close
బ్యాంకింగ్‌ దిగ్గజం.. రానా

బ్యాంకింగ్‌ దిగ్గజం.. రానా

బ్యాంకు అంటే డబ్బు మాత్రమే కాదు, అదో నమ్మకం. ప్రభుత్వ రంగ బ్యాంకుల వెనక వ్యక్తులకన్నా ప్రభుత్వం ఉందన్న భరోసా ఖాతాదారులకు ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ బ్యాంకులు ముందు ఖాతాదారుల విశ్వాసాన్ని పొందాలి. అది రానా కపూర్‌ లాంటి కొందరికే సాధ్యం. అందుకు నిదర్శనం ఆయన స్థాపించిన ‘ఎస్‌ బ్యాంక్‌’. దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా జీవితం యువ వ్యాపారులకు ఓ స్ఫూర్తి పాఠం.
రానా కపూర్‌ పుట్టి పెరిగింది దిల్లీలో. ‘శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌’లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాక అమెరికాలోని రట్గెర్స్‌ యూనివర్సిటీ నుంచి 1979లో ఎంబీఏ చేశారు. ఆ సమయంలోనే న్యూయార్క్‌లోని సిటీ బ్యాంక్‌లో ఇంటర్న్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకుల భవనాల్ని చూశాక, ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్ర గురించి విన్నాక భారత్‌లో బ్యాంకు స్థాపించాలన్న ఆలోచన కలిగిందాయనకు. నిజానికి  వ్యాపారవేత్తగా ఎదగాలన్న కల రానాకు చిన్ననాటి నుంచీ ఉంది. ‘ఎప్పటికైనా వ్యాపార రంగంలో అడుగుపెడతానని తాతయ్యకి చెప్పేవాణ్ని. ఆ మాటలు ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించేవి. ఎందుకంటే, ఆయన నలుగురు కొడుకులూ ఉద్యోగాల్లో స్థిరపడటంతో కుటుంబానికి చెందిన నగల  వ్యాపారాన్ని వదులుకోవాల్సి వచ్చింది’ అంటూ తన కుటుంబ వ్యాపార మూలాల్ని గుర్తుచేసుకుంటారు రానా. ఎంబీఏ పూర్తిచేసి ఇండియా వచ్చిన రానా... సిటీ, ఏఎన్‌జెడ్‌ గ్రిండ్లే, ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’లలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏఎన్‌జెడ్‌ తుది జాబితాలోని మూడు పేర్లలో రానా కపూర్‌ పేరు ఒకటి. అందులోని మిగతా ఇద్దరూ ఉన్నతాధికారుల సంతానం కావడంతో తనకు అక్కడ ఉద్యోగం దక్కలేదంటారాయన. తర్వాత ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’లో చేరి 15 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ చివరి రెండేళ్లూ ఆసియాలోని వివిధ దేశాల్లో బ్యాంకు బాధ్యతల్నీ తీసుకున్నారు.
కార్పొరేట్‌ మిత్రులు
1995లో ’ఏఎన్‌జెడ్‌ గ్రిండ్లేస్‌-మర్చెంట్‌ బ్యాకింగ్‌ బిజినెస్‌’ భారత్‌ విభాగం బాధ్యతల్ని చేపట్టే అవకాశం వచ్చినపుడు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేవలం రెండేళ్లలో ఆ విభాగంలో దాన్ని ఆరో స్థానానికి తేగలిగారు. అక్కడ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల కొనుగోలుకూ, సునీల్‌ మిత్తల్‌ టెలిఫోన్‌ కంపెనీ సేవల్ని ప్రారంభించడానికీ అవసరమైన నిధుల్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. రానాకు సునీల్‌ మిత్తల్‌ 16ఏళ్ల వయసునుంచీ పరిచయం. ఇద్దరూ దిల్లీలోని పంచశీల క్లబ్‌లో స్నూకర్‌ ఆడేవాళ్లట. వృత్తిలో చేరాక కార్పొరేట్‌ ప్రపంచంలో కొత్త మిత్రుల్నీ సంపాదించుకున్నారు రానా. మరోవైపు సొంత బ్యాంకు కలనూ గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. ఏఎన్‌జెడ్‌లో ఉండగానే 1995లో అమెరికా వెళ్లి అక్కడ ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తాను ప్రారంభించాలనుకుంటున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) గురించి వివరించారు. దాన్లో సగానికిపైగా వాటా ఇస్తే రూ.22 కోట్ల పెట్టుబడికి సిద్ధమంది ఆ సంస్థ. ఉత్సాహంగా భారత్‌ తిరిగొచ్చి ఆ విషయాన్ని తన తోడల్లుడూ ‘ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంక్‌’ భారత్‌ విభాగాధిపతీ అయిన అశోక్‌ కపూర్‌కి చెప్పారు. ‘మంచి ఒప్పందమే కానీ, అది చిన్న మొత్తం’ అని తన అభిప్రాయం చెప్పిన అశోక్‌, హాలెండ్‌కు చెందిన ‘ర్యాబో బ్యాంకు’ భారత్‌లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉందంటూ వారితో మాట్లాడమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా సంస్థతో చర్చలు నిలిపేశారు రానా. ఏఎన్‌జెడ్‌లో పనిచేస్తూనే ర్యాబో బ్యాంకు ప్రతినిధులతో సంప్రదింపుల్లో ఉండేవారు. చివరకు 1997లో వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్‌బీఎఫ్‌సీ అయిన ‘ర్యాబో ఇండియా ఫైనాన్స్‌’లో 25 శాతం వాటాని కేటాయించినందుకుగానూ రానాతోపాటు అశోక్‌, ఇంకా అప్పటికి ‘డ్యూష్‌ బ్యాంక్‌’ భారతీయ విభాగాధిపతిగా ఉన్న హర్‌కీరత్‌ సింగ్‌ భాగస్వాములుగా చేరారు. ఒక్కొక్కరికి రూ.9కోట్లు విలువ చేసే వాటాల్ని కేటాయించింది ర్యాబో. అదనంగా 17ఏళ్ల ఉద్యోగ జీవితంలో దాచిన రూ.40 లక్షల్నీ అందులో పెట్టుబడిగా పెట్టారు రానా. అప్పటికి దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నా,  ఆందోళన చెందకుండా 1998 ప్రారంభంలో ర్యాబో బ్యాంకుని ప్రారంభించిందా బృందం. ‘వ్యవస్థ పూర్తిగా అనుకూలంగా లేనపుడే  ఏ కంపెనీనైనా ప్రారంభించడం మంచిది. అప్పుడే మనలోని పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాల్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది’ అంటారు రానా.
అన్నిటా అనుభవం
బ్రిటన్‌కు చెందిన ‘టెట్లీ టీ’ కంపెనీని ‘టాటా టీ’ చేజిక్కించుకోవడంలో ర్యాబో బ్యాంకు భారతీయ విభాగం కీలక పాత్ర పోషించింది. అది వరకు ఓ ప్రయత్నం విఫలమవడంతో ఆ ఒప్పందం కుదర్చడంలో ర్యాబో బ్యాంకు పూర్తిగా సాయపడేలా అప్పటి టాటా టీ అధినేత కృష్ణకుమార్‌ రాత పూర్వక హామీ కోరినపుడు రానా అలా రాసిచ్చారు కూడా. ఆ ఒప్పందం రానా కెరీర్‌లో ఓ పెద్ద విజయం. ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా’లో కార్పొరేట్‌  బ్యాంకర్‌గా, ఏఎన్‌జెడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేసిన రానా... ర్యాబో బ్యాంకులో యజమానిగా అనుభవం సంపాదించాక 2001 నుంచే అశోక్‌, సింగ్‌లతో కలిసి సొంత బ్యాంకును స్థాపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరకు ముగ్గురూ ఆ బ్యాంకులో తమ వాటాల్ని అమ్మేసి సొంత బ్యాంకు పెట్టడానికి 2003లో బయటకు వచ్చేశారు. ఆ సమయానికి ఒక్కొక్కరి వాటా కిందా రూ.50 కోట్లు వచ్చాయి. ‘ఎస్‌ బ్యాంక్‌’కు అది వరకు ఆర్థిక రంగంలో పనిచేసిన అనుభవం లేకపోయినా బ్యాంకు స్థాపించుకునే అవకాశం(గ్రీన్‌ఫీల్డ్‌ బ్యాంకింగ్‌) ఇచ్చింది ఆర్బీఐ. అలా జరగడం దేశంలో అదే తొలిసారి. అందుకు కారణం వ్యవస్థాపకులకు  ఆ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉండటమే. 2004లో ఆర్బీఐ ‘ఎస్‌ బ్యాంకు’కు లైసెన్స్‌ ఇవ్వడానికి కొద్దిరోజుల ముందే కొన్ని  కారణాలవల్ల సింగ్‌ బయటకు వెళ్లిపోయారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకుతోడు  అత్యుత్తమ మానవ వనరులూ, సాంకేతికత, పారదర్శకత... ప్రధాన లక్షణాలుగా అశోక్‌ ఛైర్మన్‌గా, రానా ఎండీ, సీయీవోగా  ‘ఎస్‌ బ్యాంకు’ ప్రారంభమైంది.  వృత్తి నిపుణుడికి సొంత కంపెనీ అనేది ఎంత గొప్ప అవకాశమో తెలిసిన ఇద్దరు కపూర్‌లూ ఎంతో కష్టపడి పనిచేయడం  మొదలుపెట్టారు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమన దశలో ఉండటమూ కలిసొచ్చింది. ప్రారంభంలో చేరిన ఉద్యోగులకు వాటాలిచ్చి ఉద్యోగులూ, యజమాన్యం ఒకటేనన్న సంకేతం ఇచ్చారు. దానివల్ల  ఉద్యోగులకు బ్యాంకుతో దీర్ఘకాల అనుబంధం ఏర్పడింది. దాదాపు 30 మంది ఉన్నత స్థాయి మేనేజర్లని ర్యాబో బ్యాంకు నుంచి తీసుకొచ్చారు రానా. బ్యాంకు ఐటీ (హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌, డేటా సెంటర్‌...) విభాగాన్ని విప్రోకి పొరుగు సేవల విధానంలో  కేటాయించి కేవలం బ్యాంకింగ్‌ నిర్ణయాలమీద దృష్టి పెట్టారు. దాంతో నిర్వహణ ఖర్చూ తగ్గింది. ఆ తర్వాత దేశంలో చాలా బ్యాంకులు ‘ఎస్‌ బ్యాంకు’ని ఈ విషయంలో అనుకరించాయి. లావాదేవీలు ప్రారంభించిన ఏడాదికే ‘ఎస్‌ బ్యాంకు’ విలువ రూ.వెయ్యి కోట్లు దాటింది. ఆ సమయంలో ఐపీఓకి వెళ్లి అతిపెద్ద సాహసం చేశారు. అక్కడా విజయం సాధించారు. 25 శాతం వాటాని అమ్మి రూ.315 కోట్లు స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సమీకరించారు. ‘నిజానికి  ఎస్‌ బ్యాంక్‌ బ్రాండ్‌ ఆ ఐపీవోతోనే పుట్టింది’ అంటారు రానా. రిటైల్‌ బ్యాంకింగ్‌ మాదిరిగా ఎక్కువ శాఖలు అవసరంలేకుండా ప్రారంభంలో కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ వైపు మొగ్గుచూపారు. మొదట బ్యాంకింగ్‌ రంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనీ, ఆపైన మార్కెట్‌లోకి బాగా విస్తరించాలనేది కపూర్‌ల ప్రణాళిక. సమర్థ నాయకత్వం ఎలాంటి ప్రణాళికనైనా అమల్లో పెట్టగలదు. రానా, అశోక్‌ లిద్దరూ ప్రతిభావంతులే కాదు, అనుభవజ్ఞులూనూ. అందుకే బ్యాంకుని ప్రారంభం నుంచీ అభివృద్ధి పథంలో నడిపించగలిగారు.  అవకాశాల్ని అందిపుచ్చుకుంటేనే మనుగడ అని గుర్తు చేయడానికి డెస్క్‌ మీద పెట్టుకోమంటూ ఆహారం కోసం పరుగుతీస్తున్న 500 చిరుత బొమ్మల్ని తమ బృందానికి ఇచ్చారు. ‘బ్యాంకు అయినా, సంస్థ అయినా, ఎత్తుపల్లాలను చూడాలి. అప్పుడే దానికి భవిష్యత్తు ఉంటుంద’ని చెబుతారు రానా. ‘ఎస్‌ బ్యాంకు’ ప్రారంభమైన నాలుగేళ్లకే ఓ అనుకోని సంఘటన ఎదురైంది. 2008 నవంబరు 26న ముంబయిలోని ఒబెరాయ్‌ ట్రైడెంట్‌ హోటల్‌లో భార్యతో కలిసి విందుకు వెళ్లిన అశోక్‌ కపూర్‌ టెర్రరిస్టుల దాడుల్లో మరణించారు. ఆయన భార్య మధు ప్రాణాలతో బయటపడగలిగారు. అశోక్‌లేని లోటు తీర్చలేనిదే అయినా, బ్యాంకు మీద ఆ ప్రభావం పడకుండా అన్నీ తానై బ్యాంకుని నడిపించారు రానా. తర్వాత కొన్ని అంశాల్లో రెండు కుటుంబాల మధ్యా అభిప్రాయ బేధాలు వచ్చినా మళ్లీ సద్దుమణిగాయి. అశోక్‌ కుటుంబానికి ఇప్పటికీ బ్యాంకులో 10 శాతానికిపైగా వాటా ఉంది.
పదిహేనేళ్లలో 200రెట్లు!
2010 తర్వాత కార్పొరేట్‌ బ్యాంకింగ్‌కి మాత్రమే పరిమితం కాకుండా వృద్ధి బాగా ఉండే ఆహార, వ్యవసాయాధార పరిశ్రమలు, టెలీ కమ్యునికేషన్స్‌, ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌,  పునరుత్పాదక ఇంధనం, మీడియా- వినోదం, తయారీ రంగాలపైనా దృష్టి పెట్టింది  ఎస్‌ బ్యాంక్‌. ‘బ్యాంకు నిర్మాణానికి 10-20 ఏళ్లు పడుతుంది. అన్నాళ్లూ కష్టపడటం తప్ప మరో మార్గంలేదు’ అని చెప్పే రానా, తన పని సమయంలో 50 శాతాన్ని ఉద్యోగులతో సమావేశమయ్యేందుకు  కేటాయిస్తారు. ప్రస్తుతం కార్పొరేట్‌,
రిటైల్‌, మధ్య-చిన్న తరహా పరిశ్రమలు...  ఈ మూడు విభాగాల్లోనూ సేవలు అందిస్తూ దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా నిలిచింది ‘ఎస్‌ బ్యాంక్‌’. డిజిట‌ల్‌ మార్కెట్‌లోనూ విస్తరిస్తూ ఖాతాదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. 2004లో వెయ్యి కోట్లుగా ఉన్న ఎస్‌ బ్యాంకు ఆస్తి విలువ నేడు సుమారు రూ.2లక్షల కోట్లకు చేరింది. రానా విజయానికి ఇంతకంటే కొలమానం ఉంటుందా!


అంబానీకి పొరుగున

రానా భార్య... బిందు. వీరికి ముగ్గురు అమ్మాయిలు... రాధ, రాఖీ, రోషిని. ముగ్గురూ సొంత వ్యాపారాల్ని ప్రారంభించారు.
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో వాటిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘అమ్మ, అక్క, నా భార్య, మా ముగ్గురు కుమార్తెలూ నాకు స్ఫూర్తి...’ అంటారు రానా.
* వారంలో నాలుగైదు రోజులు ట్రెడ్‌మిల్‌ మీద వర్కవుట్‌ చేస్తారు.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక, రాజకీయ పరిణామాల్ని గమనిస్తారు.
* నచ్చే హాలిడే స్పాట్‌...  సిమ్లా, ఇటలీ.
* నచ్చే పుస్తకం... ‘ఎ హోల్‌ న్యూ మైండ్‌’.
* రోల్‌ మోడల్‌.. బిల్‌ క్లింటన్‌, రతన్‌ టాటా.
* ఆస్తి విలువ రూ.10వేల కోట్లు. దేశంలో బ్యాంకింగ్‌ రంగంలో ఉదయ్‌ కొటాక్‌ (కొటాక్‌ మహీంద్రా బ్యాంకు) తర్వాత రెండో అత్యంత సంపన్నుడు.
* ముఖేశ్‌ అంబానీ ఇంటి పొరుగునే రూ.128 కోట్లు పెట్టి 2013లో ఇల్లు కొన్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.