close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లుంగీ కట్టు... సూపర్‌హిట్టు..!

లుంగీ కట్టు... సూపర్‌హిట్టు..!

‘రంగస్థలం సిట్టిబాబులా నువ్వూ లుంగీ కట్టుకోరాదూ... ఎంతసక్కగుంటావో...’ అంటూ గర్ల్‌ఫ్రెండో భార్యో అడగాలేగానీ ఎగిరి గంతేయని మగాళ్లు ఉండరంటే ఉండరండీ. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా ఇది మా గొప్ప నిజమండీ. మరండీ...  ఇప్పుడు లుంగీ కట్టు పాత చింతకాయ ఫ్యాషన్‌ కాదండీ బాబూ... అదో కొత్త స్టైల్‌ స్టేట్‌మెంట్‌ బాసూ అనేస్తున్నారండీ అందరూనూ!
‘లుంగీ డాన్స్‌ లుంగీ డ్యాన్స్‌...’ అంటూ చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో దూసుకొచ్చిన లుంగీ పాటా ఆ కట్టూ ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. కళ్లముందు కదులుతూనే ఉంది. ఈలోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ రానా బాబు లుంగీ కట్టుతో అందరినీ ఆకట్టుకుని దాన్నో క్లాస్‌ ఫ్యాషన్‌గా మార్చేశాడు. నిన్నమొన్న ‘మిడిల్‌క్లాస్‌ అబ్బాయి’గా నానీ లుంగీ కట్టులోని సౌకర్యాన్ని మరోసారి గుర్తుచేశాడు. ఇక, ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ లుంగీ కట్టుతో నటించేసి ఇదో స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా మార్చేశాడు. ఆ లుంగీ రెపరెప అక్కడితో ఆగితే చెప్పుకునేదేముందీ... ‘కృష్ణార్జున యుద్ధం’లో నానీ ‘దారి చూడు... దుమ్మూ చూడు మామా... దున్నపోతుల భేరి చూడు...’ అంటూ మళ్లీ లుంగీతో దుమ్ము రేపేశాడు. వీటికి తోడు... ఇదే మా సరికొత్త గెటప్‌ అంటూ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోలతోబాటు సినిమా యూనిట్‌ మొత్తం లుంగీలతో స్టేజిలెక్కేస్తూ దానికో క్రేజీ లుక్కు తీసుకొచ్చేస్తున్నారు.
సినీ లుంగీ!
మన సినిమాల్లో లుంగీ మరీ కొత్త గెటప్పేం కాదు. ముఠామేస్త్రీ చిరంజీవి, తమ్ముడు పవన్‌, సింహాద్రి ఎన్టీఆర్‌లు లుంగీల్లో ఆడిపాడి అలరిస్తే, ఆపై అత్తారింటికి దారేదిలో పవన్‌, రామయ్యా వస్తావయ్యాలో ఎన్టీఆర్‌లు లుంగీ డ్యాన్సులు చేసి మెప్పిస్తే, ఏకంగా శ్రీమంతుడులో మహేష్‌ లుంగీ లుక్‌ తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసేసింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే- మధ్యతరగతి హీరోలంతా సాదా, చారల లుంగీలతో మర్యాదగానూ, సంపన్నులు జరీ అంచు లుంగీలతో హుందాగానూ, రౌడీ పాత్రలన్నీ గళ్లలుంగీలతో క్రూరంగానూ, సరదారాయుళ్లంతా సిల్కు, పూల లుంగీలతో విలాసంగానూ కనిపిస్తుంటారు. మొత్తమ్మీద లుంగీకీ ఓ వ్యక్తిత్వాన్ని ఆపాదించేసింది తెలుగు సినిమా. తమిళ, మలయాళ హీరోలయితే దైనందిన జీవనంలోనూ లుంగీ కట్టుని అస్సలు మిస్సవరు. మనదగ్గర పల్లెల్ని వదిలేస్తే ఇంట్లో ఉన్నప్పుడో లేదా పడుకునేముందో మాత్రమే కట్టుకునే లుంగీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికారికంగానూ ధరిస్తుంటారు.
యమా సౌకర్యం!
అలాగని మిగిలినచోట్లంతా లుంగీని మర్చిపోయారా అంటే లేదనే చెప్పాలి. కాకపోతే ఉత్తరభారత పైజమాలూ, పశ్చిమదేశాల షార్ట్‌ల మోజులోపడి దక్షిణాది రాష్ట్రాల్లో లుంగీ నేటితరంలో కొంత కనుమరుగైన మాట నిజం. కానీ ఎప్పటికీ పోదనే చెప్పాలి.
ఐదారేళ్ల కిత్రం... నేషనల్‌ శాంపల్‌ సర్వే ఆఫీసు వాళ్లు వినియోగదారులు కొనే దుస్తుల గురించి ఓ సర్వే చేశారట. 52 శాతం మంది ఏడాదికో లుంగీ అయినా కొంటున్నారనీ, 21 శాతం మంది పంచెనీ 13 శాతమే కుర్తా పైజమానీ కొంటున్నట్లు తేలిందట. దీన్నిబట్టి ‘ఆ షార్టులూ పైజమాలతో పోలిస్తే లుంగీనే యమా సౌకర్యం... వేసవిలో మరీనూ..’ అనేవాళ్ల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు సరికదా, రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వేడి, తేమ ఎక్కువగా ఉండే దేశాల్లో ప్యాంట్లకన్నా లుంగీ కట్టే హాయి. గాలి ఆడటం వల్ల దురదలూ చర్మంమీద రాష్‌లూ ఇన్ఫెక్షన్లూ రాకుండా ఉంటాయి. దీన్ని ఎవరి ఇష్టానుసారం వాళ్లు సులభంగా కట్టుకోవచ్చు. కట్టుకోవడం ఇబ్బంది అనుకునేవాళ్లకోసం కుట్టినవీ వస్తున్నాయి. శంఖుమార్కు, ఉడతమార్కు, రామరాజు... వంటివి కాటన్‌ లుంగీలకి పేరొందితే, సిల్కు, శాటిన్‌, క్రేప్‌ లుంగీలకి బాంబే డైయింగ్‌ బ్రాండు పెట్టింది పేరు. అయినా గళ్ల లుంగీనే లుంగీ అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు వాటిలో బోలెడు ఫ్యాషన్లు. సాదావీ అంచులున్నవీ, బాతిక్‌, టై అండ్‌ డై వంటి ప్రింట్లు వేసినవీ, ఎంబ్రాయిడరీ ఆప్లిక్‌ వర్కూ చేసినవీ కూడా వస్తున్నాయి. జరీ అంచు లుంగీల మాదిరిగానే చందేరి, పట్టు లుంగీలనీ నేస్తున్నారు. వాటిని రకరకాలుగా కట్టి మోడల్స్‌తోనూ బాలీవుడ్‌ స్టార్లతోనూ ర్యాంప్‌ వాక్‌లు చేయిస్తున్నారు నేటి డిజైనర్లు. దాంతో సంప్రదాయ వస్త్రధారణలో భాగమైన లుంగీ, ఇప్పుడు ఫ్యాషన్‌ వేదికలమీదా సందడి చేస్తోంది.
అమ్మాయిలు లుంగీ కట్టరా?
... అని అడిగితే, ‘ఎవరన్నారు అలాగని’ అంటూ రివర్సులో ప్రశ్నిస్తారు మలయాళీభామలు. లుంగీ మగాళ్లదే అంటే అస్సలు ఒప్పుకోరు వాళ్లు. అక్కడి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నివసించే స్త్రీలూ ఇంట్లో ఉన్నప్పుడు పైన జాకెట్టు వేసుకుని లుంగీనే కట్టుకుంటారు. దీన్నే ‘మండు’గా పిలుస్తారు. ఆమధ్య కేరళలోని ఓ కాలేజీలో జీన్స్‌ వేసుకోవద్దన్నారని లుంగీలు కట్టుకొచ్చి మరీ నిరసన తెలిపారక్కడి అమ్మాయిలు.
మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాల్లోని మహిళలు బయటకు వెళ్లినా లుంగీనే ధరిస్తారు. అందుకే ఇది యూనిసెక్‌్్స డ్రెస్‌. అంతెందుకు... నందు బ్రాండ్‌ లుంగీలకి అమ్మాయిలూ మోడల్సే. అనేక దేశీ బ్రాండ్‌లు మహిళలకోసం లుంగీలను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్‌ ‘జారా’ అమ్మాయిలకోసం ప్రత్యేకంగా లుంగీలను డిజైన్‌ చేసింది. సుమారు ఆరున్నర వేల రూపాయల ఖరీదు చేసే ఆ లుంగీని స్కర్టు మాదిరిగా కలిపి కుట్టేశారు. దాంతో చాలామంది కాలేజీ అమ్మాయిలు కూడా ఆటవిడుపుగా లుంగీని కట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సినీతారలు అప్పుడప్పుడూ లుంగీమీద మనసు పారేసుకోవడం తెలిసిందే. జీనత్‌ అమన్‌, విద్యాబాలన్‌, దీపికా పదుకొనె, రమ్యకృష్ణ... వంటి వారంతా భిన్న సందర్భాల్లో లుంగీ పోజులతో అలరించినవారే. పంజాబ్‌లో బాంగ్రా డ్యాన్సులో ఆడామగా ఇద్దరూ లుంగీ లాంటి వస్త్రాన్నే ధరిస్తారు.
విదేశాల్లోనూ లుంగీ..!
దక్షిణాసియా, ఆగ్నేయాసియాలతోబాటు తూర్పు ఆఫ్రికా, అరబ్బు దేశాల్లో కూడా ఈ లుంగీ కట్టు కనిపిస్తుంటుంది. అయితే బర్మావాసులకి మాత్రం జాతీయ డ్రెస్‌ కూడానట. ఇప్పటికీ వాళ్లు షూ వేసుకున్నా కోటేసుకున్నా లుంగీ కట్టుకునే బిజినెస్‌ మీటింగులకీ హాజరవుతారు. దీన్నే వాళ్లు ‘లాంగి’ అంటారు. వాళ్లనుంచే తమిళనాడుకీ వచ్చింది అంటుంటారు. కొన్నితరాల క్రితం తమిళప్రజలు మయన్మార్‌కు వలస వెళ్లారు. అయితే 1960లలో జపాన్‌ వాళ్లు అక్కడికి పెద్ద యెత్తున రావడంతో చాలామంది తమిళయన్లు వెనక్కి వస్తూ లుంగీల సంస్కృతినీ వెంట తీసుకువచ్చారట. అప్పటివరకూ పంచెనే లుంగీగా కట్టుకునేవాళ్లంతా ఇది తేలికగా ఉండటంతో గళ్ల లుంగీలు కట్టుకోవడం ప్రారంభించారట.
సోమాలియా, మలేషియా, బాలి, ఇండొనేషియాల్లో సారంగ్‌ పేరుతో లుంగీ వాడుకలో ఉంది. పూల డిజైన్‌తో ఉండే సారంగ్‌లను ఆడామగా బీచ్‌ డ్రెస్‌గానూ ధరిస్తుంటారు. అసలైన లుంగీకట్టు చూడాలంటే మాత్రం బంగ్లాదేశ్‌ వెళ్లాల్సిందే. పిల్లల కూడా లుంగీలు కడతారు. వాటిల్లో బాతిక్‌ ప్రింట్లదే హవా. హైదరాబాద్‌ శివార్లలోని బార్కాస్‌లో స్థిరపడ్డ యెమనీలు ఇండొనేషియా నుంచి దిగుమతి చేసుకున్న సిల్కు లుంగీలు కడతారు. ఇక, ఒడిశావాసులకి సంబల్‌పురి లుంగీలంటే మహా మోజు.
ఇలా లుంగీల్లో ఎన్ని రకాలున్నా ఎవరెలా కట్టినా మనదగ్గర మాత్రం సంప్రదాయ బద్దంగా సరిగంచు లుంగీని పాదాల వరకూ కడితే అది క్లాస్‌... గళ్లలుంగీ కట్టి దాన్ని మోకాళ్ల వరకూ మడిస్తే అది మాస్‌... దాన్నే నిక్కరు కనిపించేలా ఇంకాస్త ఎగ్గడితే ఊర మాస్‌. మాసో క్లాసో- మీకే లుక్కు కావాలో మీ ఇష్టం బాస్‌..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.