close
అశ్వత్థం

అశ్వత్థం
- కె.వి.వి.సత్యనారాయణ

‘‘నీయమ్మా- చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటా నా కొడకా...’’ బస్సు విండో సీటులో కూర్చుని కునికిపాట్లు పడుతున్న నేను ఉలిక్కిపడి లేచాను ఆ అరుపుకి. ‘‘డరో మత్‌- ఓ కొయీ పాగల్‌ హై...’’ నవ్వుతూ అన్నాడు పక్కసీట్లో ఆయన.
అంధేరీ లోకల్‌ స్టేషన్‌కి వెళుతుండగా డి.ఎన్‌. నగర్‌ మెట్రో మలుపువద్ద ఆ అరుపుకు నేను ఉలిక్కిపడ్డానికి కారణం- ఆ పిచ్చాడు తెలుగులో అరిచాడు...గొంతు చించుకుని మరీ అరిచాడు.

*     *     *     *     *

నేను ఆంధ్రాబ్యాంకులో పనిచేస్తున్నాను. బాంద్రా వెస్ట్‌ బ్రాంచీలో డెప్యూటీ బ్రాంచి మేనేజరుగా బదిలీ అయింది. ఒషివారాలో మా ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. మావాడికి ముంబయి యూనివర్సిటీ కలీనా క్యాంపస్‌లో ఎమ్మెస్‌ సీటు రావడం వల్ల నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది ముంబయి. క్వార్టర్స్‌ నుంచి బస్‌లో అంధేరీ స్టేషన్‌కు వెళ్ళి, అక్కడినుండి బాంద్రా లోకల్‌ ట్రైన్‌లో వెళ్తాను.
నా చిన్నతనంలోనే నాన్నా అమ్మా చనిపోయారు. ఈమధ్య కాలంలోనే అత్తామామ కూడా కాలం చేశారు. కాశీ, గయ కార్యక్రమాలు అన్నీ పూర్తయినా అమ్మా నాన్నల ఆబ్దీకం నాకు చాలా ఇంపార్టెంట్‌. నా ప్రస్తుత సమస్య- ఈరోజు మా నాన్న ఆబ్దీకం. చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది నాకీ రోజు. మాతుంగలో ఓ పంతుల్ని పట్టుకున్నాను - తెలుగువాడే - ఇంటికొచ్చి చేయమంటే- నాలుగువేలు అన్నాడు. ‘ఇది మొదటి సంవత్సరం శ్రాద్ధకర్మ కాదు బాబూ... ముప్ఫై ఏళ్ళ తర్వాతది’ అన్నా- నవ్వి ‘అందుకే నాలుగువేలు’ అన్నాడు. తప్పదుగా... అంధేరీ స్టేషనుకి అరగంటలో వస్తానని ఫోన్‌ చేశాడు. వెళ్ళి ఆటోలో తీసుకురావాలి అయ్యవారిని.

*     *     *     *     *

అసలు బయటకు వెళ్ళాలంటేనే అంధేరీ లోకల్‌ స్టేషనుకి వెళ్ళాలి. రోజూ డి.ఎన్‌.నగర్‌ మెట్రో మలుపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పిచ్చాడి అరుపులు వినిపిస్తాయి. వాడు అరిచే అరుపులకి బస్సులో మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ కనెక్ట్‌ అవుతున్నాను.
‘‘ఒసేవ్‌, ఎక్కడ చచ్చావే- వాడి దగ్గరే కులుకుతున్నావా.?’’
ఈసారి ఇదేదో ఇంకా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. బస్సు ‘అప్నా బజార్‌’ దగ్గర ఆగితే అటూ ఇటూ చూశాను- కనపడతాడేమో అని- కనిపించాడు. మాసిన గడ్డం, చిరిగిన బట్టలు- చిందరవందరగా ఉన్నాడు. చేతిలో ఒక ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ పట్టుకున్నాడు. ఆ దారంటే వస్తోన్న ఒక వ్యక్తిని హఠాత్తుగా ఆపి చేయి సాగలాగాడు.
‘‘అకాల మృత్యు హరణం - సర్వవ్యాధి నివారణం - సర్వపాపక్షయం - శనీశ్వర పాదోదకం - పావనమ్‌... శుభమ్‌- చేయి పట్టరా అప్రాచ్యుడా... అలా వెర్రిచూపులు చూస్తావేం- ఏల్నాటిశని పట్టి ఏడుస్తున్నావ్‌- ఏబ్రాసి వెధవా...’’
ఆ వ్యక్తికి అర్థంకాలేదు ‘‘అరే పాగల్‌- ఛోడ్‌...’’ చేయి విదిలించుకుని పరిగెత్తాడు.
చాలా స్పష్టంగా ఉంది ఉచ్ఛారణ, సందేహం లేదు... అతడెవరో పెద్దింటివాడే! పిచ్చిముదిరి ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఉండాలి. బస్సు ఒక్క కుదుపు కుదిపి బయలుదేరడంతో ముందుకు చూశాను.

*     *     *     *     *

కండక్టర్‌ ఐరన్‌ రాడ్‌పై శబ్దం చేస్తూ అన్నాడు ‘‘కుటే?’’
‘‘ధర్మపురి’’
‘‘కాయ్‌... ధర్మపురి?!’’
‘‘సీనుగాడితో త్వరగా మాట్లాడాలి- త్వరగా... ఛల్‌.’’ కండక్టరుకి కోపం వచ్చింది. ‘‘అరే ఛల్‌బే- పహలే ఉతార్‌ బస్‌సే...’’ చేయి పట్టుకుని లేపి, బ్యాక్‌డోర్‌ దగ్గరకు తీసుకెళ్ళాడు ఆ పిచ్చాడ్ని. ఒక్క తోపుతోసి రాడ్‌పైన రెండుసార్లు శబ్దం చేశాడు. బస్‌ కదిలింది. బహుశా అలా చేయకుండా ఉండాల్సింది ఆ కండక్టరు.

*     *     *     *     *

‘‘ఇవాళ ‘జంధ్యాల పూర్ణిమరా’, సన్యాసుల్లారా... జంధ్యాలు వేసుకు తగలడండి- ఒరేయ్‌ సోంబేరీ... నిన్నే!’’ ఇక తట్టుకోవడం నావల్ల కాలేదు. రోజూ ఈ న్యూసెన్స్‌ ఏమిటి? టైమ్‌ చూశా, ఇవాళ కాస్త ముందే బయలుదేరినట్లున్నాను. ఈ ముసలాడి సంగతేమిటో తేల్చేయాలి. వీడు హిందీలోనో మరాఠీలోనో మాట్లాడుతూ ఉంటే ఈపాటికి తన్ని తరిమేసేవాళ్ళు. తెలుగులో తగలడి బతికేస్తున్నాడు. ‘ధాకే కాలనీ బస్టాప్‌’ రాగానే దిగి వెనక్కి నడిచాను. ఆ పిచ్చాడు ఒక చేతిలో పొడవాటి తాడును పట్టుకుని అప్నాబజార్‌ ముందు అటూ ఇటూ తిరుగుతున్నాడు. వచ్చేపోయే వాళ్ళని గదమాయిస్తున్నాడు. అప్నాబజార్‌ గేటు దగ్గర సెక్యూరిటీగార్డు నిలబడి ఉన్నాడు. అతని మెడలోఇలాంటి తాడే వేసి ఉంది. దగ్గరగా వచ్చిన నన్ను చూశాడు పిచ్చాడు చిరాగ్గా. ‘‘ఏరా సీనూ, ఎక్కడ చచ్చావ్‌ ఇప్పటివరకూ... రా, ముందు జంధ్యం వేసుకు తగలడు’’ చేతిలోని తాడు నా మెడలో వేయబోయాడు. వారిస్తూ అన్నా ‘‘నేను బ్రాహ్మణుణ్ణి కాను.’’‘‘ఓరి వెధవా, జంధ్యం బ్రాహ్మణుడికి కాదురా... బ్రాహ్మణీకానికి. బ్రాహ్మణీకం కులం కాదురా సన్నాసీ... క్యారెక్టర్‌.’’నా జుట్టు పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి నట్లనిపించింది. ఎక్కువ
సేపు అక్కడ ఉండలేకపోయా. బస్టాపులో మరో బస్సు ఆగితే పరిగెత్తుకెళ్ళి బస్సు పట్టుకున్నాను.

*     *     *     *     *

ఆరోజు నాలుగో శనివారం. సెలవుదినం. సుజాత- ‘‘చిన్న షాపింగ్‌ పని ఉంది, మీరు ఖాళీయేగా- లోఖండ్‌వాలా వెళ్దాం’’ రమ్మంది. సన్నీ కాలేజీకి వెళ్ళాడు. హఠాత్తుగా అన్నాను- ‘‘అంధేరీ వెళ్దాం... స్టేషన్‌ దగ్గర మార్కెట్‌ చూశావ్‌గా- నాకూ పనుంది.’’
నావంక ఓసారి అదోలా చూసి ‘సరే’ అంది. బయటకొచ్చి ఆటో ఎక్కాం. మళ్ళీ డి.ఎన్‌.నగర్‌ మెట్రో మలుపు...నాకెందుకో హార్ట్‌బీట్‌ పెరుగుతోంది. అప్నాబజార్‌... ధాకే కాలనీ బస్టాప్‌... దాటి ముందుకు వెళ్ళిపోయింది ఆటో. ఈసారి ఎటువంటి శబ్దం లేదు. ఆటోలోంచి సగం బయటకు వంగి చూస్తుంటే వెనుక నుంచి లోపలకు లాగింది సుజాత.

*     *     *     *     *

గత నాలుగు రోజులుగా చాలా అనీజీగా బతుకుతున్నాను. బ్యాంకులో కూడా ఏ పనీ సరిగా చేయలేకపోతున్నా- కస్టమర్స్‌తో కూడా గొడవపడుతున్నా- వెళ్ళేటపుడూ వచ్చేటపుడూ ధాకే కాలనీ దగ్గర దిగడం, వెతకడం అలవాటైపోయింది. ఆ ముసలాడు కనపడటం లేదు. ఆ అరుపులు వినపడటం లేదు... ఏమయ్యాడతను!?

*     *     *     *     *

ఆదివారం ఉదయాన్నే బయటకు వెళ్తుంటే అడిగింది సుజాత- ‘‘ఎక్కడికీ?’’ అని. ‘‘అంధేరీ స్టేషన్‌ వరకూ వెళ్ళొస్తా.’’
‘‘ఏం?’’
‘‘రికవరీ డ్రైవ్‌’’
‘‘ఆదివారమా?!’’
‘‘ఇది మార్చి నెల- మార్చి నెలలో బ్యాంకర్లకు ఆదివారాలు ఉండవు’’ చిరాగ్గా అన్నాను.
సుజాత మాట్లాడలేదు. నేను బయటకు వచ్చి బస్సు ఎక్కాను. డి.ఎన్‌.నగర్‌ మెట్రో మలుపుకి వచ్చేటప్పటికి మళ్ళీ హార్ట్‌బీట్‌ ఇంక్రీజ్‌ అవడం మొదలుపెట్టింది. అప్నాబజార్‌, ధాకే కాలనీ - లేడు ఆ ముసలాడు - అతని అరుపులు కూడా లేవు. ధాకే కాలనీ బస్టాపులో నలుగురైదుగురు బస్సు వెనుక డోరుగుండా లోపలకు ఎక్కారు. కండక్టర్‌ తల లోపలకు తీయమని కసిరితే- కిటికీలోంచి తల లోపలకు తీసుకుని సరిగ్గా కూర్చున్నాను. నాకు పార్లల్‌గా ఆడవాళ్ళ సీట్లో ఎవరో దంపతులు కూర్చున్నారు. ఇద్దరూ వృద్ధులే. కాస్త ముందుకు వంగడంతో కిటికీవైపు ఉన్న ఆ పెద్దాయన కనిపించాడు. అతని ముఖంవైపు చూశాను... ఆ ముఖం ఎక్కడో చూశాను అనిపిస్తోంది. ఎక్కడా...ఎక్కడా... ఇంకెక్కడా - అదిరిపడ్డా - ఆ పిచ్చాడు ఇతనే!

*     *     *     *     *

అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మాసిన గడ్డం, చిరిగిన బట్టలూ ఇప్పుడు లేవు. నిన్నటి వరకూ నేను చూసిన పిచ్చివాడు అతడే అంటే నాకే నమ్మకం కలగడం లేదు. ఆయన పక్కన కూర్చున్నావిడ ముక్కుపుడకలు లేని ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మిలా ఉంది. చూడగానే నమస్కరించేలా ఉంది.
నాకు చాలా టెన్షన్‌గా ఉంది... వాళ్ళ వెనుక సీటు ఖాళీ అయితే అక్కడికి చేరాను. ‘‘నమస్తే అండీ...’’ వెనుదిరిగి చూసింది ఆమె. ‘‘నమస్తే బాబూ... మీరూ...?’’‘‘అబ్బే, తెలుగువాళ్ళని అనిపిస్తే- పలకరించాలనిపించి... నేను ఇక్కడ ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తుంటాను.’’ఇంతలో ఆ పెద్దాయన వెనక్కి తిరిగి నావైపు చూశాడు. ‘‘ఎవరే, ఈ సీనుగాడు?’’ నాకు వింతగా అనిపించింది. ‘‘అయినా, ఆ డ్రైవరు సీనుగాడేంటి...
బస్సు నడుపుతున్నాడా, ఆటో తోల్తున్నాడా అని- అయినా బస్సు నిండా ఇంతమంది సీనుగాళ్ళేవిటని’’ మళ్ళీ కిటికీకి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఆవిడ పమిటకొంగు భుజం మీదుగా లాక్కుంది.
‘‘సీనుగాడెవరండీ..?’’
‘‘మా అబ్బాయి... ఈయనకి ప్రాణం’’ ఆమె కాస్త ఇటు తిరిగి అంది. ‘‘ఈమధ్యనే కాలం చేశాడు- క్యాన్సరొచ్చి.’’ బస్సు డ్రైవరు మలుపు తిరిగేటప్పుడు బ్రేకు మీద కాలు బలంగా వేయడంతో పెద్ద శబ్దం చేస్తూ బస్సు మలుపు తిరిగింది.

*     *     *     *     *

వారి అబ్బాయి శ్రీనివాసరావుకి క్యాన్సర్‌ వచ్చింది ఆర్నెల్లక్రితం. వాళ్ళది ధర్మపురి. ఆయన పౌరోహిత్యుడు. కొడుకంటే ప్రాణం. లాభంలేదని తేల్చేశారు. ‘కీమోథెరపీ’ నరకయాతన అనుభవిస్తున్న కొడుకుని చూసి మానసికంగా బెదిరిపోయాడు ఆయన. చిన్నప్పటి శ్రీనివాసరావే ఆయనకి గుర్తు. బస్సు ఊరుదాటి చీకట్లో ఓ దాబా దగ్గర ఆగినప్పుడు- ఆ బస్సు దిగి వేరే బస్సు ఎక్కేశాడు ఆయన. అతని జేబులోని మందుల షాపు బిల్లు మీదున్న నంబరు చూసి అప్నాబజారు సెక్యూరిటీగార్డు ఫోన్‌ చేయడం వల్ల ఆమె ఇతన్ని చేరుకుంది.
‘‘మా అబ్బాయి చనిపోయాడనీ అతని అంత్యక్రియలు కూడా జరిగిపోయాయనీ ఈయనకు తెలియదు’’ పమిటచెంగు గుప్పిటతో పట్టుకుని నోటికి అడ్డంగా పెట్టుకుంది ఆమె.

*     *     *     *     *

రెండు నిమిషాలు నేనూ ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయాం. నాకొక్క విషయం చాలా ఇబ్బందిగా ఉంది - కొడుకు చనిపోయిన విషయం - ఆ పెద్దాయనకు ఇంకా తెలియదు.
‘‘మీ అబ్బాయి శ్రీనివాసరావుకి పెళ్ళయిందా?’’
‘‘అయింది బాబూ. ఇద్దరు పిల్లలు. అమ్మాయి- వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంది. శ్రీను కంపెనీలోనే అమ్మాయికి ఉద్యోగం ఇస్తారట. ఆ వచ్చిన సొమ్ము ఇద్దరు పిల్లల పేరున వేసి, ఆమెను గార్డియన్‌గా పెట్టారు. శ్రీను వైద్యానికి ధర్మపురిలో ఉన్న ఇల్లు అమ్మేయడంతో వాళ్ళు అనాథలైపోయారు.’’
ఎవరు అనాథలైపోయారో నాకు అర్థంకాలేదు. ఈలోగా అంథేరీ స్టేషను దగ్గరకు వచ్చింది బస్సు.‘‘లేవండి’’
‘‘ఆ- లేస్తా. అయినా, సీనుగాడేడే- ఆకలి అవుతోంది- రెండిడ్లీలు తెమ్మను.’’
ఆమె మళ్ళీ పమిటి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుని ఆయన్ని కిందకు తీసుకువెళ్ళిపోయింది. ఆమె భుజానికి ఓ ట్రావెల్‌ బ్యాగ్‌ వేలాడుతోంది. వెనుక నేనూ కిందకు దిగాను. నెమ్మదిగా ఆమె పక్కకు చేరాను.
‘‘మీరిక్కడకు వచ్చి ఎన్ని రోజులైంది?’’
‘‘నాలుగు రోజులు బాబూ. ఆ సెక్యూరిటీగార్డు దయవల్ల - వాళ్ళింటి దగ్గరే ఈ నాలుగు రోజులూ గడిపింది. గొప్ప మనసున్న మనిషి అతను. నేను పోయేంత వరకూ గుర్తుంటాడు.’’
‘‘ఇప్పుడెక్కడికి వెళ్తారు?’’
ఆమె మాట్లాడలేదు. ఆ పెద్దాయన అటూ ఇటూ చూస్తూ అంటున్నాడు- ‘‘సీనుగాడేడీ, ఆకలేస్తోందని చెప్పానుగా?’’
‘‘ఇడ్లీ బయటకు ఇవ్వరట. మనమే వెళ్ళి తినాలట, త్వరగా పదండి’’ ఆయన చేయి పట్టుకున్నాను.

*     *     *     *     *

హఠాత్తుగా నాకేదో అయింది. వాళ్ళిద్దర్నీ ఏదోలా ఇక్కడే ఆపేద్దామని ఉంది. ఎలానూ వాళ్ళకు కొంపా గోడూ లేదు. ఆ పెద్దావిణ్ణి కన్విన్స్‌ చేస్తే సరి! ఒకవేళ ఒప్పుకుంటే- సుజాత ఏమంటుందో..? ముక్కూ మొహం తెలియని మొత్తం ఫ్యామిలీని తెచ్చి ఇంట్లో పెడ్తానంటే నన్ను కూడా బయటకు పొమ్మంటుంది. ఏదో చేయాలి... ఎలా... అయినా ఇది నాకు అవసరమా..?
‘‘సిఎస్‌టీలో మూడు గంటలకి ‘కోణార్క్‌’ దొరుకుతుంది కానీ, రిజర్వేషన్‌ లేకుండా ఎలా..?’’ ఆమె మాట్లాడలేదు. అప్పుడే సిఎస్‌టీ నుంచి లోకల్‌ ట్రైన్‌ వచ్చినట్లుంది. జనాన్ని దిగనిచ్చి మేం ఎక్కాం. మూడు టికెట్లు విడిగా చింపి జేబులో పెట్టుకున్నాను. ఆ ముసలాయన మళ్ళీ కిటికీ పక్కనే కూర్చున్నాడు. వాళ్ళకు ఎదురుగా నేను కూర్చున్నాను. ఆదివారం కావడంతో అంత రష్‌ లేదు.
‘‘ధర్మపురిలో ఇల్లు అమ్మేశానన్నారుగా, మరి ఎక్కడికి వెళ్తారు?’’ ‘‘ఊర్థ్య మూల మధశ్శాఖాం - అశ్వత్థం ప్రాహురవ్యయమ్‌- చందాసి యస్య పర్ణాని యశ్వంవేద సవేదవిత్‌’’- గట్టిగా చదివాడాయన. ఆయన ఎడంచేయి కిటికీ మీద ఉన్న నా కుడిచేయిని తాకింది.
అది చూసింది ఆమె. ఆమె కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తోంది. ‘‘ఈయన సరిగా ఉన్నప్పుడు అయిదు నిమిషాలకో గీతా శ్లోకం చదివేవారు- మళ్ళీ ఇప్పుడు...’’ పమిటకొంగు నోటి దగ్గరకెళ్ళింది.
‘‘ఇక్కడే ఉండిపోవచ్చుగా’’ నాలోని బ్యాంకరు ఎందుకో మేల్కొన్నాడు. ‘‘ఇక్కడ ఈయనలాంటి వాళ్ళకి చాలా డిమాండు ఉంది. ఆబ్దీకానికి నాలుగువేలు- వరలక్ష్మీ వ్రతానికి అయిదువేలు- పెళ్ళయితే చెప్పనక్కరలేదు. దాదాపు పదివేల కుటుంబాలున్నాయి తెలుగువాళ్ళవి.’’ ఆమె వింతగా చూసింది నావంక.
‘‘దాదర్‌లో ‘ఆంధ్ర మహాసభ’ ఉంది. రవీంద్రగారని నాకు తెలిసిన పెద్దాయన ఉన్నారు. అక్కడికి వెళ్దాం. ఈయన మామూలు మనిషి అయ్యేంతవరకూ అక్కడే ఉండండి. వాషిలో ‘తెలుగు కళా సమితి’ ఉంది. రెడ్డిగారినడిగి రవీంద్రగారు ఓ చిన్న రూమ్‌ ఏర్పాటుచేస్తారు. అది చాలు కదా ప్రస్తుతానికి. కాస్త అలవాటైతే నెలకో ముప్ఫై నలభైవేలు సంపాయించొచ్చు’’ గ్యాప్‌ లేకుండా మాట్లాడుతుంటే ఆయాసం వస్తోంది.
ఆమె మళ్ళీ పమిటకొంగును గుప్పిటపట్టి నోరు నొక్కుకుంటుండగా అన్నాను- ‘‘మనం వడాలా రోడ్‌ దగ్గర దిగిపోదాం- దగ్గర’’ ట్రైన్‌ వడాలా రోడ్‌ స్టేషన్‌లో ఆగింది.ఆయన చేయి అందుకుంటూ అన్నా ‘‘లేవండి నాన్నా...’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.