట్టిగా నవ్వేవాళ్లు నవ్వని వాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట. ‘అయ్యో మాకంత సెన్సాఫ్‌ హ్యూమర్‌ లేదు. నవ్వురాదు’ అంటారా... ఏంపర్లేదు. కావాలని నవ్వినా ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే మనసారా నవ్వితే ఎక్కువ లాభాలుంటాయి. ఆరోగ్యం కోసం పండ్లు కొనుక్కుని తింటాం, కష్టపడి వ్యాయామం చేస్తాం... కానీ నవ్వుని కొనక్కర్లేదు. నవ్వడానికి కష్టపడాల్సిన పనీలేదు. అయినా నవ్వడానికి అంత ఆలోచిస్తారేం... నవ్వండీ...

జోక్‌ చేశానంతే 

భర్త: ఏమోయ్‌, దశరథుడి గురించి తెలుసా నీకు?
భార్య: ఎందుకు తెలీదూ, శ్రీరాముడి తండ్రి.
భర్త: అదికాదోయ్‌, ఆయనకు ముగ్గురు భార్యలు, అది తెలుసా అని...
భార్య: తెలుసూ, అయితే?
భర్త: నేను కూడా మరో ఇద్దర్ని చేసుకోవచ్చు.
భార్య: మీకు ద్రౌపది గురించి తెలుసా?
భర్త: భలేదానివే బంగారం, నేనేదో సరదాగా జోక్‌ చేస్తే అంత సీరియస్‌గా తీసుకుంటావేం...

పారిపోయింది 

బబ్లూ... కుక్కపైన వ్యాసం రాసుకురమ్మని చెప్పానా? మరెందుకు రాయలేదు... అడిగింది టీచర్‌.
‘రాద్దామని కుక్కపైన పెన్ను పెట్టగానే పారిపోయింది టీచర్‌’ అమాయకంగా మొహంపెట్టి చెప్పాడు బబ్లూ.

కాస్త గడ్డి పెట్టండమ్మా

భార్య: ఏంటా సరసం... పని చేసుకుంటున్నపుడు అలా వాటేసుకోకండీ, గిల్లకండీ అని ఎన్నిసార్లు చెప్పాలి..?
పనిమనిషి: కాస్త గట్టిగా గడ్డి పెట్టండమ్మా, చెప్పీ చెప్పీ విసుగొస్తంది నాక్కూడా.

అత్తయ్యగారూ, బాగున్నారా

రత్నమాల, రామారావు భార్యాభర్తలు. ఇద్దరూ ఓ సాయంత్రం రోడ్డు మీద నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. భార్యను ఆటపట్టించాలనుకున్న రామారావు ‘మీ బంధువొస్తోంది పలకరించు’ అన్నాడు నవ్వుతూ. 
‘నమస్తే అత్తయ్యగారూ... బాగున్నారా... నేనూ మీ అబ్బాయీ ఈవినింగ్‌ వాక్‌కి బయల్దేరామండీ’ పలకరించింది రత్నమాల.

మనకి గాజులుతెండి

‘‘పెళ్ళైన దగ్గర్నుంచీ చూస్తున్నా... ఎప్పుడూ ‘నాకు, నాది’ అంటావు కానీ ‘మనది, మనకు’ అనవేం?’’ భార్యపైన చిరాకుపడ్డాడు రమేష్‌.
‘‘అలాగేలెండి, మీ మాటెందుకు కాదనాలి. కాస్త బజారుకు వెళ్ళి మనకి గాజులూ మల్లెపూలూ తీసుకురండి’’ చెప్పిందామె.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.