close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చినాబ్‌పై చుక్‌చుక్‌ కోసం..!

చినాబ్‌పై చుక్‌చుక్‌ కోసం..!

శ్రీనగర్‌.. భూలోకాన్ని సృష్టించిన భగవంతుడు తాను సేదదీరడానికి ఏర్పాటుచేసుకున్న స్వర్గంలా ఉంటుంది. మంచుకొండలూ, వాటికి పచ్చటి దుప్పటి కప్పినట్టుండే చిట్టడవులూ, నింగి వంగి తన ప్రతిబింబాన్ని చూసుకుంటోందా అనిపించే దాల్‌ సరస్సూ.. ఇలా ఎన్నెన్నో అందాలతో అలరిస్తుంది. కానీ ఇప్పటిదాకా దాన్ని మనదేశ ప్రధానభూగంతో కలిపే రైల్వే లైను లేదు. ఆ లోటుని పూడ్చే క్రమంలో అక్కడ ప్రపంచంలో అతిఎత్తైన వంతెన నిర్మిస్తోంది భారతీయ రైల్వే. దాని విశేషాలివి..
శ్మీర్‌లోని రీసీ జిల్లాలో ఉన్న బక్కల్‌-కౌరీ ప్రాంతాల నడుమ ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో చినాబ్‌ రెండు పెద్ద పర్వతాల నడుమ ప్రవహించడం వల్ల అతిపెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయని కలిపేందుకే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుందీ వంతెన. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో టార్న్‌ నదిపై ఉన్న రైల్వే వంతెనే ప్రపంచంలో అతి ఎత్తైంది. చినాబ్‌ వంతెన ఎత్తు దానికన్నా 19 మీటర్లు ఎక్కువ! కుతుబ్‌మినార్‌కన్నా అయిదురెట్లు ఎత్తులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతెందుకు.. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌కన్నా ఇది 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తుతో మాకేం పని అంటారా.. ఇది కేవలం రైల్వే వంతెన మాత్రమే కాదు. దీనికి రక్షణగా రెండువైపులా ఇనుపతాళ్లని పట్టి ఉంచే అతిపెద్ద స్తంభాలని (పైలాన్స్‌) ఏర్పాటుచేశారు. వంతెన మొదలయ్యాక ఈ రెండు స్తంభాల పై నుంచి బంగీజంప్‌ వంటి సాహస క్రీడలకీ అవకాశం కల్పిస్తారట. అంతేకాదు.. దీనికి ఓవైపు సైకిల్‌దారితోపాటూ రోప్‌వే కూడా ఉంటుంది. అంటే రైలు ప్రయాణంతోపాటూ.. ప్రపంచంలో అతి ఎత్తైన ఈ వంతెన నుంచి సాహసాలూ చేయొచ్చన్నమాట!
ఇదీ దీని ప్రాధాన్యం..
జమ్ము నుంచి శ్రీనగర్‌కి వెళ్లాలంటే రోడ్డుమార్గమే శరణ్యం. ఈ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 44) చాలా వరకూ పర్వతాలపైనే సాగుతుంది. అందువల్ల జమ్ము-శ్రీనగర్‌  నగరాల మధ్య 269 కిలోమీటర్లే ఉన్నా..  ఓ వైపు ప్రయాణానికే ఎనిమిదిగంటలు పడుతుంది! ఆ సమయాన్ని తగ్గించి.. శ్రీనగర్‌ని రైల్వేలైన్‌తో కలిపేందుకు ఉత్తర రైల్వే జోన్‌ 1990ల నుంచే ప్రయత్నిస్తోంది. దీనికి ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లైన్‌(యూఎస్‌బీఆర్‌ఎల్‌) అని పేరుపెట్టింది. అంటే జమ్మూలోని ఉధంపూర్‌ నుంచి  శ్రీనగర్‌ని దాటి బారాముల్లా దాకా వెళ్లే రైల్వే లైన్‌ అన్నమాట. ఇది పూర్తయితే జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఐదుగంటల్లో చేరుకోవచ్చు. మొత్తం 325 కిలోమీటర్లుండే ఈ లైన్‌ నిర్మాణపరంగా అత్యంత క్లిష్టమైంది.  ఇందుకోసం ముందు ఉధంపూర్‌ నుంచి కాట్రా అనే ప్రాంతానికి 25 కిలోమీటర్ల రైలు లైన్‌ వేశారు. ఈ మార్గంలో 2014 నుంచే ప్రయాణికుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జమ్మూ నుంచి వైష్ణోదేవి  ఆలయానికి వెళ్లే భక్తులు ఈ రైలుకే వస్తారు. ఈ మార్గాన్ని ‘లెగ్‌ 1’ అంటారు. ఇక ‘లెగ్‌ 2’ కాట్రా నుంచి బనిహాల్‌ మధ్య ఉంటుంది. మొత్తం 92 కిలోమీటర్ల లైన్‌ ఇది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చినాబ్‌ రైల్వేవంతెన వచ్చేది ఈ మార్గంలోనే. ఈ బ్రిడ్జి పొడవు 1.315 కిలోమీటర్లే అయినా.. దీనికోసం పన్నెండువందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది భారతప్రభుత్వం.
ఎన్నో సవాళ్లు..
దాదాపు ఎనిమిదేళ్లుగా దీన్ని నిర్మిస్తున్నారు. భూకంప ప్రమాదాలు ఎక్కువగా వచ్చే ప్రాంతం కావడం వల్ల నిర్మాణ ప్రణాళికని చాలాసార్లు మార్చారు. ఒకదశలో అసలు ఈ రైల్వే లైన్‌ మార్గాన్నే మళ్లించాలనుకున్నారు. అనేక అధ్యయనాల తర్వాత పాత ప్రణాళికకే కట్టుబడ్డారు. మధ్యలో తీవ్రవాదుల దాడులూ, కిడ్నాప్‌లూ, హత్యలూ చోటుచేసుకున్నాయి. ఆ సవాళ్ళన్నీ అధిగమించి 2014 నుంచి పనులు జోరుగా మొదలుపెట్టారు. అతి  తీవ్రమైన భూకంపాలని తట్టుకునే విధంగానే దీన్ని నిర్మిస్తున్నారు. తీవ్రవాదుల బాంబుదాడులకు చెక్కుచెదరకుండా ఉండేందుకు  63 మి.మీ. మేర మందంగా ఉండే ప్రత్యేక స్టీలు వాడుతున్నారు. అంతేకాదు ఈ వంతెన మైనస్‌ 20 డిగ్రీల మంచు కురుస్తున్నా  తట్టుకోగలదు. గంటకి 265 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా నిభాయించగలదు. ఈ రైల్వే బ్రిడ్జిని 2019కల్లా పూర్తిచేస్తామని చెబుతోంది భారతీయ రైల్వే. ఇటీవలే  ఈ వంతెనకి అవసరమైన ఉక్కు చాపం (స్టీల్‌ ఆర్చ్‌) నిర్మాణాన్నీ పూర్తిచేశారు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.