close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవ్వితే... చమక్‌ చమక్‌..!

నవ్వితే... చమక్‌ చమక్‌..!

కొందరు నవ్వితే ముత్యాలు రాలినట్లో వెన్నెల కురిసినట్లో ఉంటుంది అంటుంటారు. ఆ సంగతి ఎలాగున్నా మెరిసే ఆ పలువరసని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దంతాలు పసుపురంగులోకి మారి ఇబ్బందిగా అనిపిస్తాయి. దంతాలమీద ఎనామిల్‌ అనే సున్నితమైన పొర ఒకటి ఉంటుంది. ఇది తెల్లగా ఉంటుంది. అయితే టీలూ, కాఫీలూ కూల్‌డ్రింకుల్లాంటివి ఎక్కువగా తాగడం, ధూమపానం, మద్యపానం, గోళ్లు కొరకడం, పళ్లు కొరకడం... వంటి రకరకాల అలవాట్లూ కొన్ని రకాల పండ్లలోని ఆమ్లగుణాలూ, యాంటీబయోటిక్స్‌, ఇతరత్రా మందులు ఎక్కువగా వాడటం వంటి కారణాలవల్ల కూడా ఎనామిల్‌ పొర దెబ్బతినడంతో దంతాలు పసుపురంగులోకి మారతాయి. అలా మారిన దంతాలు తెల్లగా మెరిసేలా చేసే కొన్ని చిట్కాలు...
* కాస్త టూత్‌పేస్టు తీసుకుని అందులో టీస్పూను బేకింగ్‌ సోడా వేసి బాగా కలిపి బ్రష్‌ చేసి గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. లేదూ బేకింగ్‌సోడాతోనే రెండు
నిమిషాలు వారానికి మూడుసార్లు రుద్దితే సరి.
* కమలాతొక్క తీసుకుని తెల్లగా ఉండే లోపలి భాగంతో దంతాలమీద రుద్ది ఐదు
నిమిషాలు ఉంచాలి. తరవాత బ్రష్‌ చేయాలి. ఇలా రోజూ రాత్రి పడుకునేముందు ఓ వారంపాటు చేస్తే తొక్కలోని విటమిన్‌-సి కారణంగా దంతాలు తారల్లా తళుక్కుమంటాయి. లేదూ స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి రోజూ పడుకునేమందు దంతాలకు పట్టించి ఐదు నిమిషాలు రుద్దాలి. ఇలా వరసగా పదిరోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
* టేబుల్‌స్పూను నిమ్మరసంలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి దాంతో దంతాలను రుద్ది, కాసేపు ఉంచి తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.  ఇలా వారానికి రెండుసార్లు చేసినా చాలు.
* గుప్పెడు తులసిఆకులు  పేస్టులా చేసి, టూత్‌పేస్టుతో కలిపి వారంపాటు బ్రష్‌ చేస్తే దంతాలు చమక్‌ చమక్‌...!


అమ్మాయిలూ... క్యాబేజీ తింటున్నారా?

బ్రకోలీ, కాలీఫ్లవర్‌, క్యాబేజీ తింటున్నారా... తినే అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా తినండి అంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. రోజూ వీటిని కనీసం 10 గ్రాములైనా తినడంవల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల గోడల మందం తగ్గి, రక్త సరఫరా మెరుగుపడుతుంది అని తేలింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో ఈ కూరల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం వాళ్లు ఈ కూరగాయల్ని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునేవాళ్లనీ, తీసుకోనివాళ్లనీ పరిశీలిస్తే వీటిని క్రమం తప్పక తినేవాళ్లలో కెరోటిడ్‌ రక్తనాళాల గోడలు పలుచగానూ ఆరోగ్యంగానూ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, దీని కారణంగా గుండెనొప్పి, పక్షవాతం వచ్చే అవకాశం  తగ్గుతుందని వాళ్ల పరిశీలనల్లో తేలింది. కాబట్టి అబ్బో క్యాబేజీనా...బ్రకోలీనా... అనకుండా వాటిని కాస్త ఉడికించి తినండి.


డెంగ్యూకి ఆయుర్వేద మందు!

డెంగ్యూ జ్వరాలు ఎంతగా భయబ్రాంతుల్ని చేస్తున్నాయో తెలియంది కాదు. దీనికారణంగా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడం, మరణాలు సంభవించడం... వంటివి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ దీనికి ప్రత్యేకమైన యాంటీబయోటిక్‌గానీ మరే ఔషధంగానీ లేదనే చెప్పాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల మంది దీనిబారిన పడుతున్నారు. గత ఏడాది ఒక్క మనదేశంలో లక్షన్నరకి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తీవ్రతను దృష్టిలో పెట్టుకునే దిల్లీకి చెందిన ‘ద సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయర్వేదిక్‌ సైన్సెస్‌’తోబాటు కర్ణాటకలోని బెల్గాం ఐసిఎంఆర్‌ ప్రాంతీయ కేంద్రానికి చెందిన ఆయుర్వేద వైద్యులు గత మూడేళ్లుగా దానిమీద నిరంతర పరిశోధనలు చేసి ఏడు రకాల ఓషధీమూలికలతో ఓ మందుని రూపొందించారు. దీన్ని 90 మంది రోగులకి ద్రవరూపంలో ఇచ్చి పరిశీలించగా మంచి ఫలితం కనిపించిందట. దీన్ని ట్యాబ్లెట్‌ రూపంలోకి తీసుకొచ్చి వచ్చే ఏడాదికల్లా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కృషిచేస్తున్నారు. మంచి విషయం కదూ.


పోట్లాడుకుంటున్నారా?!

విషయం చాలామంది తల్లిదండ్రులకి తెలియంది కాదు, అయినా సరే మర్చిపోయి పిల్లల ముందు వాదించుకోవడం, గట్టిగా అరుచుకోవడం, పోట్లాడుకోవడం చేస్తూనే ఉంటారు. కొందరు విచక్షణ మరిచి ఆ గొడవల్లోకీ పిల్లల్నీ చేర్చి మరీ తిట్టుకుంటారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ల భావోద్వేగాల్ని ఎంతగానో దెబ్బతీస్తాయి. అప్పటికప్పుడు వాళ్లలో అవి బయటపడకున్నా తరవాతి జీవితంమీద ప్రభావాన్ని కనబరుస్తాయనీ ముఖ్యంగా కాస్త సిగ్గరులుగా ఉండే పిల్లల్ని మరింత ఒత్తిడికి గురిచేస్తాయనీ అంటున్నారు అమెరికన్‌ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు కొందరు పిల్లల్ని ఎంపికచేసి, రెండు వర్గాలుగా విభజించి వాళ్ల మానసిక స్థితిని గమనించారట. గొడవలు పడే కుటుంబంలోని పిల్లలతో పోలిస్తే, అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య పెరిగిన పిల్లలు అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి తల్లిదండ్రులూ జాగ్రత్త!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.