close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పొంచివుంది... జలగండం!

పొంచివుంది... జలగండం!

టికెట్లు కొనడానికో, బస్సెక్కడానికో క్యూలో నిలబడతాం. కానీ యుద్ధం చేయడానికి క్యూలో నిలబడడం గురించి విన్నారా? ప్రస్తుతం మన పరిస్థితి అదే. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయని అనుకుంటుంటే ఇన్నాళ్లూ విన్నాం. ఆ పరిస్థితుల్ని త్వరలోనే చూడగల దేశాల సరసన ఇప్పుడు మనమున్నాం. దేశంలో జలాశయాలు పూర్తిగా కుంచించుకుపోయాయనీ జలగండం పొంచి ఉన్న దేశాల్లో భారత్‌ ముందువరసలో ఉందనీ తాజా అధ్యయనాలు చిత్రాలతో సహా వెల్లడించాయి. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటామా అని ఇప్పుడు ప్రపంచమంతా మనవైపే చూస్తోంది.గొంతు ఎండిపోయె పేగు మండిపోయె గంగతల్లి జాడలేదనీ... నీటిపైన ఆశ నీరు గారిపోయె రాత మారు దారిలేదనీ... సినిమాలోదే అయినా ప్రస్తుతం దేశంలోని పలు గ్రామాల పరిస్థితికి అద్దంపట్టే పాట ఇది.
ధారలైన కంటినీటితో దాహం తీరదంటున్నాయి పల్లెలు.
ఊరికి దూరంగా అడవి పక్కన ఉన్న చెలమలో ఊరే నీటిని చిన్న గిన్నెతో తీసి ఒక బిందె నింపుకోవాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. కానీ తప్పదు. ఊళ్లోని ఆడవాళ్లంతా వంతులవారీగా ఆ గొయ్యి దగ్గర కూర్చుని నీటిని తోడుతుంటారు. వేసవి నాలుగు నెలలూ అదే పరిస్థితి. 150 కుటుంబాలున్న కూసపల్లి గ్రామం ఒడిశాలో ఉంది. ఊళ్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోగా వారికి ఇప్పుడు ఆ చెలమే ఆధారంచ.
వేసవిలో ఏటా నీటి సమస్యే. ఈ ఏడాది అసలు వర్షాల్లేకపోవడంతో ఆర్నెల్లుగా నీళ్లు లేవు. దాంతో పనులు లేక చాలామంది పట్టణాలకు వలసవెళ్లారు. కొబ్బరి చెట్లకీ, పశువులు తాగడానికీ నీరు కొని వాడుతున్నారు. అవి తాగడానికి పనికొచ్చే నీరు కాదు. ఎక్కడైనా పైపులు లీకవుతుంటే తాగడానికి మంచినీళ్లు పట్టుకోవచ్చని బిందెలు పట్టుకుని వెదుకుతూ వెళ్తారు ఆడవాళ్లు. తమిళనాడులోని కావేరి నదీతీరాన ఉన్న పూడూరు గ్రామస్థుల పరిస్థితి ఇది.
తిరువనంతపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద నీళ్లు బిందె పది రూపాయలకు కొనుక్కుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని దామా జిల్లాలో అయితే ఇప్పటికే గ్రామాలకు గ్రామాలు వలస వెళ్లిపోయాయి. గోవాలో 500 ఏళ్లుగా ఉన్న హార్వాలెమ్‌ జలపాతం ఈ ఏడాది ఎండిపోయింది. ఇదొక్కటే కాదు, పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు జరుగుతున్న ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది నీటివనరులు ఆవిరైపోయాయి. దాంతో వాటి చుట్టుపక్కల గ్రామస్థులంతా నీటి చెలమల కోసం అడవుల్లో వెదుకుతున్నారు. మూడు వందల ఏళ్ల క్రితం తవ్విన దిగుడుబావి. ఎర్రని రాయితో అంచెలంచెలుగా కట్టిన ఆ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిజానికి వారసత్వ సంపదగా చూపించుకోవాల్సిన నిర్మాణమది. కానీ ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధిత చంద్రశేఖరపురం గ్రామ ప్రజలకు ఆ బావి నీరే ఆధారం. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి బావిలోకి దిగి నీటిని తీసుకెళ్తుంటారు మహిళలు.
గుజరాత్‌కి ప్రధాన నీటి వనరైన నర్మదా డ్యామ్‌లో ఈ ఏడాది నీటి స్థాయి గత 13 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకి పడిపోయింది. దాంతో తాగునీటి అవసరాలన్నా గట్టెక్కాలని సాగునీటి సరఫరా నిలిపేశారు. అయినా ఎక్కడైనా ఎవరైనా నీటిని దొంగిలిస్తారేమోనని ప్రత్యేక పోలీసు దళాల్ని కాపలాగా పెట్టారు. మరోపక్క వందలాది గ్రామాలు నీరు లేక అల్లల్లాడుతున్నాయి.
ఒక రాష్ట్రమని లేదు, ఒక ప్రాంతమని లేదు... దేశంలో ఉత్తరం నుంచీ దక్షిణం వరకూ తూర్పు నుంచీ పడమర వరకూ నీటి సమస్య లేని చోటు లేదు. మొత్తం 140 జిల్లాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. 90కి పైగా ప్రధాన రిజర్వాయర్లు మార్చి 15 నాటికే నాలుగోవంతు నీటిని మాత్రమే కలిగిఉన్నాయి. ఇది గత ఏడాది కన్నా 16 శాతం తక్కువ.

ఈ ప్రభావం పల్లెల మీద...వేసవి మూడు నెలలూ పల్లెల్లో ప్రగతి పడకేస్తుంది. పనులేవీ జరగవు. రేపటి సంగతి దేవుడెరుగు, ఇవాళ్టికి బిందెడు నీళ్లు దొరికితే చాలనుకునే పరిస్థితే పలు గ్రామాలది. వారానికి ఒకరోజు వచ్చే నల్లా దగ్గరో ఊళ్లో నీటి చుక్క రాలుస్తున్న ఒకటీ అరా బోర్ల దగ్గరో బిందెలు బారులు తీరతాయి. అప్పటివరకూ ఆత్మీయంగా ఉన్న ఇరుగూ పొరుగూ ట్యాంకర్ల దగ్గరికెళ్లేసరికి బద్ధ శత్రువులవుతారు. రోజులో కొన్ని గంటల పాటు మôచినీరు సంపాదించడానికే కష్టపడే మహిళలకు ఇక మరో పని చేసుకునే అవకాశమే ఉండదు. తెల్లారి లేచి గుక్కెడు టీనీళ్లతో మొదలుపెడితే ప్రతి పనికీ నీరే కావాలి. ఇంటిల్లిపాది నీటి అవసరాలు తీర్చే బాధ్యతా ఆమెదే. అందుకే నీరు తేవడానికి ఒక భారతీయ మహిళ ఏడాదికి సగటున 200కి.మీ. నడుస్తుందని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం తాగునీరు తెచ్చుకోవడానికి అరగంట నడిచి వెళ్లాల్సివస్తే వారికి నీరు అందుబాటులో లేనట్లే లెక్క. అలా చూసినా ఉత్తరాది రాష్ట్రాల్లో వందలాది గ్రామాల ప్రజలు 30- 40 నిమిషాలు నడవాల్సివస్తోంది. మన ప్రభుత్వ లెక్కల ప్రకారం 500మీటర్ల పరిధిలో మంచినీరు లభిస్తే వారు నీటి వసతికి దగ్గరగా ఉన్నట్లు. అయినా 22శాతం గ్రామీణులకు ఇప్పటికీ అంత ‘దగ్గర’ నీటి వసతి లేదు. మహారాష్ట్ర, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ఆదివాసీ గ్రామాల్లో పురుషులు నీటి కోసమే రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకరు ఇంటి పనులు చేస్తే మరొకరు నీళ్లు తేవాలి. వయసు పెరిగో మరో కారణంగానో ఆమె నీళ్లు మోసుకొచ్చే పరిస్థితి లేకపోతే మూడో పెళ్లి చేసుకుంటారు. దారుణమనిపించే ఈ పరిస్థితి మారుమూల పల్లెల్లో నీటి సమస్యకి నిదర్శనం.
చేజేతులా తెచ్చుకున్నదేఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్న అపర నాగరిక సమాజం మనది. కానీ ఏం లాభం? ప్రకృతి పాఠాలు పెడచెవిన పెట్టాం. లక్షల్లో బోర్లు వేసి భూగర్భ జలాన్ని తోడేశాం. భవిష్యత్తులోకి తొంగిచూసే ఆత్రుతలో చరిత్రను మరిచాం. నీటి వనరుల పక్కనే నాగరికతలు అభివృద్ధి చెందాయని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ నాగరికత మనిషికి ప్రాణాధారమైన నీటివనరుల్ని సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. నేటి మన స్వార్థమే కానీ రేపటి సమాజం గురించి మనకు పట్టదు. నదులకు పుష్కరాలు చేస్తాం. హారతులిచ్చి నమస్కరిస్తాం. ఆ తర్వాత అడ్డమైన చెత్తనీ అందులోనే పడేస్తాం. పారే నది పక్కన ఉంటే పరిశ్రమలకేం కొదవ? అటు నీటినీ వాడుకుంటాయి. ఇటు వ్యర్థాలనూ వదులుతాయి. అందుకు గంగాయమునల్ని మించిన ఉదాహరణల్లేవు. దాదాపు సగం దేశానికి దాహార్తిని తీర్చాల్సిన గంగమ్మ తల్లి రోజూ 700 పరిశ్రమల నుంచి వెలువడుతున్న 50 కోట్ల లీటర్ల కాలుష్యాలను కలుపుకొని భారంగా కదులుతోంది. యమునలో 70 శాతం కలుషిత జలాలే. దేశంలోని 275 నదుల్నీ బ్లాక్‌లిస్టులో పెట్టింది కాలుష్యనియంత్రణ మండలి. నదుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు చెరువులూ కుంటల్ని పట్టించుకునేదెవరు? వాటిల్లో నీరుంటే ఎందుకూ పనికిరాని కాలుష్యకాసారాలు. నీరు లేకుంటే మొత్తానికి వాటి ఆచూకీనే గల్లంతు.
నీటి సమస్య మనదే కాదు, ప్రపంచమంతటా ఉన్నదే. మనకి మరింత తీవ్రం ఎందుకంటే ఆసియాలో జనాభాకీ నీటి లభ్యతకీ మధ్య ఉన్న తేడా ఎక్కువ. ప్రపంచ జనాభాలో ఆసియా వాటా 60 శాతం కాగా అందుబాటులో ఉన్న నీరు 36 శాతమే. అదే అమెరికాలో చూస్తే 6 శాతం జనాభాకి 26 శాతం నీరు అందుబాటులో ఉంది. ప్రపంచ జనాభాలో 17 శాతం మనదేశంలో ఉంటే నీరు 4 శాతమే ఉంది. ఆ నీటిని కూడా మన అవసరానికి మించి 17 రెట్లు అధికంగా భూగర్భాన్ని పిండుకున్నాం.
‘డే జీరో’ వాళ్లకి తప్పింది కానీ...
ఆ నగరాన్ని సందర్శించడానికి వెళ్లే పర్యటకులకు విమానం దిగకముందే పైలట్‌ ఓ విజ్ఞప్తి చేస్తాడు. ‘ఈ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దయచేసి నీరు వృథా చేయకండి’ అని. బస చేసే హోటళ్లలో అడుగడుగునా హెచ్చరికలు కన్పిస్తుంటాయి. 90సెకన్లకు మించి షవర్‌ స్నానం చేయవద్దంటూ టీవీ ఛానల్స్‌ గుర్తుచేస్తుంటాయి. పర్యటక కేంద్రంగా అందరికీ తెలిసిన కేప్‌టౌన్‌ నీటి కోసం అల్లాడుతూ ఇటీవల వార్తల్లోకెక్కింది. మూడేళ్ల క్రితం వరకూ
ఆ నగరం సుభిక్షంగానే ఉంది. రిజర్వాయర్ల నిండా నీళ్లున్నాయి. పైగా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ని అద్భుతంగా చేపట్టినందుకు 2015లో అవార్డు కూడా అందుకుంది. వరసగా మూడేళ్లు వానల్లేవు, అంతే. రిజర్వాయర్లన్నీ ఎండిపోయాయి. నీటికి రేషన్‌ విధించారు. అదీ క్రమంగా తగ్గిస్తూ మనిషికి 25 లీటర్లే చేయడంతో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. పోలీసు భద్రత పెట్టి మరీ నీటిని సరఫరాచేశారు. పరిస్థితి అలాగే కొనసాగితే అక్కడ చుక్క నీరు లేని రోజు ‘డే జీరో’ ఈ ఏడాదే వచ్చేది. అదృష్టవశాత్తూ వర్షాలు పడ్డాయి. దాంతో డే జీరోని ఈ ఏడాదికి వాయిదా వేయగలిగారు. కేప్‌టౌన్‌ గండం గడిచింది కానీ మనకి ఆ గండం పొంచి ఉంది. బెంగళూరు, పుణె, చెన్నై... అన్ని నగరాలూ ప్రమాదం అంచునే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నీటి ముప్పు పొంచివున్న ప్రపంచంలోని పది ప్రధాన నగరాల జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
నగరాలే ఎందుకు?
పాలనా యంత్రాంగం ఉండేదీ, పనులన్నీ జరిగేదీ నగరాల్లోనే. అక్కడ ఒక్కరోజు పంపుల్లో నీరు రాకపోతే జనజీవనం స్తంభించిపోతుంది. అందుకే పల్లెలు ఎంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా నగరాలకు ఆ సమస్య తీవ్రతను అంతగా తాకనివ్వరు. రిజర్వాయర్లలో నీటి మట్టం కనీస స్థాయికి రాగానే సాగునీటి సరఫరా నిలిపేస్తారు. తాగునీటికి ప్రాధాన్యమిస్తారు. వేసవిలో చాలా చోట్ల వారానికి రెండు రోజులూ లేదా ఒకే రోజు నీటిసరఫరా చేస్తున్నారు. అయినా సరఫరాలో అక్రమాలను అరికట్టే గట్టి చట్టాలు లేకపోవడమూ, పట్టణీకరణ పెరగడమూ, నేలంతా కాంక్రీటుమయం కావడమూ, పారిశ్రామికాభివృద్ధీ; వీటికి తోడు సరఫరాలో, వినియోగంలో వృథా... అన్నీ కలిసి నగరాల్లో నీటి ఎద్దడికి కారణమవుతున్నాయి. వాననీటిని ఒడిసిపట్టడమనేది మన దేశంలో ఇంకా అలవాటుగా మారలేదు. ఆరు శాతం వర్షపు నీటిని మాత్రమే మన దేశం నిల్వ చేసుకోగలుగుతోంది. అదే అభివృద్ధి చెందిన దేశాలు నూటికి నూరుశాతం వాననీటిని నిల్వచేసుకుంటున్నాయి. మూడో వంతు వాననీటిని నిల్వ చేసుకున్నా చాలు వ్యవసాయానికి వానలపై ఆధారపడనక్కరలేదంటారు నిపుణులు. రెండు దశాబ్దాలక్రితమే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేశాయి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు. ఐదేళ్లలోనే దాని ప్రభావమూ కన్పించింది. కానీ తర్వాత ఆ నియమాన్ని పట్టించుకున్నవారు లేరు. బాధ్యతగా భావించిన ఎవరో కొందరు తప్ప అందరూ అనుసరించకపోవడంతో స్వచ్ఛమైన వాననీరు భూమిలోకి ఇంకకుండా వ్యర్థంగా డ్రైనేజీలో కలుస్తోంది.
‘మంచి’ నీరేదీ?ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేని అత్యధిక ప్రజానీకం భారత్‌లోనే ఉంది. నిజానికి మనదేశం నీరులేని దేశం కాదు. ఎన్నో జీవనదులున్నాయి. లెక్కలేనన్ని ఉపనదులున్నాయి. సగటు వర్షపాతమూ చాలినంత ఉంటుంది. లేనిదల్లా నీటి వనరుల్ని సక్రమంగా నిర్వహించుకునేే చైతన్యమే. పలుచోట్ల కాలుష్యం వల్ల ప్రాణాధారం కావాల్సిన నీరే ప్రజల పాలిట శాపంగా మారింది. ఉపరితల జలాలే కాదు, భూగర్భ జలాలనూ చేజేతులా కలుషితం చేసుకున్నాం. మురుగునీరూ, పారిశ్రామిక వ్యర్థాలూ, పంటలకు వేసే ఎరువులూ, క్రిమిసంహారకమందులూ కలిసి నీటి నాణ్యతను నాశనం చేస్తున్నాయి. దేశంలో కోటీ పదిహేను లక్షల మంది ప్రజలకు ఎముకలను దెబ్బతీసే ఫ్లోరోసిస్‌ ప్రమాదం ఉన్న నీరు తప్ప నాణ్యమైన నీరు అందుబాటులో లేదు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ దేశంలో 19 రాష్ట్రాల్లో తాగునీటిలో అధిక ఫ్లోరైడ్‌ ఉన్నట్లు గుర్తించింది. గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలోని పది రాష్ట్రాల్లో నీటిలో ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉంటోంది. దీని వల్ల ఊపిరితిత్తులూ, చర్మమూ, మూత్రపిండాలూ, కాలేయమూ అనారోగ్యం పాలవుతున్నాయి. దేశంలో 45,053 గ్రామాలకు మాత్రమే సురక్షిత మంచినీటి సరఫరా ఉంది. ఇంకా 18,917 గ్రామాలకు ఆ సౌకర్యం లేదు. అంటే ఆ గ్రామాల్లో ప్రజలు ఇంకా నీటికోసం బావులు, కుంటలు, వాగులు, చెలమల మీదే ఆధారపడుతున్నారు. నీరు లేని తనం అంటే జలదారిద్య్రం... ఇది అన్ని రకాల పేదరికానికీ మూలం. అది లేకపోతే ఆరోగ్యమూ అభివృద్ధీ ఏదీ ఉండదు. ఎందుకంటే నీరొక్కటి లేకపోతే ప్రాణమే కాదు, అసలు ప్రపంచమే నిలవదు.
ఏం చేయాలి?
1951లో మనదేశంలో వార్షిక తలసరి నీటి అందుబాటు 5,177 ఘనపు మీటర్లు. ఇప్పుడది 938కి పడిపోయింది. ఇది ఏటికేడాదీ తగ్గుతూనే ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చుకోలేమా అంటే... అది నీటి సంరక్షణ విషయంలో మన నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం...
* ప్రతి ఒక్కరూ నీటి క్రమశిక్షణ అలవరచుకోవాలి. అవసరానికి మించి ఒక్క చుక్క కూడా వాడకూడదు. ఉదాహరణకు... పంపులో నిమిషానికి పదిలీటర్ల నీరు వస్తుందనుకుంటే బ్రష్‌ చేసుకున్నంతసేపూ పంపు తిప్పేసి ఉంచకుండా కట్టేస్తే 30 లీటర్ల నీరు మిగిల్చినట్లే. అలాగే షేవింగ్‌ చేసుకునేటప్పుడు 40 లీటర్లు ఆదా చేయొచ్చు. సింకులో పాత్రలు కడిగేటప్పుడు ఐదు నిమిషాలకు 50 లీటర్ల నీరు వాడతాం. అదే బకెట్‌లో పట్టుకుని కడిగితే అందులో సగం చాలు.
* తక్కువ నీటితో పనులయ్యే మార్గాలు చూసుకోవాలి. దుస్తుల్ని వాషింగ్‌మెషీన్‌లో ఉతికితే నాలుగు రెట్లు ఎక్కువ నీళ్లు పడతాయి. మామూలు స్నానం కన్నా షవర్‌ స్నానానికి రెట్టింపు నీరు కావాలి. పైపు పెట్టి కార్లనూ బైకుల్నీ కడగడమూ, వాకిళ్లను శుభ్రం చేయడమూ మానుకోవాలి. కారును కడగడం కాకుండా తడిబట్టతో తుడిస్తే అరలీటరు నీరు చాలు.
* సెకనుకో చుక్క చొప్పున ఒక్క పంపు లీకైతే రోజుకు 18.5 లీటర్లూ సంవత్సరానికి 6752 లీటర్ల నీరు వృథా అవుతుందని నిపుణులు లెక్క తేల్చారు. అందుకని లీకయ్యే పంపుల్ని నిర్లక్ష్యం చేయకుండా మరమ్మతు చేయించాలి.
* ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా తవ్వాలి. అప్పుడే వాననీరు భూమిలోకి ఇంకి ఆరిపోయిన భూమాత గొంతు తడుస్తుంది. క్రమంగా భూగర్భ జలాలు పెరుగుతాయి.
* పల్లెల్లో ఊరంతా కలిసికట్టుగా నిలిచి సహజ జలవనరులైన చెరువులూ కుంటలూ బావుల్ని పునరుద్ధరించుకోవాలి. కొత్తవాటిని తవ్వుకోవాలి. వాగుల మీద వీలైనన్ని చెక్‌డ్యాములు కట్టుకోవాలి.* భవనాలూ అపార్టుమెంట్‌ సముదాయాల్లో పైకప్పుల మీద కురిసే వాననీటిని సేకరించే ఏర్పాటుచేసుకోవాలి. వెయ్యి చదరపు అడుగుల పైకప్పు ఉంటే ఒక్క వానాకాలంలో కనీసం 2.24లక్షల లీటర్ల నీటిని సేకరించవచ్చనీ, అప్పుడసలు మున్సిపల్‌ నల్లా కనెక్షనే అక్కర్లేదనీ అంటున్నారు నిపుణులు.
* పైపులతో సరఫరాలోనే 30, 40 శాతం నీరు వృథా అవుతోంది. దీని వల్ల తలసరి నీటి లభ్యత తగ్గిపోతోంది. ప్రతి దశలోనూ ఈ వృథాని అరికట్టే చర్యలు అవసరం.
* ప్రభుత్వాలు నీటి పునర్వినియోగంపై దృష్టి పెట్టాలి. మురుగునీటినీ, సముద్ర జలాల్నీ శుద్ధిచేసి వ్యవసాయానికీ పరిశ్రమలకీ వాడుకోవచ్చు. మనదేశంలో ఇది చాలా తక్కువ. ఇళ్లల్లోనూ - వంటింట్లో వాడిన నీటిని మొక్కలకు పోయవచ్చు.
* పరిశ్రమల్లో ‘వాటర్‌లెస్‌ టెక్నాలజీ’కి ప్రాధాన్యమివ్వాలి. పరిశ్రమలన్నీ కూడా అవి వాడిన నీటిని తిరిగి శుద్ధిచేయడాన్ని బాధ్యతగా స్వీకరించాలి.
* వీటన్నిటికన్నా ముఖ్యంగా- మనం సంపాదించే డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తామో, ఎంత భద్రంగా దాచుకుంటామో అంతకు వెయ్యింతల జాగ్రత్తను నీటి వినియోగం పట్ల చూపాలని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.

*      *      *      *      *

మన ముందున్న నీటి సవాలు చిన్నది కాదు. గంగను నేలమీదికి తేవడానికి ఆ భగీరథుడు ఎంత కష్టపడ్డాడో అంతకు రెట్టింపు కష్టం దాన్ని సంరక్షించుకోడానికి మనమూ పడాలి. ఎందుకంటే నీటి చుక్కని ఆక్సిజన్‌ హైడ్రోజన్‌ అణువులుగా విడదీయడమే తప్ప ఆ రెంటినీ కలిపి నీటిని తయారుచేయడం ఇంకా మనకు చేతకాలేదు. అది చేతయ్యేదాకా ప్రతి నీటిబొట్టూ మనకు బంగారమే. నీటి పొదుపు మనందరి కర్తవ్యమే.


అంకెల్లో...

84 కోట్లు... సురక్షిత నీరు అందుబాటులో లేనివారు. అందులో 16.3కోట్లు భారతీయులే.
230 కోట్లు... పారిశుద్ధ్య వసతి లేనివారు. అందులో మన వాటా 21 కోట్లు.
6 గంటలు... నీటి కోసం ఓ మహిళ సగటున కష్టపడే సమయం.
90 సెకన్లు... నీటి సంబంధ వ్యాధుల కారణంగా ప్రతి ఒకటిన్నర నిమిషాలకూ ఓ శిశువు ప్రాణం పోతోంది.
10 లక్షలు... నీరూ పారిశుద్ధ్యమూ అందుబాటులో లేని కారణంగా సంభవించే అనారోగ్యాలతో మరణిస్తున్నవారి సంఖ్య.
రూ.2 లక్షల కోట్లు... అందరికీ రక్షిత మంచినీరు దొరికితే తగ్గే ఆరోగ్య వ్యయం
రూ.171 లక్షల కోట్లు... నీటి కొరత వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.