close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇన్‌క్విలాబ్‌... కొత్త విప్లవం!

ఇన్‌క్విలాబ్‌... కొత్త విప్లవం!

ఆరో తరగతి చదువుతున్న సాయిప్రియకి తమ్ముడుపుట్టాడు. వాడి ఏడుపువల్ల.. కూలీనాలీ చేసుకునే ఆమె తల్లికి రాత్రంతా నిద్ర కరవయ్యేది. అందుకే.. తన తమ్ముడి కోసం రాత్రంతా దానికదే ఊగే ఊయలని డిజైన్‌ చేసిందా పాప! అరవింద్‌ వాళ్ల మావయ్య అడవిలో బీట్‌ కానిస్టేబుల్‌. రాత్రుళ్లు కాపలా పనుల్లో ఉన్నప్పుడు పురుగూపుట్రా కుట్టకుండా ఆయన కోసం అడుగువేయగానే లైట్లు వెలిగే బూట్లు సృష్టించాడు! ఈ ఇద్దరే కాదు ఇలాంటివాళ్లు వందల మంది నిరుపేద చిన్నారులని ఆవిష్కర్తలుగా మార్చారు ఆ ముగ్గురూ!సంపన్న కుటుంబం, చదువుల్లో మంచి ర్యాంకులు, ఐదంకెల జీతమిచ్చే కొలువులు, ఒక్కసారిగా అవన్నీ కాదనుకుని సమాజసేవకోసం అసలైన శ్రీమంతులు కావడం.. ఇలాంటి జీవితాలు సినిమాలకే పరిమితం కాదని నిరూపిస్తున్నారు ఈశ్వర్‌, సాహిత్య, వివేక్‌లు. ఈశ్వర్‌ది చిత్తూరు జిల్లా. ఇంజినీరింగ్‌ తర్వాత ఐబీఎం సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఏడాది గడవకుండానే సమాజ సేవపై  దృష్టిమళ్ళింది. వారాంతాల్లో చుట్టుపక్కలున్న బడులకి వెళ్లి పాఠాలు చెబుతుండేవాడు. ఒకస్థాయిలో సేవే తన జీవితమనుకున్నాడు.. ఇంట్లోవాళ్లు వద్దంటున్నా వినకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
సాహిత్యది హైదరాబాదే. వ్యాపారుల కుటుంబం. బిట్స్‌-గోవాలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివిన ఆమె అమెజాన్‌లో ఉద్యోగం చేసేది. వాళ్లక్క కూతురు ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివేది. ఆ పాపకి అందే నాణ్యమైన విద్యా, తన ముద్దుముద్దు మాటల్లో తొణికిసలాడే తెలివిని చూస్తూ మురిసిపోయేది సాహిత్య. అదే సమయంలో ఆమె దృష్టి తమ ఇంటి పనిమనిషివాళ్ల పాపపై పడింది. ఈ పాపదీ అదే తరగతే కానీ.. చదివేది సర్కారు బడిలో. ‘అక్కడికీ ఇక్కడికీ చదువుల్లో అంత తేడా ఎందుకుందీ?’ ఈ ప్రశ్న మనకి సామాన్యంగా అనిపిస్తోంది కానీ సాహిత్యని అది నిలవనీయలేదు. ఎంతగా అంటే.. అమెజాన్‌ ఉద్యోగానికి రాజీనామా చేసేటంతగా. ఉద్యోగం నుంచి బయటికొచ్చాక వివిధ రాష్ట్రాలకి వెళ్లి ప్రాథమిక చదువులని పరిశీలించడం మొదలుపెట్టింది.
హైదరాబాద్‌కి చెందిన వివేక్‌దీ దాదాపు ఇదే నేపథ్యం. ఫ్యాక్ట్‌సెట్స్‌ అనే సంస్థలో ఐటీ ఉద్యోగం చేసేవాడు. జీతం బాగానే ఉన్నా ఏదో అసంతృప్తి. తానొక్కడూ బాగుంటే చాలదు, చుట్టూ ఉన్న సమాజంలో సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న తపన. దాంతో రాజీనామా చేసేశాడు. ఈ ముగ్గుర్నీ కలిపింది ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ స్వచ్ఛంద సేవాసంస్థ.
ఒక్కపైసా తీసుకోవడం లేదు..
ఆ సంస్థ అందించే ఫెలోషిప్‌ కోసం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు ముగ్గురూ. ఈ ఫెలోషిప్‌ కింద రెండేళ్లపాటు నిరుపేద చిన్నారులు చదివే బడుల్లో బోధించాలి. ముగ్గురూ హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బడిలో 2014 నుంచి రెండేళ్లపాటు చదువులు చెప్పారు. ఓ కార్యక్రమంలో కలుసుకుని ఆలోచనలు పంచుకుని.. ఫెలోషిప్‌ తర్వాత కూడా నిరుపేద విద్యార్థుల కోసం తమ సేవలు కొనసాగించాలనుకున్నారు. అలా ‘ఇన్‌క్వి-లాబ్‌’ సంస్థని 2016లో స్థాపించారు. బడిలో చెప్పే పాఠాలు కాకుండా.. పిల్లల్లో వివిధ రకాల నైపుణ్యాలు పెంపొందించే మాస్టర్‌మైండ్స్‌, యూసీ మాస్‌ అబాకస్‌ వంటి సంస్థలు ఇప్పుడు ప్రతిచోటా ఉన్నాయి. ఇన్‌క్వి-లాబ్‌ కూడా అలాంటిదే కానీ ఇది లాభాపేక్ష లేకుండా నిరుపేద చిన్నారుల కోసమే పనిచేస్తుంది. ఆఫీసు అద్దెలూ, వివిధ సైన్స్‌ పరికరాల కొనుగోలు కోసం అవసరమయ్యే సొమ్మును దాతలూ, క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థల ద్వారా అందుకుంటున్నారు. అవి తప్ప పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఒక్కపైసా కూడా తీసుకోవడం లేదు. అలా ఇప్పటిదాకా 1300 పిల్లల చేత.. 350 కొత్త ఆవిష్కరణలు(ప్రోటో-టైప్‌) చేయించారు! ఒట్టి ప్రొటోటైప్‌ ఉంటే ప్రయోజనమేంటీ.. అందుకే వీటిని పూర్తిస్థాయి వస్తువులుగా తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్‌ కాలేజీలకి తీసుకెళుతున్నారు. జనసామాన్యం నుంచి ఇలాంటి వస్తువులని తయారుచేయిస్తున్న ‘పల్లెసృజన’ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.ఆ స్ఫూర్తేమిటో చెప్పారు..
అంకుర సంస్థలు తమ ఆలోచనలని పెట్టుబడిదారులకి వివరించే పిచ్‌ సెషన్‌ల గురించి వినే ఉంటారు! అలాంటి ఓ సెషన్‌ని ఇటీవలే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కోసం ఇటీవల నిర్వహించింది ఇన్‌క్వి-లాబ్‌ సంస్థ! పల్లెసృజన వ్యవస్థాపకుడు బ్రిగేడియర్‌ గణేశ్‌, రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ రంగనేకర్‌ ప్యానలిస్టులుగా వ్యవహరించారు. తాము తయారుచేసిన వస్తువుల గురించి ఒక్క నిమిషంలోనే వివరించాలని నియమం పెట్టినా సరే.. విద్యార్థులు అద్భుతంగా రాణించారు. అడవి కాపలా సిబ్బందికి ఉపయోగపడే బూట్ల నుంచి సౌరశక్తితో నడిచే విత్తనం నాటే యంత్రాలదాకా పదిహేను ఆవిష్కరణలని ప్యానెల్‌ ముందుంచారు. ఇన్‌క్వి-లాబ్‌ సంస్థ తమలో నింపిన స్ఫూర్తేమిటో చెప్పకనే చెప్పారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.