close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ పద్మనాభుడు పవళించడు..!

ఈ పద్మనాభుడు పవళించడు..!

భక్తుల పాలిట కొంగుబంగారంగా, సిరిగల స్వామిగా ప్రసిద్ధి చెందిన దైవం అనంత పద్మనాభుడు. ఇక్కడ స్వామి శేషతల్పంమీద పవళించినట్టుగా కాకుండా నిలబడిన భంగిమలో సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు. మూసీ నది
జన్మస్థానంగా, అనంత పద్మనాభుడి దివ్యధామంగా వికారాబాద్‌లోని అనంతగిరి విరాజిల్లుతోంది.నంతానంత దేవేశ అనంత ఫలదాయక। అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః।। అంటూ... అనంతమైన సిరిసంపదలు ఇచ్చే ఆ దేవదేవుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. అమితమైన భక్తితో స్వామిని దర్శించి పులకిస్తారు. అనంతగిరి కొండల్లో కొలువైన ఈ ఆలయ సందర్శనం ఎంతటి భక్తి భావాన్ని పెంపొందిస్తుందో, ప్రకృతి కాంతకు పచ్చనిచీర కట్టినట్లుండే ఇక్కడి మనోహర దృశ్యాలూ అంతటి మధురానుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా పేర్కొంటారు.స్థలపురాణం
సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన వైష్ణవ పుణ్య క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. విష్ణుపురాణం ప్రకారం... విష్ణుమూర్తి పాన్పు అయిన శేషుని తలభాగం తిరుమలగా, మధ్య భాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా వెలుగొందుతోంది. ఇక్కడే సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల పాటు మార్కండేయ మహర్షి తపస్సు చేసి శ్రీమహావిష్ణువు ఈ కొండల్లోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందుతాడు. సాలగ్రామ శిలగా వెలసిన ఆ శ్రీహరిని మార్కండేయుడు కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి అర్చించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. కలియుగ ప్రారంభ సమయంలో మార్కండేయుడు పద్మనాభ స్వామిని ఇక్కడికి వచ్చినవారందరికీ గంగా స్నాన భాగ్యం కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామి ఆనతి మేరకు గంగాదేవే స్వయంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి పుష్కరిణిగా మారిందట.ముచుకుందే మూసీ...
రాజర్షి అయిన ముచుకుందుడు దేవేంద్రుడి కోరిక మేరకు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు రాక్షసులతో పోరాడి, విజయం సాధిస్తాడు. దీనికి ప్రీతి చెందిన ఇంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ‘ఓ మహేంద్రా, సుదీర్ఘకాలంపాటు రాక్షసులతో పోరాడటం వల్ల నాకు నిద్ర కరవైంది. ఎలాంటి ఆటంకం కలగకుండా నిద్రపోయే అందమైన ప్రదేశాన్ని చూపించు. ఒక వేళ ఎవరైనా నాకు నిద్రా భంగం చేస్తే వారు వెంటనే భస్మమయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించమ’ంటాడు. అందుకు ఇంద్రుడు అనంతగిరి గుహల్లో నిద్రపొమ్మని సూచిస్తాడు. ఇదిలా ఉండగా బలరామకృష్ణులను అంతమొందించడానికి వస్తున్న యవనుడి నుంచి రక్షణ పొందడానికి అన్నదమ్ములిద్దరూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వెళతారు. వీరిని అనుసరిస్తున్న కాలయవనుడు గుహలో నిద్రపోతున్న ముచుకుందుడిని చూసి, కృష్ణుడనుకుని పొరబడి ఆగ్రహంతో దాడిచేస్తాడు. దాంతో ముచుకుందుడు నిద్ర మేల్కొనడం యవనుడు భస్మం కావడం ఏకకాలంలో జరిగిపోతాయి. అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన ముచుకుందుడు తన కమండలంలోని జలంతో స్వామిని అర్చించి, నదిగా మారి ఎప్పుడూ కృష్ణుడి పాదాల చెంతే ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. అలా ముచుకుందుడి కోరిక మేరకు అతని పేరు మీద ముచుకుంద నది ఏర్పడిందట. కాలక్రమంలో అది మూసీనదిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం తెలియజేస్తోంది.ఏటా రెండు సార్లు...
ఏటా అనంతగిరిలో రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చిన్న జాతరను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలూ, పల్లకీ సేవా, అనంతరం పెరుగు వసంతాన్నీ కనుల పండగగా చేస్తారు. కార్తిక మాసంలో అనంత పద్మనాభుడికి వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజుల్లో రోజుకొక వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు నిర్వహించే రథోత్సవం, చక్రస్నానాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.ఇలా చేరుకోవాలి
అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కి డెబ్భై  కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. భాగ్యనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి తాండూరు వెళ్లే బస్‌లో వికారాబాద్‌ వరకూ వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

- అన్నెపు దామోదరరావు, ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌
ఫొటోలు: సి.బషీర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.